Friday, September 29, 2023

జ్యోతిబసు రికార్డును అధిగమించిన నవీన్ బాబు

  • తండ్రిని మించిన తనయుడు
  • అవినీతికి ఆమడ దూరం. పరిపాలనాదక్షుడు

ఆ పేరులోనే నాయకుడు వున్నాడు. ఉన్నట్టుగానే నాయకత్వ పటిమను చాటుకున్న పట్నాయకులలో బిజూ పట్నాయక్, నవీన్ పట్నాయక్ ఎన్నదగినవారు. పేరెన్నికగన్నవారు. బిజూ పట్నాయక్ నిన్నటి తరాలవారికి బాగా పరిచయస్తుడు. ఆయన పేరు చెప్పకుండా ఒడిశా గురించి మాట్లాడడం సాధ్యపడదు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్న నవీన్ పట్నాయక్ నేడు తండ్రిని మించిపోయాడు. కేవలం తండ్రినే కాదు, దేశంలోని అనేకమంది ముఖ్యమంత్రులను దాటిపోయాడు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ముగ్గురులో ఒకడిగా పుటలకెక్కాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన జ్యోతిబసు రికార్డును కూడా అధిగమించాడు. మరికొన్నాళ్లలో సిక్కిం సీఎంగా గతంలో సేవలందించిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును కూడా దాటిపోయి చరిత్ర సృష్టించే బాటలో ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వున్నారు. ప్రస్తుతం అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చామ్లింగ్ కు వుంది (24 సంవత్సరాల 166రోజులు). పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు 23సంవత్సరాల 139రోజులు సేవలందించి ద్వితీయుడుగా వున్నారు.

Also read: మణిపూర్ లో ఆగని జాతివిద్వేషజ్వాల

అరంగేట్రం జనతాదళతో

నవీన్ పట్నాయక్ ఈ జూలై 23వ తేదీకి జ్యోతిబసును కూడా అధిగమించి, రెండో స్థానాన్ని ఆక్రమించారు. నవీన్ పదవీ కాలం వచ్చే ఏడాది మే వరకూ వుంది. 2024 ఎన్నికల్లోనూ గెలుపొందితే నవీన్ అందరినీ దాటి అగ్రభాగాన నిలుస్తారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్ళీ నవీన్ పట్నాయక్ గెలిచి ఆ రికార్డును సొంతం చేసుకొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తండ్రి పేరును కలుపుకొని బిజూ జనతా దళ్ ను స్థాపించారు.  మొదట్లో జనతా దళ్ లో ఉన్నారు. లోక్ సభకు ఎంపికై కేంద్రమంత్రిగానూ కొంతకాలం పనిచేశారు. 2000 మార్చి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగి ఇప్పటికి వరుసగా అయిదు సార్లు తను గెలిచి, తన పార్టీని గెలిపించి చరిత్రకెక్కారు. హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన రాజకీయ రణక్షేత్రంగా మలుచుకొని, 23ఏళ్ళుగా కొనసాగుతున్నారు. ఇలా ఒకే నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కూడా విశేషం. సుమారు 50ఏళ్ళ వయస్సులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు అక్షరాన్నే నమ్ముకొని యాత్ర సాగించారు. గొప్ప చదువరి, మంచి రచయిత. ఆ రచనలన్నీ ఇండియా, ఇంగ్లాండ్, అమెరికాలో పుస్తకాలుగా ముద్రణ కూడా పొందాయి.ఎ సెకండ్ ప్యారడైజ్,ఎ డిసెర్ట్ కింగ్ డమ్, ది గార్డెన్ అఫ్ లైఫ్ మొదలైన పుస్తకాలు నవీన్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. తన మాతృభాష ఒరియా తప్ప ఇతర భాషలు చాలా నేర్చుకున్నాడు. దానిని వైఫల్యంగానే భావించాలి. ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్, హిందీ, పంజాబీ భాషలలో మంచి అధికారం వుంది. ఒరియా ప్రసంగాలను రోమన్ అక్షరావళిలో రాసుకొని చదువుతారు. ఇన్ని భాషలు నేర్చుకున్న వ్యక్తి సొంత భాష నేర్చుకోకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటునే వున్నారు.

Also read: సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా కసరత్తు

సంజయ్ గాంధీ సహాధ్యాయుడు

చదువంతా డెహ్రాడూన్, దిల్లీలోనే సాగింది. సంజయ్ గాంధీ సహాధ్యాయి, స్నేహితుడు కూడా. రాజకీయాల్లోకి రాకముందు జీవనమంతా ఒరిస్సాకు దూరంగానే నడిచింది. తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాతే రాజకీయ యవనికపై అడుగుపెట్టారు. రచనా, పఠనా వ్యాసంగంతో పాటు దైవభక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా గ్రామ దేవతలను, పూరీ జగన్నాథుడిని ఆరాధిస్తారు. ఈయన జీవనశైలి కూడా భిన్నంగా వుంటుంది. మితభాషి, పెద్దగా ఎవరినీ కలవరని పేరుంది. ఆ అంశం, ఆ వ్యక్తులు నచ్చితే సమయం బాగానే గడుపుతారని కూడా చెబుతారు. (1) అవినీతికి వ్యతిరేకంగా నిలబడడం, (2) పేదల అనుకూల విధానాలు నవీన్ పెట్టుకున్న విధానాలు. ఇప్పటికీ వాటికే కట్టుబడి వున్నారు. ఆ విధానాలను, ఆయన పరిపాలనను, శైలిని ప్రజలు అత్యంతంగా ఇష్టపడుతున్నారనే విషయాన్ని ఆయన పాతికేళ్ల రాజకీయ విజయప్రస్థానమే విశదపరుస్తోంది. ఒడిశా చాలా పేద రాష్ట్రం, వెనుకబడిన ప్రాంతం. సహజవనరులు పుష్కలంగా వున్నా,అక్షరాస్యత,ఆధునికతలో అనుకున్నంత ప్రగతి సాధించలేదన్నది చేదునిజం. బిజెపి,కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రజలు నవీన్ నాయకత్వంలోని బిజెడికె ఓటువేస్తున్నారు. నవీన్ పట్నాయక్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ప్రారంభంలో బిజెపితో, వాజ్ పెయితో, ఎన్డీఏతో కొంతకాలం కలిసి సాగారు. విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.

Also read: శ్రీరమణ పెన్నుమూశారు

ఎన్ డీ ఏ నుంచి విడిపోయి సొంత పార్టీ

స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్యా ఉదంతం కందమాల్ జిల్లాలో అల్లర్లు రేపింది. ఈ నేపథ్యంలో, ఎన్డీఏ నుంచి విడిపోయి కొంతకాలం మూడో ఫ్రంట్ గా చెప్పుకొనే ‘లెఫ్ట్ ఫ్రంట్ ‘తోనూ జతకట్టారు. 2014లో అన్ని కూటముల నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ బిజెడితోనే ఎన్నికలబరిలో దిగి, 2014, 2019లోనూ వరుసగా విజయం సాధించారు. నరేంద్రమోదీ హవాలోనూ సొంతబలంతో అధికార పీఠాన్ని ఒంటిచేత్తో నిలబెట్టుకున్నారు. తండ్రి బిజూ పట్నాయక్ వలె ఈయన కూడా అధికార స్వామ్యాన్ని (బ్యూరోక్రసీ) నియంత్రణలో పెట్టుకున్నారు. అంతటా, అన్నీ తానై చక్రం తిప్పుతుంటారు. నవీన్ వ్యూహాలు అంతుచిక్కవు. కరణం లెక్కలు కాటికి పోయినా అర్ధం కావు అన్న చందాన వుంటాయి. ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఒకప్పుడు పట్నాయక్ సామాజిక వర్గానికి చెందినవారే గ్రామ కరణాలుగా ఉండేవారు. మన తెలుగునాట నియోగి బ్రాహ్మణులు లాగా అన్నమాట! మొత్తంమీద, ఈయన వ్యూహాలు, విధానాలు ఎట్లా ఉన్నా, ఒక విధానం మాత్రం తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కు దగ్గరగా ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, వాళ్ళతో పెద్దగా ఘర్షణలకు దిగకుండా రాష్ట్ర ప్రయోజనాలనే ప్రధానంగా భావించడం. ఆ మేరకు కేంద్రాన్ని ఒప్పించి సాధించడంలో నవీన్ పట్నాయక్ చాలా వరకూ విజయం సాధించినట్లే. 2014 నుంచి కూడా ఏ పక్షంలో చేరలేదు. కొత్తగా ఏర్పడిన ‘ఇండియా’కు కూడా దూరంగానే వుంటూ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. 1946లో జన్మించిన నవీన్ మరో రెండేళ్లలో 80వ ఏట అడుగుబెడతారు. 80ఏళ్లంటే వృద్ధాప్యమే.

Also read: ఐటీ భవితవ్యం ఏమిటి?

సంపద సృష్టికి బలమైన పునాదులు

వృద్ధుడవుతున్నా,తన రాజకీయ వారసులు ఎవరన్నది ఇంతవరకూ ప్రకటించలేదు.నవీన్ పట్నాయక్ ను ఆరాధించినట్లుగా, మిగిలిన నాయకులను ప్రజలు ఏ మేరకు స్వాగతిస్తారో కాలమే సమాధానం చెప్పాలి. నవీన్ పట్నాయక్ పై వ్యక్తిగతంగా అవినీతి మరకలు లేకపోయినంత మాత్రాన, ప్రభుత్వంలో, నాయకులలో అవినీతి లేదని చెప్పలేం. చట్టం తన పని తాను చేసుకుపోయినా, లేకపోయినా, అవినీతి మాత్రం తనపని తాను చేసుకొని పోతూనే వుంటుంది. దానిని ఆపే శక్తి ఈ కాలానికి లేదు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన తెలియనట్లు ఉండవచ్చు. గతంలో అక్రమ చిట్ ఫండ్లు, పోంజీ స్కీమ్ లో బిజెడి ప్రజాప్రతినిధులను సీబీఐ అరెస్టు చేసింది. జీవితకాల పొదుపు పేరుతో జరిగిన ఆర్ధిక మోసాలలో లక్షల సంఖ్యలో పేద ప్రజలకు కోట్లాది రూపాయల మోసాలు జరిగాయి.  ఆ సందర్భంలో సుమారు 30కంపెనీలను సీబీఐ విచారించింది. అటువంటి కంపెనీల ప్రారంభోత్సవాల్లో నవీన్ అతిధిగా పాల్గొన్నట్లు కనిపించే ఫోటోలు కూడా అప్పుడు చక్కర్లు కొట్టాయి. ఒడిశాలో ప్రస్తుతం బిజెపి కూడా బలంగానే వుంది.2019లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు వున్నాయనే మాటలు కూడా వినపడ్డాయి.2024లో దృశ్యం ఎట్లా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా,వివాదరహితుడుగా, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను సాధించిన ఘటికుడిగా నవీన్ పట్నాయక్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. శేషజీవితంలో సుకీర్తిని సాధించడంతో పాటు పేదరాష్ట్రమైన ఒడిశా సుసంపన్న మైన రాష్ట్రంగా అవతరించడానికి బలమైన పునాదులు వేస్తారని ఆకాంక్షిద్దాం.

Also read: అదృష్టవంతుడు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles