Monday, April 29, 2024

బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు

పరమాన్నం బాగుందో లేదో చెప్పే గుట్టు దానిని తినడంలోనే ఉన్నదన్నట్టు (ఎక్కువగా తింటే బాగున్నట్టు) బీహార్ లో జనకులగణన ఫలితాలను ఒక చెంచాడు రుచి చూసినా జాతీయ స్థాయిలో జనకులగణన చేయించవలసిన అవసరాన్ని నొక్కి చెపుతుంది. రిజర్వేషన్ కోటాను ఇంకా పెంచవలసి వస్తుందేమోనన్న అగ్రవర్ణాల ఆదుర్దాతో పాటు మీడియా డేటా మీద కంటే రాజకీయ పరిణామాలపైన దృష్టిని కేంద్రీకరించింది.

బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన తొలి విడత వివరాలు 200 కులాలను పేర్కొన్నాయి. వాటి జనాభాను తెలియజేశాయి. కులాల వివరాలూ, మతాల అనుబంధాలు తెలిపారు. మరిన్ని వివరాలతో రెండో దఫా సమాచారాన్ని బీహార్ ప్రభుత్వం విడుదల చేయవలసి ఉన్నది. ఇప్పటికే విడుదల చేసిన టేబుళ్ళను చూస్తే అనేక అంశాలలో మన అవగాహనను ఇనుమడింపజేశాయి. మొట్టమొదట 2021లో జరగవలసిన జనాభా లెక్కలు ఏమి చేయాలో ఆ పని బీహార్ జనగణన చేసింది.[link: https://main.mohfw.gov.in/sites/default/files/Population%20Projection%20Report%202011-2036%20-%20upload_compressed_0.pdf].

అంటే బీహార్ జనాభా మొత్తం ఎంతో తెలిపింది. బిహార్ జనాభా 2011లో 10.41 కోట్లు. అది జులై 2023కు 12.68 కోట్లకు పెరిగింది. బీహార్ జనాభా కచ్చితంగా 12.53 కోట్లు అని ఇప్పుడు నమ్మకంగా తెలుసు.  బిహార్ వెలుపల నివసిస్తున్న 53.07 లక్షల బిహారీలతో కలుపుకొని మొత్తం బీహారీల సంఖ్య  13.07 కోట్లు. ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏమీ లేవిక్కడ.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

రెండో అంశం, మూడు సామాజిక విభాగాల –షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు- వాటాలను బిహార్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా సూచిస్తున్నది.  2011 నాటి జనాభా లెక్కలతో పోల్చితే షెడ్యూల్డ్ కులాల వాటా 16.0 శాతం నుంచి 19.65 శాతానికీ, షెడ్యూల్డ్ జాతుల వాటా 1.3 శాతం నుంచి 1.68 శాతానికీ, ముస్లింల వాటా 16.9 శాతం నుంచి 17.70 శాతానికీ పెరిగింది. అంటే, గత జనాభా లెక్కలతో పోల్చితే షెడ్యూల్డ్ కులాల, జాతుల జనాభా, మొత్తం జనాభాలో వారి వాటా  గణనీయంగా పెరిగాయని అర్థం అవుతూ ఉన్నది. ముస్లింల విషయంలో పెరుగుదల అంత గణనీయంగా లేదు. ఇది కొత్త సమాచారం.  2021లో జనాభా లెక్కలు జరిగి ఉంటే అప్పుడే ఆ సమాచారం అందుబాటులోకి వచ్చేది.

మూడోది, ఇక్కడే ఆసక్తికరంగా ఉంటుంది, బిహార్ జనాభాలో ఓబీసీల వాటా ఎంతో తిరుగులేని డేటా ఈ గణన ఇచ్చింది. మనం లెక్క లేకుండా ఉజ్జాయింపుగా జాతీయ స్థాయిలో ఓబీసీలు 52 శాతం ఉన్నారని అనుకుంటున్నాం. కానీ బిహార్ జనాభాలో 63.14 శాతం ఓబీసీలు ఉన్నట్టు తేలింది. సర్వేక్షణం వృత్తిగా కలిగినవారికి ఇది ఆశ్చర్యకరమైన అంశం కాదు. 2011-12లో ఎన్ఎస్ఎస్ఓ వినియోగదారుల వినిమయ సర్వే ప్రకారం జనాభాలో 60 శాతం ఓబీసీలు ఉన్నట్టు తెలిసింది. 2019లో జరిగిన అఖిల భారత రుణాలు, పెట్టుబడుల సర్వే (డెట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ సర్వే) ప్రకారం 59 శాతం మంది ఓబీసీలు  ఉన్నట్టు వెల్లడించారు. ఎన్ఎఫ్ హెచ్ ఎస్ లో దీనిని 54-58 శాతంగా లెక్కవేసి తక్కువగా తేల్చారు. 2020లో జరిగిన సీఎస్ డీఎస్ లోక్ నీతీ ఎన్నికల సర్వే ఓబీసీ శాతాన్ని వాస్తవానికి దగ్గరగా 61 శాతంగా నిర్ణయించింది. కానీ సాధారణ ప్రజలలో ఈ అంకెలు తుపాను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.

Also read: చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

నాలుగో అంశం, ఇప్పుడు ఓబీసీలలో రెండు విభిన్నమైన విభాగాల బలాబలాలు మనకు తెలుసు. వెనుకబడిన తరగతులవారు అనగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ లో ఎగువునున్నవారు అంటే భూములు సొంతంగా కలిగిన యజమానులు యాదవులూ, కూర్మీలూ, కుష్వాహాలూ, తదితరులు అందరూ కలిపి జనాభాలో 27.12 శాతం ఉంటారు. బ్యాక్ వర్డ్ క్లాసెస్ లో దిగువన ఉన్నవారు, బాగా వెనకబడి ఉన్నవారు (ఎక్ట్రీమ్లీ బ్యాక్ వర్డ్-ఈబీసీ) వంద చిన్న కులాలవారు ఉంటారు. సేవలూ, చేతిపనులూ, మట్టిపని చేసే  ఈ తరహావాళ్ళు 36.01 శాతం ఉంటారు. ఇది అందరికీ సుమారుగా తెలిసిందే. రెండు విభాగాలకూ రిజర్వేషన్లలో 18శాతం, 12 శాతంగా విభజించారు. కానీ సరైన లెక్కలు ఇంకా గమనంలోకి తీసుకోవలసి ఉన్నది. దీనివల్ల బీహార్ రాజకీయాల ప్రాథమ్యక్రమం మారుతుంది. ఈబీసీల ప్రగతి విధానాలలోమార్పు వస్తుంది.

అయిదోది, మనకు ఇప్పుడు మిగిలినవారు ఎందరో తెలుసు. వారిని జనరల్ కేటగరీ అనవచ్చు లేదా రిజర్వేషన్ లేని వర్గాలు అనవచ్చు. రాష్ట్ర జనాభాలో వారి వాటా 15.52 శాతం మాత్రమే. మామూలుగా ఇటువంటి విషయాలు గమనిస్తూ వస్తున్న పరిశీలకులకూ, ఎన్నికల విశ్లేషకులకూ ఇది పెద్దగా దిగ్భ్రాంతి కలిగించే అంశం కాదు. ఉజ్జాయింపుగా రిజర్వేషన్లు లేని వర్గాల శాతం మొత్తం జనాభాలో 18-20 శాతం ఉండవచ్చునని ఇంతవరకూ నేను అంచనా వేస్తూ వచ్చాను. వాస్తవానికి వారి వాటా అంతకంటే తక్కువ ఉన్నట్టు బిహార్ జనకులగణన తేల్చింది. కానీ అధికార లెక్కలను ప్రచురించే సరికి జనరల్ (సాధారణ) అనే మాటలోని అసమంజసత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. తక్కినవారంతా మినహాయింపు అన్నట్టు వీరు మాత్రమే సాధారణ విభాగం అన్నట్టు ఇంతవరకూ మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మనం గమనించిందేమంటే రిజర్వేషన్లు లేని విభాగమే చిన్నదనీ, మినహాయింపు పొందవలసిందనీ.

Also read: మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?

చివరగా, 1931 తర్వాత మొట్టమొదటిసారిగా జాతి (కులం) ప్రాతిపదికగా జనాభా లెక్కలు మనకు అందాయి. బీహార్ రాజకీయాలనూ, సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణులు, రాజపూత్ లు చెరి అయిదు శాతం ఉంటారని అంచనా వేసే వాళ్ళం. వాస్తవానికి వారి వాటా వరుసగా 3.67 శాతం, 3.45 శాతం. భూమిహార్ లు నాలుగు నుంచి అయిదు శాతం ఉంటారని అంచనాలు ఉండేవి. వాస్తవానికి వారి వాటా 2.89 శాతం. అంటే అగ్రవర్ణాలుగా పిలవబడేవారు (సవర్ణులు, తదితరులు), కాయస్థులతో కలిపి, రాష్ట్ర జనాభాలో పదో వంతు మాత్రమే. కచ్చితంగా చెప్పాలంటే 10.61శాతం. 1931లో ఈ వర్ణాల జనాభా 15.4 శాతం ఉండేది. దరిమిలా బాగా తగ్గింది. అగ్రవర్ణాల వాటా తగ్గడానికి ప్రధాన కారణం వారి జనాభా పెరగడంలో స్తబ్దతతో పాటు ఈ వర్ణాలవారు వలస వెళ్ళడం కూడా కారణమని చిన్మయ్ టుంబే అంటారు.  అట్టడుగున ఉన్న వర్గాలు ఉన్నచోటే ఉండగా, కొద్దిగా వెసులుబాటు ఉన్న వర్ణాలవారు బీహార్ నుంచి వలస వెళ్ళారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలూ, తెగలూ, ముస్లింల వాటా పెరగడానికి కూడా ఇదే కారణం.

ఇంతకాలం ఆధిపత్యవర్గాలుగా చెలామణి అయిన కొన్ని ఓబీసీ కులాలను కూడా ఎక్కువగా అంచనా వేసినట్టు ఈ కులజనగణన స్పష్టం చేస్తున్నది. కొన్ని అంచనాల ప్రకారం యాదవులు 15 శాతానికి మించి ఉంటారు. కానీ వారి వాస్తవ వాటా 14.3 శాతం. 1931లో యాదవులకు ఉన్న 12.7 శాతం కంటే ప్రస్తుత వాటా ఎక్కువే. కుర్మీలు నాలుగు శాతం, అంతకంటే ఎక్కువ ఉంటారని స్థూలంగా వేసిన అంచనా తప్పని తేలింది. వారి వాస్తవ వాటా 1931లో 3.3 శాతం ఉంటే ప్రస్తుతం 2.9 శాతానికి తగ్గింది. యాదవ్ ల తర్వాత పెద్ద కులం రవిదాసీలు (5.3శాతం), రుసధ్ (5.3శాతం), కుష్వాహా  (4.2శాతం), ముసాహర్ (3.1శాతం), టెలి (2.8శాతం), మల్లా (2.6శాతం), బనియా (వైశ్యులు-2.3 శాతం). బనియాలను బీహార్ లో ఓబీసీలుగా పరిగణిస్తారు. కాను (2.2శాతం), ధనుక్ (2.1శాతం), ప్రజాపతి (1.4శాతం), బధాయీ (1.5శాతం). కహార్ (1.6శాతం)  వగైరా కులాలు కూడా ఓబీసీలలో ఉన్నాయి.

Also read: మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని అనుకోవడం లేదు 

కులాలవారీ దృశ్యం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. ముస్లిం సామాజికవర్గం జనాభా లెక్కలు సేకరించడం బీహార్ లో ఇదే ప్రథమం. షెక్ (3.8శాతం), సయ్యద్ (0.2శాతం), మల్లిక్ (0.1శాతం), పఠాన్ లు (0.7శాతం) అష్రాఫ్ ముస్లింలలో ఉన్నారని ఇప్పుడు మనకు తెలుసు. బీహార్ లో ఉన్న ముస్లింలలో నాలుగింట మూడు వంతుల మంది పాస్మండాలు. జలాహా, ధునియా, ధోబీ, లాల్ బేగీ, సుర్జాపూరీ వంటి వెనుకబడినవర్గాలు ఇందులో ఉన్నాయి. అలీ అన్వర్ అసాధారణ పని ‘మాసావట్ కీ జంగ్’ ద్వారా వెలుగులోకి వచ్చిన పాస్మండావర్గం రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.

జనాభా లెక్కల డేటా రెండో విడత విడుదల కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ వచ్చే సమావేశంనాటికి విడుదల చేస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కులం, మతం మాత్రమే కాకుండా విద్య, వృత్తి, భూముల యజమానుల వివరాలు, నెలసరి ఆదాయం, నాలుగు చక్రాల కార్లూ, కంప్యూటర్లూ ఉన్నాయా, లేవా అనే వివరాలూ సేకరించారు. ప్రతి కులం విద్యారంగంలో, ఆదాయంలో, వెనుకబాటుతనంలో ఎక్కడ ఉన్నదనే సామాజిక-ఆర్థిక డేటా మొట్టమొదటిసారి మనకు లభిస్తున్నది. ఇది చాలా విలువైనది. ఈ వివరాలు ఇంతవరకూ మనకు తెలియనే తెలియవు.

Also read: మణిపూర్ సంక్షోభాన్ని హిందూత్వ-క్రైస్తవ ఘర్షణగా చూడొద్దు, అది దేశీప్రాచ్యదృష్టి అవుతుంది

మనకు ఉజ్జాయింపుగా అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్ అనే జర్నలిస్టు బీహార్ లో అసెంబ్లీ,  మంత్రిత్వ శాఖలవారీగా కులాల వివరాలు జాగ్రత్తగా సేకరిస్తూ వస్తున్నాడు. సంజయ్ కుమార్ రచించిన ‘పోస్ట్ మండల్ పోలిటిక్స్ ఇన్ బీహార్’ అనే గ్రంథంలో కూడా అధికారిక వనరుల నుంచి సేకరించిన సమాచారం ఉంది. ఉదాహరణకు 1985లో హిందూ అగ్రవర్ణాల (జనాభాలో వారి వాటా 10.6శాతం మాత్రమే) చేతిలో అసెంబ్లీ సీట్లలో 42శాతం ఉండేవి. 2020నాటికి ఈ శాతం తగ్గింది. అయినా సరే 26శాతం దగ్గర ఉన్నది. జనాభాలో వారి వాటా కంటే రెట్టింపు. ఇప్పుడు యాదవులు తమ నిష్పత్తి కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు కలిగి ఉన్నారు. జనాభాలో వారి వాటా 14శాతం ఉంటే అసెంబ్లీ స్థానాలలో వారి వాటా 21 శాతం ఉన్నది. అయిదు ఎకరాల కంటే  ఎక్కువ భూమి కలిగిన ఆసాములు ఓబీసీలకంటే జనరల్ (సాధారణ) కులాలలో ఎక్కువగా ఉన్నారని మనకు తెలుసు. వ్యవసాయ కూలీలలో 9.2 శాతం మంది మాత్రమే సాధారణ (అగ్రవర్ణాలు) కులాలకు చెందినవారు. 29.4 శాతం మంది ఓబీసీలైతే, 42.5శాతం మంది ఎస్సీలు. విద్యకు సంబంధించిన గ్రాఫ్ కూడా అంతే స్పష్టంగా ఉన్నది. సాధారణ కులాలవారిలో 10.5 శాతం మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు. ఓబీసీలలో 2.8 శాతంమంది, ఎస్సీలలో 2.1 శాతం మంది గ్రాడ్యుయేషన్, అంతకన్నా అధికంగా చదువుకున్నవారు ఉన్నారు.

కానీ ఇప్పుడున్న డేటా కొన్ని పెద్ద విభాగాలకి సంబంధించిందే. ఈ సారి వెలువడే డేటా అన్నికులాలూ, ముఖ్యంగా పెద్ద గొడుగు లాంటి అనేక కులాల సముదాయమైన ఓబీసీలూ, చదువులోనూ, ఇతర విషయాలలోనూ ఎక్కడ ఉన్నారో మరింత స్పష్టంగా తెలుపుతుంది. జనాభా లెక్కల ఉద్దేశం వివిధ కులాలు ఎంతమంది ఉన్నారో, జనాభాలో వారి నిష్పత్తి ఏమిటో తెలుసుకోవడం మాత్రమే కాదు. ప్రతి కులానికి ఉన్న సదుపాయాలు ఏమిటో, హక్కులు ఏమిటో, వెసులుబాట్లు ఏమిటో తెలుసుకోవడం కూడా. రాజకీయాలనూ, సామాజికన్యాయ విధానాలనూ రూపొందించేందుకూ, వాటికి పదును పెట్టేందుకూ ఈ వివరాలు దోహదం చేస్తాయి. కులలా ఉనికిని, కులాల కారణంగా సమాజంలో ఉన్న అంతరాలనూ, వివక్షనూ గుర్తించడానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకోవడం ద్వారా కులనిర్మూలన అనే లక్ష్యాన్ని సాధించజాలము. కులాల ప్రభావాన్ని కొలవకుండా, గుర్తించకుండా, లెక్కించకుండా కులం ప్రాతిపదికగా కొనసాగుతున్న అసమానతలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించలేము. బీహార్ వేసిన ముందడుగును దేశమంతా అనుసరించవలసిందే.

Also read: స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles