Saturday, April 27, 2024

అఫ్ఘానిస్తాన్ పాతికేళ్ళ కిందట తాలిబాన్ వశం అయింది ఈ విధంగా…..

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి -4

అఫ్ఘానిస్తాన్ లోకి సోవియెట్ సైన్యాలు ప్రవేశించడానికి ముందే ముజాహిద్ ను (ముజాహిద్ అంటే మతయుద్ధం – జిహాదీ – చేసే యోధుడు అని అర్థం. ముజాహిద్ కి బహువచనం ముజాహిదీన్) మతయుద్ధానికి సిద్ధం చేసే కార్యక్రమం అమలుకు పాకిస్తాన్, అమెరికాలు చేతులు కలిపాయి. 1979లోనే అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) ద్వారా అఫ్ఘాన్ తిరుగుబాటు దళాలలకు నిధుల అందించడానికి అనుమతి ఇచ్చారు. జిమ్మీ కార్టర్ హయాంలో అమెరికా దృష్టి అధికంగా ఇరాన్ పైనే ఉన్నప్పటికీ అఫ్ఘానిస్తాన్ లో కూడా ఆసక్తి కనబరిచింది. అఫ్ఘానిస్తాన్ ను సోవియెట్ సైన్యం ఆక్రమించుకోవడం అఫ్ఘానిస్తాన్ ప్రజలకే కాకుండా అమెరికా అధ్యక్షుడికీ, పాలకవర్గానికి కూడా ఆశ్చర్యం కలిగించింది. వెంటనే ‘ఆపరేషన్ సైక్లోన్’ పేరతో ముజాహిదీన్ కి నిధులూ, ఆయుధాలూ సరఫరా చేయడాన్ని ముమ్మరం చేశారు. ముజాహిదీన్ కు శిక్షణ ఇవ్వడానికీ, ఆయుధాలు అందించడానికి రూ.20 బిలియన్ (రెండు వేల కోట్ల) డాలర్లు అమెరికా ప్రభుత్వం ఖర్చు చేసింది. స్టింగర్ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ని నిర్మించి ముజాహిదీన్ కు పెద్ద సంఖ్యలో సరఫరా చేసింది. 1986 నుంచీ సోవియెట్ సేనలపైన ముజాహిదీన్ స్టింగర్ మిసైల్స్ ను ప్రయోగించి వారిని వేధించి,  భారీ నష్టం కలిగించారు. సీఐఏ నిధులూ, ఆయుధాలూ ఒసామా బిన్ లాదెన్ కూ, ఆల్ ఖాయిదా మిలిటెంట్లకూ అందాయని కొందరి ఆరోపణ.

Also read: తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?

సోవియెట్ల ఆక్రమణకు పూర్వమే ముజాహిదీన్ తో అమెరికా సంబంధాలు

అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్ సేనలు 1979 డిసెంబర్ లో ప్రవేశిస్తే, అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ ముజాహిదీన్ కు డబ్బు ఇవ్వడం 3 జులై 1979నాడే ప్రారంభించింది. సోవియెట్ యూనియన్ అఫ్ఘాన్ లోకి రావడానికి అయిదు మాసాల ముందే అమెరికా అఫ్ఘాన్ మతయోధులతో సంబంధాలు పెట్టుకున్నది. సోవియెట్ సేనలు అఫ్ఘాన్ లోకి ప్రవేశించడం పట్ల నిరసనగా జిమ్మీ కార్టర్ 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించి గొప్ప సంచలనం సృష్టించారు. అప్పటికే ఇరాన్ తో బందీల సంక్షోభం కొనసాగుతోంది. అయినా సరే, సోవియెట్ ప్రాబల్యం పెరగకుండా చూసేందుకు సీఐఏని అఫ్ఘానిస్తాన్ పైన ప్రయోగించారు. పాకిస్తాన్ కి అమెరికా ఆర్థిక సహాయం హెచ్చించారు. ముజాహిదీన్ కి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ద్వారా ఆర్థిక సహాయం. ఆయుధాలు అందించాలనీ, అమెరికా ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నదో అంతే మొత్తం సౌదీ అరేబియా కూడా ఖర్చు చేయాలనీ అమెరికా పథకం రచించి సౌదీ రాజు చేత ఒప్పించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ కు ముజాహిదీన్ విధేయులుగా ఉండేవారు. సోవియెట్ సేనల అఫ్ఘాన్ లో ప్రవేశించడానికి ముందు అక్కడ ఉన్న మార్క్సిస్టు అనుకూల ప్రభుత్వంపైన మతఛాందస ముజాహిదీన్ గెరిల్లా పోరాటం చేస్తూ ఉంటే వారికి అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా. చైనా సాయం అందించేవి. అమెరికా సాయం 1980లో రెండు కోట్ల డాలర్ల సాయంతో మొదలై 1987లో 63కోట్ల డాలర్ల వరకూ పెరిగింది.

Also read: అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా

కార్టర్ సలహాదారు వెల్లడి

ప్రెసిడెంట్ కార్టర్ దగ్గర జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జిగ్ న్యూ బ్రెజిన్స్ కీ 1998 జనవరిలో ఒక విలేఖరుల గోష్ఠి పెట్టి తాలిబాన్ ను అమెరికానే సృష్టించిందని ప్రకటించాడు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తయారు చేసి దాన్ని ప్రపంచాన్ని గడగడలాడించే భయంకరమైన శక్తిగా మార్చిన ఘనత కూడా సీఐఏదేనని చెప్పాడు. ముజాహిదీన్ కు జిహాదీల కొరత లేదు. పాకిస్తాన్ లో, అఫ్ఘానిస్తాన్ లోని పాక్, ఇరాన్  సరిహద్దు ప్రాంతాలలో మదర్సాలు తాలిబ్ లను (విద్యార్థులను)ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేసి ముజాహిదీన్ లో చేర్చించేవి. విద్యార్థులలో మతభావనలను దట్టించేవి. యుద్ధం చేయడం నేర్పేవి.  దేవోబందీ ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం మతమౌఢ్యాన్ని నూరిపోసే మదర్సాలలో  పాకిస్తాన్ లోని బినోరీ మదర్సా ప్రధానమైనది. తాలిబాన్ నాయకుడిగా ఎదిగిన ముల్లా ఒమర్ , జైషే మొహమ్మద్ అధినేత మసూద్ బినోరీ మదర్సాలో చదివిన ప్రబుద్ధులే.  

Also read: మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్

సోవియెట్లు అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించిన తర్వాత  నజీబుల్లా ప్రభుత్వం బిక్కుబిక్కు మంటూ ఉంది. ఆ ప్రభుత్వంపైన యుద్ధం చేయడానికి కూడా ముజాహిదీన్ కు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు సాయం చేశాయి. జిమ్మీకార్టర్ తర్వాత అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఒక్క అఫ్ఘానిస్తాన్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోవియెట్ యూనియన్ వ్యతిరేక శక్తులకూ, కమ్యూనిస్టులను వ్యతిరేకించేవారికీ పెద్ద ఎత్తున అండదండలు సమకూర్చారు. 1981 నుంచి 1987వరకూ అమెరికా పాకిస్తాన్ కి 320 కోట్ల డాలర్లు చెల్లించింది. అందులో సగం ఆర్థిక సహాయం కింద, సగం ఆయుధాల సరఫరా కింద లెక్క కట్టింది.

Also read: తాలిబాన్ పై గెరిల్లాపోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు

అమెరికా ఆయుధాలు కరాచీ మీదుగా చేతులు మారి ముజాహిదీన్ చేతుల్లోకి వెళ్ళేవి. మార్గమధ్యంలో కరాచీలోనే కొన్ని ఆయుధాలు అక్రమంగా, రహస్యంగా అమ్ముకునేవారు పాకిస్తాన్ లో తయారైనారు. ముజాహిదీన్ ముఠాలు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండేవి.  కొన్ని ముఠాలకు ఇతర ముఠాలకంటే ఎక్కువ ఆయుధాలూ, నిధులూ అందేవి. మొత్తంమీద సుమారు నలభై సాయుధ ముఠాలను ఐఎస్ఐ సమన్వయం చేసేది.  చైనా కూడా జిహాదీలకు ఆయుధాలు సరఫరా చేసేది.  సోవియెట్ యూనియన్ బపరిచిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా నుంచి వచ్చిన మతఛాందస భావజాలం, నిధులు కలిసి జిహీదీలను ముందుకు నడిపించాయి. ఆ విధంగా ఇస్లామిక్ భావజాలం, డబ్బు సంచులతో వచ్చినవాడే ఒసామా బిన్ లాదెన్.

రష్యా నుంచి ఐఎస్ఐ చేతుల్లోకి అఫ్ఘాన్ అధికారం

ముజాహిదీన్ తిరుగుబాటును అణచివేయడంలో విఫలమైన సోవియట్ యూనియన్ 1989లో అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించింది. అమెరికా నిష్క్రమించిన తీరు కంటే సోవియెట్ సైనికులు వాపసు వెళ్ళిన తీరు హుందాగా ఉంది. వారు వెళ్ళినప్పుడు అఫ్గానిస్తాన్ లో కనీసం మొహమ్మద్ నజీబుల్లా ప్రభుత్వం ఉంది. ఇప్పటి లాగా పది రోజులలోనే తాలిబాన్ కాబూల్ లోకి దూసుకు రాలేదు. అప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చేందుకు నాలుగేళ్ళకు పైగా పోరాడవలసి వచ్చింది. మైకేల్ గోర్బచేవ్ సోవియెట్ సైన్యాలను ఉపసంహరణకు అంగీకరిస్తూ ఒక ఒప్పందంపైన సంతకాలు చేశారు. మరుసటి సంవత్సరమే సోవియెట్ యూనియన్ కుప్పకూలిపోయి విచ్ఛిన్నమైంది. అఫ్ఘానిస్తాన్ లౌకిక ప్రభుత్వానికి సోవియెట్ మద్దతు ఆగిపోయింది. లౌకిక అప్ఘానిస్తాన్ ఆటకట్టినట్టు అయింది. మతఛాందసుల ప్రభావం పెరిగిపోయింది. అఫ్ఘానిస్తాన్ లో అధికారం సోవియెట్ యూనియన్ నుంచి పాకిస్తాన్ లోని ఐఎస్ఐ హస్తాలలోకి వెళ్లింది. అమెరికా, చైనా, సౌదీ అరేబియాలు తెరవెనుకే ఉన్నాయి. ఈ మూడు దేశాలూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐని నియంత్రిచడానికి ప్రయత్నించేవి. మూడు దేశాలనూ ఐఎస్ఐ అధికారులు తెలివిగా ఉపయోగించుకొని తమ పబ్బం గడుపుకున్నారు.  అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.  సోవియెట్ సేనలు నిష్క్రమించిన తర్వాత అఫ్ఘానిస్తాన్ లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. నజీబుల్లా ప్రభుత్వం పడిపోయింది.

అఫ్ఘాన్ ప్రజలకు వీడ్కోలు చెబుతున్న సోవియెట్ సైనికులు

మొన్న తాలిబాన్ కాబూల్ ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు కతార్ కు పరారైన అష్రాఫ్ ఘనీ మాదిరే నజీబుల్లా ఇండియాకు రావడానికి ప్రయత్నించాడు. కాబూల్ విమానాశ్రయంలో నజీబుల్లాను ఇండియాకు తీసుకురావడంకోసం విమానం వేచి ఉంది. అప్పటికే కాబూల్ ఐక్యరాజ్య సమితి రాయబారి విమానంలో కూర్చొని ఉన్నాడు. భద్రతాదళం అధికారులు నజీబుల్లాను అడ్డుకున్నారు. వారితో పెద్దగా మాట్లాడుతూ వాదనకు దిగాడు నజీబుల్లా. అధ్యక్ష ప్రాసాదానికి పోలేకా, విమానం ఎక్కలేక మధ్యలో ఎటూకాకుండా దిక్కుతోచకుండా ఉండిపోయాడు. ఒక కారు వచ్చి ఆయనను దగ్గరలోనే ఉన్న  ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి తీసుకొని వెళ్ళింది. అక్కడే నాలుగున్నర సంవత్సరాలు ఐచ్చికంగా ఉండిపోయాడు.

Also read: తాలిబన్లు కాదు, తాలిబాన్!

నజీబుల్లా దారుణ హత్య

పాకిస్తాన్ కు విధేయత కలిగిన ఆరేడు సాయుధ ముఠాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ అంతర్యుద్ధం ఆగలేదు. ప్రభుత్వం నిలవలేదు. అదికారంకోసం సాయుద ముఠాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఆరంభించాయి. శాంతిభద్రతలు ఛిద్రమైనాయి. ప్రముఖులను అపహరించడం, వారిని క్షేమంగా తిరిగి అప్పగించేందుకు డబ్బులు వసూలు చేయడం, హత్యలు చేయడం, లూటీలు చేయడంతో గందరగోళంగా పరిస్థితులు  ఏర్పడినాయి.  అవినీతి హద్దు మీరింది.

ఉత్తరాది రాష్ట్రాలకు క్షేమంగా తీసుకువెడతానని తజిక్ నేత అహ్మద్ షా మసూద్ హామీ ఇచ్చాడు. కానీ నజీబుల్లా అంగీకరించలేదు. తాను కూడా పష్టూనే కనుక తాలిబాన్ తో మాట్లాడి రాజీపడవచ్చునని ఆశించాడు. తజిక్ నాయకుడితో పారిపోతే తాలిబాన్ క్షమించరని కూడా భయపడ్డాడు.

నాలుగేళ్ళు అంతర్యుద్ధం తర్వాత ఫష్టూన్ తెగకు చెందిన తాలిబ్ లే (విద్యార్థులే) విమోచకులుగా అఫ్ఘాన్ ప్రజల కళ్ళకు కనిపించారు. అధికారం వదిలిపెట్టి ఉత్తర దిశగా పలాయనం చిత్తగిస్తున్న అహ్మద్ షా మసూద్ సాయుధముఠా చేతుల నుంచి తాలిబాన్ అధికారం కైవసం చేసుకున్నది. 1996 నుంచి తాలిబాన్ పాలన మొదలై 2001 డిసెంబర్ లో  అమెరికా, నాటో సేనలూ, ఉత్తరాది కూటమికి నాయకుడైన అహ్మద్ మసూద్ ముఠాకు చెందిన యోధులూ కలిసి తాలిబాన్ ను అఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్ళగొట్టే వరకూ సాగింది.  అంతవరకూ నజీబుల్లాకూ, ఆయన సోదరుడికీ, ఇద్దరు సేవకులకూ ప్రాణభయం లేదు. మసూద్ ముఠా వెళ్ళిపోవడంతో నజీబుల్లాకు రక్షణ తొలిగిపోయింది. కొద్దిమంది తాలిబాన్, ఒక ఐఎస్ఐ అధికారి కలిసి నజీబుల్లా ఉండే ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి వెళ్ళి అతడినీ, అతడి సోదరుడినీ చితకబాది, జీపుకు కట్టివేసి, నేలమీద చాలా దూరం ఈడ్చుకొని వెళ్లి కాల్చి చంపివేశారు. ఆయన శవాన్ని అధ్యక్ష ప్రాసాదం ఎదురుగా ట్రాఫిక్ లైట్ పోల్ కి కట్టివేశారు. ప్రజలలో భయం నింపడానికి చేసిన పని అది.  తాలిబాన్ కు అండదండలు అందించిన సౌదీ అరేబియా సైతం నజీబుల్లాను కిరాతకంగా హత్య చేసిన తీరును ఇస్లామ్ కి వ్యతిరేకమైనదంటూ  విమర్శించింది. ఆ దారుణాన్ని ప్రపంచం అంతా నిర్ద్వంద్వంగా ఖండించింది.

Also read: క్లిష్టపరిస్థితులలో కాబూల్ నుంచి భారతీయులను ఎట్లా రక్షించారు? ఎవరు కాపాడారు?

Related Articles

2 COMMENTS

  1. The historical facts of Afganistan recent struggle is well articulated. American interests Worldwide were to contain Soviet union Influence post second World war amid cold war between USSR and USA . Mujahideen and Taliban were created by Pakistan and supported by America for their own vested interests resulting complete chos in Afghanistan . Arguably pakistan took advantage of US position to large extent .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles