Thursday, March 28, 2024

తాలిబాన్ పై గెరిల్లాపోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు

అఫ్ఘానిస్తాన్ పైన విజయపతాక ఎగురవేసిన సంరంభంలో తాలిబాన్ యోధులు సంబరాలు జరుపుకుంటూ ఉండగా తాలిబాన్ కు లొంగే సమస్యలేదనీ, వారితో ఒక ఇంటికప్పుకింద ఉండే ప్రశ్న ఉత్పన్నం కాదనీ మొన్నటిదాకా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న అమ్రుల్లా సాలే ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. అమ్రుల్లా సాలే తన గురువు ఏలిన పాంజ్ షీర్ కు వెళ్ళినట్టు సమాచారం. కాబూల్ కి ఈశాన్యంలో ఉన్న పాంజ్ షీర్ లోయ తాలిబాన్ అధీనంలో లేదు. సాలే గురువు, పోరాటయోధుడు అహ్మద్ షా మసూద్ కుటుంబం ఆధ్వర్యంలో ఆ లోయ ఉన్నది. సోమవారంనాడు మసూద్ తనయుడితో సాలే కలసి ఉన్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిందూకుష్ పర్వత సానువుల్లో ఉన్న ఈ లోయ ఇంతవరకూ తాలిబాన్ సొంతం కాలేదు. అఫ్గానిస్తాన్ లో అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ లోయ మసౌద్ పాలనలోనే ఉండేది. అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన సోవియెట్ యూనియన్ కూడా ఆ లోయను వశం చేసుకోలేకపోయింది. అమెరికా సేనలు సైతం ఈ లోయ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే లోయ పాలకుల అమెరికా పక్షానే ఉన్నారు. తాలిబాన్ ఆధిక్యం నిరూపించుకున్న తర్వాత కూడా అక్కడ మసౌద్ తనయుడు అహ్మద్  నేతృత్వంలో పోరాటయోధుల దళాలు లోయను పరిరక్షిస్తున్నాయి. మసూద్ తనయుడూ, అమ్రుల్లా సాలే, మాజీ రక్షణమంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి  తాలిబాన్ కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది.

కజికిస్తన్ కు పలాయనం చిత్తగించిన మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ

‘‘నా మాటలు విశ్వసించిన లక్షలాదిమంది ప్రజలను మోసం చేయలేను. తాలిబ్ ఉగ్రవాదులతో ఏ పరిస్థితులలోనూ కలసి జీవించలేను. నా హీరో అహ్మద్ షా మసూద్ ఆత్మనూ, వారసత్వాన్నీ నేను వంచించజాలను. తాలిబాన్ తో కలసి ఒకే కప్పుకింద ఎన్నడూ ఉండబోను,’’అంటూ అమ్రుల్లా సాలే ఇంగ్లీషులో ట్వీట్ పెట్టాడు. తాలిబాన్ పైన గెరిల్లా యుద్ధం సాగించే వ్యూహానికి సాలే, అహ్మద్ మసూద్ కలిసి పదును పెడుతున్నారు. అఫ్ఘాన్ పౌరులలో ఒక లక్షణం గమనించాలి. వారు ఎవ్వరితోనూ ఎన్నటికీ రాజీ పడరు. గ్రీకులూ, హూనులూ, బ్రిటిష్ వారూ, సోవియెట్ యూనియన్, అమెరికా … ఎవరైనా సరే వారు జోహుకుం అనరు. అహ్మద్ తాలిబాన్ తో కలసి అధికారం పంచుకోవడం గురించి కొంత ఆలోచించాడు. అటువంటి ప్రతిపాదన చేశాడు. కానీ తాలిబాన్ పలకలేదు. ఇప్పుడు తాలిబాన్ ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాడు.

అగ్రరాజ్యాలనే మట్టికరిపించిన ధీరులు

అగ్రరాజ్యాలనే మట్టికరిపించిన ధీరచరిత్ర అఫ్ఘానిస్తాన్ ప్రజలది. వారు ప్రేమించినవారికి ప్రాణమిస్తారు. ద్వేషించినవారితో రాజీ ప్రసక్తే ఉండదు. వారు ఎంత కాలమైనప్పటికీ ఎన్ని కష్టాలూ, నష్టాలూ ఎదురైనా రాజీలేని పోరాటం సాగిస్తూనే ఉంటారు. కొన్ని తరాల పాటు విజయం వరించకపోయినా పోరాటం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. వారు స్నేహానికి ప్రాధాన్యం ఇస్తారు. మాటకు కట్టుబడి ఉంటారు. ధోకా చేస్తే సహించరు. భయపడరు. తమ ప్రాణాలపైన తీపి లేదు.

పాంజ్ షీర్ లోయ సహజమైన రక్షణలు కలిగిన లోయ. ‘‘ఈ లోయలోకి తాలిబాన్ ను రానివ్వం. మా శక్తినంతా వినియోగించి వారిని ప్రతిఘటిస్తాం. వారిని ఎదిరించి పోరాడుతాం’’ అని లోయలో జీవిస్తున్న ఒక యువకుడు చెప్పాడు. సాలే చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధ అయినాడు. మసూద్ దళంలో నాయకుడి వెంటే ఉంటూ 1980-90లలో పోరాటం సాగిస్తూ జీవితం గడిపాడు. ఒకానొక సమయంలో అమ్రుల్లా సాలే కూడా తీవ్రవాదే. ఆతడిని తాలిబాన్ లు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టించారు. అతడిని పట్టుకోవడం కోసం అతడి సోదరిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి నుంచి తాలిబాన్ అంటే అతడికి బద్ధవైరం.

అమెరికా సేనలు అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించి తాలిబాన్ ను తరిమివేసిన తర్వాత సాలే తిరిగి ప్రభుత్వంలో పని చేశాడు.  గూఢచారి విభాగానికి అధిపతిగా ఉన్నాడు. అనంతరం ఉపాధ్యక్ష పదవి చేపట్టాడు. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ని రెండు దశాబ్దాల విరామం తర్వాత తిరిగి ఆక్రమించుకున్న కారణంగా అమ్రుల్లా సాలే వంటి యోధులు మరల ఆయుధాలు పట్టవలసి వస్తున్నది.

కొడుకు అహ్మద్ మసూద్, తండ్రి అహ్మద్ షా మసూద్

పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత

పాకిస్తాన్ పట్ల తన వ్యతిరేకతను సాలే దాచుకోలేదు. పాకిస్తాన్ దౌత్యవేత్తలు తాలిబాన్ కు మంచిపేరు తేవాలని ఎంత ప్రయత్నించినా, తాలిబాన్ తో తమకు సంబంధాలు లేవంటూ ఎన్నివేషాలు వేసిన వాస్తవాలు మాయం కాజాలవని సాలే స్పష్టం చేశాడు. తాలిబాన్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదంటూ ఉపాధ్యక్షుడి హోదాలో సాలే పదే పదే ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్ అఫ్ఘాన్ రాయబారి కుమార్తెను జులై 16న కిడ్నాప్ చేసిన ఉదంతంతో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మధ్య పచగడ్డి భగ్గుమంటోంది. ఆ ఉదంతం కారణంగా అఫ్ఘాన్ రాయబారిని వెనక్కు పిలిపించుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అఫ్ఘాన్ అధ్యక్షుడ అష్రాఫ్ ఘనీ ఒకే వేదికపైన ఉన్నప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ ను అన్ని విధాలా నడిపిస్తోందంటూ అష్రాఫ్ ఆరోపణ చేశారు. తాలిబాన్ ఎదగడం పాకిస్తాన్ కు నష్టమే కానీ లాభదాయకం కాదని ఇమ్రాన్ సమాధానం చెప్పారు. కానీ మొన్న తాలిబాన్ ను స్వాతంత్ర్య సమర యోధులతో పోల్చుతూ, వారి విజయంతో అఫ్ఘానిస్తాన్ బాసిన సంకెళ్ళు తెగిపోయాయంటూ ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించాడు.

షేర్ –ఇ – పాంజ్ షీర్

అహ్మద్ షా మసూద్ ని షేర్-ఇ-పాంజ్ షీర్ అని పిలిచేవారు. నార్తె అలయెన్స్ కు నాయకత్వం వహించి తాలిబాన్ కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 2001లో అమెరికా అఫ్ఘానిస్తాన్ లో అడుగుపెట్టడానికి నార్త్ అలయెన్స్ పూర్తిగా సహకరించింది. అంతకు ముందు 1979 నుంచి 1989 వరకూ సోవియెట్ యూనియన్ సేనలు అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించడాన్ని పూర్తిగా వ్యతిరేకించి పోరాడినవాడు అహ్మద్ షా మసూద్. చాలా శక్తిమంతమైన గెరిల్లా యుద్ధ ప్రవీణుడుగా, కమాండర్ గా పేరు తెచ్చుకున్నాడు. తజిక్  సున్నీ తెగకు చెందిన మహ్మద్ షా మసూద్ తాలిబాన్ అధికారంలోకి రాకముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. కాబూల్ లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా కమ్యూనిస్టు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. బుర్హనుద్దీన్ రబ్బానీ నాయకత్వంలో ఇస్లాంమత రాజకీయాలలో ప్రవేశించాడు. మహమ్మద్ దావూద్ ఖాన్ ను గద్దెదింపే ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తిరుగుబాటు విఫలమైంది. తర్వాత రబ్బానీ నాయకత్వంలోని జమాయత్-ఇ-ఇస్లామీ పార్టీలో చేరాడు. సోవియెట్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ కు నాయకత్వం వహించి పాంజ్ పీర్ సింహంగా పేరు తెచ్చుకున్నాడు. 1992లో పెషావర్ శాంతి ఒప్పందంపైన సంతకం చేశాడు. కమ్యూనిస్టేతర ఇస్లామిక్ ప్రభుత్వంలో చేరి రక్షణమంత్రిగా పని చేశాడు. కాబూల్ ని రక్షించేందుకు పోరాడాడు. గుల్ బుద్దీన్ హక్ మత్యార్ వంటి సాయుధముఠా నాయకుల దాడుల నుంచి కాబూల్ ని పరిరక్షించాడు. 1995లో కాబూల్ ని వశం చేసుకోవడానికి తాలిబాన్ పోరాడినప్పుడు వారిని ఎదిరించి నిలిచాడు. నాడు జరిగిన అంతర్యుద్ధంలో సుమారు 60 వేలమంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి తాలిబాన్ గెలుపొందింది.

మాజీ రక్షణమంత్రి బిస్మిల్లాఖాన్ మొహమ్మదీ

తాలిబాన్ ప్రభుత్వాన్ని కూలదోసిన మసౌదీ

తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మూఢ ఇస్లామిక్ వాదాన్ని మసూద్ తిరస్కరించాడు. తజికిస్తాన్ కు వెళ్ళిపోయాడు. పోతూపోతూ సలాంగ్ సొరంగాన్ని ధ్వంసం చేశాడు. ఇస్లామిక్ ఫ్రంట్ నాయకుడిగా కుదురుకొని అఫ్ఘానిస్తాన్ భూభాగంలో అయిదు నుంచి పది శాతం వరకూ తన అధీనంలో ఉంచుకోగలిగాడు. 2001లో యూరప్ లో పర్యటించాడు. తాలిబాన్ కు మద్దతు ఇవ్వవద్దని పాకిస్తాన్ కు నచ్చజెప్పవలసిందిగా యూరప్ దేశాధినేతలను కోరాడు. అల్ ఖాయితా, తాలిబాన్ లు పురమాయిస్తే ఆత్మాహుతి దళం మసూద్ పైన దాడి చేసింది. ఆత్మాహుతి దళం బాంబు పేలి 9 సెప్టెంబర్ 2001న మసూద్ మరణించాడు. రెండు రోజుల తర్వాతనే 11 సెప్టెంబర్ న అల్ ఖాయిదా ఆత్మాహుతి దళాలు న్యూయార్క్ లోని అంతర్జాతీయ వాణిజ్య శిఖరాలపైన దాడి చేశాయి. అహ్మద్ షా మసూద్ చనిపోయిన తర్వాత అతడి దళానికి అతడి కుమారుడు అహ్మద్ మసౌదీ నాయకత్వం వహిస్తున్నాడు. షా మసూదీకి ‘నేషనల్ హీరో’ పురస్కారాన్ని హమీద్ కార్జాయ్ ప్రభుత్వం మరణానంతరం ప్రకటించింది. అంతకు ముందు అమెరికా సేనలతో కలసి రెండు మాసాలుపోరాటం చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని 2001 డిసెంబర్ లో కూలదోయడంలో అహ్మద్ మసూద్ నాయకత్వంలోని నార్దరన్ అలయెన్స్ పాత్ర అద్వితీయమైనది.

అహ్మద్ మసూద్, సమ్రుల్లా సాలే తో మాజీ రక్షణమంత్రి బిస్మిల్లాఖాన్ మహమ్మదీ చేతులు కలిపే అవకాశం ఉంది.  ఈ ముగ్గురూ కలసి తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా ఉద్యమాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles