Monday, June 5, 2023

చరిత్ర హీనులు ఎవరు?

3వ భాగం­­

ఇది యథార్థ కథనం. 1జులై 2021 నాడు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి గ్రామం నుంచి పదిహేను మంది దళితులు వచ్చి పౌరహక్కుల ప్రజా సంఘం నాయకులను కలుసుకున్నారు. వచ్చిన దళితుల పేర్లు:

(1). పబ్బే ఆనంద్ (2). పబ్బే చంద్రయ్య (3). పబ్బే ప్రేమ్ కుమార్ (4) పబ్బే సామ్యూల్ (5). పబ్బే సాయిలు (6). పబ్బే శాంసన్ (7). పబ్బే దానెల్ (8). చింతకింది ప్రభాకర్ (9). చింతకింది అనుసూజ (10). చింతలకింది సరోజ (11). చింతలకింది స్వరూప  (12). చింతలకింది కాంతారావ్ (13). చింతలకింది లక్ష్మమ్మ (14). చింతలకింది గంగయ్య (15). చింతలకింది పబ్బే సామెల్.

వాళ్ళు చెప్పిన విషయం:

వారి పూర్వీకులకు ప్రభుత్వం జీవనోపాది కింద 353 సర్వే నంబర్ లో 9 ఎకరాల 12 గుంటల ఇనాం భూమి ఇచ్చింది. అందులోనే దున్నుకొని, పంటలు పండించుకొని బ్రతుకుతున్నట్లు చెప్పారు. కాలం సరిగా లేకపోవుట చేత బ్రతుకు తెరువును వెతుక్కుంటూ వలస వెళ్ళినట్లూ, ఈ మధ్య కరోనా కారణంగా గ్రామానికి తిరిగి వెళ్లినట్లూ, అక్కడనే జీవిస్తున్నట్లూ చెప్పారు. వలస వెళ్ళినప్పుడు వారి భూములను పక్కవాళ్ళ కు అనగా వారి కులస్తులైన (1). పబ్బే లక్ష్మమ్మ,(2). పబ్బే ప్రశాంత్ (3). పబ్బే సుభాష్ (4). పబ్బే తుల్జమ్మ (5). పబ్బే సంతోషమ్మ (6). పబ్బే నికోద్యమ (7). పబ్బే లక్ష్మమ్మ భర్త పురుషోత్తం లకు దున్నుకొనుటకు ఇచ్చినట్లు చెప్పారు. రెండు వర్గాల వారూ దళితులే. పొలం లోకి వెళ్లి పంట వేద్దాము అని భూమిని సాఫ్ చేస్తున్న క్రమములో మా కులస్థులు అధికారులతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ సర్వే సమయంలో వాళ్ళ పేరుమీద భూమిని చేసుకున్నట్లు వారికి తెలిసినట్లు తెలిపారు. ఇప్పుడు వారి దళిత లీడర్ మరియు తెరాస లీడర్ రమేష్ ఉరఫ్ రామేశ్వర్ సహకారంతో వారికి వచ్చిన వారసత్వపు భూమితో పాటు వీరి భూమిని కూడా అమ్ముతున్నట్లు చెప్పారు. ఎలా అయినా ఈ అన్యాయాన్ని ఆపాలని హక్కుల నాయకులను కోరారు.

Also read: ఎవరు చరిత్ర హీనులు?

దళితులకు అన్యాయం చేస్తున్నవారూ దళితులే

దళిత నాయకులే అన్యాయం చేస్తున్నారు అని బాధగా చెప్పారు. అయితే వాళ్ళ దగ్గర ఆభూమి తాలూకు ఆధారాలు లేవు. ఇనాం భూములకు పట్టేదార్ పాస్ బుక్స్ తరువాత ఇస్తారు, ఇప్పుడు ఇవ్వరు అని గ్రామ పెద్దలు చెప్పటం చేత పాస్ బుక్స్ లేవని చెప్పారు. మేము ఒక ప్రయత్నంలో భాగంగా మండల తహసీల్దార్, జిల్లా కలెక్టర్, తదితర అధికారులకు ఫిర్యాదు ఇప్పించాము. ఆ ఫిర్యాదులో మా ఇనాం భూమిని తస్కరించి రామేశ్వర్ అనే దళిత నాయకుడు అగ్రిమెంట్ చేసుకొని మరొకరికి అమ్ముతున్నారు, అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయవద్దు అని రాతపూర్వకంగా తెలియజేయించాము. ఇదే విషయాన్ని 02-08-2021 న హై కోర్టు దృష్టికి తీసుకవెళ్ళాము. కేసు పెండింగ్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయవద్దు అని తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ రాతపూర్వకంగా ఇచ్చాము. 09-08-2021 నాడు తహసీల్దార్  రిజిస్ట్రేషన్ చేయవలసి ఉన్నది. దాన్ని వాయిదా వేశారు.

రిజిస్ట్రేషన్ర ఆగిపోతూనే రమేష్ ఆక్రమదారులను రెచ్చగొట్టి ఆనంద్ ఇంటిపైకి పంపాడు. అక్రమదారుల అందరి డబ్బు, అమ్మగా వచ్చిన డబ్బులో కొంత డబ్బును అడ్వాన్స్ రూపములో 28 లక్షల రూపాయలను పబ్బే లక్ష్మమ్మ కు రమేష్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ వాయిదా పడటం చేత పబ్బే లక్ష్మమ్మ  బిస్తరు తీసుకొని ఆనంద్ ఇంటికి వెళ్ళింది. ఆనంద్ కేసు వేయటం చేత భర్త ఇంటిలో నుండి గెంటివేసినట్లు చెప్పింది. కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని డబ్బులో భాగస్వాములుగా ఉన్న సుమారు 20/30 మంది 09-08-2021 న రాత్రి ఆనంద్ ఇంటి మీదకు వెళ్లి హడావుడి చేసారు. ఆనంద్ కుటుంబం మొత్తం భయానికి లోనయ్యారు. సర్వే నంబర్ 353 ఇనాం భూమి కాదు, సర్వే నంబర్ 354 మాత్రమే ఇనాం భూమి అని గొడవ చేశారు. ఆనంద్, మిగిలిన 14 మంది సర్వే నంబర్ 354 లో ఎలా సమానంగా భూమి ఉందో అదే విధంగా సర్వే నంబర్ 353 లో కూడా ఉన్నది అని ఆనంద్ వాళ్ళు చెప్పారు. ఆనంద్ వాళ్ళ పూర్వికులు పెంటయ్య అనీ. పెంటయ్య  తాలూకు వారసులు ఆనంద్ వాళ్ళు అనీ,  బాలయ్య తాలూకు వారసులు ఆక్రమదారులు అనీ తేల్చారు. మా భూమిని మాకు వదిలి పెట్టి,  మీ భూమి వరకు అమ్ముకోండి అని ఆనంద్, మిగిలిన 14 మంది వాదన చేసారు.

Also read: ఎవరు చరిత్ర హీనులు?

రమేష్ ను చూసి భయపడిన ఆనంద్

రమేష్, తదితరులు ఇనాం భూమి సర్వే నంబర్ 353 అని ఎలా చెపుతారు, ఇనాం భూమి కాని పక్షంలో ముక్కును నేలకు 25-08-2021 నాడు రాయాలని గ్రామ తీర్మానం చేసారు. ఆనంద్, మిగిలిన 14 మంది కేసు వాపస్ తీసుకోని పక్షంలో రమేష్ చంపేస్తాడని భయంగా ఉందని 11-08-2021 న ఆనంద్, ఆనంద్ భార్య, భాగస్వాములు మా ఆఫీస్ కు వచ్చారు. అందరితో క్షుణ్ణంగా మాట్లాడి మర్పల్లి గ్రామానికి 14-08-2021 నాడు వస్తామని చెప్పి పంపాము.రామేశ్వర్ ఉరఫ్ రమేష్ తోనూ, గ్రామ సర్పంచ్ (మహిళ, కానీ మొత్తం కొడుకు కలీముద్దీన్ సర్పంచ్ గా ముద్ర ఉన్నది) తోనూ, తహసీల్దార్ తోనూ మాట్లాడాలని నిర్ణయం జరిగింది. నిర్ణయం ప్రకారమే ముగ్గురితో మాట్లాడాము. రమేష్ నోరు పెద్దగా చేసి భయపెట్టించే టందుకు ప్రయత్నం చేసాడు.‘‘ఎస్సీలం, మాకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, మీరు భయపెట్టిస్తున్నారు, ఒక కూలి చేసుకొనే వాడిని చూసుకొని రిజిస్ట్రేషన్ను ఆపేస్తారా? ఆనంద్ పై క్రిమినల్ కేసు పెడతాను. ఇనాం భూమి కాదు, ఒక్కోడి అంతు చూస్తాను’’ అని రమేష్ ఫోన్ లోనే విపరీతంగా మాట్లాడినాడు.

‘‘14 ఆగస్టు 2021 న మర్పల్లి వస్తున్నాము, ఆ రోజు కూర్చొని డిసైడ్ చేద్దాము’’ అని చెప్పాము. ‘‘వస్తే రండి. నాకెందుకు చెపుతున్నారు? మా ఎస్సీ ల భూముల విషయంలో మీరు ఏ లెక్కలో జోక్యం చేసుకుంటారో అదీ చూస్తాను’’ అని  రమేష్ అన్నాడు.

సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ రండి మాట్లాడుదాము అన్నారు. తహసీల్దార్ గారు చెప్పారు ‘కూర్చోని వాళ్ళ భూమి వాళ్ళు సెటిల్ చేసుకుంటే’ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సర్వే నంబర్ 353 ఇనాం భూమి కాదు, రెండు కుటుంబాల వారు హక్కుదారులుగా రికార్డ్ చూపుతున్నది అని తహసీల్దార్ గారు చెప్పారు. మేము తహసీల్దార్ గారితో చెప్పాము హై కోర్టులో వేసిన కేసును ‘నాట్ ప్రెస్’ చేస్తాము అన్నాము. అయితే హై కోర్టు మాత్రం బాధితులకు న్యాయం జరగాలి అనుకుంటే ‘కాన్సర్న్డ్ ఫోరమ్’  ను అప్రోచ్ కావచ్చు అని ఆదేశాలను ఇచ్చింది. 

మర్పల్లి గ్రామ సందర్శన

14-08-2021న మర్పల్లి గ్రామం వెళ్ళాము. గ్రామ సర్పంచ్ గా చెలామణి అవుతున్న గ్రామ సర్పంచ్ కొడుకు కలీముద్దీన్ గారిని కలిసాము. గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు, చిన్న పెద్ద అందరూ గ్రామ సర్పంచ్ అంటే కలీముద్దీన్ గారి పేరే చూపుతున్నారు. ఆ గ్రామ సర్పంచ్ పేరు అనగా మహిళ పేరు ఎవరికీ తెలియదు. సర్పంచ్ గారి పేరు తెలుసుకొనేటందుకు మేము డీపీఓ కార్యాలయంను అప్రోచ్ అయ్యాము. డీపీఓ కార్యాలయం వారు ధృవీకరించిన పేరు ‘మేహమూద బి (బిసి-ఇ)’అని. మహిళా (జనరల్) రిజర్వేషన్ కోటాలో ఎన్నుకోబడినది అని డీపీవో కార్యాలయం అధికారులు చెప్పారు. మహిళా సర్పంచుల పరిస్థితి ఈ విధముగా ఉన్నది. మహిళల సాధికారితను కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు గుర్తించటానికి సుముఖంగా లేరు అని మరొకసారి ఋజువైనది.

Also read: ఆ ఆరుగురు …..

సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ మేము కేసు వేయటమే తప్పుగా నిర్ణయం చేశాడు. మేము ఒక విషయం స్పష్టం చేశాము. కేసువేసిన ‘వాదులు’ దళితులు, వారికి 353 సర్వే నంబర్ గురించి తెలిసిన విషయం ‘ఇనాం’ భూములు అనీ, ఇనాం భూములకు పట్టేదార్ పాస్ పుస్తకాలు ‘మోఖ పంచనామ’ చేసిన తరువాత పట్టేదార్ పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు అనీ, అందుకు ఎదురుచూస్తున్నారు అనీ, కానీ, అనూహ్యంగా వారి పక్క భూములవారు వారి భూములను కూడా అమ్ముతున్నారు అనీ, దీనికి మధ్యవర్తిగా రమేష్ @రామేశ్వర్, మీరు కలిసి 18 లక్షలకు ఖరీదు చేశారు అనీ, మీరు 60 లక్షలకు అమ్ముకుంటున్నారు అనీ, ఈ అమ్మకాన్ని ఆపాలి అనీ బాధితులు అన్నారు.అందులకు తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారికి బాధితులు ఫిర్యాదు చేశారు అనీ, సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారికి వివరించాము. తహసీల్దార్ గారు స్పందిస్తూ 09-08-2021 నాడు జరుగబోతున్న రిజిస్ట్రేషన్ను హోల్డ్ లో పెడుతున్నట్లు తెలిపారు అనీ, సర్వే నంబర్ 353 ఇనాం భూమి కాదు అనీ క్లారిటీ ఇచ్చారు అనీ, కేసును కూడా ఛాలెంజ్ చేయటం లేదు అని తహసీల్దార్ గారికి  తెలిపినట్లు సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారికి తెలియజేసాము. అయినప్పటికినీ, సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారు బాధితులు చాలా పెద్ద నేరం చేసినట్లు వాదించారు. 10-08-2021 నాడు ఫిర్యాదుదారుడు (బాధితుడు) ఆనంద్ 25-08-2021నాడు తప్పును సరిచేసుకునేటందుకు ముక్కును నేలకు రాయాలని గ్రామ తీర్మానం  జరిగినట్లు సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారు చెప్పారు. ముక్కును నేలకు రాస్తే తప్పు సరిచేసినట్లుగా తీర్మానం చేశారు, బాధితుల భూములను ఫోర్జరీ చేసి అమ్ముతున్న వారికి ఎలాంటి శిక్ష వేస్తారు అని సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారిని మేము అడిగాము. ఈ విషయం రమేష్ కు తెలియాలి అని కలీముద్దీన్ అన్నారు.

రమేష్ ను పిలవగలరా అని అడిగాము. మొబైల్ ధ్వారా స్పీకర్ తెరచి రమేష్ తో సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారు మాట్లాడారు. వారిద్దరి సంభాషణ సాధారణ మనుషులు భయంతో బట్టలను చింపుకొని పరుగెత్తే విధముగా ఉన్నది. వారిద్దరి సంభాషణ –  గ్రామ పెద్దలు, కుల పెద్దలు, కుల నాయకులు, అధికార పార్టీ నాయకులు పెద్ద మనుషుల ముసుగులో ‘ఇద్దరు రౌడీలు కుమ్మక్కై’ గ్రామ ప్రజలను చట్టపరిధిలో దోచుకొనే ఒక  ప్రత్యేకమైన గుంపుగా, వారి దురాగతాలను ఎవరు ఎత్తిచూపకుండా వుండే విధంగా ‘చట్ట పరిధిలో హక్కు’ ను సృష్టించుకున్న “ఇద్దరు పెద్ద మనుషులుగా”  మాకు అనిపించారు.

సామ్యూల్, ప్రేమ్ కుమార్ వాదన

రమేష్ వచ్చాడు. పెద్ద పెద్ద రంకెలు వేసాడు. ఆనంద్ భయపడి పోయాడు. సామ్యూల్ మాట్లాడటం షురూ చేశాడు. సామ్యూల్ కు తోడుగా ప్రేమ్ కుమార్ నిలబడ్డాడు. రమేష్ వీరిద్దరిని వ్యక్తిగత దూషణలతో దాడి చేయటం మొదలుపెట్టాడు. సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారి పెదవులపై సన్నటి నవ్వు కదలాడటం స్పష్టంగా కనిపించింది. మేము ఎవ్వరం పిరికి చర్యలకు పూనుకోలేదు. మాటలు మర్యాదగా రానివ్వమని రమేష్ కు చెప్పాము. మేము నీకన్నా పెద్దగా రంకెలు వేయగలము అని స్పష్టం చేశాము. అప్పుడు  సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారి పెదవులపై ఉన్న దరహాసం మాయమయింది. రాత్రి 9 గంటలు అవుతోంది. మరొకసారి కూర్చొని సమస్యకు ముగింపు ఇద్దాము అని సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారితో చెప్పాము.

Also read: నడుస్తున్న కథ

ముక్కు నేలకేసి రాయాలి

సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారు అన్నారు (రిపీట్ చేసారు) గ్రామ తీర్మానం ప్రకారం 25-08-2021 నాడు సమావేశం ఉన్నది, ఆనంద్ ముక్కు నేలకు రాసేది ఉంది అన్నారు. చూద్దాము అని చెప్పి మేము బయలుదేరి వచ్చాము. మెయిన్ రోడ్ కు మర్పల్లి కొంచెం లోపలికి ఉంటుంది. మేము మెయిన్ రోడ్ కు చేరుకొనే సమయానికి ముందే  రమేష్ పెంచి పోషిస్తున్న అనుచరులు ‘మెయిన్ రోడ్’ మీద ఉన్నారు. మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్ లో నీళ్ల బాటిల్ కొనుక్కుందామని ఆగినప్పుడు ‘ అనుచరుల’ విషయం బయట పడింది.

25-08-2021 నాటిగ్రామ తీర్మానం ప్రకారం ఆనంద్ మీటింగ్ కు రావాలని, ముక్కు నేలకు రాయాలని ఆనంద్ పైన, మిగిలిన బాధితులపైనా రమేష్, రమేష్ అనుచరులు, సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారులు ఒత్తిడిచేయడం రెండు రోజుల నుంచే మొదలు పెట్టాడు. 24ఆగస్టు 2021 నాడు సాయంత్రం కు వారి ఒత్తిడి పరాకాష్టకు చేరింది. ఆనంద్ లో భయం నెలకొన్నది. ఇంటిమీద దాడి చేస్తారేమోనని మరొక భయం ఆనంద్ లో కలిగింది.

అప్పుడు ధైర్యంగా ఆనంద్ – పోలీసులతోను, పౌర హక్కుల ప్రజా సంఘం- తెలంగాణ రాష్ట్రం వారితో మాట్లాడమని ఆనంద్, ఇతర బాధితులు  రమేష్, రమేష్ అనుచరులకు, సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారికి వివరణతో కూడిన జవాబు ఇచ్చాడు. పోలీసులు గాని, పౌర హక్కుల ప్రజా సంఘం తెలంగాణ రాష్ట్రం వారు కాని గ్రామ తీర్మానం ప్రకారం నడుచుకొమ్మని చెపితే నడుచుకుంటానని ఆనంద్ రమేష్, రమేష్ అనుచరులకు, సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారికి స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలిపాడు. మా భూములను రమేష్ అమ్మకుండా తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ గారికి తెలిపారు.

అయితే, ఈ రోజు పరిస్థితి, రమేష్ @ రామేశ్వర్  తహసీల్దార్ పై ఎస్ సీ, ఎస్ టీ అట్ట్రాసిటీ కేసు పెడతానని భయపెట్టించేటందుకు ప్రయత్నం చేసారు. తహసీల్దార్ గారు కూడా దళితుడేనని తెలుసుకొన్నారు. వికారాబాద్ శాసనసభ్యుడి తో ఒత్తిడి తెచ్చారు. రిజిస్ట్రేషన్ కు దారి వేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొంటున్న వారు / కొనుక్కుంటున్న వారు వికారాబాద్ ఎంఎల్ఏ అనుచరుడు / బినామి అని తెలిసింది. దళితుడు పక్క దళితుడి భూమిని కబ్జా చేసుకొని  దళిత మధ్యవర్తి / పైరవీకారుడితో చేతులు కలిపి దళిత ఎంఎల్ఏ అనుచరుడికి ‘ఫోర్జరీ కాగితాలతో’ అమ్ముతున్నారు!

రమేష్ మరియు సర్పంచ్ ముద్ర కలిగిన కలీముద్దీన్ ఇద్దరు భూమి వ్యాపారాలు చేస్తున్నారు. ఇద్దరూ.. వచ్చే కమిషన్ న్ను పంచుకుంటున్నారు. కమిషన్ ఏజెంట్ గా పనిచేయటం తప్పుగా మేము భావించటం లేదు. కానీ, కమిషన్ కోసం భయపెట్టి, బలవంతంగా భూములను లాక్కొని, తప్పుడు పత్రాలతో పాస్ బుక్కులను అధికారుల నుండి తీసుకొని, రైతు బంధు పథకాన్ని అనుభవిస్తున్నాము అనే ఒకే ఒక కారణంతో ఆక్రమించుకున్న  భూములను  అమ్ముకొనే హక్కుంది అని అనుకోవటం తప్పు అంటున్నాము. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు రమేష్ @ రామేశ్వర్ నోటికి భయపడటం ” అన్యాయాన్ని,ఆక్రమణలను” పెంచి పోషించటమేనని చెపుతున్నాము. మోఖ పంచనామాలతో భూముల తగాదాలను 100% పరిష్కరించవచ్చు. ఒక ఫిర్యాదు రెవెన్యూ అధికారులకు అందినప్పుడు రెవెన్యూ అధికారులు “మోఖ పంచనామ” ఎందుకు చేయరు?

ల్యాండ్ సర్వే కొందరికి మంచి లాభసాటి వ్యాపారం

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ల్యాండ్ సర్వే సదుద్దేశ్యంతో చేయించారు. ఈ సదుద్దేశ్యం కొందరికి ‘మంచి లాభసాటి వ్యాపారం’ గా మారింది. గ్రామ పెద్దలు, కుల పెద్దలు, కుల నాయకులు, అధికార పార్టీ నాయకుల కు ఎవరితోనైతే వ్యక్తిగత కక్షలు కలిగిఉన్నారో వారి భూములను ఆయాకులపు వారితో స్వాహా చేయించారు / చేయిస్తున్నారు. “ధరణి” ఫెయిల్ అయ్యింది అని చెప్పటానికే ఇది చాలా ముఖ్యమైన కారణం. దీనిని సరిచేయక పోతే ప్రభుత్వం చాలా పెద్ద మూల్యం ప్రజలకు చెల్లించుకొనే పరిస్థితి రాబోతుంది. మోఖ పంచానామాలతో ‘ధరణి’ కి కొత్త మెరుగులు దిద్దవచ్చు, మంచి ఫలితాలను ప్రజలకు చేరవేయవచ్చు. 

మేము గమనించిన మరొక విషయం అగ్ర వర్గాలలో దోచుకొనే కొంతమంది నాయకులను పోలి  దళిత నాయకులం అనే ముసుగులో కొంతమంది నాయకులు ఉన్నారు, వీరి శాసనం వేదం.ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించేటందుకు భాగస్వాములైన వారు పౌర హక్కుల ప్రజా సంఘం తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.

Also read: ఆనందం … ?

(జయ వింధ్యాల, అడ్వకేట్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. మొబైల్ : 9440430263)

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles