Friday, July 19, 2024

భరతునితో హనుమ సంభాషణ

రామాయణమ్223

భరద్వాజ మహర్షిని రాముడు ఒక వరము కోరినాడు. ‘‘స్వామీ, ఇది కాలము కాని కాలము. అయినా ఈ వృక్షములన్నియు తమతమ ఫలములతో నిండిపోయి మధుధారలు స్రవించవలెను. అయోధ్య వెళ్ళు మార్గమంతా ఫలపుష్పభరితమై యుండవలెను.’’

అందుకు భరద్వాజ మహర్షి ‘అటులే’అని వరమొసంగెను.

Also read: భారద్వాజ ముని ఆశ్రమంలో రామదండు విడిది

కాలము కాని కాలములో, ఆకులు రాలిన చెట్లన్నీ సమృద్ధిగా ఫలపుష్పముల బరువుతో ఒంగి పోయి చూపరులకు కనువిందు, వానరులకు ఫలవిందు చేసినవి. వానరులు ఫలములను తింటూ మధువులను గ్రోలుతూ రసాస్వాదనలో మునిగితేలిరి.

రాముడు అంత అయోధ్యవైపు చూసి ఏదో ఆలోచించి హనుమను పిలిచి, నీవు వెంటనే అయోధ్యవెళ్ళి మన క్షేమసమాచారము తెలుపుము. మార్గములో శృంగిబేరపురములో నా ఆత్మ సముడు, నా ప్రియమిత్రుడు గుహునకు నా రాక ఎరిగించుము. అతడు నీకు భరతుడున్న తావు ఎరిగించగలడు. భరతుని చేరి జరిగిన వృత్తాంతమంతయూ తెలుపుము.

Also read: పుష్కక విమానంలో సీతారామలక్ష్మణులూ, ఇతరులూ అయోధ్య ప్రయాణం

‘‘ఆ, ఒక్క మాట! ఇవి అన్నీ నీవు మాటలాడునప్పుడు భరతుని ముఖకవళికలు, దేహకదలికలు, చేష్టలు ,చూపులు ,అతని సమాధానము గమనింపుము. రాజ్యము అధికారము అతనిని ప్రలోభపెట్టినవేమో పరిశీలింపుము. అతనికి రాజ్యముమీద, అధికారము మీద కించిత్తు మమకారమున్నట్లుగా నీకు తోచినచో వెంటనే నాకు తెలుపుము. రాజ్యమును అతనికే వదిలి వేసెదను’’ అని పలికెను

రామాజ్ఞ తలదాలిచి వాయుపుత్రుడు మనుష్యరూపము ధరించి అయోధ్యవైపుగా

బయలు దేరెను.

Also read: దివ్యవిమానములో దశరథ దర్శనం

మొదట శృంగబేరిపురము చేరుకొని గుహునకు రాముని ఆగమనవార్త వినిపించి భరతుని కలియుటకు ఆకాశమార్గమున అయోధ్యకు పయనమాయెను.

అచట అయోధ్యకు దగ్గరలోని నందిగ్రామములో దుఃఖము చేత కృశించిన శరీరముగలవాడు, జడలుగట్టిన జుట్టుగలవాడు, మురికిపట్టినదేహముగలవాడు, నారచీరలు ధరించి, నియమవంతుడై పరిశుద్ధమైన మనస్సుతో బ్రహ్మర్షి సమాన తేజోవిరాజితుడైన రామసహోదరుడు భరతుని గాంచినవాడై హనుమంతుడు ….

ఆయన వద్దనిలచి అంజలిఘటించి …‘‘మహానుభావా,నీవు ఏ రాముని గురించి దుఃఖించుచున్నావో ఆ రాముడు నీ యోగక్షేమములు అడుగుచున్నాడు…

‘‘ఓ ప్రభూ నీకు శుభవార్త! నీవు మరియొక ముహూర్త సమయములో నీ సోదరుడైన రాముని కలువబోవుచున్నావు!”…అనుచూ పలికెను.

Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు

‘‘వస్తున్నాడు రామచంద్రుడు. సీతాలక్ష్మణసమేతుడై వనవాసవ్రతము పూర్తిచేసుకొని కోదండరాముడు వస్తున్నాడు ప్రభూ’’ అనుచూ పలికిన ఆంజనేయుని మాటలు వినిన భరతుడు మనస్సులో సంతోషతరంగములు ఉప్పెనలా చుట్టుముట్టగా తట్టుకొనలేక తటాలున  నేలపైబడినాడు.

మరల తెప్పరిల్లి తేరుకొని ప్రియవార్త తెచ్చిన ఆంజనేయుని కౌగలించుకొని తన ఆనందాశృవులతో ఆ మారుతిని అభిషేకించెను.

ఎవరు నీవు?

ఇంత ప్రియవార్త తెచ్చినావు.

దేవతాపురుషుడివా?

గంధర్వుడివా?

లేక మానవుడవేనా?

ఏమిచ్చి నీ ఋణము తీర్చుకొనగలను?

లక్షగోవులను ఇమ్మందువా?

నూరు గ్రామాలు ఇమ్మందువా?

లేక రెండూ ఇవ్వనా?

అందమైన సుందరాంగులను భార్యలుగా సమర్పించమందువా?

ఏమివ్వగలనయ్యా నీకు ఇంత మంచి వార్త తెచ్చినావు?

.

NB

.

ఎలాంటి అన్నదమ్ములను ఆ బ్రహ్మ పుట్టించాడు!

ఒకరికోసం మరియొకరు పరితపించేవారు!

తమవలన ధర్మగ్లాని జరుగరాదని భావించి ధర్మము కోసం స్వంత సుఖాలు త్యాగము చేసి రాజ్యాలను కూడా గడ్డిపోచల్లాగా విసిరి పారవేయగలిగినవారు ….

మహాత్మా వాల్మీకి, నీవు ధన్యుడవయ్యా! వారి చరితను గ్రంధస్థము చేసి మాకు అందించినావు ! ….

అసలు నీ ఋణము మేమెలా తీర్చుకోగలమయ్యా?

Also read: సీతమ్మ అగ్నిప్రవేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles