Monday, July 26, 2021

ఆచరణలో చూపించాలి ఆదర్శాలు

జి  7, అంటే ఏడు దేశాల సమూహం (గ్రూప్ అఫ్ 7) స్థాపించి 48 ఏళ్ళు పూర్తయింది. 1973 మార్చి 23వ తేదీన స్థాపించారు. తొలి సమావేశం 15 నవంబర్ 1975లో జరిగింది. మరో రెండేళ్లలో జి  7 స్థాపించి 50ఏళ్ళు పూర్తి కానుంది. నాలుగున్నర దశాబ్దాల నుంచి ఈ దేశాలన్నీ సమావేశం అవుతూనే వున్నాయి. జి 7 కు సామూహికంగా ఒకే ఎజెండా ఉన్నప్పటికీ, ఆచరణలో ఎవరి స్వార్థం వారిదేనని ఇన్నేళ్లు గడచిన చరిత్ర చెబుతోంది. బహుశా భవిష్యత్తులో కూడా ఎవ్వరి దుకాణం వారిదే తప్ప, పరాయి దేశాల ప్రగతికి ఊతం ఇస్తాయని చెప్పలేం. ఆ దేశంతో ఉండే అవసరాల పునాదులపైనే బంధాలు నిర్మాణమవుతున్నాయి. బ్రిటన్ లోని కార్బిస్ బే లో జి 7 దేశాల అధినేతలు తాజాగా సమావేశమయ్యారు. ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియాను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న 7 దేశాలతో పాటు ఈ మూడు దేశాలను కూడా కలుపుకొని వెళ్లాలని వారి ఉద్దేశ్యం. ఉద్దేశ్యం మంచిదే.

Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

చైనా ఆట కట్టించేనా?

మొత్తంగా ఈ సమావేశాల సారాంశం ఏంటంటే? చైనాను ఎట్లా తొక్కి పెట్టాలన్నదే ప్రధాన లక్ష్యంగా సాగింది. కెనడా, జెర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఇందులో సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేశాలు. బహుపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలానే లక్ష్యంతో ఈ దేశాలన్నీ జి 7 అనే గొడుగు కిందకు చేరాయి. ఆ గొడుగు కిందకు మరిన్ని దేశాలను తేవాలని, గొడుగు నిడివిని కూడా పెంచాలనుకుంటున్నాయి. చైనా వ్యతిరేక దేశాలన్నిటినీ ఈ గొడుగు కిందకు తేవాలనే ఆలోచన ప్రధానంగా అమెరికాకే ఉంది. అనేక సంవత్సరాల నుంచి అగ్రరాజ్యమనే కీర్తిని అనుభవిస్తోంది. అది కాస్తా దెబ్బతినే ప్రమాదాలు పొంచిఉన్నాయని పసిగడుతోంది. ఈ జి 7 దేశాల ప్రయాణానికి సమాంతరంగా ఈ నలభైఏళ్ళల్లో చైనా అనూహ్యంగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే అమెరికాను అధిగమించి, అగ్రరాజ్యంగా అవతరించే సూచనలు కన్పిస్తున్నాయని ప్రపంచ ఆర్ధిక రంగ నిపుణులు భాష్యం, జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో అమెరికా సహా ఈ దేశాలన్నీ మరింతగా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా కనుసన్నల్లో ‘క్వాడ్ దేశాలు ‘ ఏర్పడ్డాయి.అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఇందులో ఉన్నాయి. జి 7లో కూడా అమెరికా, జపాన్ లు ఉన్నాయి. నిన్న జరిగిన జి 7 సమావేశానికి క్వాడ్ సభ్యత్వ దేశాలైన ఇండియా,ఆస్ట్రేలియాను ఆహ్వానించడం వెనకాల అమెరికా ఉందన్నది లోకానికి ఎరుకే.

Also read: యూపీలో ఏమి జరుగుతోంది?

కరోనా సృష్టికర్త చైనానే

కరోనా వైరస్ కు సృష్టికర్త చైనా అని ఈ దేశాలన్నీ నమ్ముతున్నాయి. ఆ దిశగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో  చాలా వరకూ ప్రపంచ దేశాలు చైనాను దోషిగానే చూస్తున్నాయి. జి 7 శిఖరాగ్ర సమావేశంలో, చైనా అంశంతో పాటు ప్రస్తుత కరోనా వైరస్, భవిష్యత్తులో రాబోయే మహమ్మారి వైరస్ లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కరోనా కల్పించిన ఆర్ధిక, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం ప్రధమ లక్ష్యం. ఇటువంటివి భవిష్యత్తులో వస్తే తట్టుకోగలిగిన శక్తిని నిర్మాణం చేసుకోవడం రెండవ లక్ష్యం. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ‘ ( బి ఆర్ ఐ ) వ్యూహంతో చైనా ఇప్పటికే చాలా దేశాలను ఆక్రమించింది. పెట్టుబడులు, అప్పుల పేరుతో శ్రీలంక మొదలు చాలా దేశాలను తన దొడ్లో కట్టేసుకుంది. ఇదే సిద్ధాంతంతో మరిన్ని దేశాలను కబళించాలని చూస్తోంది.’ బై అండ్ కిల్ ‘ అనే వ్యూహం కార్పొరేట్ వర్గాల్లో చాలా ప్రసిద్ధమైంది. చైనా బి ఆర్ ఐ పేరుతో ఇంచుమించుగా అవే కుట్రలు పన్నుతోంది. చైనా దురాక్రమణ ప్రస్థానం ఆసియా నుంచి మొదలై ఐరోపా వైపూ సాగుతోంది. దీనికి దీటుగా జి 7 దేశాలు  ‘ బి 3 డబ్ల్యూ’ ( బిల్డ్ బాక్ బెటర్ వరల్డ్ ) అనే సరికొత్త పథకానికి రూపురేఖలు గీశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చించాలని చూస్తున్నారు.కరోనా కష్టాలను అధిగమించి, ప్రగతి భవనాలను నిర్మించాలనుకుంటున్నారు.

Also read: మోదీతో దీదీ ఢీ!

స్వేచ్ఛావాణిజ్యం

మరింత స్వేచ్చాయిత వాతావరణంలో వాణిజ్యాన్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నారు. వాతావరణాన్ని ఆరోగ్య దాయకంగా మార్చడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి చర్యలను పటిష్ఠం చేయాలనుకుంటున్నారు. ఆర్ధికం, పర్యావరణం, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకేతికత, అభివృద్ధి, విదేశాంగ విధానపరమైన అంశాలపై తరచూ సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఇవ్వన్నీ మంచి ఆలోచనలే. నేటి ప్రధానమైన చర్చనీయాంశం కరోనా వైరస్. ముందుగా దీనిని అరికట్టకపోతే ఏవీ ముందుకు వెళ్లవు. ముందుగా ప్రపంచ మానవాళి ప్రాణాలను కాపాడుకోవాలి. దానికి ఉపకరించే వ్యాక్సినేషన్ వేగవంతం అవ్వాలి. ఈ అంశంలో సంపన్న దేశాలలో మానవత్వం లోపిస్తోంది. సంపన్న దేశాల దగ్గర వారి అవసరానికి మించి డోసులు ఉన్నాయి.  ఇంత వరకూ ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందని, పొందలేని దేశాలు కూడా చాలా ఉన్నాయి. జి 7 కూటమికి మిత్ర దేశంగా ఉన్న భారత్ కే సరిపడా వ్యాక్సిన్లకు దిక్కులేదు. రెండు డోసులతో కలుపుకుంటే మన వ్యాక్సినేషన్ ఇంతవరకూ 4 శాతం కూడా దాటలేదు. పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్లను అందించే బాధ్యతను జి 7 దేశాలు తీసుకోవాలి. ఈ విషయంలో, భారత్ వంటి మిత్రపక్ష దేశాలను ఆదుకోవాలి. అప్పుడే సంపన్న దేశాల మానవత్వం నిలబడుతుంది, జి 7 దేశాల లక్ష్య సాధనపై, భావి ప్రయాణంపై విశ్వాసం పెరుగుతుంది.

Also read: చైనా వక్రదృష్టి

పర్యావరణం ప్రాధాన్యం గుర్తించాలి

పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో ఇప్పటికైనా అర్ధమైతే మంచిది. అభివృద్ధి పేరుతో చేసిన అరాచకాలు,మానవ దుర్మార్గాల పర్యవసానమే ఈ కరోనా రూపంలో వచ్చిన కష్టాలు. పర్యావరణ రక్షణ కోసం వేలాది కోట్ల డాలర్ల కేటాయింపుతోనే సమస్యలు తీరవు. దానిని సక్రమంగా ఖర్చు పెట్టాలి. ప్రకృతి, పర్యావరణం, జీవరాశులపై గౌరవం పెరగాలి. కేవలం ఆర్ధిక, రాజకీయ స్వార్ధాలతో ఎన్ని దేశాలు ఏకమైనా ప్రయోజనం సూన్యం. మన సమస్యలకు మనమే కారకులమని గుర్తించాలి. గ్లోబల్ కార్పొరేట్ పన్నును 15 శాతంగా ఉండాలన్నది మంచి ఆలోచన. కానీ, దీనికి ఆమోదం లభించాలంటే జి 20 దేశాల మద్దతు కీలకం. దాన్ని సాధించాలి. కేవలం చైనాపై ఉండే క్రోధంతో నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. అమెరికా – చైనా ఆధిపత్య పోరుకు భారత్ వంటి దేశాలు పావులు కాకూడదు. జి 7 దేశాలు శిఖరాగ్ర సమావేశంలో చేసుకున్న తీర్మానాలన్నీ స్వాగతించదగినవే. ముందుగా మిగిలిన దేశాలకు వ్యాక్సిన్లు అందించి మనుషుల ప్రాణాలను కాపాడాలి. ఆ తర్వాత కరోనా కల్పిత కష్టాల నుంచి తోటి దేశాలను బయటపడెయ్యాలి. మిగిలిన తీర్మానాలపై సమాంతరంగా దృష్టి సారించాలి. ఆ దిశగా ముందుకు వెళతారని ఆశిద్దాం. అప్పుడే,జి 7 గా ఏర్పడిన లక్ష్యం నెరవేరుతుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య 7 నుంచి మరింత పెరుగుతుందని అంచనా వెయ్యవచ్చు. ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఆచరణలో విజయం సాధించాలి.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles