Wednesday, December 8, 2021

మోదీతో దీదీ ఢీ!

ఆకర్ష్ పథకంలో భాగంగా, మొన్న ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలు మొదలు ఛోటా మోటా నాయకుల వరకూ చాలామంది బిజెపిలోకి వలస వెళ్లారు. తృణమూల్ పార్టీతో పాటు, కాంగ్రెస్, వామపక్ష శ్రేణులు కూడా బిజెపి వైపుకు మళ్ళాయి. కానీ, ఎన్నికల్లో తృణమూల్ విజయ దుంధుభి మోగించింది. మళ్ళీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. బిజెపి తప్పకుండా గెలిచి, అధికారంలోకి వస్తుందనే విశ్వాసం, కేసుల భయం, ఆకర్షణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో బిజెపిలోకి వలసలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.పార్టీని వీడిన శ్రేణులు బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేస్తున్నాయి. ఇదంతా తృణమూల్ చేస్తున్న దుష్ప్రచారం తప్ప, అంత దృశ్యం లేదని బిజెపి వర్గాలు అంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో వలసలు జరుగకపోయినా, సొంతగూటికి చేరికలు మొదలయ్యాయన్నది వాస్తవంగానే కనిపిస్తోంది.

Also read: చైనా వక్రదృష్టి

బీజేపీ నుంచి తృణమూల్ లోకి వలసలు

మళ్ళీ మమ్మల్ని పార్టీలోకి తీసుకోండంటూ సాక్షాత్తు అధినేత్రి మమతా బెనర్జీకి కొందరు నేతలు లేఖలు రాస్తున్నారు. అదే బాటలో కొందరు కార్యకర్తలు కూడా నడుస్తున్నారు. బిజెపిలో చేరి తప్పు చేశామంటూ బిర్ భుమ్ జిల్లాలోని బిపత్రికురి గ్రామంలో అనేకమంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అధికార  తృణమూల్ పార్టీ బెదిరింపులకు భయపడి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని బిజెపి స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు దీపేందు విశ్వాస్, సోనాలి గుహ మొదలు సరళ ముర్ము, అమోల్ ఆచార్య వంటి నేతలు తిరిగి తృణమూల్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం వలసల అంశం పశ్చిమ బంగలో చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి వరకూ బెంగాల్ కే పరిమితమైంది. ఇప్పుడు దృశ్యం, గమనం మారుతున్నాయి. దేశంలోని మూలమూలకు పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తాజాగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కొన్ని నెలల్లో సిద్ధం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి ఎదగాలని చూస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ, ఆ పార్టీని తృణమూల్ ఢీకొడుతుందని అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి.

Also read: సందేహాలను నివృత్తి చేసిన మోదీ

స్థాయి పెరిగిన మమత

బెంగాల్ లో బిజెపిని ఓడించినందుకు అభినందిస్తూ దేశం నలుమూలల నుంచి లక్షలాది ఇమెయిల్స్ వచ్చాయని బెనర్జీ చెబుతున్న మాటలను తేలికగా కొట్టి పారేయకూడదు. ఇదంతా చూస్తూ వుంటే, ఎక్కువమంది భావిస్తున్నట్లు మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో పెద్దపోరాటానికే సిద్ధమైనారని తెలుస్తోంది. నిన్నటి ఎన్నికల గెలుపుతో ఆమె స్థాయి మరింత పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మమతా బెనర్జీ పెద్ద గేమ్ కు సిద్ధమవుతున్నట్లు అంచనా వేయాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలవడం, మోదీ వంటి అత్యంత శక్తివంతమైన నాయకుడిని సై అంటే సై అంటూ ఢీ కొట్టడం మామూలు విషయం కాదు. నరేంద్రమోదీ ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతున్న తరుణంలో, బెంగాల్ ఎన్నికలు ఎదురుదెబ్బ కొట్టాయి. ఆ రాష్ట్రంలో మూడు సీట్ల దశ నుంచి రెండంకెల స్థానాలకు ఎదగడం బిజెపి ప్రయాణంలో ఘనమైన విజయమే అయినప్పటికీ, సర్వశక్తులు వడ్డి, మమతా బెనర్జీని అడ్డుకోలేకపోవడం మంచి పరిణామం కాదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతిన్నాయి కానీ, తృణమూల్ కు ఎటువంటి నష్టం జరుగలేదు. నష్టం జరుగకపోగా, ముచ్చటగా మూడోసారి విజయం వరించింది. ఇప్పుడు ఆ పార్టీని ప్రతి రాష్ట్రంలో విస్తరించడానికి ఆమె సిద్ధమవ్వడం జాతీయ రాజకీయాల్లో కొత్త పరిణామం.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

మమతా బెనర్జీ నాయకత్వంలో ప్రతిపక్షాల ఐక్యత?

నరేంద్రమోదీకి సాటిగా నిలబడగలిగిన నాయకుడు ఒక్కడూ లేడనుకుంటున్న సందర్భంలో, మమతా బెనర్జీ పేరు పైకి వచ్చింది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా, బిజెపికి పోటీగా ప్రతిపక్షాలన్నీ మరింతగా ఏకమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ పేరును ప్రకటించి, ఎన్నికల్లోకి దుమికినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండు -మూడేళ్ళ సమయం ఉంది. అప్పటికి రాజెవరో ? రెడ్డెవరో? ఇప్పుడే చెప్పలేకపోయినా, నరేంద్రమోదీకి సవాలుగా నిలవడానికి మమతా బెనర్జీ ఉన్నారనే మాటలు దేశంలో గట్టిగానే వినపడుతున్నాయి. ఈరోజు పరిస్థితులు గతంలో ఉన్నంత అనుకూలంగా లేకపోయినా, వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ నరేంద్రమోదీకే ప్రజలు పట్టం కడతారని కొందరు విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. మోదీని తక్కువ అంచనా వెయ్యరాదని, ఎన్నికల సమయానికి వాతావరణాన్ని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకోవడంలో నరేంద్రమోదీ సిద్ధహస్తులని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, మోదీ – దీదీ పోరు ఇప్పట్లో ఆగేట్టు లేదు. పశ్చిమ బెంగాల్ లో వలసలు ఎక్కువ జరిగితే, తృణమూల్ మరింత బలపడుతుంది. వీటన్నింటినీ బిజెపి ఏ విధంగా అడ్డుకుంటుంది? తన పరపతిని, ప్రగతిని ఎట్లా కాపాడుకుంటుంటుంది అన్నది కాలంలోనే తెలుస్తుంది.

Also read: బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles