Sunday, September 15, 2024

మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి-3

అమెరికా సైన్యం వెళ్ళిపోయిన తర్వాత అఫ్ఘానిస్తన్ ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకొని ఆ దేశం నుంచి బయటపడటానికి ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. అనేకమంది నిరాశ్రయులైనారు. కొందరు తాలిబాన్ చేతికి చిక్కారు. విమానం టైర్లకు మానవ దేహం తాలూకు అవశేషాలు ఉన్నాయని కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికాకు విమానం నడిపిన పైలెట్లు చెప్పారు. విమానం రెక్కల మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నఒక వ్యక్తి కిందపడటం వీడియోలో ప్రపంచం అంతా చూసి దిగ్భ్రాంతి చెందింది. రెండు వందల మంది ప్రయాణం చేయవలసిన విమానంలో ఆరువందలమందికి పైగా ప్రయాణం చేశారని కూడా కథనాలు విన్నాం. హృదయవిదారకమైన సన్నివేశాలు చూసినప్పుడు గుండెలు పిండిన అనుభూతి కలిగింది. కాబూల్ లో ఇరవై సంవత్సరాలు మకాం పెట్టి అఫ్ఘానిస్తాన్ ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పి చేష్టలుడిగి అఫ్ఘాన్ అధ్యక్షుడికి తెలియకుండా తాలిబాన్ తో చర్చలు జరిపి, ఒప్పందం కుదుర్చుకొని, సైన్యాన్ని ఉపసంహరించుకోవడం నిజాయతీ, విశ్వసనీయత, సూత్రబద్ధమైన వైఖరి కలిగిన దేశం చేయదగిన పని కాదు. అగ్రరాజ్యం చేయవలసిన పని అసలే కాదు. రెండు దశాబ్దాలపాటు అక్కడ ఉన్నా అఫ్ఘాన్ ప్రజలంటే ప్రేమ లవలేశమైనా లేదు. వారి క్షేమం గురించి చింత లేదు. తమ సైన్యాన్ని సురక్షితంగా వెనక్కు రప్పించుకోవడం ఒక్కటే లక్ష్యం. అఫ్ఘాన్ ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు. ఇదీ అమెరికా వైఖరి. ఇదే అమెరికా ఆధునిక చరిత్ర.

Also read: తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?

అడ్డం తిరిగిన అమెరికా కథ

ఒక దేశాన్ని కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు ఆక్రమించిన మరో దేశం కథ అడ్డం తిరిగి వెనక్కు స్వదేశానికి వెళ్ళిపోయే ఘట్టాలు చరిత్రలో చాలా సందర్భాలలో కనిపిస్తాయి. ప్రపంచం పెద్దగా, పెత్తందారీగా వ్యవహరించడానికి ప్రయత్నించి, ప్రపంచాన్ని కొల్లగొట్టి, చివరికి అలసిపోయి, నష్టపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే సమయంలో స్వార్థ చింతన తప్ప ఇతరుల భద్రత పట్టదు. మొదట బ్రిటన్, తర్వాత అమెరికా ఈ పాత్రలు పోషించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థతో, సామ్రాజ్య కాంక్ష నశించి ఇంటిని చక్కబెట్టుకునే క్రమంలో ఇండియాను వదిలి వెళ్ళే క్రమంలో భారతీయులకు బ్రిటన్ ఎనలేని కష్టం కలిగించింది. 1947లో బ్రిటన్ ఇండియాను మతం ప్రాతిపదికగా రెండుగా చీల్చి తన్నుకొని చావండని చెప్పి వాపసు వెళ్ళిపోతే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే హిందువులూ, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే ముస్లింలూ వేల సంఖ్యలో మతకలహాలలో చనిపోయారు. రెండు నుంచి ఇరవై లక్షలమంది చనిపోయారని అంచనా. రెండు కోట్ల మంది నిరాశ్రయులైనారు. వేలజీవితాలు బుగ్గిపాలై పోయాయి. కుటంబాలు విడిపోయాయి. సర్వనాశనం జరిగింది. సిగ్గుపడవలసిన పలాయనం (షేమ్ ఫుల్ ఫ్లయిట్) అని అమెరికా చరిత్రకారుడు స్టాన్లీ వాల్పర్ట్ వ్యాఖ్యానించాడు. అధికార బదిలీ అంటూ మర్యాదగా చెప్పుకున్నప్పటికీ బ్రిటన్ చేసింది కృతఘ్నతాపూర్వకమైన చర్య. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకుతిన్నది. 1857లో మొదటి సిపాయీల తిరుగుబాటు తర్వాత పాలనాధికారాన్ని స్వీకరించిన బ్రిటిష్ రాణి పాలనలోనూ దోపిడీ కొనసాగింది. భారత్ నుంచి వెళ్ళిపోవలసిన సమయం వచ్చే సరికి దేశాన్ని రెండుగా చీల్చి నరమేధానికి కారణమైంది.

ప్రపంచంలో కమ్యూనిస్టులను అరికట్టుతాననీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాననీ, మానవహక్కులను కాపాడతానని బయలు దేరిన అమెరికా చేయరాని పనులు చాలా చేసింది. ప్రజాస్వామ్యదేశమైన ఇండియాను వ్యతిరేకించి సైనిక నియంతల పాలనలో మగ్గే పాకిస్తాన్ ను బలపరిచేది. తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ సైనికాధికారులు నరమేథం సాగిస్తుంటే ప్రతిఘటించి విమోచనోద్యమం నిర్వహించినవారికి ఇండియా మద్దతుగా నిలిస్తే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్స్ నిక్సన్ సప్తమ నౌకాదళాన్ని (సెవెన్త్ ఫ్లీట్) పాకిస్తాన్ కు సహాయం చేయడానికి పంపించాడు. అంతకు పూర్వం వియత్నాంపైనా, కంబోడియాపైనా అమెరికా  బాంబులవర్షం కురిపించింది. తనను నమ్ముకున్న తైవాన్ కు తెలియకుండా చైనాతో సంబంధాలు పెట్టుకుంది. కిసింజర్ రాయబారం నడిపించి మావోను నిక్సన్ ను కలిపించాడు. ఇరాక్ లో లేని రసాయనికాయుధాలు ఉన్నాయని బుకాయించి బాంబులు వేసి ప్రాణనష్టం, ఆస్తినష్టం అపారంగా కలిగింది ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్ ను ఉరితీయించింది.

Also read: అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా

మాయని గాయం  సైగాన్  

కాబూల్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణను అర్ధశతాబ్ది కిందట సైగాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణతో పోల్చుతున్నారు. ఉత్తర వియత్నాం సైనిక నాయకుడు జనరల్ వోగ్యూయెన్ జియాప్  ఫ్రెంచ్ వలస సైనికులను డీన్ బీన్ ఫూ దగ్గర చిత్తు చేసి తరిమికొట్టిన 1954లోనే అమెరికా తలదూర్చింది. 21 సంవత్సరాల తర్వాత అదే జియాప్ అమెరికా సేనలనూ, దక్షిణ వియత్నాం సేనలకూ చిత్తుగా ఓడించాడు.

వియత్నాం యుద్ధం టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేసిన మొదటి సాయుధపోరాటం. అక్కడ ఉత్తర వియత్నాం యోధులు అమెరికా, దక్షిణ వియత్నాం సైనికులను ఏ విధంగా ఓడించారో ప్రత్యక్షంగా చూసిన ప్రపంచం అమెరికాను చిన్నచూపు చూడటం ప్రారంభించింది. అమెరికా పౌరసమాజం కూడా అమెరికా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించింది. ‘‘హే హే ఎల్ బీజే (అప్పటి అద్యక్షుడు లిండన్ బి జాన్సన్). ఈ రోజు ఎంతమంది పిల్లల్ని చంపావో చెప్పు (హౌ మెనీ కిడ్స్ యూ హావ్ కిల్డ్ టు డే?)’’ అంటూ నినాదాలు ఇస్తూ నిరసన ప్రదర్శనలు చేసేవారు. ఒకానొక సమయంలో ఐదు లక్షల అమెరికా సైనికులు వియత్నాంలో ఉన్నారు. ఇది అఫ్ఘానిస్తాన్ లో అమెరికా సైనికుల కంటే ఐదు రెట్లు అధికం. 2010లో ఒబామా హయాంలో అత్యధికంగా లక్షమంది అమెరికా సైనికులు అఫ్ఘానిస్తాన్ లో ఉండేవారు. ఉత్తర వియత్నాంపైన సైనిక విజయం సాధించజాలమని గ్రహించిన అమెరికా సైగాన్ నుంచి ఉపసంహరించుకున్నది. 30 ఏప్రిల్ 1975న ఉత్తర వియత్నాం స్వాధీనంలోకి దక్షిణ వియత్నాం వచ్చినప్పుడు సైగాన్ లో అమెరికా రాయబార కార్యాలయ భవనంపైన సైనిక హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తూ అమెరికా పౌరులూ, సైనికులూ తహతహలాడుతూ పరుగులు తీయడం చూసినవారికి మొన్న కాబూల్ దృశ్యాలు అర్థం అవుతాయి. అప్పట్లో టీవీలో అమెరికా సైనికుల, పౌరుల సైగాన్ అగచాట్లను చూపించారు. హెలికాప్టర్లో పట్టనంత మంది అమెరికన్ లు ఎక్కి హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత దానికి వేళ్ళాడుతున్నవారు కిందికి దూకిన దృశ్యాలు చూసినవారు చాలామంది సజీవంగా ఉన్నారు. ఉత్తర వియత్నాం సైనికులు సైగాన్ లో ప్రవేశించేందుకు క్షణాల ముందుగా అమెరికన్లను ఎక్కించుకొని వెళ్ళడానికి హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు మొన్న కాబూల్ కష్టాలు చూసినవారికి గుర్తుకొచ్చి ఉంటాయి. చివరి హెలికాప్టర్ సైగాన్ నుంచి అమెరికా పౌరులతో నిష్క్రమించిన తర్వాత నాలుగు గంటలకు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సైగాన్ ను ఆక్రమించుకున్నది (అఫ్ఘానిస్తాన్ లో అంత వెసులుబాటు కూడా లేదు. అమెరికా సేనల ఉపసంహరణకు ఆగస్టు 31 వరకూ గడువు ఉండగానే ఆగస్టు రెండో వారం చివరలోనే కాబూల్ తాలిబాన్ వశం అయింది.) ఆ విధంగా 120 సంవత్సరాల విదేశీ ఆక్రమణ నుంచి సైగాన్ విముక్తి పొందింది. ఉత్తర వియత్నాం మహానాయకుడు హోచీమిన్ పేరు సైగాన్ కు పెట్టి హోచీమిన్ సిటీ అని పిలుస్తున్నారు. రెండు దశాబ్దాలు సాగిన యుద్ధంలో 58 వేలమంది అమెరికా సైనికులూ, 2,50,000 మంది వియత్నాం (ఉభయ వియత్నాంల) సైనికులూ మరణించారు. ఆ విధంగా ఆసియాలో ఆక్రమించిన దేశం నుంచి అవమానకరమైన పరిస్థితులలో నిష్క్రమించవలసి వచ్చింది. కాలచక్రం అయిదు దశాబ్దాలు తిరగడానికి ముందే ఆసియాలో మరో దేశం నుంచి అంతకంటే అవమానకరమైన పరిస్థితులలో నిష్క్రమించవలసి వస్తుందని అమెరికన్లు ఊహించి ఉండరు.

Also read: తాలిబాన్ పై గెరిల్లాపోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు

సామ్రాజ్యాల సమాధి

వియత్నాం గాయాలు మానక మునుపే మరో ఆసియా దేశం అఫ్ఘానిస్తాన్ తో చెలగాటం మొదలుపెట్టింది అమెరికా.  ఈ సారి ఆక్రమించుకున్న అఫ్ఘానిస్తాన్ ఆషామాషీ దేశం కాదు. దానికి ‘సామ్రాజ్యాల సమాధి’ అనే పేరు ఉంది. ఎందరో చక్రవర్తులూ, రాజులూ, యోధానుయోధులూ అఫ్ఘానిస్తాన్ పైకి దండెత్తి వెళ్ళినా ఒక్కరూ కాళ్ళూనుకోలేదు. అందరూ అవమానభారంతో వెనుతిరగవలసి వచ్చింది. తొలుత  ఇరాన్ రాజులు అఫ్ఘానిస్తాన్ ను నియంత్రించడానికి ప్రతయ్నించి విఫలమైనారు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ (సికందర్ ) వరుసగా రాజ్యాలను గెలుచుకుంటూ ఇండియా సరిహద్దు వరకూ వచ్చాడు. పురుషోత్తముడి చేతిలో పరాభవం చెంది వెనుదిరిగాడు. అఫ్ఘానిస్తాన్ పైన కన్ను వేశాడు కానీ వీలుకాలేదు. మగథ రాజులైన మౌర్యులు కూడా అఫ్ఘానిస్తాన్ పైన కన్నువేశారు. విఫలమైనారు. మొఘల్ చక్రవర్తులూ, బ్రిటిష్ రాజులూ, సోవియెట్ యోధులూ, ఇప్పుడు అమెరికావీరులూ మట్టికరిచారు. రవి అస్తమించని మహాసామ్రాజ్యాన్నీ, రెండు అగ్రరాజ్యాలనూ సమాధి చేసిన ఘన చరిత్ర అఫ్ఘానిస్తాన్ ది.  

సమైక్య అఫ్ఘానిస్తాన్ కు కందహార్ 18వ శతాబ్దంలో రాజధానిగా ఉండేది. 12వ శతాబ్దంలో మంగోలు యోధుడు చంగిజ్ ఖాన్ అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేసినప్పుడు కందహార్ ను నాశనం చేశాడు. కానీ అనతి కాలంలోనే కందహార్ కోలుకొని అభివృద్ది చెందింది. తర్వాత పర్షియన్లు (ఇరాన్ వారు) తర్వాత మొఘల్ చక్రవర్తులు తర్వాత మళ్ళీ పర్షియన్లు కందహార్ పైన ఆదిపత్యం చెలాయించారు. 19వ శతాబ్దంలో బలపడుతున్న రష్యా ఇండియాను కాజేయకుండా చూసుకునేందుకు  నిరోధించడానికి వీలుగా  అఫ్ఘానిస్తాన్ తమ చేతిలో ఉంటే బాగుంటుందని బ్రిటిష్ పాలకులు అనుకున్నారు. బ్రిటిష్ వారికీ, అఫ్ఘాన్ సేనలకూ మధ్య 90 సంవత్సరాలలో మూడు యుద్దాలు జరిగాయి. ఆంగ్ల సామ్రాజ్యం వెనుకంజ వేసింది. 20వ శతాబ్దంలో అఫ్ఘానిస్తాన్ ను నియంత్రించడానికి సోవియెట్ యూనియెన్  ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఇరవై ఒకటో శతాబ్ది, నూతన సహస్రాబ్ది ఆరంభంలో అమెరికా రంగప్రవేశం చేసింది. రెండు దశాబ్దాల తర్వాత భంగపడింది.

అమానుల్లా రాజ్యాంగం

అఫ్ఘానిస్తాన్ చివరి రాజు జాహిర్ షా. సోవియెట్ యూనియన్ ప్రగతి చూసి ఆ విధంగా ప్రగతి పథంలో అఫ్ఘానిస్తాన్ ను నడిపించాలని ప్రయత్నించిన రాజులలో జాహిర్ షా (1933-73) మూడో రాజు. మొదటి రాజు అమానుల్లా. అతడు 1923లో అఫ్ఘానిస్తాన్ కు ఒక రాజ్యాంగాన్ని ప్రసాదించాడు. అన్ని మతాలనూ, పురుషులనూ, స్త్రీలనూ సమానంగా చూడాలని రాజ్యాంగం నిర్దేశించింది. మతనాయకులకు ఇది నచ్చలేదు. రాజుపైన తిరుగుబాటు చేశారు. కాబూల్ ని కైవసం చేసుకున్నారు. కానీ అఫ్గానిస్తాన్ మొత్తం వారి చేతికి చిక్కలేదు. అమానుల్లా బంధువు మొహమ్మద్ నాదర్ షా అధికారం హస్తగతం చేసుకున్నాడు. అమానుల్లా రాజ్యాంగాన్ని, విధానాలనీ నాదర్ షా కొనసాగించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ళకు నాదిర్ షాను శత్రువులు హత్య చేశారు. నాదిర్ షా కుమారుడు జాహిర్ షా. రెండో ప్రపంచయుద్దకాలంలోనూ, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనూ జాహిర్ షా ఏలుబడిలో అఫ్ఘానిస్తాన్ ఉండేది. రాజు ఉంటూనే ప్రధాన మంత్రులు రాజ్యం చేసేవారు. వారిలో ఒకరైన షా మహమూద్ మతఛాందసులను ఎదిరించాడు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలనీ, పత్రికాస్వేచ్ఛ ఉండాలనీ, పార్లమెంటులో ఉదారవాదులు ఉండాలనీ ప్రయత్నించాడు. మతఛాందసులు దావూద్ ఖాన్ ను ముందుకు నెట్టారు. దావూద్ ఖాన్ షా మహమూద్ ని ఓడించి అధికారం హస్తగతం చేసుకున్నాడు. దావూద్ ఖాన్ కూడా సోవియెట్ విధానాలనే అనుసరించి సైనికంగానూ, ఆర్థికంగానూ ఎదిగేందుకు ప్రయత్నించాడు. సోవియెట్ యూనియన్ ప్రభావం అఫ్ఘానిస్తాన్ పైన అమితంగా ఉండేది. సోవియెట్ నీడలో ప్రగతిశీల విధానాలను అవలంబించాడు. మహిళలకు పరదా పద్ధతికి స్వస్తి చెప్పాడు.  రాజకీయాలలో, ఉద్యోగాలలో, విద్యావ్యవస్థలలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది.  ఇది మళ్ళీ మతఛాందసులకు నచ్చలేదు. వారు ఆగ్రహించారు. కత్తి దూశారు. అప్పటి నుంచి అది కలహాల కుంపటే.

అఫ్ఘాన్ పార్లమెంటులో రెండు సభలు

అఫ్ఘానిస్తాన్ పార్లమెంటును లోయా జిర్గా అంటారు. అది సమున్నత మండలి. జాహిర్ షా ప్రవేశపెట్టిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి. ఒకటి మన లోక్ సభ, బ్రటిన్ లో హౌస్ ఆఫ్ కామన్స్, అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్ లాగానే ప్రజాప్రతినిధుల సభ. రెండోది మన రాజ్యసభ లాగా, బ్రిటన్ లో హౌస్ ఆఫ్ లార్డ్స్ లాగా, అమెరికాలో సెనేట్ లాగా పెద్దల సభ. 1966లోనూ, 1969లోనూ ఉభయ సభలకూ ఎన్నికలు జరిగాయి. అన్ని రకాల భావజాలాలు ఉన్నవారు ఎన్నికలలో పాల్గొన్నారు. అతివాదులూ, మితవాదులూ అందరూ స్వేచ్ఛగా ఎన్నికలలో పాలుపంచుకున్నారు. ఒక వైపు మార్క్సిస్టు పార్టీ ఉంటే మరో వైపు మతఛాందసాన్ని ప్రోత్సహించే జమాత్-ఎ-ఇస్లామీ నిలిచింది. జమాత్ కు మదర్సాల లో చదువుకున్నవారు వస్తే మార్క్సిస్టు పార్టీకి యూనివర్శిటీలో చదువుకున్నవారు వచ్చేవారు. భావజాల సంఘర్షణలతో, ఆదిక్యం కోసం పెనుగులాటతో రెండు దశాబ్దాలు గడచిపోయాయి. జమాత్ భావజాలానికి 1994లో పుట్టిన బిడ్డలే తాలిబాన్.

Also read: క్లిష్టపరిస్థితులలో కాబూల్ నుంచి భారతీయులను ఎట్లా రక్షించారు? ఎవరు కాపాడారు?

భారత్ తో స్నేహం, పాకిస్తాన్ తో వైరం

అఫ్ఘానిస్తాన్ కి పాకిస్తాన్ మిత్రదేశమనే పేరుంది. తాలిబాన్ కు పాకిస్తాన్ అడ్డా. అమెరికా ఆక్రమణలో అఫ్ఘానిస్తాన్ ఉండిన రెండు దశాబ్దాలూ తాలిబాన్ కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. కానీ పాత స్పర్థలు రెండు దేశాల మధ్య ఉన్నాయి. పష్టూనిస్తాన్ సమయ్య రెండు దేశాల నాయకుల మధ్య ఎప్పటికైనా చిచ్చు పెట్టగలదు. తాలిబాన్ బలపడి స్థిరబడిన తర్వాత ఈ సమస్య పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మధ్య అపోహలకూ, స్పర్థలకూ, ఘర్షణకూ దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇది పాత సమస్య. బ్రటిష్ వారికీ, అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాలకీ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం డ్యూరాండ్ రేఖ రెండు దేశాల సరిహద్దు. కానీ, డ్యూరాండ్ లైన్ ను అఫ్ఘానిస్తాన్ రాజులు ఎన్నడూ సరిహద్దుగా అంగీకరించలేదు. ఎందుకంటే తమ పష్టూన్లు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు. అది కూడా తమకే చెందుతుందని అఫ్ఘాన్ రాజులూ, నాయకులూ  వాదించేవారు. పష్టూన్లు నివసిస్తున్న పష్టూనిస్తాన్ ను స్వాధీనం చేసుకునేందుకు దావూద్ సోవియెట్ యూనియన్ సహయం కోరాడు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ తో సరిహద్దును మూసివేసింది. దావూద్ ఖాన్ పదవీ చ్యుతుడైన తర్వాత కొన్నేళ్ళకు తిరుగుబాటు చేసి 1973లోఅధికారంలోకి తిరిగి వచ్చాడు.

ఈ సారి దావూద్ ఖాన్ జాహిర్ షా రాజ్యాంగాన్నిరద్దు చేసి అఫ్ఘానిస్తాన్ ను రిపబ్లిక్ గా ప్రకటించాడు. పాక్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోతో స్నేహం చేసి పష్టూనిస్తాన్ ను సాధించాలని ప్రయత్నించాడు. 1978లోదావూద్ ఖాన్ నీ, అతని కుటుంబ సభ్యులనూ తిరుగుబాటుదారులు హత్య చేశారు. అఫ్ఘాన్ సైన్యంలో వామపక్ష భావాలు కలిగిన అధికారులు ఎక్కువగా ఉండేవారు. అధికారంలోకి వచ్చినవారు సోవియెట్ యూనియన్ కు అనుకూలంగా ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ విధానమైన భూసంస్కరణలను అమలు చేయడానికి ప్రయత్నం జరిగింది. మతగురువులు అంగీకరించారు కానీ గిరిజన తెగలవారు వ్యతిరేకించారు. సోవియెట్ యూనియన్ 1979లో అఫ్ఘానిస్తాన్ పైన దండెత్తి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నది. కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలం మతశక్తులను ఆకర్షించింది. ఈ మతశక్తులకు పాకిస్తాన్ అండగా నిలిచింది. పాకిస్తాన్ తో చైనా చేతులు కలిపింది. అమెరికా అండగా నిలిచింది. ఇస్లాం మతవాదులు పోరాటయోధులుగా, ముజాహిదీన్ గా అవతారమెత్తారు. మతయుద్ధం (జిహాద్) ప్రారంభమైంది.

Also read: తాలిబన్లు కాదు, తాలిబాన్!

(మిగతా తరువాత)   

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles