Thursday, May 23, 2024

సోమసుందర్ నాయకంపల్లి జ్ఞాపకాలు!

(‘కలలు – కన్నీళ్ళు’ ఆత్మకథ విశిష్టాధ్యాయం)

“నాయకంపల్లి గ్రామంలో బ్రాహ్మలూ, బ్రాహ్మణేతరులు కలిసి ఏకపంక్తిగా భోజనం చేయడం ఆ వేళే ప్రారంభమయింది. ఆ ప్రారం భానికి కృష్ణశాస్త్రి గారే ప్రేరకులు. ఆయన హైందవ మతాన్నీ, కులాల నిచ్చెన మెట్లనీ ఎప్పుడో 1916 లోనే విడిచిపెట్టారు. ఛాందసులైన శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి శిష్యులైన వేదుల సత్య నారాయణ శాస్త్రి గార్ని కూడా సోత్రియత్వం నుంచి బయటపడేసి బాల్య వితంతువుని వివాహం చేసుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చారు… నాయకంపల్లి చరిత్రకు మాత్రం అదే గొప్ప విప్లవాత్మక సంఘటన..”

               కలలు – కన్నీళ్ళు,

             ( 279, 280 పేజీలు)

డా. ఆవంత్స సోమసుందర్ ఆత్మకథ ‘కలలు – కన్నీళ్ళు.’ ఈ పుస్తకానికి నేను మొదటి పాఠకుడిని. ప్రచురణకు ముందే చదివి మార్పులు చేర్పులు సూచించినవాడ్ని. నాకు స్వయంగా ఆయనే ఇంగ్లీషులో రాసిచ్చిన కాపీ మొదటి పేజీ చదివేంత వరకూ ఈ విషయం నాకు కూడా తెలీదు. అప్పటికి నా ఇంటర్ అయిందేమో. ఈ ఒక్క పుస్తకమనే కాదు, ఆయన రాసిన పదుల సంఖ్యలో గ్రంథాలు బయటకు రావడానికి ప్రధాన కారణం శ్రీమతి ఎర్రమిల్లి ఉషాకుమారి. కానీ, ఆవిడ పేరు ఈ ఒక్క పుస్తకం ముందుమాటలోనే మనకి కనబడు తుంది. 325 పుటల పుస్తకం లో ఇతరేతర విశేషాలన్నీ ఒకెత్తూ, చివర్లో రాసిన “మధూద యంలో మంచి ముహుర్తం” ఒక్కటీ ఒకెత్తూ. ఆనూరులో కొడుకు బారసాలప్పుడు నాయకంపల్లి అనే గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం కోసం ఆ ఊరి పెద్దమనుషులు సోమసుందర్ గార్ని సంప్రదించడం, అందుకు ఆయన అంగీకరించి ఎందరో మహామహులతో చేసిన అసాధారణ మహోత్సవం గురించిన వివరణాత్మక సమాచారం సుమారు మొత్తం 30 పేజీలు!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మొదలుకొని పిలకా గణపతి శాస్త్రి గారి వరకూ, వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి నుండి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి దాకా, శశాంక నుండీ భావనరావు గారు, కృష్ణశాస్త్రి గారి మేన కోడళ్ళు సీత, అనసూయ, రాంషా, ఇంతమంది మహా మహులు మెత్తగా గడ్డిసర్ధి ఈతాకు చాపలేసిన ఎడ్లబళ్ళ మీద నాయకంపల్లి వెళ్ళడం జరిగింది. నిజానికి పాలగుమ్మి పద్మరాజు, కలిదిండి గోపాల శాస్త్రి, హనుమత్ శాస్త్రి కూడా పాల్గొనాల్సింది కానీ ఏవో కారణాల వల్ల రాలేక పోయారట. పాతిక పుటలకి పైగా  ఆ సభా ఏర్పాట్లూ, బ్రహ్మరథం పట్టిన గ్రామ పెద్దలు నిర్వాహకులు, చౌదరి గారు, ఆవంత్స సుబ్బారావు గారు, భోజన, వసతి ఏర్పాట్లు మొదలు ఎంత ఘనంగా సభా వేదిక నిర్మించారో, ఇంకా ఇతర ఉపాధ్యాయ మిత్రుల కోసం ఆయన వర్ణించిన తీరు చదువు తూంటే అబ్బుర మనిపిస్తుంది!

నిరాశ పరుస్తుందని తెలుసు కానీ ఇంతమంది కవులు, కళాకారులు, సాహితీ ఉద్దండులతో ప్రారంభమైన ఆ గ్రంథాలయ స్థలాన్ని ఓమారు చూసి రావాలనే ఆశ చాలా కాలం నుండి నాలో ఉంది. ఈరోజు మనకి పెద్ద విషయంగా అనిపించక పోవచ్చుకానీ స్వాతంత్ర్యానికి పూర్వం ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఆ కార్యక్రమం అసమానతల మీద చూపిన ప్రభావం ఎంత బలీయమైందో ఊహించ వచ్చు. కృష్ణశాస్త్రి గారి చేతుల మీద ప్రారంభించబడిన ఆ ఊరి గ్రంథాలయం, తదనంతరం జరిగిన మహత్తరమైన సాహిత్య సభ, సోమసుందర్ గారికి ఒక జీవితకాలపు జ్ఞాపకం. అంతటి గ్రామాన్ని ఒకసారి పలకరించినట్లుంటుందని కవి మిత్రులు, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ బాధ్యులు మేకా మన్మధరావు గారూ, నేనూ బయలుదేరి మొన్నా ఊరికి వెళ్ళాం!

ఇప్పుడా ఊరు రెండైంది, పాతూరు, కొత్తూరు. ఏ ఊర్లోనూ లైబ్రరీ ఊసే లేదు. ఊరి చివర పాడుబడిన మొండి గోడలు చూసి గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. దసరా ఉత్సవాల్లో భాగంగా లైబ్రరీ మొండి గోడలకి ఎదురుగానే ఊరందరికీ ఆరోజు అన్నదానం అని హడావుడి నడుస్తోంది. మా వివరాలు తెల్సుకుని అల్పాహారం అందించారు. ఎనభై ఏళ్ళ కిందటి చరిత్ర. ఎవరికి తెలుస్తుంది? ఊర్లో కొద్దిమందిని కలిసాం. ఆవంత్స సుబ్బారావు గారి అబ్బాయి వెంకట్రావు గారి చిరునామా పెద్దాపురంలో వెతికి పట్టుకుని ఆయనకి శతజయంతి కార్యక్రమం ఆహ్వానం ఇస్తే సంతోషించారు. సోమసుందర్ బంధువులామె ఎనభై ఏళ్ళ పెద్దావిడ్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆనూరులో కలిసి ఆహ్వాన కరపత్రం, ‘కలలు – కన్నీళ్ళు’ పుస్తకం అందించాం.అంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కోసం ఈ రోజు తెల్సిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా పోవడం నిజమైన విషాదం!

(కుల అంతరాల్ని అధిగమించడానికి ఆ రోజు జరిగిన సహపంక్తి భోజనాలు చూపిన ప్రభావం ఎంతటిదో సోమ సుందర్ రాశారు కాన, ఇదేదో కేవలం ఒక గ్రంథాలయం గురించిన విషయం కానే కాదు. సామాజిక చైతన్య క్రమంలోనూ ఈ దేశ సాంస్కృతిక పరిణామంలోనూ ఆ రోజు గ్రంథాలయాలు పోషించిన మహోన్నతమైన పాత్రను నిజాయితీగా గుర్తించడం. సంఘ సంస్కరణోద్యమాల్లో భాగంగా విశాల దృక్పథంతో కొనసాగిన విస్తృత మానవోద్యమ యత్నాలకి సంబంధించిన ప్రయత్నాల్ని ఆ మేరకు నిజాయితీగా గౌరవించడం. అన్నిటి కన్నా ముఖ్యం గా నూరేళ్ళ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న విస్మృత కవితా వజ్రాయుధుడు డా. ఆవంత్స సోమసుందర్ స్మృతిలో ఆయన ఆశయాలకి పునరం కితం కావడం. అందుకోసమే నాయకంపల్లి జ్ఞాపకాల ఫొటోలతో ఈ చిన్ని రైటప్ !)

 – గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles