Wednesday, May 8, 2024

గోవిందా నీతో నిత్య సాంగత్యమే మాసౌభాగ్యం

27గోదా గోవింద గీతం


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ దన్నై
ప్పాడి పఱైకొండు యామ్ పెరు శమ్మానమ్
నాడు పుగళుం పరిశినాళ్ నన్ఱాగ
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి ప్పూవే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామ్ అణివోమ్
ఆడై ఉడుప్పోం అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ, నెయ్ పెయ్ దు ముళంగైవళివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఒల్లని మనసులనైన గెల్చెడి గోవింద బిరుదాంకితా

నందనందనా నీ వైభవమ్ములెల్ల కీర్తించి పఱైనో

జగమెల్ల మెచ్చురీతి పెద్దసన్మానమునో కోరినాము

బంగారు మణి కంకణములు, సింగారు కై దండలు,

గున్నాలు చెవిపూలు, కాలికి మెరియు వెండికడియాలు

మేలి వస్త్రములిచ్చి, ఆపైన మోజేతిదాక నేయి స్రవించు

పాలపాయసాన్నములన్  నీ చెంత గూర్చుని ఆరగించెడు

నీ నిత్య సాంగత్య దివ్యసౌభాగ్య సాకేతమ్ము మాకిమ్ము

ప్రతిపదార్థం

కూడారై = తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే: శీర్= కళ్యాణగుణసమన్వితుడైన: గోవిందా = గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పాడి = కీర్తించి, పఱైకొండు =పఱ అనే వాయిద్యాన్ని కోరి, యామ్= మేము,పెరు=  పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్=సన్మానమును,నాడు=లోకమంతయు, పుగళం పరిశినాళ్ = మెచ్చుకునే రీతిలో, నన్ఱాగ శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే = పాదాభారణాలు, యెన్ఱనైయ = అని పిలువ బడే, పల్కలనుమ్=అనేక రకాల ఆభరణాలను, యామ్ = మేము, అణివోమ్= ధరింతుముగాక,ఆడై= వస్త్రములను, ఉడుప్పోం = ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతోచేసిన అన్నము, పరమాన్నము, మూడనెయ్ పెయ్దు = నేయి పోసి, ముళంగై = మోచేతినుండి, వళివార=కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసియుండి, కుళిరుంద= ఆరగించడమే-ఏలోర్ ఎంబావాయ్= మావ్రతము.

‘నిను కీర్తించి పఱై అనే వాయిద్యాన్ని పొందారు. భగవంతుడితో కలిసి భగవన్నామాన్ని కీర్తించడమే వారి లక్ష్యం. నారాయణనే నమక్కే = నారాయణుడే మనకే ఫలము ఇస్తాడని మేం నమ్ముతున్నాము. మాకు సన్మానము కావాలి.

శ్రీకృష్ణుని పరాక్రమం

తనతో విభేదించి,కలిసి రాకుండా పోయే శత్రువులను జయించడమనేది ఒక పరాక్రమం, అది కళ్యాణగుణ సంపద. ఆ సంపద గల గోవిందుడా నిను కీర్తించి, ఈ తిరుప్పావై వ్రతం ఫలితంగా పఱై అనే వాయిద్యమును నీనుంచి పొందాలని అనుకుంటున్నాం లేదా ఘనసన్మానము లోకులంతా మెచ్చుకునే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం. చేతులకు గాజులు, భుజాలకు కడియాలు, చెవికింద దుద్దులు, పైన చెవిపూలు, కాలికి అందెలు, వంటి అనేకాభరణాలు ధరించాలి. తరువాత మంచి చీరలు కట్టుకోవాలి. పాల అన్నము మునిగేట్టు నేయి పోయాలి. ఆ తీపి పరమాన్నాన్ని మోచేతి వెంట కారునట్టుగా దోసిట్లో పోసుకుని జుర్రుకోవాలి. అదీ నీతో కలిసి కూచుని హాయిగా భుజించాలి, ఇదే మా వ్రతఫలం గోవిందా అంటున్నది గోదమ్మ, అవునని గొంతు కలిపారు గోపికలు.

Also read: రావణు గూల్చిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము

భగవంతుని అందుకోవడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం. పరమాన్నం  తినాలనే కోరిక కాదు, పరమాత్ముడితో కలిసి పరమాన్నపు ఆనందాన్ అనుభవించడమే పరమానందనుకోవడం అద్భుతమైన కోరిక. పరమానందమే మోక్షం. పరమాత్ముడితో కూడి అనుభవించడం, అదే కూడారై.

Also read: సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము


గోపికలు నిన్నటి పాశురంలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖ చక్రాలు అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేకపోతే శంఖ చక్రాలతో పాటు, గరుడ ధ్వజం,పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం తరువాతి పాశురాలలో జరుగుతుంది.

Also read: వేదగుహలలో పరమాత్మ ప్రకాశం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles