Friday, March 29, 2024

మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

గాంధీయే మార్గం-13

గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పదిగంటల సమయంలో గుండు గీయించుకున్నారు. మరుసటి రోజు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు.‌ అది 1921 సెప్టెంబరు 22!  సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. 

మోకాళ్ళు దాటని గోచి, పైన తువ్వాలు… ఇంతే ఆయన ఆహార్యం!  చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా వాడారు. గాంధీజీ కనుమూసేదాకా అలాగే కొనసాగారు. మనకు తెలిసిన ఆయన రూపం, ఆయన పేరు చెప్పగానే మదిలో మెదిలే రూపం – అదే!

ఖాది తనకు ‘ఐడియా’,  ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు! లోతయిన చూపు ఉంటే గానీ ఆయన అంతరార్థం మనకు సులువుగా గోచరించదు. అయితే ఏ సమయంలో కూడా ఆయన అనాలోచితంగా కానీ, తొందరపడి గానీ నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. 

ఒక ఖండం అనదగ్గ సువిశాలమైన దేశం;  పలు భాషలు, సంస్కృతులు, నమ్మకాలు విలసిల్లే సువిశాలమైన దేశం – అయిన భారతదేశానికి ఆయన ధరించిన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’ గా పనిచేశాయి, ఆయన సందేశాన్ని నాలుగు చెరగులా మోసుకు వెళ్ళాయి. 

 1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబరు మాసానికి ముగిసిపోవాలి. అయితే అది తృప్తికరంగా సాగడంలేదు. దానికి చాలా కారణాలున్నాయి. తగనంత ఖద్దరు గుడ్డ దొరకడం లేదని చాలాచోట్ల జనం ద్వారా తెలిసింది. దానికి తోడు దాని ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ,  ఖాది చాలినంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి అంటూ కూడా ఉపన్యాసాలతో వివరించడం మొదలైంది.

 సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వందరెట్లు, కాదు వెయ్యిరెట్లు ఎదిగారు! తాను పాటించకుండా మిగతావారిని కోరడం సబబు కాదని. వారు చాలీచాలని గుడ్డలతో జీవిస్తుంటే, తాను మాత్రం ఎందుకు మొత్తం దుస్తులు వేసుకోవాలని మథనపడ్డారు. అంతే, దేశంలో పేదల రీతిలో తాను కూడా గోచి కట్టుకోవాలని నిర్ణయం తీసుకుని, దాన్ని  జీవితాంతం పాటించారు. తమలాగే జీవించే గాంధీజీ చెప్పింది చేస్తారు, పేద ప్రజలతో కలసి నడుస్తారు – అని మొత్తం దేశానికి బోధపడింది. అంత విశ్వసనీయత ఆయన సంపాదించుకున్నారు కనుకనే ఈ సువిశాల దేశంలో అహింసాత్మకంగా  స్వాతంత్ర్య ఉద్యమం మూడు దశాబ్దాలకు పైగా నడిచింది!  ఇంత సుదీర్ఘకాలం పాటు ఉద్యమాన్నికొనసాగించడం మాటలు కాదు! 

పరిశీలించడం, అధ్యయనం చేయడం, నేర్చుకోవడం, పాటించడం – గాంధీజీకి కొత్తకాదు. ఒక సంవత్సరం పాటు ప్రసంగం చేయకుండా దేశమంతా తిరిగిన వ్యక్తి గాంధీజీ. బీహారు చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారతదేశపు ఉద్యమం.  

అహ్మదాబాదు జౌళి కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతుగా నిలిచింది తన  భారత దేశపు రెండవ పెద్ద ఉద్యమం. ఈ రెండు పోరాటాలు గుడ్డలకు సంబంధించినవని గమనించాలి. 1918లో జరిగిన జౌళి కార్మికుల ఉద్యమంలో రెండు వారాలు గడిచాయి. క్రమంగా నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు,  సమ్మె కార్మికులెవరూ చెట్టు కింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు, ఓ కార్మికుడు చెప్పాడు… వారికి పోయేదేముంది..  కార్లో వస్తారు, ఇంటికి వెళ్ళి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! దాంతో గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది.  దాని ఫలితమే గాంధీజీ తన తొలి నిరాహారదీక్ష 1918 మార్చి 15న ప్రారంభమైంది! ఫలితంగా మొత్తం పరిస్థితి మారింది, వారంరోజుల్లో పరిష్కారం లభించి, కథ కొలిక్కి వచ్చింది. 

అది గాంధీజీ విధానం! నేర్చుకోవడం చెప్పడానికి ముందు తాను చేసి చూపించడం!!  ‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ!  మోకాళ్లు దాటని గోచి లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?  గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని అక్కిరాజు రమాపతి రావు తన  ‘దుర్గాబాయి దేశముఖ్’ అనే  మోనోగ్రాఫ్ లో పేర్కొన్నారు– అదే స్ఫూర్తి అని. 

మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మదాలితో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ  వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో గాంధీజీ తన పర్యటనను కుదించుకుని,  మధురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మధురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. ఈ విషయం గురించి ఒక పత్రికాప్రకటన కూడా తయారు చేశారు. రైలులో తనతో  పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి ఈ విషయం చెబితే నచ్చలేదు,  ఆయన గాంధీజీని నిరుత్సాహపరిచారు. అప్పటికే గాంధీజీ స్థిరనిర్ణయానికి వచ్చేశారు!

విదేశీ వస్త్ర బహిష్కరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది.  ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది. ఖద్దరు గుడ్డ లోటు సమస్యను కూడా కొంత వరకు పరిష్కరిస్తుంది. అంతకుమించి మరో రెండు విషయాలను కూడా గాంధీజీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి వచ్చారు. మనదేశపు శీతోష్ణస్థితులు బట్టి కూడా గోచి ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్ళు తమ శరీరం  పూర్తిగా కప్పుకోమని నిర్దేశించదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయస్సులో, భారత స్వాతంత్ర్యోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు! దేశంలోని ఎంతోమంది దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కనుకనే కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు గాంధీజీ!

నేటికీ గాంధీజీ మనకు మహాత్ముడుగా ఎందుకు గౌరవనీయులుగా ఉన్నారు? ఆయన చూపించిన హేతుబద్ధతా, కొనసాగించిన త్రికరణ శుద్ధీ నేడు మన సమాజంలో గణనీయంగా లోపించాయి! వాటిని అలవర్చుకుంటే అదే జాతిపితకు అర్థవంతమైన నివాళి అవుతుంది!

డా. నాగసూరి వేణుగోపాల్

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles