Friday, April 26, 2024

ములాయం సింగ్ యాదవ్ మరి లేరు

  • పది సార్లు అసెంబ్లీకీ, ఏడు విడతల లోక్ సభకు ఎన్నికైన ప్రజానాయకుడు
  • అత్యాచారంపైన వివాదస్పద వ్యాఖ్యలతో అల్లరైన అగ్రనాయకుడు

సోమవారం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన ములాయం సింగ్ యాదవ్ ఒక సోషలిస్టు యోధుడు. ‘నేతాజీ’గా అందరూ పిలుచుకునే ములాయం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు. పది విడతల శాసనసభకూ, ఏడు సార్లు లోక్ సభకూ ఎన్నికైనారు. మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్ర ప్రభుత్వంలో రెండేళ్ళపాటు రక్షణ మంత్రిగా వ్యవహరించారు. మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి స్వయానా తండ్రి.

Mulayam Singh Yadav Passes Away: SP founder Mulayam Singh Yadav dies after  prolonged illness
ప్రధాని నరేంద్రమోదీతో ములాయంసింగ్ యాదవ్

82 ఏళ్ళ ములాయంసింగ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో గురుగ్రాంలోని మాందాతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘వినయసంపన్నుడుగా, క్షేత్రస్థాయి నాయకుడుగా అందరూ గౌరవించే ములాయం సింగ్ మరణం నాకు బాధ కలిగిస్తోంది,’’అని ప్రధాని నరేంద్రమోదీ ఖెదం వెలిబుచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో మూడు రోజుల సంతాప దినాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

అయిదేళ్ళ నుంచి కొడుకు అఖిలేష్ యాదవ్ పార్టీని నిర్వహిస్తున్నప్పటికీ ములాయంసింగ్ ను దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిగా పరిగణిస్తున్నారు. అఖిలేష్ సైతం ములాయంను ‘నేతాజీ’ అనే పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అగ్రశ్రేణి నేత మాత్రమే కాకుండా కేంద్ర రక్షణ మంత్రిగా (1996-98) కూడా ములాయం పని చేశారు.

తనకు ఏది తోస్తే అది మాట్లాడే స్వభావం ములాయంది. ప్రతిపక్షానికి దిగ్భ్రాంతి కలిగించేలా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ములాయంసింగ్ మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో నేతగా ఎదిగినవారిలో లాలూప్రసాద్ యాదవ్. ములాయంసింగ్ యాదవ్, నితీష్ కుమార్ ప్రముఖులు. ఒకానొక సందర్భంలో ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్ష నాయకుల పరిశీలనలో ఉన్నవ్యక్తి ములాయం. 22 నవంబర్ 1039లో ఇటావా జిల్లాలో సైఫై గ్రామంలో జన్మించారు. రాజకీయశాస్త్రంలో మూడు పట్టాలు పుచ్చుకున్నారు. ములాయం 1967లో ఎంఎల్ఏగా ఎన్నికైనారు. రెండో సారి ఎంఎల్ఏగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇతర ప్రతిపక్ష నాయకులలాగానే ములాయం సైతం జైలుకు వెళ్ళారు. మెయిన్ పురి నుంచి ఆయన ప్రస్తుత లోక్ సభలో సభ్యుడిగా ఉన్నారు. అంతకు క్రితం ఆజంగఢ్ , సంబల్ లోక్ సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.  ఆయన కుస్తీపట్టులో మంచి పేరుతెచ్చుకున్న పహిల్వాన్.

ములాయం సింగ్ భార్య మాలతీ దేవికి అఖిలేష్ యాదవ్ కు జన్మినిచ్చే సయచంలో అనారోగ్యానికి గురై మంచంమీదనే సంవత్సరాల తరబడి ఉన్నారు. 1974 నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆమె 2003లో శాశ్వతంగా కన్నుమూశారు. 1990ల నుంచీ సాధనాగుప్తా అమే మహిళతో ములాయంకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఆమెని రెండో భార్యగా పరిగణించారు. అప్పటికే ఆమెకు ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు ఉన్నారు. తాము భార్యాభర్తలమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ లో ములాయం వెల్లడించే వరకూ వారి సంబంధం లోకానికి రూఢిగా తెలియదు. ప్రతీక్ యాదవ్ భార్య అపర్నా భిక్ష్ యాదవ్ బీజేపీలో చేరారు. సాధనాగుప్తా స్వల్ప అస్వస్థత అనంతరం 2022లో మరణించారు.   

मुलायम सिंह यादव ने कार्यकर्ताओं में भरा जोश, बोले-यूपी में BJP-SP के बीच  लड़ाई, 2024 की करें तैयारी - mulayam singh yadav said competition between  only samajwadi party and bjp in up
కుమారుడు అఖిలేష్ యాదవ్ తో ములాయంసింగ్ యాదవ్

ములాయం సింగ్ అసలు రాజకీయ ప్రస్థానం రాంమనోహర్ లోహియా శిష్యుడిగా (లోహియైట్ గా) ప్రారంభించారు. లోహియా నేతృత్వంలోని సంయుక్త విధాయక్ దళ్ నాయకుడిగా ఉన్నారు. అనంతరం చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ క్రాంతిదళ్ లో, భారతీయ లోక్ దళ్ లో, సమాజ్ వాదీ జనతా దళ్ లో పని చేశారు. 1989లో తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చంద్రశేఖర్ ని బలపరిచారు. 1992లో సొంత పార్టీ సమాజ్ వాదీ పార్టీని నెలకొల్పారు. యాదవులు, ముస్లింలు వెన్నెముకగా ఈ పార్టీని నడిపించారు. 1993లో మాయావతి నాయతక్వంలోని బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 1992లో బాబరీమసీదు విధ్వంసం తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని పీవీ నరసింహారావు బర్తరఫ్ చేశారు. ఫలితంగా జరిగిన మధ్యంతర ఎన్నికలలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా ఎస్ పీ- బీఎస్ పీ నాయకత్వం అడ్డుకున్నది. కాంగ్రెస్, జనతా దళ్ మద్దతుతో ములాయం ముఖ్యమంత్రి అయినారు. 2 అక్టోబర్ 1994న ముజఫర్ నగర్ లో ఉత్తరాఖండ్ ఉద్యమకారులపైన పోలీసులు కాల్పులు జరిపారు. 1995 వరకూ ముఖ్యమంత్రి పదవిలో ములాయం కొనసాగారు. 2002లో ఏ పార్టీకీ మెజారిటీరాని పరిస్థితిలో బహుజన సమాజ్, బీజేపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆగస్టు 2003లో మాయావతి ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. మాయావతి పార్టీ నుంచి కొంతమంది ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించారు. ములాయం సింగ్ రెండో విడత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు ఆయన లోక్ సభ సభ్యుడు. ఆరు మాసాలలోగా శాసనసభకు ఎన్నిక కావలసి ఉంది. గన్నౌర్ నియోజకవర్గం  నుంచి ఉపఎన్నికలో పోలైన ఓట్లలో 90 శాతం ఓట్లు పొంది ఘనవిజయం సాధించారు.  అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికలలో మెయిన్ పురి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఘనవిజయం సాధించారు. యుపీలో అధిక స్థానాలు గెలుపొందారు. కానీ కొత్త లోక్ సభ లో కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నది. కేంద్రంలో చేసేది ఏమీ లేదు కనుక ములాయం లోక్ సభ స్థానానికి రాజీనామా సమర్పించి 2007 వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. కొన్ని సంవత్సరాలుగా తాను నెలకొల్పిన పార్టీ క్రమంగా తన కుమారుడు అఖిలేష్ చేతులలోకి పోవడాన్ని నిర్లిప్తంగా గమనించారు. 2012లో అఖిలేష్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.  

అధికారంకోసం లావాదేవీలు చేయడం, బేరసారాలకు దిగడం అన్నది ములాయంసింగ్ కు కొత్తకాదు. అవకాశవాద రాజకీయాలలో అందె వేసిన చేయి. ముఖ్యమంత్రి పదవికోసం బీఎస్ పీతోనూ, బీజేపీతోనూ, కాంగ్రెస్ తోనూ పొత్తుపెట్టుకున్న రాజకీయ నాయకుడు.

‘‘బాయ్స్ విల్ బి బాయ్స్, ఏవో తప్పులు చేస్తూ ఉంటారు.అంతమాత్రాన మరణశిక్ష విధిస్తామా?’’ అంటూ ప్రశ్నించడం  ద్వారా రేప్ విషయంలో వివాదాస్పదుడుగా ములాయం సింగ్ తాలారు. 2012లో నిర్భయ సామూహిక అత్యాచారం తర్వాత అత్యాచారం చేసినవారికి మరణశిక్ష విధించాలంటూ చట్టాన్ని సవరించడాన్ని ములాయం వ్యతిరేకించారు. ‘బోయ్స్ విల్ బి బోయ్స్’ అంటూ ములాయం చేసిన వ్యాఖ్యను ఐక్యరాజ్య సమతి ఉన్నత కార్యదర్శి బాన్ కీ మూన్ విమర్శించారు. సామూహికంగా అత్యాచారం చేయడం అసంభవమనీ, ఈ విషయంలో ఆడవారు అబద్ధం చెబుతున్నారంటూ ములాయం చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వవలసిందిగా మహోబా జిల్లాకోర్టు సమన్లు జారీ చేసింది.

2012లో అఖిలేష్ యాదవ్ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సమాజ్ వాదీలో విభేదాలు వచ్చాయి. తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చాయి. పెద్దనాయన రాంగోపాల్ యాదవ్ మద్దతు అఖిలేష్ కు ఉన్నది. కానీ తండ్రి ములాయం, పినతండ్రి శివపాల్ సింగ్ యాదవ్ లు కలిసి ఒకటిగా ఉన్నారు. వారికి అమర్ సింగ్ తోడుగా, సలహాదారుగా ఉండేవారు. 2016లో కుమారుడు అఖిలేష్ నూ, వేలు విడిచిన సోదరుడు రాంగోపాల్ యాదవ్ నీ పార్టీ నుంచి ములాయంసింగ్ బహిష్కరించారు. ఇరవై నాలుగు గంటల తర్వాత బహిష్కరణను ఉపసంహరించుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించి తననే ప్రతిష్ఠించుకొని తానే అధ్యక్షుడిగా అఖిలేష్ ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సమాజ్ వాదీ పార్టీపైన అఖిలేష్ యాదవ్ పట్టు బిగిసింది. దానితో ములాయం సింగ్ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర నుంచి విరమించుకున్నట్టే. కానీ మెయిన్ పురీ లోక్ సభ సభ్యుడిగా మరణం వరకూ కొనసాగుతూనే ఉన్నారు. టిబెట్ కు స్వాతంత్ర్యం రావాలని కోరుకున్నారు. దలైలామాకు నెహ్రూ ఆశ్రయం ఇవ్వడాన్ని సమర్థించారు. భారత్ కు చైనా శత్రువు కానీ పాకిస్తాన్ కాదనీ, పాకిస్తాన్ భారత్ కు అపకారం చేయగల శక్తిమంతమైన దేశం కాదనీ ములాయం అభిప్రాయం.

సువేందు రాజ్ ఘోష్ అనే దర్శకుడు ములాయం సింగ్ జీవితాన్ని తెరకెక్కించారు. సినిమా పేరు ‘మై ములాయం సింగ్ యాదవ్.’ ములాయం సింగ్ గా అమిత్ సేఠీ నటించారు. జీవిత పర్యంతం సమాజవాదీ స్పృహతో రాజకీయాలలో చైతన్యవంతంగా పని చేసిన ములాయంసింగ్ వెనుకబడిన కులాల నాయకులు అగ్రగణ్యుడు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles