Sunday, December 3, 2023

అక్రమార్కుల ఆట కట్టేనా?

  • న్యాయం సత్వరం జరిగే రోజులు వచ్చేనా?
  • ప్రతీకార చర్యలకు స్వస్తి చెప్పేదెన్నడు?
  • ఫిరాయింపుదారులకు అభయహస్తం అన్యాయం కాదా?

అధికారంలో వున్న పార్టీలు విపక్షాలపై కేసులు బనాయిస్తూ, ఏజెన్సీలను ఉసిగొలుపుతూ, జైళ్లపాలుచేస్తూ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయనే మాటలు కొత్తవి కాదు. కానీ,  గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు కొన్నాళ్ళుగా బాగా వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం మొదలు, పశ్చిమ బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల దాకా అన్ని ప్రభుత్వాలు ఈ మాటలు పడుతున్నాయి. అదే సమయంలో, అనునూయులు, అధికార పార్టీలకు వచ్చిన /తెచ్చిన ఫిరాయింపుదారులు మాత్రం హాయిగా నిద్రపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. బీఆర్ యస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కవిత, ఆప్ నేత సిసోడియా వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. సిసోడియా సంగతి అటుంచితే, కవిత అంశం కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. నాటకీయత, ఉత్కంఠత పెంచే కథనాలు, ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలు, ఊహాగానాలతో సాగే చర్చలు ఎక్కడ చూసినా రచ్చరచ్చ చేశాయి. కవిత అరెస్టవుతుందా, లేదా? రేపెవరో?… అంటూ వార్తలు,సంభాషణలు హోరెత్తిపోయాయి. కారణాలు ఏవైనా  ప్రస్తుతం ఈ వాతావరణం కాస్త స్తబ్దుగా వుంది.

తెలంగాణలో  ఎన్నికల వేడి

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రగులుతోంది. బిఆర్ఎస్ -బిజెపి -కాంగ్రెస్ మధ్య సాగుతున్న త్రిముఖపోటీలో రాజెవరో? రెడ్డెవరో? మరి కొన్నాళ్ళలోనే తెలుస్తుంది. బిజెపి – బిఆర్ ఎస్ మధ్య తెరవెనక బంధాలు ఉన్నాయనే ప్రచారం మాత్రం బలంగా వుంది. కాంగ్రెస్ బలపడకూడదనే వ్యూహంతో ఈ రెండు పార్టీలు ఈ చీకటి బంధాన్ని పెట్టుకున్నాయని అంటారు. నిజానిజాలు ఏలినవారికే ఎరుక. ప్రస్తుతం తెలంగాణలో, బిజెపిని దాటుకొని కాంగ్రెస్ బలం పుంజుకుందనే మాటలు జోరుగా వినపడుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ తర్వాత, అసలు రంగు బయటపడుతుంది. అప్పటి దాకా ఆగాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై భారీ అవినీతి ఆరోపణలు, అరెస్టు, బెయిల్స్ అంశాలు కాకరేపుతూనే వున్నాయి. బాబు వారసుడు లోకేష్ చుట్టూ కూడా అవే అంశాలు వున్నా, ఇంకా అరెస్టు కాలేదు. ఎప్పుడైనా ఆ అవకాశం వుందనే ప్రచారం బలంగానే వుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్స్ తోనే కాలం గడుపుతున్నారని, ఆయన బెయిల్స్ రద్దు చేయించి మళ్ళీ జైలు పాలు చెయ్యాలని చంద్రబాబు వర్గం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఏదో నేరంలో జైలుకు పంపాలనే పనిలో బిజెపి ప్రభుత్వం వుంది.

తెలుగు రాష్ట్రాలలోనూ ముదిరిన తెగులు

ఇలా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ప్రతికార చర్యో, ఆరోపణలో ప్రబలుతూనే వున్నాయి. ఇంకొక వైపు- రాజకీయాల్లో  అవినీతిపరులు, అక్రమార్కులు పెరిగిపోతున్నారని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వున్నారు. మరోవైపు- ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవ్వేమీ తమకు సంబంధించిన విషయాలు కాదనుకుంటూ ఓటర్లు తమ మానాన తాము ఓట్లు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. నేరచరితులు ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. కొన్ని వేలమందిపై కేసులుంటే, రుజువు కాబడి, శిక్షలు పొందుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇదీ జరుగుతున్న తంతు! గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘సీబీఐ’ని ‘కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్’గా అభివర్ణిస్తూ అప్పటి బిజెపి బడానేతలు విమర్శించేవారు. ఇప్పుడు బిజెపిని, ముఖ్యంగా మోదీని విపక్షాలు విపరీతంగా విమర్శిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీని కొమ్ముకాస్తూ, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి కనీసం ప్రతిస్పందనలు లేవంటూ విపక్షాలు చేస్తున్న చర్యలతో ఉభయ సభలు దద్దరిల్లుతూనే వున్నాయి. నిఘంటువులోకి ‘మోదానీ’ అనే కొత్త పదం వచ్చి చేరింది కూడా. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్షనేతలు ఈ పదాన్ని బాగా వాడుతున్నారు. అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎప్పుడు ఏర్పాటుచేస్తారంటూ విపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి.

చట్టం తన పని  తను చేసుకుపోతున్నదా?

ఇదంతా కేవలం రాజకీయమేనని సరిపెట్టుకొని కూర్చోడం సరికాదు. మొత్తంగా ఈ తీరుకు చరమగీతం పాడాలి. అధికారంలో ఎవరున్నా దర్యాప్తు వ్యవస్థల స్వతంత్రత పెరగాలి.నేరచరితుల నేరాల నిగ్గు వేగంగా తేల్చడమే కాక, వెనువెంటనే శిక్షలు పడాలి. ఆ దిశగా న్యాయస్థానాలు కదిలే పరిణామాలు రావాలి. సిబ్బంది కొరత తీరాలి. కొండలా పేరుకు పోతున్న కేసుల బూజులు ఒదల్చాలి. అతి అక్రమార్కులను ఎన్నికల నుంచి బహిష్కరించే పరిస్థితులు రావాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చరిత్రను తిరగిస్తే ఎన్నో ఉదాహరణలు ఎదురుగా కనిపిస్తాయి. వ్యాపారస్తులు -రాజకీయ నేతల మధ్య బంధాలు రోజురోజుకూ పెరగడమే కాక, రాజకీయాల్లోకి వచ్చే వ్యాపారస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏ రంగంవారైనా రాజకీయాల్లోకి రావచ్చు,ఇరు వర్గాల మధ్య బంధాలు పెరగవచ్చు. అందులో ఏమీ తప్పు లేదు. అనారోగ్య, అక్రమ, అవినీతి వాతావరణం పెరగడమే ఆవేదన రగిలించే అంశం. ఆశ్రిత వర్గాలవారు కుబేరులవుతున్నారు. కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినవారు పదవుల్లో కూర్చొని అందలాలు ఎక్కుతున్నారు. పేద -పెద్ద మధ్య వ్యత్యాసం పెరగడం సమాజ శాంతికి మంచిది కాదు. అక్రమార్కులతో చట్టసభలు నిండిపోవడం క్షేమదాయకం కాదు. పడాల్సినవారికి శిక్షలు పడకపోవడం మరో ప్రమాదకర అంశం.వ్యవస్థలు మారడమే కాదు. ప్రజలు మారాలి. ఓటర్లు మారాలి. ఓటింగ్ మారాలి. ఇవ్వేమీ మారనంతకాలం, మంచివారికి అధికారం,డబ్బు అందనంత కాలం దేశాభివృద్ధికి తిరోగమనం తప్ప పురోగమనం సాధ్యపడదు. ఇక పార్టీ ఫిరాయింపులపై అదుపులేకపోవడం మరో కోణం. చట్టం తన పని తాను చేసికెళ్ళి పోతోంది.. అంటుంటారు. అక్రమార్కులు, ఫిరాయింపుదారులందరి పనిపట్టే రోజులు పూర్తిగా వచ్చినప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది, ధర్మం వెలుగుతుంది.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles