Saturday, May 4, 2024

సంకురాతిరి

  • తెలుగు లోగిళ్ళలో అతి పెద్ద పండుగ
  • వ్యవసాయదారులకు సంబురం

తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే. రాత్రిపవలూ పండుగే. అదీ మూడు, నాలుగు రోజుల పాటు సాగుతుంది. అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి. మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు. మారడం అని అర్ధం. పల్లెటూర్లలో ‘సంకురాత్తిరి’ అని అంటారు. దాదాపుఅన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి, కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది.  పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు… మేషం మొదలైన 12 రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం ‘సంక్రాంతి’. సంవత్సరానికి 12 సంక్రాంతులు  ఉంటాయి. పుష్యమాసంలో, హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది ‘మకర సంక్రాంతి’. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం.

Also read: ఈ సారి కరోనా వల్ల ముప్పు తక్కువే!

నాలుగు రోజుల పండుగ

సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు. తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ, ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు  గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ. గిట్టుబాటు ఎట్లా ఉన్నా పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? “పండుగలు అందరి ఇంటికీ వస్తాయి, కానీ, ఎందుకో మా ఇంటికి రావు!” అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. “గరీబీ హటావో ” అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ  పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి –లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. ఈ పరిణామం దేశ శాంతికి, సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా, దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి.

Also read: జమిలి ఎన్నికలు జరిగేనా?

నిత్యావసర వస్తువుల ధరలపై నిఘా

ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. పేదవాడు, దిగువ, మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు? సొంత ఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు, ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి, పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు, వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే  హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు, గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు, ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి. ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి. గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి. ఎద్దుల బండి పోటీలు పలనాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి. ‘ఒంగోలు గిత్త ‘కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం.

Also read: లక్షద్వీప్ వైపు లక్షలమంది చూపు!

ఉత్తరాయణ పుణ్యకాలం

ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం. ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు. అందుకే, భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో, వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై  ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు, పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, గారెలు, చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి, చేతిలో తాళం మోతలతో, హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా, పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.

Also read: ఆంధ్రమేవ జయతే!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles