Saturday, April 27, 2024

ఇంగితం లేని పండిత ప్రకాండులు

పుష్పమిత్రుడి కాలం నుండి ఆధునిక కాలం దాకా హిందూ పండితులమని అనుకున్నవారంతా బౌద్ధంపై విషం కక్కారు. అభాండాలు వేశారు. అబద్ధాలు సృష్టించి చెప్పారు. అందుకు మనం ఎంత మంది పండితుల ఉదాహరణలైనా ఇవ్వొచ్చు. ‘బుద్ధ ధర్మం – హిందూ ధర్మంలోని ఒక శాఖ’ అన్నారు స్వామి వివేకానంద. మరొక అడుగు ముందుకేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘బుద్ధుడు హిందువుగా పుట్టాడు. కానీ, హిందూ ధర్మానికి ద్రోహం చేశాడు. ధిక్కరించాడు’-అని అన్నారు. ఇంగ్లీషులో THE REBEL CHILD OF HINDUISM అని అన్నారాయన. ఇక పోతే డా. పి.వి. కానే అనే మేధావి ‘బుద్ధుడు హిందువుగానే పుట్టాడు. ఉపనిషత్తుల నుండి కొన్ని విషయాలు సంగ్రహించి, ఆయన తన శిష్యులకు బోధించాడు తప్పిస్తే, ఆయన స్వంతంగా ప్రపంచానికి చెప్పింది ఏదీ లేదు’- అని అన్నారు. వీళ్ళంతా హిందూ ధర్మాన్ని ఉద్ధరించినవారిగా, అత్యున్నత స్థాయికి చెందిన హిందువులుగా పేరు గడించినవారు. అయితే వీరు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో విశ్లేషించుకుందాం!

స్వామి వివేకానంద హిందూ ధర్మ ఔన్నత్యం గురించి ప్రపంచ స్థాయిలో ప్రసంగించిన వక్త. హిందూ ధర్మప్రచారకుడిగా, హిందూ ధర్మ సంస్కర్తగా కూడా పేరుంది. అయితే ఇతను బ్రాహ్మణుడు కాదు. కాయస్థ కులస్తుడు. అయినా, తన మనసును, మెదుడును బ్రాహ్మణీకరించుకున్నాడు. ఇక భారత రాష్ట్రపతి పదవిని అలకరించిన ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ తెలుసు. అయితే అయన ఒక మనువాది అని చాలామందికి తెలియదు.  కూతుర్లకు బల్యవివాహాలు చేయడం, అర్ధాంగికి అక్షరంముక్క రాకుండా చూడడం, తల్లిని హింసించడం, అనైతికంగా పరాయిస్త్రీలతో గడపడం ఆయనకు ఉన్న లక్షణాలు. ఉద్యోగ జీవితంలోనూ నిజాయితీ లేనివాడు.  ఇతరుల ధీసిస్ లు కాపీ  కొట్టి ప్రచురించుకున్న ఘనాపాటి. ఇవన్నీ ఎవరో చెబితే నమ్మేవాళ్ళం కాదు. కానీ, స్వయంగా ఆయన కొడుకే తండ్రి అనైతిక జీవితం గురించి రాశాడు. ఆయన ఎవరో కాదు. దేశం గర్వించదగ్గ చరిత్రకారుడు డాక్టర్ సర్వేపల్లి గోపాల్. ఇక పి.వి. కానె (1880-1972) గురించి చెప్పుకోవాలంటే THE HISTORY OF DHARMA SHASTRA- ధర్మ శాస్త్రాల చరిత్ర నాలుగు సంపుటాలు 6,500 పేజీలు రాసిన రచయిత. భారత ప్రభుత్వం నుంచి భారతరత్న (1963)పురస్కారాన్ని స్వీకరించిన పెద్దమనిషి.

Also read: చదువురాని అవివేకులు పాలకులైతే?

తమ సనాతన వైదిక/బ్రాహ్మణ/హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠాపించడానికి గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా తమ ఇంగిత జ్ఞానాన్ని మరిచి అబద్ధాలు చెపుతారని మనం అనుకుంటామా? అనుకోము. కానీ వాళ్ళు చెప్పారని రుజువైంది. అసలు బుద్ధుడి కాలానికి హిందూ ధర్మం గానీ, హిందూ మతం గానీ లేనేలేవు. హిందూ అనే పదమే లేదు. ఆ పదం ఎప్పుడు ఎలా ఆవిర్భవించిందో చారిత్రక ఆధారాలు మనకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొప్పవాళ్ళు చెప్పారని అబద్ధాలు నమ్ముదామా? లేక చరిత్ర  రుజువు చేసిన సత్యాల్ని స్వీకరిద్దామా? విద్య అందరికీ అందుబాటులోకి రాకుండా బ్రాహ్మణవర్గం కట్టుదిట్టం చేసిందని మనకు తెలుసు. కేవలం తమ వర్గంలోని పురుషులకు మాత్రమే అందే విధంగా చర్యలు చేపట్టింది. తమ వర్గంలోని స్త్రీలను కూడా శూద్రుల స్థాయిలోనే ఉంచింది. అందువల్ల సమాజం మీద సర్వాధికారాలు చేజిక్కించుకున్న విద్యావంతులైన బ్రాహ్మణులు ఆ కాలంలో ఏం చెప్పినా చెల్లింది. ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లింది. వాళ్ళను నిలదీసేవారే లేరు.

ఎంత ఉన్నత స్థాయికి చెందినవారైనా వారు చెప్పినదాంట్లో నిజమెంత అనేది విశ్లేషించుకునే హక్కు ఇప్పుడు మనకు ఉంది. ఇక్కడ ఏవో కొన్ని పేర్లు చెప్పి, వారి స్థాయి తగ్గించాలని నేను ప్రయత్నించడం లేదు. ఇతరత్రా న్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, లోతుగా తరచి చూసి, తెలుసుకున్నది ఏమంటే – బుద్ధుడి కాలానికి హిందూ ధర్మం అనేది లేదు. ఆయన హిందువుగా పుట్టడమేమిటీ? ఆయన కాలానికి ఉపనిషత్తులు, పురాణాలు ఇంకా రాయబడలేదు.వాటిలోంచి విషయాలు సంగ్రహించి శిష్యులకు బోధించడమేమిటీ? ఆ మాటలకు అర్థమే లేదు. బుద్ధుడి అనంతరం పదమూడు వందల సంవత్సరాల తర్వాత జరిగిన పరిణామాలను బుద్ధుడికి ఆపాదించడమేమిటీ? అంటగట్టడమెందుకూ? తప్పుగదా?

బుద్ధుడు సాధారణ శకానికి ముందువాడు (BCE). బుద్ధుడి తర్వాత సాధారణ శకం ఎనిమిది నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య (C.E) ముస్లింలు భారత దేశానికి వలస వచ్చారు. సింధూ నది దాటి వచ్చారు. వారి ఫారసీ భాషలో స- పలకదు. వారు దాన్ని హ-గా పలుకుతారు. అందుకని, వారు దాన్ని హిందూనడి అన్నారు. హిందూ నది దాటి వచ్చాం అని చెప్పారు. హిందూ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల్ని ‘హిందువులు’ అని అన్నారు. ఆ విధంగా ఆ పదం వాడుకలోకి వచ్చింది. హిందూ – పదానికి మతానికీ అప్పుడు సంబంధమే లేదు. తర్వాత క్రమక్రమంగా వైదికులు ఆ పదాన్ని స్వంతం చేసుకున్నారు. తమకు అనువైన విధంగా వాడుకోవడం ప్రారంభించారు. అనాదికాలం నుండి తమ హిందూ మతం ఉంది – అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకుంటే మన ఈ పండిత ప్రకాండులు బుద్ధుడి గురించి చెప్పనవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా?

Also read: అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు

ఇంతకీ హిందూ మతానికి ప్రారంభకులు ఎవరూ? ప్రపంచంలోని మతాలన్నింటికీ ఎవరో ఒక ప్రారంభకుడు ఉన్నాడు. మరి హిందూ మతానికి ఎవరూ లేరెందుకూ? బుద్ధుడు-మహావీరుడు-జీసస్-మహ్మద్-గురునానక్ ల వలె హిందూ మత ప్రారంభకులు ఎవరు? ఎవరైనా పరిశోధించగలరా? శంకర-రామానుజ-మధ్వాచార్యులు హిందూ మత ప్రచారకులే తప్ప, ప్రారంభకులు కాదు. కాలక్రమంలో కొంతమంది కొన్నికొన్ని విషయాలు సేకరిస్తూ, జోడిస్తూ హిందూ మతానికి ఒక స్వరూపాన్ని తెచ్చినట్టుగా అనిపిస్తుంది.

స్వామి వివేకానందుడు బ్రాహ్మణుడు కాకపోయినా, బ్రాహ్మణవాదాన్ని నెత్తిన మోసిన విధంగానే ఒకప్పుడు నూటాఎనిమిది ఉపనిషత్తులు రాసినవారు కూడా బ్రాహ్మణులు కాదు. వాటిని క్షత్రియులు రాశారని తెలుస్తోంది. నిజానికి ఉపనిషత్తులు సాహిత్యంలో ఒక భాగం. వేదాలలో భాగం కాదు. బ్రహ్మ గురించి ఆత్మ గురించి అవి చర్చించాయి. ‘‘బ్రహ్మం సత్యం. జగత్ మిథ్యం’’ అన్న శంకరాచార్య ఎంత అజ్ఞానాన్ని పంచాడో ఆధునిక దృష్టికోణంలో చూస్తే తెలుస్తుంది. అసలైతే ‘జగత్ సత్యం-బ్రహ్మం మిధ్యం’ అని అనాల్సింది. బుద్ధుడు ఆ మాట అనలేదు కాని ఆయన బోధనల్లోని సారాంశం అదే. ప్రతిది మానవుడి కోణంలో సాగాలన్నాడు. దేవుడితో మనకేమిటి సంబంధం? దేవుడి పేరుత మానవులంతా ఉపవాసాలుండి ఎందుకు శుష్కించి పోవాలి? ‘‘మానవుణ్ణి సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే దిశలో మన పనులు ఉండాలి’’- అని చెప్పాడు బుద్ధుడు. లేని బ్రహ్మాన్ని సత్యమనిపించడం – కనిపిస్తున్న జగత్తును మిధ్య అనడం జ్ఞానమవుతుందా? 108 ఉపనిషత్తులలో 11 మాత్రమే ప్రాచీనమైనవని, మిగతావన్నీ తర్వాత కాలంలో రాయడబడ్డాయని- అందులో కొన్నిమాత్రమే ముఖ్యమైనవని, మిగిలినవన్నీ ఏ ప్రాధాన్యతా లేనివని డా. బి. ఆర్. అంబేడ్కర్ తన పరిశీలనలో తేల్చారు. ‘‘ప్రాచీన భారత్: క్రాంతి అవుర్ ప్రతిక్రాంతి’’ చదివినవారికి అలాగే ‘‘BUDDHA AND HIS DHARMA’’ వంటి అంబేడ్కర్ రచనలు చదివినవారికి విషయాలు వివరంగా తెలుస్తాయి. హిందూ దేవుళ్ళలో క్షత్రియులు ఉన్నారు కానీ, బ్రాహ్మణులు లేరన్నది గమనించాలి. అందువల్ల ఉపనిషత్తుల రచనలో క్షత్రియుల పాత్రే ఉందన్నది అర్థం చేసుకోవాలి.

Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

ఆత్మ పరమాత్మల సుడిగుండంలో తిప్పి, మనుషుల్ని విభజించి మూర్ఖులుగా తయారు చేసిన సనాతన/వైదిక/బ్రాహ్మణ/హిందూ మతం కావాలా లేక కార్యకారణ సంబంధం గురించి చెప్పి, సర్వ మానవ శ్రేయస్సును, సమానత్వాన్నికోరి – మానవుడు పరిపూర్ణుడు కావాలని ఆకాంక్షించిన బుద్ధుడు/బౌద్ధం కవాలా? ఎవరికి వారే ఆలోచించుకోవాలి! ఒక సారి చిత్రమైన సంఘటన జరిగింది. ఒక హిందూ మత ప్రచారకుడు ఒక బౌద్ధ భిక్కుతో చర్చిస్తూ ‘‘మీరు మా మనుస్మృతిని ఎందుకు విమర్శిస్తారూ? అందులో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కదా?’’ అన్నాడు. ‘అవి ఏవో దయచేసి చూపండి’ – అన్నాడు బౌద్ధభిక్షువు. హిందూ ప్రచారకుడు అంత పెద్ద గ్రంథంలో నుంచి మూడు నాలుగు శ్లోకాలు తీసి చూపాడు. భిక్కు నవ్వి ‘‘తట్టెడు పేడలో మూడు, నాలుగు వేరు శనగ గింజలు పడ్డాయనుకోండి. మీరు తట్టెడు  పేడ తినగలరా?’’- అని అడిగాడు. అంతే హిందూ ప్రచారకుడు చటుక్కున లేచి వెళ్ళిపోయాడు.

భగవద్గీత, ధమ్మపథాన్ని వక్రీకరించి రాసుకున్న గ్రంథం – అని పరిశోధకులు తేల్చారు. ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు హిందూ దేవదేవతల వల్ల రాలేదు. కేవలం ఒక్క బుద్ధుడి వల్లే వచ్చింది. ఇక ఇప్పుడు సత్యాన్వేషణకు కంకణం కట్టుకున్న ఈ తరం దేశ పౌరులు అన్నిటినీ పునఃసమీక్షించుకోవాలి. పునఃనిర్వచించుకోవాలి. పునఃనిర్మాణానికి పూనుకోవాలి. సత్యమేవ జయతే – అని బోర్డు మీద రాసుకోవడం కాదు. సత్యం జయించాలంటే దేశ పౌరులంతా నిజ జీవితంలో ప్రతిక్షణం ఇక ఆ పనిలోనే ఉండాలి!సమయం వచ్చేసింది గనుక, ఇక ఉంటారు కూడా!

Also read: నాస్తికోద్యమ విప్లవ వీరుడు-పెరియార్

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles