Sunday, November 10, 2024

కరోనా మహమ్మారితో పెరగనున్న చిన్నారుల మరణాలు

  • ఐక్యరాజ్యసమితి నివేదికలో విస్తుపోయే నిజాలు
  • పెరగనున్న చిన్నారుల మరణాలు
  • విద్యకు దూరమవుతున్న బాలలు
  • సాంక్రమిక వ్యాధుల కారణంగా పెరగనున్న మరణాలు

కరోనా మహమ్మారితో మానవ జీవితాలు ఎన్నడూ ఊహించనంతగా మారిపోయాయి. గతంలో లేని కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. కరోనా సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.  లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాతో పాటు ఆరు దక్షిణాసియా దేశాలపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను రూపొందించింది.  

కరోనా మహమ్మారి కారణంగా రోగ నిరోధక శక్తి సన్నగిల్లడంతో భారత్ లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు రాబోయే కాలంలో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా కారణంగా గర్భస్రావాలు, గర్భిణీ మరణాలతో పాటు సాంక్రమిక వ్యాధుల మరణాలు అనూహ్యంగా పెరుగుతాయని నివేదిక హెచ్చరికలు చేసింది. ఆరు దక్షిణాసియా దేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య 2020లో 228641 నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది. భారత్ లో ఈ మరణాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 154020 చేరుకుంటాయని అంచనా వేసింది. దాయాది దేశం పాకిస్తాన్ లో చిన్నారుల మరణాలు 14 శాతం పెరిగి 59251కి పెరుగుతాయని వెల్లడించింది.

Also Read: దేశవ్యాప్తంగా ఉధృతంగా కరోనా

దక్షిణాసియాలో కరోనా మహమ్మారి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు పేరుతో యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి జనాభా నిధి సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్, శ్రీలంక దేశాల  గణాంకాలతో ఈ నివేదిక తయారు చేశాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళల్లో గర్భస్రావాలు పెరుగుతాయని నివేదిక హెచ్చరికలు చేసింది.

లక్షలాది మంది చిన్నారులు బలయ్యే అవకాశం:

కరోనా నియంత్రణ చర్యల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాసియాలో అక్టోబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య 5 లక్షల మంది కొవిడ్​కు బలయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 490000 మంది లక్షల మంది భారత్​లోనే మరణిస్తారని వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో ఇటీవల కరోనా మరణాల సంఖ్య అనుకున్నదానికంటే వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలివిగా లాక్​డౌన్​లు విధించడం, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ మరణాలు 83 శాతం మేర తగ్గుతాయని నివేదిక తెలిపింది. కొవిడ్ నిబంధనలు సరిగా పాటించకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాల సంఖ్య 2020 అక్టోబర్-2021 సెప్టెంబర్ మధ్య 491,117గా నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్ నిబంధనలు పాటిస్తే మరణాల సంఖ్య 85821 కి పడిపోతుందని తెలిపింది.

కరోనాతో భారీగా పెరిగిన ఖర్చుల భారం:

2021 ఫిబ్రవరి నాటికి దక్షిణాసియాలో 12 మిలియన్ల కరోనా కేసులు వెలుగు చూడగా అందులో 10.9 మిలియన్ కేసులు భారత్​లోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా వల్ల దక్షిణాసియా దేశాలలో భారీగా ఖర్చులు పెరిగాయని తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం 1.9 బిలియన్ డాలర్లు,  ఇతర వైద్య సేవలకు గాను 580 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అంచనా వేసింది.

Also Read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు

కరోనా కట్టడికి ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలను బట్టి 2021 సెప్టెంబర్ నాటికి దక్షిణాసియా దేశాలు సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగానే  కరోనా టెస్టులపై ఖర్చు చేసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. కరోనా కారణంగా ఇతర వైద్య పరీక్షల నిమిత్తం 520 మిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లను చేసే అవకాశం ఉందని లెక్కగట్టింది.

వ్యాధులతో పెరగనున్న మరణాల రేటు:

క్షయ, మలేరియా, ఎయిడ్స్, టైఫాయిడ్ వంటి వ్యాధుల వల్ల తలెత్తే మరణాలు సైతం పెరుగుతాయని నివేదిక తెలిపింది. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏర్పడే మరణాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. 

విద్యకు దూరమవుతున్న చిన్నారులు:

కరోనాతో పాఠశాలల మూసివేత వల్ల దక్షిణాసియా దేశాల్లో 90 లక్షలమంది చిన్నారులు ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులు విద్యకు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో పాఠశాలల మూసివేతతో 70 లక్షల మంది చిన్నారులు విద్యాభ్యాసానికి దూరమవుతారని అంచనా వేశారు. కరోనా మహమ్మారి కారణంగా భవిష్యత్ లో ఆర్థిక వ్యయాలు పెరుగుతాయని ఐక్య రాజ్య సమితి నివేదికలో వెల్లడించింది.

Also Read: అంతరిక్షంలో నాలుగు స్థంభాలాట

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles