Saturday, June 15, 2024

మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు

రామాయణమ్201

కుంభ నికుంభులు కుంభకర్ణుని సుతులు. వారు రావణుని ఆజ్ఞమేరకు యూపాక్ష, శోణితాక్ష, ప్రజంఘులను వెంటపెట్టుకొని యుద్ధరంగానికి మహోత్సాహంగా బయలు దేరారు. సంకుల సమరం జరిగింది. శోణితాక్షుడు,యూపాక్షుడు,

ప్రజంఘుడు మువ్వురినీ అంగద, మైంద, ద్వివిదులు ఎదుర్కొన్నారు. అంగదుడి చేతిలో ప్రజంఘుడు కళ్ళుమాశాడు. ద్వివిదుడి దెబ్బకు గింగరాలు తిరిగి పడిపోయి కళ్ళు తేలవేశాడు యూపాక్షుడు. మైందుడి చేతిలో శోణితాక్షుడు అసువులు బాశాడు.

Also read: మరోసారి లంకాదహనం

అది చూసి కుంభుడు మహా వేగంగా ఈ మువ్వురి మీదకు దూసుకుంటూ వచ్చాడు. వాడి ధాటికి ఈ ముగ్గురూ నిలువలేక పోయారు. అప్పుడు శ్రీరాముడు జాంబవంతుడు, సుషేణుడు మొదలగు వారిని వీరికి సహాయంగా పంపాడు. కానీ వారు కూడా ఆగలేక పోయారు.

ఇక స్వయంగా సుగ్రీవుడు కుంభుడిమీదకు యుద్ధానికి వచ్చాడు. వారి యుద్ధం  రెండు మదపుటేనుగులు పోరాడుతున్నట్లుగా ఉంది. వారి పాదఘట్టనలకు భూకంపాలు పుడుతున్నాయి. సముద్రం కల్లోల తరంగాలతో ఎగసెగసి పడుతున్నది. చివరకు కుంభుడిని చాపలా చుట్టి ఎత్తి సముద్రంలో విసిరేశాడు సుగ్రీవుడు. ఆ బరువుకు హిమాలయశృంగాల్లా సముద్రతరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అయినా ఫలితంలేకపోయింది. వాడు అంతే వేగంతో తిరిగి వచ్చాడు. రావడంరావడమే సుగ్రీవుడి గుండెలమీద ఎగిరెగిరి తన్నాడు. సుగ్రీవుడు తన పిడికిలి బిగించి వజ్రతుల్యం చేశాడు. ఆ పిడికిలితో వానిని ఒక్కపోటు వక్షస్థలం మీద పొడిచాడు. అది పగిలి నెత్తురు కక్కుకుంటూ వాడు మరణించాడు.

Also read: ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం

సోదరుడి చావు చూసిన నికుంభుడు సుగ్రీవుడి మీదకు వచ్చి కలియబడ్డాడు. వాడి బలమును తట్టుకొనలేక నానా అగచాట్లు పడుతున్న సుగ్రీవుని పక్కకు తీసుకు వచ్చి, ఆంజనేయుడు వాడితో కలియ బడ్డాడు. వాడి చేతిలోని సకల ఆయుధాలను ఎగురగొట్టి వాడి జుట్టుబట్టి లాగి పిసికి పీడించి పడదోసి వాడి గుండెలమీద కూర్చుని గుద్దుతూ ఉంటే వాడు భైరవస్వరంతో దిక్కులు మార్మోగేలా హాహాకారాలు చేయసాగాడు. ఏ మాత్రము కనికరము చూపక వాడి శిరస్సును బలవంతంగా లాగి మొండెమునుండి ఊడబెరికి ఘోరాతిఘోరంగా సంహరించాడు ఆంజనేయుడు.

కుంభనికుంభులు హతులైనారనే వార్త చెవినపడగానే రావణుడు అగ్గిమీద గుగ్గిలము లాగా భగ్గుమన్నాడు. ప్రక్కనే ఉన్న ఖరుడి పుత్రుడు మకరాక్షుడిని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో సరాసరి రాముడి మీదకే యుద్ధానికి వచ్చి క్షణ కాలంలో సంహరింపబడ్డాడు.

Also read: అతికాయుని యమపురకి పంపిన రామానుజుడు

మకరాక్షుడి మరణవార్తవిని పళ్ళుపటపటకొరికి ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్ళి రామలక్ష్మణులను సంహరించమన్నాడు రావణుడు.

వాడు యుద్ధరంగంలో ఎవరి కంటాబడకుండా అదృశ్యరూపంలో బాణాలు వేస్తూ వానర సైన్యాన్ని చికాకు పరచసాగాడు. వాడి అధర్మయుద్ధానికి లక్ష్మణునికి కోపము వచ్చి, ‘‘అగ్రజా, ఆజ్ఞాపించు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వీడిని అంతం చేస్తాను’’ అని పలికాడు.

అప్పుడు రాముడు, ‘‘లక్ష్మణా, కనపడకుండా ఉన్నవాడిని, శరణాగతుడినీ, యుద్ధం చేయనివాడిని, నమస్కరించినవాడిని, పారిపోతున్నవాడినీ, ఏమరు పాటుగా ఉన్నవాడిని చంపటము నీ వంటి మహా వీరులు చేయకూడని పని. పైగా బ్రహ్మస్త్రము ఒక్కడినే చంపకుండా అనేకమంది చావుకు కారణమవుతుంది. ఒక్కడి కోసం అందరినీ చంపడము ధర్మమా?’’

‘‘అయినా వీడిని వెంటాడి ,వేటాడే దివ్యాస్త్రాన్ని నేనే ప్రయోగిస్తాను’’ అని పలికాడు. వీరిరువురి ఆలోచనలు గ్రహించిన ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు.

మాయాసీతను కల్పించి తనరధముపై కూర్చోపెట్టుకొని అందరూ చూస్తుండగా కత్తితో వీపుమీద చీరాడు. కుడిడొక్కలోనుండి ఎడమభుజము లోనికి కత్తిపెట్టి చీరివేశాడు.

హనుమంతుడు అది చూసి నిజమైన సీత అని భ్రమించి రామునికీ వార్త చేరవేయడానికి వెళ్ళాడు.

Also read: తమ్ముడి మరణంతో బేజారైన రాక్షసరాజు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles