Thursday, February 2, 2023

బాబోయ్, నాలుగో వేవ్!?

  • బూస్టర్ డోసు వేసుకోవడంలో ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం
  • ఐఐటీ-కాన్పూర్ పరిశోధక మండలి నాలుగో వేవ్ అంటోంది
  • అందరూ అప్రమత్తంగా ఉండకపోతే ఆనక చింతించవలసి వస్తుంది

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నమోదయ్యే సగటు కూడా బాగా పెరిగింది. అతి తక్కువ వ్యవధిలోనే 4000 నుంచి 8000దాటిపోయింది. ఆదివారం ఒక్కరోజే దేశంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 8,084. ఈ పరిణామం కలవరపెడుతోంది. రోజురోజుకూ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడం నాలుగో వేవ్ కు సంకేతంగా కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐఐటీ -కాన్పూర్ పరిశోధకమండలి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. జూన్ లో నాలుగో వేవ్ మొదలై అక్టోబర్ వరకూ ఉంటుందని దాని సారాంశం. ఐతే, తీవ్రతపై ఆ పరిశోధకులు స్పష్టతను ఇవ్వలేదు. దశల వారిగా పరిణామాలను కొంత మేరకు అంచనా వేశారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్స్, వ్యాక్సిన్, ప్రీకాషస్, బూస్టర్ డోసుల ఆధారంగా నాలుగో వేవ్ ప్రయాణం ఉంటుందని తెలిపారు. నాలుగు నెలల పాటు ఉండే నాలుగో వేవ్ ఆగస్టు రెండో వారం నుంచి మాసాంతం వరకూ ఎక్కువ ఉధృతిలో ఉంటుందని ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. దీనిని బట్టి ఆగస్టు15 నుంచి 31 వరకూ కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

నాలుగు రోజులలో 50 వేల కొత్త కేసులు

ఈ నెలలో కేవలం వారం రోజుల వ్యవధిలోనే 50 వేల కొత్త కేసులు నమోదవ్వడంతో నాలుగో వేవ్ పై తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. కాన్పూర్ – ఐఐటీ పరిశోధక బృందం నాలుగోవేవ్ ఉంటుందనే అంశాన్ని సమర్థిస్తున్నారు. మిగిలిన కొందరు శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐతే,  గతంలో ఐఐటీ-కాన్పూర్ పరిశోధకులు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఇప్పటి పరిణామాలు కూడా వారి మాటలను బలపరుస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో, దీనికి తరుణోపాయాలను అన్వేషించాలి. నిపుణులు చేస్తున్న సూచనలను పాటించడమే శిరోధార్యం. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు స్వల్పంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. వ్యాక్సిన్లు అందుబాటులో ఉండడం ధైర్యాన్ని పెంచే విషయం. కోవిడ్ నిబంధనలను పాటిస్తే రక్షణకవచంగా నిలుస్తుందన్నది వాస్తవ పరిష్కార మార్గం. ఇవ్వన్నీ సులభమైనవి, మన చేతుల్లోనే ఉన్నవి. అదే సమయంలో, పరీక్షలు పెంచడం కూడా ఎంతో ముఖ్యం. పరీక్షలు పెంచి, కోవిడ్ సోకినవారిని తెలుసుకొని, సరియైన చికిత్స అందిస్తే దుష్ప్రభావాలు తగ్గిపోతాయన్నది సత్యం. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటక, హరియాణాలలో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆ యా ప్రాంతవాసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంతో అత్యవసరమైతే తప్ప, ఆ రాష్ట్రాలకు ప్రయాణాలు చెయ్యకపోవడమే ఉత్తమం. కొత్త వేరియంట్లు దేశమంతా ప్రబలకపోవడం ఒక మంచి విషయం. బూస్టర్ డోసులను చాలామంది తీసుకోలేదు. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు దీనిని కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కోవిడ్ నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత కొందరు విశృoఖలంగా ప్రవర్తించారు. నేటి కోవిడ్ వ్యాప్తికి అదొక ముఖ్య కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్మ్యూనిటి తక్కువగా ఉన్న వారి వల్ల కోవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసమూహాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ నుంచి తమను తాము పరిరక్షించు కోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రీకాషస్ డోసులతో సహా అన్ని దశల వ్యాక్సిన్లు వేయించుకుంటే సరిపోతుంది.

క్రమశిక్షణ అత్యవసరం

తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మనసుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ పెంచడం,వృద్ధులకు ప్రీకాషస్ డోసులను అందించడం ముఖ్యమని,వెనువెంటనే దీనిపై దృష్టి సారించమని ఆదేశించారు. ప్రతి 4 – 6 నెలలకు కొత్త వేవ్ లు పుట్టుకొస్తున్న తరుణంలో బూస్టర్ డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సూచిస్తున్నారు. బలమైన, దీర్ఘకాలికమైన రోగ నిరోధకశక్తిని పొందాలంటే మూడు డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తిచేసుకోవాలని ఆమె సలహా  ఇస్తున్నారు. ఈ దిశగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని సౌమ్య స్వామినాథన్ వివరిస్తున్నారు. భారత్ లో బూస్టర్ డోసు ఇచ్చేందుకు 60ఏళ్ళు పైబడినవారికి అధిక ప్రాధాన్యం ఇచ్చినా, ఇప్పటివరకూ కేవలం 15శాతం మంది మాత్రమే వినియోగించుకోవడం విషాదమని ఆమె విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచని ప్రభుత్వాల పట్ల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 18-59 ఏళ్ళ లోపువారు ఇప్పటివరకూ కేవలం 1శాతం మంది మాత్రమే మూడో డోసు వేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తీరు అటు ప్రభుత్వాలు – ఇటు ప్రజల అలసత్వానికి అద్దంపడుతోంది. ఇప్పటికైనా మారాలి. స్వయంక్రమశిక్షణతో ముందుకు సాగాలి. లేనిపక్షంలో అందరూ భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles