Saturday, April 20, 2024

వేదగుహలలో పరమాత్మ ప్రకాశం

23. తిరుప్పావై క

దేహానికి ఆత్మకు భేదములు తెలియకుండా ఉంచే అజ్ఞానమే మేఘము. మేఘమువల్ల చీకటి పడుతుంది. జీవుడికి దిక్కు ఎటో తెలియదు. అవివేక మేఘము దుఃఖమనే వర్షాన్ని ఎడతెగక కురిపిస్తుంది. పగలు కూడా వర్షాకాలపు చీకటి కమ్మడమే సంసారం. దిక్కుతోచని జీవికి దారి చూపమని ప్రార్థన అని యామునా చార్యులు వర్ణించారు. ప్రళయకాలమున ప్రకృతినిజీవరాశిని ప్రపంచాన్నంతా తనలో నిముడ్చుకుని పరమాత్మ శయనిస్తాడు.అపుడు ఆ పరమాత్మ వేదగుహలలో ప్రకాశిస్తాడట. ఉన్నదితానొక్కడే. తనకన్న వేరుగల వస్తువులేదు. స్థూలనామరూపకమైన ప్రపంచమై వెలికి రాకముందు వేదగుహలో పండుకుంటాడట. గుహ అంటే గ్రహించడానికి శక్యం కానిదని అర్థం. ధర్మతత్వం గుహ యందు నిక్షిప్తమై ఉన్నది. భరద్వాజునకు వేదములు పర్వతములై కనిపిస్తాయి. అన్నమయ్యకు తిరుమల వేదములై శిలలై వెలసిన కొండవలె కనిపిస్తుంది. వర్షకాలంలో అసలు కదలికే లేనట్టు సింహం నిద్రిస్తుంది. వేదము కూడా ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది. పరమాత్మ సృష్టికి ముందు ప్రళయ కాలంలో సర్వజగత్తును తానే భక్షిస్తాడు. హింసిస్తాడు కనుక సింహం.

Also read: సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము

సింహాసనప్పాట్టు

శయ్యాగారంలో పాన్పుపై పడుకుని మాతో మాట్లాడడం కాదు. కదలివచ్చి సభామందిరంలో ఈ మహత్తర సింహాసనారూఢుడవై మాకు కనిపించు. మామాట విను దయదలచు అని వేడుకుంటున్న ఈ పాశురాన్ని సింహాసనప్పాట్టు అంటారు.రామానుజసంబంధీకులైన గోపికలను నిరాదరించరాదని వారిని కరుణించాలని పరమాత్ముడు అనుకున్నాడు. కనుక వారిని లోనికి రమ్మన్నాడు. అంత:పురంలోని అంతరంగ వాక్యాలకన్న సింహాసనంమీద కూర్చున్నప్పుడు పలికే బహిరంగ వాక్యాలే శ్రేష్ఠమని గోపికలు అనుకున్నారు.

రామానుజుని ప్రతీక సింహాసనం

ఆదిశేషావతారమైన రామానుజుని ప్రతీక ఆ సింహాసనము, మేము రామానుజ గురువర్యుని ఆశ్రయించి ఉన్నామని చెప్పడానికే సింహాసనం మీదకు రమ్మని శ్రీకృష్ణుని పిలుస్తున్నారు. సర్వశ్రేష్ఠుడైన నరసింహము వంటి పరబ్రహ్మము ఆదిశేష సింహాసనాన్ని అధిరోహించమని కోరుతున్నారు. రామానుజుని ఆశ్రయిస్తేనే పరమాత్మ అనుగ్రహం అని గోపికలు చెప్పకనే చెబుతున్నారు ఈ పాశురంలో. సింహాసన స్వరూపులగు ఆచార్యుల యందు అధిష్టించిన పరబ్రహ్మను ఆశ్రయించిన గోపికలు ఆచార్యసంబంధము వలన శ్రీ కృష్ణునికి అత్యంత ప్రీతిగలవారవుతున్నారు. కోయిల్ అంటే ప్రణవము, అదే పరమాత్మకు, జీవాత్మ అనే ఆచార్యునికి నివాసం. విభూతే పరమాత్మసింహాసనం అని కందాడై రామానుజాచార్య వివరిస్తున్నారు.

Also read: భాగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?

రామకృష్ణులు శౌర్యసింహాలు

శ్రీరాముడు వర్షాకాలమంతా మాల్యవంత పర్వతగుహలో ఒంటరిగా గడిపాడు. యాదవసింహుడు రాఘవ సింహుడు ఎవరికీ భయపడని పరాక్రమవంతులు. నిదురలో ఉన్నపుడుకూడా శత్రువులను తపింపజేసే శౌర్యసింహాలు రామకృష్ణులు. ఇక్కడ శ్రీ కృష్ణుడు యశోదా సింహ కిశోరం. ఆశ్రితుల ఆర్తనాదం వింటే వెంటనే లేచే వాడు. తాను నిద్రలేవవలసిన సమయం ముందే తెలియదు. కాని తనకు తానుగా సమయానికి మెలకువ తెచ్చుకుంటాడు. అయోధ్యా మందిరంలో రాముడు నిద్రిస్తుంటే చూసిన కౌసల్య, ఆతరువాత అడవిలో నిద్రించిన రాముని చూసిన విశ్వామిత్రుడు ఆ సౌందర్యానికి ముగ్ధుడవుతాడట. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవ మాహ్నికమ్ అని సుప్రభాతం పాడతాడు. యశోద కూడ నిద్రిస్తున్న కృష్ణుణి సౌందర్యాన్ని చూసి మైమరచిపోతుంది. నిద్రమేల్కొంటున్న యదుసింహుడు ఈ పాశురం కథానాయకుడు.

Also read: చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే

సింహం నిద్రిస్తున్నాసరే శౌర్యం వీడదు. అందుకంటే నిద్రిస్తున్న సింహాన్ని చూసి కూడా భయపడతారు. శ్రీరాముడు సుఖసుప్తః పరంతపః అంటే సుఖంగా నిద్రిస్తున్నా పరులను తపింపచేసే వాడు అని సీత సంభావిస్తుంది. శీరియసింగం అంటే నిద్రిస్తున్నా శౌర్యం తరగని సింహం అనీ లక్ష్మీ సహితుడనీ అర్థం. సింహం నిద్రలేవగానే పరమాత్మ ఇక నేను బహువిధముల రూపములను సంతరించుకోవలెనని సంకల్పిస్తాడట. ఆ సంకల్పంలోంచి తేజస్సు, దాని నుంచి జలము, జలమునుంచి పృథ్వి ఆవిర్భవిస్తుంది. తీ అంటే తేజస్సు. వేరి అంటే గంధము. గంధము పృథ్వీకి సంకేతం. ఈ పంచభూత తత్వాలన్నీ కలిసి మహాభూతములై అండము ఏర్పడుతుంది. బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. బ్రహ్మయే చేయించుచున్నట్టు అంతర్యామియై సృష్టిక్రమాన్ని సాగిస్తాడు. లేచి చూచి, వడలు విరిచి, సాగదీసి, ముందునకు సాగి రావడమంతా సృష్టి కార్యసంకేతమే. శరీరము ముడుచుకుని ఉన్నపుడు సృష్టి కనిపించదు. సృష్టి తరువాత ప్రకృతి కనిపిస్తుంది. బ్రహ్మకు వేదములివ్వడమే గర్జన. నీపూవైప్పూవణ్ణా, అతసీపుష్పసంకాశుడై పరమాత్మ అర్చావతారంలో భాసిస్తున్నాడు.

రాముని నడక తీరు మదగజగమనం

త్యాగరాజు సామజవరగమన అని కీర్తించిన రీతిలో మదగజం నడిచినట్టు గంభీరంగా నడిస్తే చూడాలని గోపికలు కోరుకుంటున్నారు. రాఘవ సింహం నాలుగునెలల వర్షాకాలన్ని మాల్యవంత పర్వతగుహలో గడిపి సుగ్రీవుని కర్తవ్యోన్మఖుడు కావాలని ఆదేశించడానికి బయటకు వస్తాడు. నిద్రిస్తున్న కృష్ణుని సౌందర్యం చూసారు. కనులు తెరచి కనికరించే విశాల నేత్రుని వైభవాన్ని చూసారు. గంభీరంగా నడిచి వచ్చి ఆసీనులయ్యే సన్నివేశాన్ని చూడాలని గోపికలు ఆశిస్తున్నారు.

Also read: శ్రీకృష్ణా మమ్మల్ని రక్షించడానికే అవతరించినావు

గుహలో ఉన్న సింహం కారణ తత్త్వము. సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతితోనూ జీవులతోనూ కలిసి ఉన్న పరమాత్మ శ్రీమన్నారాయణుడు. గుహదాటిబయటకు వచ్చిన సింహము కార్య తత్త్వము. స్థూలావస్థనంది ఉన్న ప్రకృతితో, జీవులతో, పరిణామాలతో కలిసి ఉన్న పరతత్త్వంకూడా శ్రీమన్నారాయణుడే.కారణ తత్త్వము కార్యతత్వమై జగద్రూపం దాల్చుతుంది. అంతర్యామిగా హృదయంలో ఉపాసించి, మూలాధారస్థానంలో శయనించి ఉన్న తత్త్వమును మేల్కొల్పి, వేం చేసినట్టు భావిస్తారని శ్రీభాష్యం  అప్పలాచార్య స్వామి వారు వివరించారు. పరతత్వము, విభవావతారము, అర్చామూర్తి, అంతర్యామి గా ఉపాసన కొనసాగుతున్నది.

చూపుల్లో నిప్పులుకురిపించిన నరసింహుడు

శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలో చెప్పినట్టు చతురాత్మాశ్చతుర్వ్యూహ చతుర్భావ చతుర్గతి అని శ్రీ మహావిష్ణువునడకలు (గతులు) నాలుగు. మదగజపు గాంభీర్యం, వృషభపు ఔధ్ధత్యం, శార్దూలపు వేగం, సింహపు శౌర్యము తలపించే నడక ఆ ఉత్తిష్టమైన నరశార్దూలానిది. రామ కృష్ణ నారసింహులను గోదాదేవి ఈ పాశురంలో సంస్మరించారని వ్యాఖ్యాతలు వివరించారు. హిరణ్య కశిపుని చూసి నిప్పులుకురిపించిన నరసింహుడు ప్రహ్లాదుని పట్ల దయార్ద్రద్రుక్కులను ప్రసరిస్తాడు. పూవువలె మెత్తగానూ, అగ్నికణంవలె తీవ్రంగానూ ఒకేసారి ఉండడం నరసింహునికే సాధ్యమవుతుంది. ఈ రెండు పరస్పరవిరుధ్ధ భావాలను దర్శించారు గోదాదేవి.శ్రీరాముడు సీతా వియోగంలో బాధపడుతూ కూడా, సుగ్రీవునికి సాయంచేసేందుకు వాలిని సంహరించి వర్షాకాలం ముగిసేదాకా ఎదురుచూస్తూ మాల్యవత్పర్వత గుహలో నివసిస్తాడు.

అనోరణీయాన్ మహతో మహీయాన్ …అణువులో పరమాణువుగానూ, చాలా పెద్దవాటిలోఅత్యంత భారీస్థాయిలోనూ ఉండగలవాడు అని పరమాత్ముని కీర్తిస్తారు. ఆత్మాగుహాయాన్నిహితోస్యజంతో… ఆత్మ అనే గుహలో నిహితుడై ఉన్న పరమాత్ముని అర్చామూర్తిలోకి ఆవాహన చేసి ఆరాధించాలని ఆగమశాస్త్రాలు వివరిస్తాయి.విలక్షణమైన ఆత్మ, విశిష్ఠమైన పరబ్రహ్మ మధ్య సంబంధ అనుభవాలను ఈ పాశురంలో కనిపింపజేస్తారు గోదాదేవి.  

Also read: ఔదార్యానికి పరాకాష్ట – పరమాత్ముడు

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles