Monday, May 27, 2024

(“స” నిషిద్ధాక్షరి)

ఈ మనోహర రాగరంజిత రవాల

కేది శ్రీకార, మది నిషేధింపబడియె!

త్రెంచిరి దయా విహీనులు తీగనొకటి!

మూగవడివోయె మధుర వీణాగళమ్ము!

ఏది మధురాక్షరమ్ము జీవేశ్వరా! మ

దీయ కమనీయ దివ్య జాతీయగీతి?

ప్రేమ లేక దాని బహిష్కరింతురయ్య?

పరవశమ్మున మేమెట్లు పాడగలము?

దేనికై మహాత్ముడు వ్రతదీక్షబూనె?

దేనికై జీవితమె బలిదానమిచ్చె?

ఏల కరవాలమెత్తి లక్ష్మీలలామ

భద్రకాళియై చెలరేగె రుద్రభూమి?

అభయమున్నదే మహిళల కర్ధరాత్రి?

ఇలను వినువారు లేరె దీనుల క్షుధార్తి?

మతము పేరిట విభజించి మానవులను,

మైలవడెనే మహాప్రభూ! మహితధాత్రి?

ఉద్యమించె తలపులు మహోదధి వలె,

నేడు మువ్వన్నె బావుటా నీడ నిలచి;

గొంతు పైకెత్తలేక, జైకొట్టలేక,

ప్రగతి చక్రాల నలుగు జీవాల తలచి!

నివర్తి మోహన్ కుమార్

“స” అక్షరం నిషిద్ధంగా “స్వాతంత్ర్య” దినాన్ని వర్ణించమని ఆదేశింపగా రచించిన ఖండిక యిది. ఆ ఆదేశం ప్రకారం ఖండికలో ఎక్కడా “స” అనే అక్షరమే కనపడకూడదు. నాలుగేళ్ళ క్రిందట రచించినదీ ఖండిక.

“స,రి,గ,మ,ప,ద,ని” అనే సప్తస్వరాల్లో “స” అనే అక్షరమే  తొలి అక్షరం. సప్తస్వరాల్లో ఏ స్వరం మూగవోయినా, సంగీతమే మూగవోతుంది. వీణలో ఏ తంత్రి తెగినా వీణయే స్థాణువై పోతుంది.

రవీంద్రనాథ్ టాగోర్

“వందేమాతరం” మన జాతీయగీతం. 1905 లో తొలిసారి ఈ గీతాన్ని కాంగ్రెస్ మహాసభలో గానం చేసినవాడు విశ్వకవి రవీంద్రుడు.

వందేమాతరం ఉద్యమ సందర్భంగా భారతమాత నీటిరంగుల చిత్రాన్ని రూపొందించిన వాడు గగనేంద్రనాథ్ టాగూర్. విశ్వకవి సోదరుని కుమారుడతడు. ఆ చిత్రంలోని భారతమాత కాషాయవర్ణం గల వస్త్రం ధరించి వుంటుంది. ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఒకచేతిలో రుద్రాక్షమాల  ఉంటుంది. ఒకచేతిలో తాళపత్రాలు ఉంటాయి. ఒక చేతిలో హైందవదేశపు పొలాలలో పండిన ధాన్యపు కంకులుంటాయి. ఒక చేత్తో  తన తనయులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. త్యాగానికి,  జ్ఞానానికి, ధ్యానానికి,  శ్రమైక జీవనానికి, కరుణరసానికి,  నిలువెత్తు ప్రతీకగా  ఆమె రూపం స్ఫురిస్తుంది.  ఇది నాకు జ్ఞాపకం ఉన్న చిత్రం.

ఈ చిత్రం యొక్క  పోస్టర్లు దేశంలోని లక్షలాది భారతీయుల చేత కొనుగోలు చేయబడి, ఊరూరా ఆరాధ్యదైవంగా, ఆనాడు, పూజలందుకొన్నవి.

అదే సంవత్సరం బెంగాల్ రాష్ట్రాన్ని పశ్చిమ బెంగాల్ గా ( హిందూ సమాజం), తూర్పు బెంగాల్ గా ( ముస్లిమ్ సమాజం) అప్పటి వైస్ రాయ్ కర్జన్ విభజించినప్పుడు, మతం ప్రాతిపదికగా జరిగిన ఈ బెంగాల్ విభజనను నిరసిస్తూ ఆసేతు హిమాచలపర్యంతం మహోద్యమం చెలరేగింది.

ఈ ఉద్యమ సందర్భంలో ముక్కు పచ్చలారని వయస్సులో ఉన్న ఖుదీరామ్ బోస్ అనే విప్లవకారుణ్ణి బ్రిటీష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉరి తీయడంతో వందేమాతరం ఉద్యమం మరింత తీవ్రతరమై తెల్లదొరల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది.

ఆ నాటి నుండి భారత స్వాతంత్ర్య పోరాటం కీలకమైన మలుపు తిరిగింది. విప్లవకారుల నాల్కలపై వందేమాతర గీతం  తారక మంత్రంగా  పనిచేసి వాడవాడలా నినదించింది. వందేమాతరం గీతానికి వందలాది రాగాలు కట్టబడినవి. ప్రతి రాగమూ తీయనిదే. ఉద్వేగభరితమైనదే. అపూర్వ విప్లవోద్యమ స్ఫూర్తి ఈ గీతంలో ఉండడమే అందుకు కారణం.

వందేమాతరం గీతంలో  అనేక పదాలు “స” అనే అక్షరంతోనే మొదలౌతాయి:

“సుజలాం”

“సుఫలాం “

“సస్యశ్యామలాం”

“స” అనే మధురాక్షరంతో మొదలయ్యే పంక్తుల్లో వందేమాతర గీతపు జీవశక్తి నిక్షిప్తమై ఉన్నది.

“స” అక్షరం లేకపోతే వందేమాతర గీతమే లేదు. “స” అక్షరం నిషేధిస్తే “వందేమాతర ఉద్యమాన్ని” నిషేధించినట్లే లెక్క.

పద్దెనిమిదవ శతాబ్దం బౌర్బన్ రాచరిక వ్యవస్థలో దౌర్భాగ్యపు లోతులను చవిచూసిన నిస్సహాయ  ఫ్రెంచి సమాజం ఒక్కసారిగా ఆ రాచరిక వ్యవస్థపై  తిరగబడింది. ఫ్రాన్స్ లో ఉప్పొంగిన ప్రజాస్వామ్య విప్లవం ప్రపంచచరిత్ర గతినే మార్చివేసింది. ఈ విప్లవానికి మూలసూత్రాలు “స్వేచ్ఛ,  సమానత్వం, సౌభ్రాతృత్వం.”

ఈ అన్ని శబ్దాల్లోనూ “స” అనే అక్షరమే బీజాక్షరం. “స” అనే అక్షరం గల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రృతృత్వం, సమానత్వం అనే  పదాలకు ప్రత్యామ్నాయ పదాలను కనుగొనడం మృగతృష్ణను ఆన్వేషించడం వంటిది.

మహాభారతం యయాతి ఉపాఖ్యానంలో, స్వర్గలోకచ్యుతుడైన

యయాతి నక్షత్రలోకాలు చేరుకున్నప్పుడు, అప్పటికే అక్కడకు  చేరుకున్న వారు సమస్త ధర్మవేత్త యైన యయాతిని ఇట్లా అడుగుతారు: “ఈ లోకంలో అన్నిటికన్న  ఉత్తమమైన ధర్మాలేవి?”.

సమాధానంగా యయాతి ఇట్లా అంటాడు. “సత్యము, భూతదయ, ఈ లోకంలోని అన్ని ధర్మాలకన్న ఉన్నతమైనవి.

మహాభారతం అడుగడుగునా సత్యము, భూతదయయే, ఉన్నత  ధర్మాలని ప్రబోధిస్తున్నది.

“ఈ సృష్టిని నడిపే వస్తువేది?” అన్న యక్షుని ప్రశ్నకు, “ఈ సృష్టిని సత్యం నడుపుతున్నది” అంటూ యుధిష్టిరుడు సమాధానం చెబుతాడు.

“స”అనే అక్షరం త్యజించి సత్యం అనే పదానికి ప్రత్యామ్నాయ పదం వెదకి పట్టుకోవడం సైతం దుర్లభమైన పని.

వైరత్యాగం అహింసలో భాగం. మహాభారతగాథలో ఒక సర్పం చేసిన తప్పుకు సమస్త సర్పకోటినీ నాశనం చేయమని ఉదంక మహాముని జనమేజయుణ్ణి రెచ్చగొడతాడు. అగ్నిలో  సర్పాలు ఒక్కటొక్కటీ నశించి పోతున్నవేళ, మరొక మహాముని  యైన ఆస్తీకుడు వచ్చి ఘోరమైన ఆ సర్పయాగాన్ని జనమేజయునిచే మాన్పిస్తాడు. హింసను వీడి వైరత్యాగాన్ని  ప్రదర్శించిన ఐతిహిసక పురుషుడు జనమేజయుడు, యుద్ధరంగాన్ని పరిత్యజించి, అహింసయే పరమధర్మంగా స్వీకరించి, భావితరాల పాలకులకు  ఆదర్శప్రాయుడైన అశోక చక్రవర్తికి  ప్రతీక.

అల్బర్ట్ ఐన్ స్టీన్

ఐతిహాసిక  మహాముని ఆస్తీకుడు ఆధునిక యుగపు అహింసామూర్తి యైన బాపూజీకి ప్రతీక. తుపాకి గుండుకు “హేరామ్” అంటూ తనువు  చాలించినవాడు గాంధీజీ. ఆయనను గూర్చి ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఇట్లా అన్నాడు 

“Generations to come, will scarce believe, that a man such as this in flesh and blood ever walked on this earth.”

జాతి విముక్తి కోసం తాను జరిపిన పోరాటానికి మహాత్మాగాంధీ “సత్యాగ్రహం ” అంటూ నామకరణం చేసుకున్నాడు. ఆయన ఇట్లా అన్నాడొకసారి: “ఒకప్పుడు దైవమే సత్యంగా నమ్మేవాణ్ణి. ఇప్పుడు సత్యాన్నే దైవంగా విశ్వసిస్తున్నాను.”

సత్యము, అహింస, గాంధీజీ, ఉభయనేత్రాలుగా,  తూచా తప్పక అనుసరించిన ఉన్నత మార్గదర్శక సూత్రాలు.

ఏ ఎల్ బాసమ్

హింసతో తల్లడిల్లిన భారతదేశంలో అహింసకు కట్టుబడిన మహానుభావులు బుద్ధుడు, అశోకుడు, మహాత్మగాంధీ మాత్రమే నని ప్రముఖ చరిత్రకారుడు ఏఎల్ బాసమ్ తన ప్రసిధ్ధ గ్రంధం The Wonder that was India లో పేర్కొన్నాడు.

ఫ్రెంచి విప్లవాదర్శాలు తర్వాతి కాలంలో అమెరికన్ స్వేచ్ఛా సంగ్రామానికి ఊపిరిపోసినవి. న్యూయార్క్ సముద్రతీరాన గల Statue of Liberty ఫ్రెంచి శిల్పులు తయారు చేసిందే.

 ఫ్రెంచ్ రాజ్యాంగం భావి ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను ప్రభావితం చేసింది.  అట్లా ప్రభావితమైన రాజ్యాంగాల్లో అమెరికన్  రాజ్యాంగం, భారత రాజ్యాంగం కూడా ఉన్నాయి.

స్వేచ్ఛ, సమానత్యము, సౌభ్రాతృత్వము, కీలకమైన ఈ మానవతాసూత్రాలు  భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ లో పొందుపరచబడినవి.

లౌకికవాదం, ఉదార మానవతావాదం, ఈ దేశపు సనాతన ధర్మానికి  క్రొత్త విషయాలు కావు. వసుధైక కుటుంబకం అనే సూత్రం హైందవ నాగరకతలోనే తొలిసారి పురుడు పోసుకుంది.

1993లో షికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగిస్తూ స్వామి వివేకానంద తరతరాల హైందవ నాగరికత విశ్వసించిన ఉదార మానవతావాదాన్ని, లౌకిక ధర్మాన్ని ప్రపంచానికి జ్ఞాపకం చేసినాడు:

“I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but accept all religions as true. I will quote to you brothern, a few lines from a hymn which I remember to have repeated since my earliest childhood, which is everyday repeated by millions of human beings: “As different streams having their sources in different places, all mingle their waters in the sea, so O Lord! the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead unto thee.”

స్వామీ వివేకానంద

అదే ప్రసంగంలో తరతరాలుగా మానవహింసకు దారితీసిన మతమౌఢ్యాన్ని గూర్చి, జాతి విద్వేషాన్ని  గూర్చి, స్వామీజీ ఇట్లా అన్నాడు:

“Sectarianism, bigotry, and its horrible descendant fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilisation and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now.”

నాగపూర్ నగరం భారతదేశానికి నడిబొడ్డు వంటిది. ఇక్కడ రాష్ట్రీయ స్వయమ్ సేవక్ సంఘ్ (RSS) కేంద్ర కార్యాలయం ఉన్నది.  ఇక్కడే 1956 లో డా బాబాసాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో సహా బౌద్ధధర్మాన్ని స్వీకరించిన శ్రద్ధాస్థలం ఉన్నది. ఈ నగరానికి సమీపంలోనే గల వార్ధా పట్టణం చేరువలో, 1936లో గాంధీజీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమం ఉన్నది. ఆర్ ఎస్ ఎస్ కేంద్రకార్యాలయం, అంబేద్కర్ శ్రద్ధాస్థలం, గాంధీజీ సేవాగ్రామం, ఒక్కొక్కటి ఒక్కొక్క విచారధారకు సంబంధించినవి. అన్నీ చరిత్రాత్మికమైనవే.

పదకొండు సంవత్సరాల క్రిందట నాగపూర్  వెళ్ళినప్పుడు ఈ స్థలాలన్నీ దర్శించినాను. అన్నిటి కన్న బాపూజీ సేవాగ్రామమే నన్ను ఆకట్టుకొన్నది.

కస్తూరిబా తో గాంధీ

కేవలం నూరు రూపాయల వ్యయంతో ఎనభై ఏడు సంవత్సరాల క్రిందట నిర్మించిన బాపూజీ సేవాగ్రామం కుటీరాలతో,  పూరిపాకలతో నిండి ఉన్నది. ఆ ఆశ్రమంలో విద్యుచ్ఛక్తి లేదు. సీలింగ్ ఫాన్లు లేవు. టెలిఫోన్ సౌకర్యాలు లేవు. ఆ ఆశ్రమవాసులందరూ శ్రమైకజీవులు.  అక్కడ ఉన్న ప్రతివారు మరుగుదొడ్లను శుభ్రం చేయవలసిందే. కూరలు తరగ వలసిందే. గాంధీజీ సైతం మరుగుదొడ్లు శుభ్రం చేయడం మొదలుకొని ప్రతి కాయకష్టమూ చేసేవాడు.  ఒకవంక రాట్నం వడకుతూనే పరులతో సంభాషించే వాడు. ఆయన చిన్ని కుటీరంలో కుర్చీలు, బల్లలు లేవు. ఆయన కుటీరమంతా మట్టినేలతో నిండి ఉన్నది. ఆయన కూర్చునే చోట గోడకు ఆనుకునే దిండు మాత్రం వున్నది. చిన్న వంట యిల్లు,  వాష్ రూమ్ ఉన్నాయి. ఆయన స్మృతికి జ్ఞాపకంగా గోడపై ఆయన దక్షిణ ఆఫ్రికా నుండి కస్తూరి బాకు రచించిన ఉత్తరం యొక్క నకలు వున్నది. ఆ ఉత్తరంలో ఇట్లా అంటున్నాడు గాంధీజీ:

“ప్రియమైన కస్తూరి!

నేను క్షేమం. నీ ఆరోగ్యపరిస్థితి గూర్చి సమస్తం తెలిసింది. నేనిప్పుడు ఆఫ్రికన్ జైలులో ఉన్నాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకీ కారాగార శిక్ష. ఈ పరిస్థితిలో స్వదేశం వచ్చి నిన్ను చూడాలంటే నేను జైలు నుండి బయటికి రావలెను. అట్లా రావాలంటే జైలర్ కు అపరాధరుసుము చెల్లించక తప్పదు. ఇదంతా మా ఉద్యమ నిబంధనలకు వ్యతిరేకం. అందుచేత నిన్ను స్వయంగా వచ్చి చూసే అవకాశం లేదు. నీవు తప్పక కోలుకుంటావని నా నమ్మకం. ప్రకృతి చికిత్స చేయించుకో. ఒకవేళ నీ మరణమే సంభవిస్తే జీవితాంతం నిన్నే స్మరిస్తూ జీవితం గడుపుతాను. మళ్ళీ పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదు.”

అదృష్టవశాత్తు కస్తూరి బా మృత్యుముఖం నుండి బైటపడింది. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్ తో పాటు కస్తూరిబా కూడా అరెస్టు కాబడి, పూనే లోని ఆగాఖాన్ పాలెస్ లో వారితో కలిసి బంధించబడింది. అక్కడే గాంధీజీ చేతుల్లో ప్రాణాలు వదిలింది.  గాంధీజీ కోసం వ్యక్తిగత సౌఖ్యాలన్నీ త్యాగం చేసిన మహదేవ్ దేశాయ్ కూడా అక్కడే మరణించినాడు. రెండు సార్లీ పవిత్ర స్థలాన్ని దర్శించినాను.

నివర్తి వెంకట సుబ్బయ్య

సేవాగ్రామ్ ఆశ్రమాన్ని చూడడానికి  నేను కుతూహలపడడంలో వ్యక్తిగత కారణమొకటి ఉన్నది. మా తండ్రి (నివర్తి వెంకట సుబ్బయ్య) క్విట్ ఇండియా ఉద్యమ యోధుడు. ఆగస్టు, 1942, బొంబాయిలో జరిగిన క్విట్ ఇండియా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి డెలిగేట్లలో ఆయన కూడా ఒకడు. అప్పుడాయన ఆంధ్ర ప్రావిన్షియల్ కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ సభ్యుడు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా. క్విట్ ఇండియా తీర్మానం జరిగిన సభలో ఆయన ఉన్నాడు. నాయకులను,  డెలిగేట్లను పోలీసులు చుట్టుముట్టి అరెస్తు కాబడినప్పుడు ఆయన అరెస్టు కాకుండా తప్పించుకొని అజ్ఞాతం లోకి వెళ్ళి పోయినాడు. ప్రభుత్వాన్ని కూలదోయవలసిందిగా ఆయన ఆంధ్యప్రజలకు పిలుపు నిచ్చిన కరపత్రము, రహస్యోద్యమం నడపడానికై ఆయన పొందు పరచిన Kurnool District Circular, పోలీసులకు దొరికినవి. ఆయనను పట్టుకున్నవారికి ప్రభుత్వం బహుమానం ప్రకటించింది. ఆయన ఎవరికీ చిక్కలేదు. రెండేండ్ల తర్వాత, ఆగస్టు 1944లో, సేవాగ్రామ్ వెళ్ళి, గాంధీజీ సలహాపై, స్వయంగా తన ఆచూకీ తెలిపి, ప్రభుత్వానికి లొంగిపోయినాడు.

సేవాగ్రామ్ లో, గాంధీజీ మా తండ్రి నొసట తిలకం దిద్ది ఆయనను పోలీసులకు అప్పగించిన చోటు, Happy Warrior అని ఆయనను ప్రస్తుతించిన చోటు ఊహించుకొని భావోద్వేగానికి గురైనాను.

నేడు గాంధీ శకం అంతరించింది. ఆయన కోరిన లౌకిక వాదము, మానవతావాదాలకు కూడా క్రమక్రమంగా కాలం చెల్లి పోతున్నది. మతం మనిషిని మరొక్క మనిషి నుండి వేరుచేస్తున్నది.మతహింస దేశమంతా చెలరేగుతున్నది. ప్రజాస్వామ్యం క్రమక్రమ జరారుజా గ్రస్తమై పోతున్నది. ఈ మంటలు మణిపూర్ కు సైతం విస్తరించినాయి.

అయోధ్య ఉద్యమ సందర్బంలో మతహింస చెలరేగినప్పుడు దుఃఖితుడైన ఒక ప్రసిద్ధ కవి పంక్తులు జ్ఞాపకం వస్తున్నాయి.

“ఈ రోజు లక్షమంది హిందువులు హింసకు బలైనారు;

ఈ రోజు లక్షమంది ముస్లింలు హతమైనారు;

ఈ రోజు వెరసి రెండు లక్షల మంది మానవుల రక్తాన్ని దేశం చిందు తున్నది.”

 నా ఖండిక నేటి తీరుతెన్నులపై నిరసన.

“ఈశ్వరా! నా దేశాన్ని రక్షించు!”

స్వాతంత్ర్యోదయ శుభాకాంక్షలతో

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles