Wednesday, April 24, 2024

భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్- మీరాబెన్

గాంధీయే మార్గం-17

               ( గతవారం కొనసాగింపు)

ఆశ ఫలించింది, గాంధీజీ స్పందించారు!

జాగ్రత్తలు, నియమాలు చెబుతూ

1925 జులై 24న రాసిన ప్రత్యుత్తరం ఆగస్టు నెలలో అందింది. తేది నిర్ణయించుకోగానే తల్లిని, అక్కని కలసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తండ్రి ‘జాగ్రత్త’ అని అనుమతించారు. రోమన్ రోలా ను కలసి తన నిర్ణయం చెప్పాగా,  ‘నువ్వు చాలా అదృష్టవంతురాలువి’ అన్నట్టు అతని కళ్ళు మెరిశాయి.

Also read: త్యాగానికీ, పట్టుదలకూ ప్రతిరూపం – మీరాబెన్

నవంబరు 6న బొంబాయిలో దాదాభాయి నౌరోజీ ఇంట ఆమె మిత్రులు కలిశారు. ఒక్కపూట ఉండమని వారు కోరినా మ్యాడలిన్ అంగీకరించలేదు. గాంధీజీ చిన్న కుమారుడు దేవదాస్ గాంధీ ఆమెకు ఆ రాత్రే బొంబాయి నుంచి అహమ్మదాబాదుకు రైలు ప్రయాణపు టికెట్ సిద్ధం చేశారు. 1925 నవంబరు 7న మహదేవదేశాయ్, వల్లభ్ భాయి పటేల్, స్వామి ఆనంద్ త్రయం రైలు ప్లాట్ ఫామ్ మీద ఆమెకు ఆహ్వానం పలికారు. వల్లభ్ భాయి పటేల్ ఆమెను నేరుగా గాంధీజీ వద్దకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో మ్యాడలిన్ అలౌకిక స్థితికి వెళ్ళి,  గాంధీజీ ముందు మోకాళ్ళమీద ఉండిపోయారు. 

Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!

గాంధీజీ ఆమెను రెండు చేతులతో పైకి తీసి “నువ్వు నా కూతురు” అని అనగానే మ్యాడలిన్ స్పృహలోకి వచ్చారు. గాంధీజీకి ఇంగ్లీషు కుమార్తెలు ఇరువురు – ఒకరు మ్యాడలిన్ స్లేడ్ (మీరాబెన్) కాగా, మరొకరు సరళాబెన్ గా పిలువబడే క్యాథరిన్ మేరి హెల్ మన్ (1901-1982). 1925 నవంబరు 7వ తేదీ నుంచి మీరాబెన్ కు గాంధీజీని వినడం, చూడటం, సేవచేయడం, సహాయపడటం, నేర్చుకోవడం జీవితంగా మారిపోయింది. అన్ని పనులతో పాటు హిందీ భాష కూడా నేర్చుకుని ఆశ్రమవాసిని అయ్యింది. అంచులేని తెల్ల చీర ధరించడం ప్రారంభించింది.

Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?

ఓ సంవత్సరం తర్వాత తండ్రి గతించినట్టు తల్లి కేబుల్ పంపింది. ఇంగ్లండు వెళ్ళి రమ్మన్నారు బాపు. కానీ మ్యాడలిన్ చలించలేదు. తన ఆశయంతో మమేకం అయ్యారు. తన హిందీ బాగోలేదని, ఉత్తర భారతదేశపు ప్రజలమధ్య హిందీ నేర్చుకోవాలని భావించారు. అలా ఢిల్లీలోని కన్యాగురుకుల్,  అటు పిమ్మట కాంగ్రి గురుకుల్ లో అభ్యసించారు.

Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

 1927లో కాంగ్రి గురుకులానికి గాంధీజీ వస్తారని తెలిసింది. తనను తీసుకు వెళ్తారని ఆశించింది. అయితే రేవారి లోని భగవద్భక్తి ఆశ్రమానికి వెళ్ళమన్నారు గాంధీజీ. అంతేకాదు,  తన మనస్సుకూ, హేతువుకూ నచ్చని వాటిని తిరస్కరించమని, వ్యక్తిత్వాన్ని నిలుపుకోమని సలహాతో పాటు ఓ ఉత్తరం కూడా పంపారు గాంధీజీ. 

Also read: వందశాతం రైతు పక్షపాతి

గాంధీజీ ఆశ్రమ వాసిగా ఉంటూ విస్తృతంగా పర్యటించారు, ఖాదీకి ప్రచారం కల్పించారు. ‘యంగ్ ఇండియా’, ‘హరిజన్’ పత్రికలలో వందదాకా వ్యాసాలు, ఇంకా ది స్టేట్స్ మన్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూస్తాన్ టైమ్స్ పత్రికలలో కూడా వ్యాసాలు రాశారు. 1932- 1933 లో అరెస్టు అయ్యి తొలుత ఆర్థర్ రోడ్ జైలులో,  పిమ్మట సబర్మతి జైలులో శిక్ష అనుభవించారు. 

Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప

గాంధీజీ అనుయాయిగా, ప్రతినిధిగా వైస్రాయ్ వద్దకూ, కాంగ్రెస్ నాయకుల వద్దకు వెళ్ళారు. అంతేకాదు భారతదేశ వాదాన్ని వినిపించడానికి లాయర్ జార్జి, లార్డ్ హాలిఫాక్స్, జనరల్ స్మట్స్, సర్ శ్యామ్యూల్ హోర్స్, విన్సటన్ చర్చిల్ వంటి వారిని కలిశారు. సేవాగ్రామ్ ఆశ్రమం రూపొందించినపుడు ఎంతో దోహదం చేశారు. 

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

1944 మే నెలలో ఆగాఖాన్ భవనం నుంచి విడుదలయ్యాక గాంధీజీ అనుమతితో రూర్కీ – హరిద్వార్ మధ్య కిసాన్ ఆశ్రమం స్థాపించారు. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ నేతృత్వంలో యూనైటెడ్ ప్రావిన్సెస్ లో ప్రభుత్వం 1946లో ఏర్పడింది. మరిన్ని పంటలు సాగుబడికి సంబంధించి ఆ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు.

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ? 

1947లో రిషికేశ్ దగ్గర పశులోక్ ఆశ్రమం, బాపు గ్రామ్ కూడా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చింది. అంతేకాదు, ఆరునెలల లోపు గాంధీజీ హత్యకు గురయ్యారు. తొలుత ఢిల్లీ వెళ్ళాలని భావించినా, ఆఖరి చూపుకు అర్థం లేదు, ఆశయం చాలని ఆగిపోయి, మ్యాడలిన్ తన పనిలో నిమగ్నమయ్యారు.   తర్వాతి కాలంలో  గోపాల ఆశ్రమం స్థాపించారు. ఆశ్రమాల పేర్లు – కిసాన్, పశులోక్, గోపాల్ గమనిస్తే ఆవిడ కృషి  ఏమిటో బోధ పడుతుంది. గ్రామీణ రంగం, వ్యవసాయం, పర్యావరణం సంబంధించిన ఆమె కృషి 1959 జనవరి 27 దాకా సాగింది.

Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా 

ఒకరోజు రోమన్ రోలా పుస్తకాన్ని అతని భార్య పంపగా పోస్ట్ లో అందింది. ఆ పుస్తకాన్ని చదువుతూ, తన జ్ఞాపకాల్లోకి జారిపోయి, స్మృతులను రాసారు. సంగీతం మళ్ళీ ఆహ్వానించింది. ఇంగ్లాండు వెళ్ళిపోయి, అక్కడి జీవితం నచ్చక, వియన్నా నగరానికి వెళ్ళి 23 సంవత్సరాలు సంగీతంతో జీవితాన్ని గడిపారు. 1969 గాంధీజీ శతజయంతికి మౌంట్ బాటన్ ఆహ్వానం మీద లండన్ వెళ్ళి, గొప్ప ప్రసంగం చేశారు. 

Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం

మీరాబెన్ తొలుత తండ్రిని, తర్వాత ఐదేళ్ళకు తల్లిని, తర్వాత మరుసటి సంవత్సరం అక్కను కోల్పోయింది. స్థిరచిత్తంతో ఇంగ్లండు వెళ్ళలేదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో లండన్ లో ఇంటికి వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళలేదు.  ఒక దశలో సర్దార్ పృధ్వీసింగ్ మీద మోహం కల్గినా, నిగ్రహించుకుని బ్రహ్మచారిణిగా ఉండిపోయారు. 1982 జూలై 20న వియన్నాలో కనుమూసిన మీరాబెన్ సంపూర్ణ సన్యాసిని…వంద శాతం గాంధీజీ అనుయాయి!

Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం 

భారత ప్రభుత్వం 1981లో మీరాబెన్ కు ‘పద్మవిభూషణ్’ ప్రదానం చేసింది.

Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం

డా. నాగసూరి వేణుగోపాల్

మొబైల్ : 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles