Thursday, April 25, 2024

సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ – ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య పెరుగుతున్న వివాదాలు, ముదురుతున్న విభేదాలు చూసే వారికి ఏమీ బాగా లేవు. ఇది సమయం, సందర్భం కూడా కాదు. ఎన్నికలు కూడా అయిపోయాయి.ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు? వీటి వల్ల సాధించేది ఏమీ లేకపోగా, ప్రజల్లో నాయకుల పట్ల చులకన భావం మరింత పెరగడానికి దోహదపడుతున్నాయి. నాయకుల రాజకీయాల మధ్యకు అధికారులను లాగి, వారిని హింసించి, పైశాచిక ఆనందాన్ని పొందడం వివేకమైన చర్యలు కావు.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

దీర్ఘకోపం మంచిదికాదు

శీఘ్ర కోపాన్ని మంచివాడి లక్షణంగానూ, దీర్ఘకోపాన్ని చెడ్డవాడి లక్షణంగా భావిస్తారు. అది వ్యక్తిగత స్థాయి వరకే పరిమితమైతే కొంత పర్వాలేదు. అది ప్రజలకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తే, అటువంటి దీర్ఘకోపం కలిగినవాడు ఎంతటి నాయకుడైనా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సిందే. పశ్చిమ బెంగాల్ లో బిజెపిని విస్తరించాలి, ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న రాజకీయమైన ఆలోచనల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం ఏం మాత్రం సహేతుకం కాదని రాజనీతి శాస్త్ర పండితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మమతా బెనర్జీపై ఉండే కోపాన్ని, ఆక్రోశాన్ని అధికారులపై, చుట్టూ వుండేవారిపై చూపించడం మంచి సంకేతాలను ఇవ్వడం లేదు. ఆలాపన్ బందోపాధ్యాయ అనే అధికారిపై కక్ష కట్టడం మంచితీరు కాదని సీనియర్    ఐఏఎస్ అధికారులు, విశ్రాంత అధికారులు విమర్శిస్తున్నారు.మొన్న సోమవారంతో అతని పదవీకాలం పూర్తయిపోయింది. మరో మూడు నెలలు పొడిగించాడానికి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంలో, కేంద్రానికి డెప్యూటేషన్ పై ఎలా తీసుకుంటారు?

Also read: మరపురాని మహానాయకుడు

దిల్లీకి బదిలీ, గిల్లికజ్జాలు

రెండు-మూడు సంవత్సరాలు సర్వీస్ ఉన్న అధికారుల విషయంలో,  ఎక్కువ సర్వీస్ లేదని,గతంలో కేంద్రంలో ఎప్పుడూ పని చేయలేదని మొదలైన కారణాలు / సాకులు చూపించి డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారుల అభ్యర్థనలను కేంద్రం తోసిపుచ్చిన సంఘటనలు చాలా వున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి విషయంలో ఆ కారణాలు ఏమై పోయాయని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆలాపన్ వివాదం ముగిసిపోయినట్లేనని మమతా బెనర్జీ అంటున్నారు. ఇంకా సాగతీస్తే, రాష్ట్రం పక్షాన పోరాటం చేపడతామని ఆమె చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేసిన వెనువెంటనే, అతనితో రాజీనామా చేయించి, రాష్ట్ర ప్రధాన సలహాదారుగా మమత నియమించుకున్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం క్రిందనో, సర్వీసు రూల్స్ చూపించో, ఇంకేమైనా కేసులు పెట్టి అధికారులను కేంద్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యవచ్చు. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్లను నిలుపుదల చెయ్యవచ్చు, జైళ్లకు పంపించవచ్చు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇలా ఎన్నైనా చెయ్యవచ్చు. కానీ అది సరియైన విధానం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

నాయకులూ, అధికారులూ పాలనలో భాగస్వాములు

నాయకులు -అధికారులు పరిపాలనలో భాగస్వామ్యులు. కలిసి మెలిసి ప్రయాణం చెయ్యాల్సినవారు. రెండు వ్యవస్థలు సమన్వయంతో సాగితేనే సుపరిపాలన ప్రజలకు అందుతుంది. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో  రాజకీయ,వ్యక్తిగత వైషమ్యాలను పెంచుకుంటూ వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. నిధులు ఇవ్వకపోవడం, లేదా జాప్యం చెయ్యడం, అభివృద్ధికి సహకరించకపోవడం, పరిపాలనాపరమైన అంశాల్లో తేల్చకుండా ముంచకుండా కాలయాపన చెయ్యడం, కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవడం మొదలైన చర్యలను కేంద్రంలో పాలనలో ఉన్నవారు చేపడితే,  రాష్ట్ర ప్రజలకు, తద్వారా దేశానికి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పటికే, కేంద్ర -రాష్ట్రాల మధ్య ఫెడరల్ సంస్కృతి కుంటినడక నడుస్తుందనే విమర్శలు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మొదలైన చోట్ల చోటుచేసుకుంటున్న పరిణామాలు సమాఖ్య స్ఫూర్తికి, సమైక్య దీప్తికి గొడ్డలిపెట్టుగానే కనిపిస్తున్నాయి.

Also read: బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

అత్తమీది కోసం దుత్తమీద

యాస్ తుపాన్ పై ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి సమయానికి రాకుండా, ప్రధానమంత్రిని నిరీక్షణలో పెట్టారన్నది ప్రస్తుత వివాదాంశం. ముఖ్యమంత్రితో కలిసి ఉన్న ప్రధానకార్యదర్శి, అధికారగణం మధ్యలో ఎలా బహిష్కరించి ఇంకో సమావేశంలో పాల్గొంటారు? అన్నది ప్రశ్న. ముఖ్యమంత్రిని అధికారికంగా ఏమీ చేయలేక, ఆ కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారని సామాన్యుడికి కూడా అర్ధమవుతోంది. ఒక పక్క కరోనా కష్టాలు-ఇంకోపక్క ప్రకృతి వైపరీత్యాలు తెచ్చిన కడగళ్ళ మధ్య నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు చేయూత అందించాల్సిన బాధ్యత కేంద్రానిది. అది మరచి, ఇలా అహాన్ని తృప్తి పరచుకొనే పనులు చేసుకోవడం వివేకం కాదు. దిల్లీ పెద్దలకు – రాష్ట్ర పాలకుల మధ్య జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఆలాపన్ బందోపాధ్యాయకు ఎదురైన చేదు అనుభవాలు మాకు కూడా ఏదో ఒక రోజు తప్పేట్లులేదనే ఆలోచనలు, భయాలు మిగిలిన రాష్ట్రాలలోని అధికారులకు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే, మహారాష్ట్ర పోలీసులకు – కేంద్ర వ్యవస్థల మధ్య వివాదాలు చెలరేగాయి. ఇప్పుడేమో, ఏకంగా ప్రధానకార్యదర్శి స్థాయి వ్యక్తికి కూడా అవి తాకాయి.

Also read: కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

అత్యున్నత అధికారులను అవమానించడం అరిష్టం

ఉన్నత విద్యలను అభ్యసించి, జాతీయ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యు పి ఎస్ సీ ) నిర్వహించే పరీక్షల్లో గెలుపొంది,అత్యంత ప్రతిభామూర్తులుగా గుర్తింపును పొంది, అత్యున్నతమైన సర్వీస్ కు ఎంపికైన అధికారులకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం దేశానికి ఏమాత్రం మంచి సంకేతం కాదు. రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరుగుతూ, అధికారుల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తోంది అనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్వీసులలోకి రావాలనుకునే యువతకు విముఖత పెరిగే ప్రమాదం ఉంది. రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, నైతిక బలాన్ని పెంచడం అంతే ముఖ్యం. ఇప్పటికైనా ఇటువంటి వివాదాలకు స్వస్తి చెప్పి పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం,సమైక్యత, శాంతి సౌభాగ్యల సాధనపై దృష్టి సారించడం మంచిది. ఎక్కడ ఎవరు అధికారంలో ఉన్నా, అన్ని రాష్ట్రాల సమాగమమే ఈ దేశం. పార్టీలు ఎన్నైనా ఉండవచ్చు, ఈ దేశం ఒక్కటే, ఇక్కడుండే మనుషులంతా ఒక్కటే. కొనఊపిరితో కొట్టుకుంటున్న సమాఖ్య వ్యవస్థను నిలబెట్టుకోవడం కేంద్రానికీ,రాష్ట్రాలకు ఉభయతారకం.

Also read: స్టాలిన్ కు శుభాకాంక్షలుస్టాలిన్ కు శుభాకాంక్షలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles