Friday, April 26, 2024

అదానీ-హిడెన్ బర్గ్ కేసులో సుప్రీం నిపుణుల కమిటీ ఏమి చేస్తుంది?

అదానీ-హిడెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు మనకు స్వతంత్ర్య న్యాయవ్యవస్థ ఉన్నదనే ఆశ్వాసన ఇవ్వజాలువు. ఈ కేసుపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ స్వతంత్రంగా, సమర్థంగా విచారణ జరిపే సంస్థగా కనిపించదు. ఆ కమిటీలో ఒక సభ్యుడు ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు. మరి ఇద్దరు అదానీ గ్రూపుకు కావలసిన వ్యక్తులు. ఈ కమిటీని సుప్రీంకోర్టు 5 ఫిబ్రవరి 2023న నియమించింది. అనేక సంస్థలు దాఖలు చేసిన అనేక పిటీషన్ల లో చేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా మార్కెట్ వ్యవహారాలను విచారించవలసిందిగా నిపుణుల కమిటీని న్యాయస్థానం ఆదేశించింది.

కార్పొరేట్ చరిత్రలో మహామాయ  చేశారని అదానీ గ్రూపును అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ సంస్థ 24 జనవరి 2023న తూర్పారబట్టింది. లెక్కలలో మోసం మాత్రమే కాకుండా స్టాక్స్ లో కుంభకోణానికి తెగబడినట్టు ఆ గ్రూపును అమెరికా సంస్థ తప్పుపట్టింది. ఈ ప్రకటన కారణంగా అదానీ గ్రూప్ షేర్ల విలువ 60 శాతానికి పైగా తగ్గిపోయింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ కుంభకోణాన్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వంపైన ధ్వజమెత్తాయి. రెండున్నర సంవత్సరాలలో ప్రధాని మోదీ ప్రియమిత్రుడి కంపెనీల విలువ కొన్ని రెట్లు ఎట్లా పెరిగాయంటూ ప్రశ్నించసాగాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో సూటిగా అడిగిన ప్రశ్నలను ప్రస్తావించకుండా మోదీ తన ప్రభుత్వం సాధించినట్టు చెప్పుకునే విజయాలను ఏకరవుపెట్టారు. తనపైన, తన పార్టీపైన, తన ప్రభుత్వంపైన ఎంత బురద చల్లితే అంతగా తన పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలం వికసిస్తుందని గొప్పలు చెప్పుకున్నారు.

తన పరిశీలనకు వచ్చిన అనేక పిటిషన్లలోని ఆరోపణలను విచారించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించాలని 2 మార్చి 2023న సంకల్పించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ప్రవీణుల సంఘాన్ని నియమించింది. చైర్మన్ కాకుండా మరి అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. సెక్యురిటీస్ అండ్ ఎక్స్ చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అన్ని విషయాలను గమనిస్తున్నదని చెబుతూ రెండునెలల వరకూ ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు  కొనసాగించవచ్చునంటూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి అధ్యక్షుడు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఓపీ భట్, బొంబాయి హైకోర్టుమాజీ న్యాయమూర్తి  జేపీ దేవధర్, బ్రిక్స్ దేశాల కొత్త అభివృద్ధి బ్యాంకు మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ సహవ్యవస్థాపకుడు నందినీ నీలేకనీ, కార్పొరేట్ న్యాయవాది సోమశేఖరన్ సుదర్శన్ లు తక్కిన సభ్యులు.

కామత్ ఐసీఐసీఐ బ్యాంకికి 1996 నుంచి 2009 వరకూ చైర్మన్ గా వ్యవహరించారు. ఐసీఐసీఐ మోసం కేసులో పోలీసులు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) కామత్ పేరు ఉన్నది. 2009 నుంచి 2018 వరకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ గా పని చేసిన చందా కొచ్చార్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసు అది. వీడియో కార్న్ గ్రూపుకు అప్పులు ఇచ్చి పెద్ద ఎత్తున ఆమ్యామ్యాలు (ముడుపులు) స్వీకరించారనే ఆరోపణ చందా కొచ్చార్ పైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేసింది. బ్యాంకు ఇచ్చిన కొన్ని అప్పులు కామత్ నాన్ఎగ్జిక్యుటివ్ చైర్మన్ గా, అప్పులు మంజూరు చేయవలసిన కమిటీ సభ్యుడుగా ఉన్న రోజులలోనే ఇచ్చారని కూడా సీబీఐ ఆరోపించింది. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కామత్ ను కమిటీ సభ్యుడిగా నియమించడంలో సుప్రీంకోర్టు ఉద్దేశం ఏమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

లిక్కర్ వ్యాపారి, లండన్ లో తలదాచుకున్న విజయమాల్యాకు అప్పులు ఇచ్చినందుకు మార్చి 2018లో సీబీఐ విచారించిన బ్యాంకు అధికారులలో ఎస్ బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ ఒకరు. ఆయన సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో కామత్ తో తో పాటు సభ్యడు. మాల్యా కంపెనీల ఆర్థిక స్థోమత సరిగా లేకపోయినప్పటికీ తగిన పూచీలు లేకుండా ఎస్ బీఐ నాయకత్వంలోని బ్యాంకుల బృందం అప్పులు బేపర్వాగా ఇచ్చాయన్నది సీబీఐ చేసిన అభియోగం. ఐసీఐసీఐ బ్యాంకు కేసులూ, ఎస్ బీఐ కేసులూ న్యాయస్థానాలలో విచారణలో ఉన్నాయి. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్, ఇన్ కం టాక్స్  వ్యవస్థ వంటి దార్యాప్తు సంస్థలు నరేంద్రమోదీ ప్రభుత్వం చేతిలో ఆయుదాలుగా ఎట్లా మారాయో భారతీయులు ఈ పాటికి గుర్తించారు.

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలెకనీ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో డిజిటల్ పురోగతి వెనుక నందన్ ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) నిర్ణయం వెనుక సైతం నందన్ ఉన్నారని ప్రతీతి.

కార్పొరేట్ లాయర్ సోమశేఖర్ సుదర్శన్ ను కమిటీ సభ్యుడుగా నియమించడం చాలామందిని ఆశ్చర్యచకితులను చేసింది. సుదర్శన్ ను మహారాష్ట్రలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టుకొలీజియం చేసిన సిఫార్సునకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు 18 జనవరి 2023నాడు తిరస్కరించింది. సుదర్శన్  పక్షపాతంగా వ్యవహరిస్తారనీ, అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారనీ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సుప్రీంకోర్టు కమిటీలో సుదర్శన్ ని నియమించడం వల్ల ఆయనను న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సును ప్రభుత్వం వేగంగా అమలు చేయవచ్చు. లేకపోతే సుప్రీంకోర్టు చెప్పిన విచారణను పూర్తి చేసేవరకూ కమిటీ సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే వరకూ కొలీజియం సిఫార్సు ఆగవలసి ఉంటుంది.

నాలుగు అంశాలను పరిశీలించవలసిందిగా ఈ కమిటీని సుప్రీంకోర్టు అడిగింది. 1. ఇటీవలి కాలంలో సెక్యూరిటీల మార్కెట్ లో ఒడిదుడుకులు రావడానికి కారణాలు ఏమిటో కనుక్కోవాలి. 2. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల అవగాహన పెంచడానికి ఏమి చేయాలో చెప్పాలి. 3. అదానీ గ్రూపు, ఇతర కంపెనీల విషయంలో వ్యవహారం చేయడంలో చట్టాన్ని ఉల్లంఘించారా? రెగ్యులేటరీ వ్యవస్థ (సెబీ, తదితర సంస్థలు) విఫలమైనాయా? కనుక్కోవలసింది. 4. రెగ్యులేటరీ విధానాన్నిపటిష్ఠం చేసేందుకూ, చట్టాలు అమలు జరిగే విధంగా చూడటానికీ, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడటానికీ ఏమి చేయాలో చెప్పాలి.     

సెక్యూరిటీ మార్కెట్ ను అధ్యయనం చేయడం, ఇటీవల సంభవించిన ఒడిదుడుకులక కారణాలు తెలుసుకొని చెప్పడం అన్నది పెద్ద విషయం కాదు. పిటిషనర్లు చేసిన ఆరోపణలకూ, ఈ కమిటీకి అప్పగించిన పనులకూ సంబంధం లేదు. అవి కోర్టు పట్టించుకోవలసిన అంశాలు కూడా కావు. ఈ కమిటీ వల్ల ఒరిగేది ఏమీ లేదు.

ఒక కమిటీని నియమించి, వాటికి అకెడెమిక్ విషయాలు పరిశీలించమని చెప్పి కూర్చున్న సుప్రీంకోర్టు న్యాయస్థానం పర్యవేక్షణలో  అదానీ వ్యవహారాన్ని విచారించేందుకు ప్రత్యక్ష చర్యలు ఏమీ తీసుకోలేదు. అదానీ గ్రూప్ తప్పుడు పనుల పైన కొన్ని మాసాలుగా అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని సెబీ పట్టించుకోలేదు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ప్రజలలో ఎంతో కొంత ఉన్నది. అటువంటి న్యాయమూర్తి నాయకత్వంలోని సుప్రీంకోర్టు  ఈ విధమైన సభ్యులతో, ఈ రకమైన అంశాలను విచారించవలసిందిగా కోరుతూ అటువంటి కమిటీని ఎందుకు నియమించిదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా సాహసోపేతంగా వెడితే ప్రభుత్వం రెచ్చిపోయి న్యాయవ్యవస్థను అతలాకుతలం చేస్తుందనే సంశయంతో అదానీ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఉపేక్షిస్తున్నదని అనుకోవాలా?ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సైతం సత్యనిష్ఠతో వ్యవహరించడానికి సంకోచిస్తున్నారా? ఇటువంటి ప్రశ్నలకు కాలమే సమాధానం ఇవ్వగలదు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles