Tuesday, April 23, 2024

ఆనందం … ?

అజీబ

కారణం అర్ధం కాదు కానీ … గొప్పమనిషి తెలిస్తే బాగుండేది అనుకుంటాం… అయితే, మనకు తెలిసినవాడు గొప్పవ్యక్తి అయితే మాత్రం … ఈర్ష్యతో అసూయతో ఏడుస్తూ ఉంటాము … ఎందుకురా చంద్రం?

ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు తెలుసా, విడాకులు కూడా తీసుకోలేదు

తెలుసు.. అయితే ఏం?

నీకు పిచ్చ ఓ తల్లి బిడ్డను ఎలా ప్రేమించావు, ప్రేమిస్తావు?

అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నావు? నా అవసరాలు, తన అవసరాలు తీర్చుకుంటున్నాము .. నేను జీవితాన్ని త్యాగం చేస్తున్నాను .. అది చూడవు ఒకటే ఏడుపు … నన్ను విసిగించకు. అయినా ఆమెతో స్నేహం చేసేటప్పుడు … ఆమెకు పెళ్లయ్యింది .. ఓ బిడ్డకు తల్లి అనే విషయాలు ఏమీ తెలియవు, తెలియనప్పుడు “ప్రేమ” అనుకున్నాను. తెలిసాక ప్రేమ కాస్త అవసరాలు తీర్చుకోవటం అనుకుంటున్నాను …

అరె, నీవు చాల మారి పోయావు … “ప్రేమ” అనేది అవసరాలు తీర్చుకునే ఓ మార్గం అంటున్నావు అంటే ఎంత నొక్కుతున్నవురా ఆమె దగ్గెర .. బుద్ధిలేదా నీకు…

నొక్కటం ఏంటిరా .. చంద్రం?

అదే డబ్బు .. దస్కం ..

డబ్బు లేదు.. దస్కం లేదు … కలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆమెనే ఖర్చుపెడుతది .. నా పై ఆమెకు ప్రేమ ఎక్కువైతే అప్పుడప్పుడు కానుకలు ఇస్తూ ఉంటది, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో అర్ధం కావట్లేదు ..

ఇందులో అర్ధం కాకపోవటం ఏముంది చెప్పు .. పెళ్ళయ్యి, భర్త ఉండి, ఓ పిల్ల తల్లితో నీవు కొనసాగిస్తున్న వ్యవహారాన్ని “అక్రమ సంబంధం” అంటారు. నీతి బాహ్యం, లోకం మెచ్చని వ్యవహారం అంటారు …. చాలా స్పష్టంగా వుంది … నీ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయటం లేదు … నీకు దక్కేది నాకు దక్కటం లేదనో, నీవేమో “జీవితాన్ని చాలా ఆనందిస్తున్నావనే ఈర్ష్యతో నో” నేను చెప్పటం లేదు…. జీవితం లో నీవు ఎక్కడ దెబ్బ తింటావో ననే భయం తో చెపుతున్నాను … నీ శ్రేయోభిలాషిని కాబట్టి ఇంతగా చెపుతున్నాను, నీకు నచ్చుతే విను లేకపోతే వినకు… ఓ పని చేద్దాము, అవినాష్ కు మీ ఇద్దరి వ్యవహారం తెలుసు కదా, అతని పై నీకు మంచి గురివుంది కదా … అవినాష్ నే అడుగుదాము.

అప్పటివరకు అన్యమనస్కంగా వింటున్న ప్రదీప్ మొఖం లో ఒక్క సారి వెలుగు వచ్చింది … సరేరాఎప్పుడెల్దాము?

ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెల్దాము … అవినాష్ నే ఇక్కడికి రమ్మంటే పోలా … మాటలలోనే అవినాష్ ప్రత్యక్షం.

ఇద్దరూ ఒకే సారి హలొ సర్ అన్నారు …

సర్ ఏంటి … మీరు  ఫోన్స్  ఎందుకు ఎత్తటం లేదు? ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఎత్తాలి కదా … ఏమయ్యింది?

అప్పుడు గుర్తుకు వచ్చింది లోపల ఎక్కడో పెట్టి, బయట నీరెండలో కూర్చున్న విషయం … 

ఏంటిది సర్ విషయం … మేమే వద్దాము అనుకుంటున్నాము …

ముందు   “సర్” అనేది ఆపెయ్యండి … లేకపోతే బెత్తం విరిగేంత వరకు కొట్టి పోతాను … 

సారి సర్ … మళ్ళీ అనము అంటూ ఇద్దరూ కళ్ళతో నవ్వారు ..

వారి నవ్వులో అవినాష్ నవ్వు కలిసింది …

అవినాష్, మొఖంను సీరియస్ గా పెట్టి … ప్రదీప్ వైపు చూస్తూ … లేఖ ఇందాకే ఫోన్చే సింది. మీ ఇద్దరి ఫోన్స్ పలకపోవటం తో నాకు చేసిన అన్నది. ఫోన్ లోనే ఏడుస్తుంది. నీవు ఈ మధ్య మాటలు తగ్గించావు, మొదట్లో ఉంటున్నట్లు ఇప్పుడు ఉండటం లేదని ఒకటే బాధ పడుతుంది. నీకు చాల సందర్భాలలో చెప్పాను … స్త్రీ పురుషుల సంబంధాలు ఎప్పుడూ “ట్రాన్సపరెంట్” గా ఉండవు, ఉండాలని అందరూ కోరుకుంటారు, ఉంటున్నట్లు గా నటిస్తారని. లేఖను వదిలించుకోవాలంటే వెంటనే పెళ్లి చేసుకో. లేకపోతే మనసు విప్పి మాట్లాడు. నీవు ఏమనుకుంటున్నావో, నీకు ఏం కావాలినో చెప్పు, ఇలా తప్పించుక తిరుగుతే … ఎన్ని రోజులు ఇలా …

ఆమెకు భర్త ఉన్నాడు, ఒక కొడుకు .. నన్ను ఏం చేయమంటావు … మొదట్లో నిజంగానే లేఖ పై ప్రేమ ఉండేది … రాను రాను … అభిప్రాయం మారింది..

పెళ్లయ్యిన ఆమెతో నీవు ఎందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?

అవినాష్ .. ఇద్దరం ఇష్టపడ్డాము … మా మధ్యనున్న గీతలను చెరిపేద్దామనుకున్నాము … చెరిపేసాము … నేను ఎప్పుడూ లేఖక పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు … లేఖ కూడా పెళ్లి చేసుకుందాము అనలేదు… ఇక్కడ పెళ్లి సమస్య లేదు … జీవితాన్ని అనుభవించాము … ఇప్పుడు కుదరటం లేదు … వద్దను కుంటున్నాను … మాటలను తగ్గిస్తూ వస్తున్నాను .. నిన్న ఇష్టమైనది … ఈ రోజు ఇష్టం కావట్లేదు …

సినిమా డైలాగ్స్ పక్కన పెట్టి … వాస్తవానికి దగ్గెరగా వెళ్లి చూడు …. ఏదో కారణాల చేత లేఖ భర్తకు దూరంగా ఉంటోంది. భర్తను వద్దను కుంటోంది. అదే సమయం లో విడాకులు వద్దు అనుకుంటోంది. వాళ్ళ కుటుంబ చరిత్ర లో ఇప్పటి వరకు ఎవ్వరూ విడాకులు తీసుకున్న దాఖలా లేదట. ఇప్పుడు లేఖ విడాకులు తీసుకుంటే “కుటుంబ పరువు” ఏం కాను అంటోంది. ఇష్టము … ప్రేమ … అభిమానం … కోరిక … వీటిని డిఫైన్ చేయటం ఆయా కాల పరిస్థితులను, సందర్భాలను బట్టి చేయవలిసిందే … సమాజ నిర్మాణం ఇక్కడ జరగలేదు. ఆయా దేశాలలో సమాజ నిర్మాణం జరిగి వుంది.. స్త్రీ -పురుష సంబంధాల పట్ల … ఒకవైపు చట్టం ఒకటి చెపుతోంది, మరో వైపు కులాలు, తెగలు, మతం, బాబాలు, దేవదూతల … సంప్రదాయాలు, కట్టుబాట్లు మరోటి చెపుతాయి. అందుకే ఇంతగా “స్త్రీ పురుష సంబంధాల” లో ద్రోహం, హింస, మోసం, అపనమ్మకం, అభద్రతా భావన .. ఒకరకమైనటువంటి వల్గారిటీ దిన దినం పెరగటానికి కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాలలో “ఒకరకమైన వికృత క్రూరమైన ఆనందం” ను అనుభవించే వారు, గ్రూపులు మాధ్యమాలలోకి ఎక్కి సమాజం లో అలజడిని కలిగిస్తున్నారు. వారికి అదో ఆనందం. ఒక్కసారి అందరిలో కలిగే భావన “సమాజం” ఎటు పోతోంది అని… వాపోతున్నారు. ప్రతీ సమస్యకు, ప్రతీ వికృత చేష్టకు పరిష్కారం “కాలం చెల్లిన, సనాతన సంప్రదాయాలను, కట్టుబాట్ల ను” సమాజం నుండి కూకటి వేళ్ళతో సహా పెకలించి, ‘రాజ్యాంగం’ తో సమాజాన్ని నిర్మాణం చేస్తే ఈ చేష్టలు ఉండవు.

మీకు ఒక ఉదాహరణ చెప్పాలి… రోడ్ల పై గతుకులు లేకుండా, అక్రమ కట్టడాలు రోడ్ల పై లేకుండా, అక్రమ స్పీడు బ్రేకర్లు లేకుండా చేసి ప్రజల పై జరిమానా విధిస్తే ప్రజలు ప్రభుత్వాలు వేసే జరిమానాలను అడ్డుకోరు. కానీ జరుగుతున్నది ఏంటి …. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడా అనే ఆందోళనతో కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఇది ప్రభుత్వానికి, ఆయా డిపార్ట్మెంట్ వాళ్లకు పట్టదు. కానీ ప్రజలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే మాత్రం విమర్శించిన వారి గురించి ఆరా తీస్తారే గానీ “వారి తప్పులను సరి చేసుకోరు”.  

ఈ స్త్రీ  పురుషుల సంబంధాల పట్ల అంతే. లేఖ విషయం చూడు .. చదువుకుంది,  ఉద్యోగం చేస్తోంది,  చట్టం గురించి తెలుసు, సమాజం లో “స్త్రీ / తన పరిస్థితి “ఏంటో తెలుసు… అయినా…  కుటుంబంలో పాటిస్తున్న కాలం చెల్లిన సంప్రదాయాన్ని ఆమె కూడా పాటిస్తోంది …  ఇప్పటివరకు   వారి కుటుంబంలోని సభ్యులు ఎవ్వరూ విడాకులు తీసుకోలేదు  కాబట్టి  ఆ “సాంప్రదాయాన్ని” అలానే కొనసాగిస్తాను అంటుంది. ప్రజలకు ఉపయోగ పడని ఇలాంటి సంప్రదాయాలని ప్రభుత్వం నిర్మూలిస్తే … ఎందరికో ఉపయోగం కదా . ఎవ్వరైనా…[ఇలాంటి స్త్రీ] ఇంటిలో నుండి బయటకు వచ్చి, విడాకులు తీసుకొని “సనాతన సాంప్రదాయాన్ని” తన ఎదుగుదలకు పునాది రాళ్లుగా వాడి మరో పెళ్లి చేసుకుంటే … ఆ స్త్రీకి ఈ సమాజం ఏం ఇస్తదో .. తెలుసా .. “తన సుఖాన్ని వెతుక్కుంటూ పోయింది, రెండు రోజులు వాడుకొని వదిలి వేస్తే అప్పుడు తెలుసొస్తుంది …” అని . ముందే ధైర్యం ఇచ్చి ఆ స్త్రీ జీవితానికి మెట్లుగా ఈ సమాజం ఇస్తే … స్త్రీ పురుషుల సంబంధాలలో వున్న వైరుధ్యం కొంతైనా తగ్గుతుంది … ఈ పని చేయదు. ఈ పనిని  ప్రభుత్వం చేయగలదు “కంపల్సరీ /ఫోర్సుడు చదువుల ”   మాదిరిగానే  “కాలం చెల్లిన, సనాతన  సంప్రదాయాలను, కట్టుబాట్ల ను “పీకి వేస్తే … అదే సమాజ నిర్మాణానికి దారి .. మీకు  మరో విషయం చెపుతాను … స్త్రీలను మాత్రమే “ధర్మాన్ని” పాటించాలి అని కోరుతున్నాము .. ఇటు సమాజం కానీ ప్రభుత్వం కానీ పురుషులు కానీ ఆ “ధర్మాన్ని” పాటించరు .. గాడిద మోస్తుంది కదా అని అన్ని బట్టల మూటలను ఆ గాడిదపై వేస్తే .. చివరికి ఆ గాడిద పరిస్థితి నడ్డి విరిగి పడి పోతది … నేటి స్త్రీల పరిస్థితి ఇంతే … “ధర్మాన్ని” పాటించు .. పాటించు అని స్త్రీల పై అన్ని వికృత పనులకు వారినే బలి చేస్తే … సమాజం సమతుల్యతను కోల్పోతది…   ప్రదీప్ .. నీవు జీవితం అంటే “ఆనందంగా అనుభవించటమే “అనుకుంటున్నావు .. ఆ ఆనందం ఎదుటి వారి నుండి వస్తుంది అంటే .. ఎదుటి వారి ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి .. దొరుకుతుంది కాబట్టి … అనుభవిస్తున్నాను అనుకోవటం నీవు  “భయంకరమైన భావ దారిద్య్రం తో బాధపడుతున్నట్లు. నీలాంటి వాళ్ళే 100 కు 90 మంది ఉన్నారు. స్త్రీలను “కాలం చెల్లిన, సనాతన సంప్రదాయాలలో, కట్టుబాట్ల” లలో బంధించి అనుభవిస్తున్నారు. ఎక్కడో ఒకటి రెండు సందర్భాలలో మగవాళ్ళు బాధపడుతున్న సందర్భాలు వున్నాయి. కానీ ఆ ఒకటి రెండు అంశాలను చూపిస్తూ ‘‘చూసారా ఆడవారి అనైతికత” అంటూ ప్రచారం చేస్తున్నారు. దీన్నే స్త్రీలు చాలా ఫాస్ట్ అయ్యారు, వారికి ఏం తక్కువ అయ్యింది …. అనటం మనం వింటూనే ఉన్నాము. నీవు ఏమి చేయాలి అనుకుంటున్నావో ఆ లేఖకు విడమర్చి చెప్పు, నీవు.. నీ పెళ్లి విషయం కూడా చెప్పు …

ఏంటి… ప్రదీప్ పెళ్లిచేసుకోబోతున్నాడా?

‘‘అవును … నీకు చెప్పలేదా … ప్రదీప్ అంత సీక్రెట్ ఏంటి … అందరి కన్నా నీ జీవితం ఏమై పోతుందో నని బాధ .. భయ పడిన వ్యక్తుల్లో వీడే మొదటి వాడు … ఏదో తప్పు చేసాను అనే ఫీలింగ్ … ముందు నీలో నుండి తీసెయ్యి ప్రదీప్ … లేఖ దగ్గరకు చంద్రను కూడా తీసుక వెళ్ళు … సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకి బాధ పడిపోవటం కాదు, ఎదుటి వారికి చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతికి చూపించి ఆనందపడటం ..’’

(ఈ కథ రాసిన రోజు : 24-01-2018)

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles