Monday, October 7, 2024

కర్ణాటక ఎన్నికలలో 4 నిర్ణాయక అంశాలు

ఎక్కడా పెద్దపెద్ద హోర్డింగులూ, ఫ్లెక్స్ లూ, గోడలపైన రాతలూ, పోస్టర్లూ కనిపించవు. ప్రచారవాహనం సైతం ఎక్కడా కనిపించదు. ఎన్నికలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాయి.

కర్ణాటకలో మేము మూడు రోజులుగా తిరుగుతున్నాం. తిరగ్గాతిరగ్గా మూడో రోజు సాయంత్రం మాకు ‘ఈ సారి నేను బీజీపీకి ఓటు చేస్తాను’ అని కొత్తగా బీజేపీకి ఓటు వేయదలచిన వ్యక్తి ఒకరు కనిపించారు. లోగడ అతడు కాంగ్రెస్ కి ఓటు చేశాడు. ఈ సారి మాత్రం బీజేపికి ఓటు చేయబోతున్నాడు. మేము యలహంకలో ఉన్నాం. బెంగళూరు నగరం శివార్లలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇది. పోయిన రెండు రోజుల్లో చిక్కమగళూరు దాకా వెళ్ళి వచ్చాం. మా బృందంలో అజిమ్  యూనవర్సిటీ ప్రొఫెసర్ ఏ నారాయణ ఉన్నారు. ఆయనకు కన్నడ రాజకీయాలు కొట్టినపిండి. అనుభవజ్ఞుడైన కన్నడ జర్నలిస్టు ఎన్ ఏ ఎం ఇస్మాయిల్ మరొక సభ్యుడు.  మా ‘ఎద్దేలు కర్ణాటక’ అనే సంస్థకు చెందిన సహచరులు కొందరు ఉన్నారు. సామాజిక స్పృహ కలిగి, కన్నడ నుంచి హిందీలోకీ, ఇంగ్లీషులోకీ అనువాదం చేయగలిగిన సంకేత్  నాగరాజ అంగడి కూడా మా బృందంలో సభ్యుడు. ఎన్నికల సమయంలో నాకు చాలా ఇష్టమైన పని ఒక పద్ధతీ, ప్రణాళికా లేకుండా తిరుగుతూ ఉండటం, ఎవరైనా మాట్లాడటానికి ఇష్టపడే వారు, ఆసక్తి కలవారు తగిలితే వారిని పలకరించడం, ప్రశ్నించడం, విషయం తెలుసుకోవడం. అదే పని ఈ సారీ చేస్తూ ఉన్నాం.

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

ఇంతవరకూ మేము అన్ని రకాల ఓటర్లనూ కలిశాం. కాంగ్రెస్ కీ, బీజేపీకీ, జేడీ(ఎస్)కూ విధేయులుగా ఉండే ఓటర్లు కలిశారు. బీజేపీకి లోగడ ఓటు వేసినవారు ఈ సారి కాంగ్రెస్ కు ఓటు వేయబోతున్నామని చెప్పారు. ఒకరు జేడీ(ఎస్)కి వేస్తానన్నారు. కొంతమంది ఏమి చేయబోతున్నదీ చెప్పడానికి సున్నితంగా నిరాకరించారు. కానీ లోగడ కాంగ్రెస్ కు ఓటు వేసి ఈ సారి బీజేపీకి ఓటు వేస్తానన్న ఒక్క ఓటరు కూడా అంతవరకూ తగలలేదు. అది ‘హవా’  ఉన్నదనడానికి ఆనవాలు అని మా మిత్రులతో అన్నాను.

కాంగ్రెస్ ‘హవా’

ఒక రవాణా సంస్థలో ఉద్యోగం చేస్తున్న 40 సంవత్సరాల వ్యక్తి ఒక వీధి మూల ఉన్న చిన్న హోటల్ లో మరి ఇద్దరు స్నేహితులతో కలిసి కాఫీ తాగుతూ కనిపించాడు. హిందీ  అరకొరగా మాట్లాడే అతని వాలకాన్ని చూసి మాకు వచ్చిన అనుమానాన్ని సంకేత్ ధ్రువీకరించారు. అతను నిజంగానే బీజేపీకి మారుతున్నాడు. జంగిల్ సఫారీ ఆఖరి మజిలీలో పులి కనిపించినట్టు అనిపించింది. ‘బీజేపీ ప్రభుత్వం ఏమి చేస్తుందని అనుకుంటున్నారు?’ అని అడిగాను. ‘బీజీపీ గరీబ్ కు మార్ దేగా’ (బీజేపీ పేదలను నిర్మూలిస్తుంది) అంటూ హిందీలో కరాఖండిగా చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైనీ, కాంగ్రెస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనూ ఎట్లా పోల్చి చూస్తారు?’’ అని అడిగానే. ఈ సారి కన్నడలో సమాధానం చెప్పాడు. ‘‘వారిద్దరీ పోల్చాలని మీరు ఎట్లా అనుకుంటారు సార్?’’ అని అడిగాడు. అతని చేతులు చేసిన సూచన ప్రకారం సిద్ధరామయ్య చాలా ఎత్తులో ఉన్నారని అర్థమైంది అనువాద అక్కరలేకుండానే.

‘‘మరి, అలాంటప్పుడు అతడు కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నాడు?’’ అతను నవ్వి తన నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడి పేరు చెప్పాడు. ఆ నాయకుడు గత నెల కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఫిరాయించాడు. ‘ఆ నాయకుడు మాకు అన్ని సమయాలలో అండదండగా నిలిచారు. కనుక ఈ సారి ఎన్నికల సమయంలో ఆయనకు మా అండదండలు సమకూర్చాలి’ అన్నాడు. ఈ సారి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారే ఓటర్లను పట్టుకోవడం కష్టం. ఇతను ఒక ప్రత్యేక కారణంవల్ల మారుతున్నాడు. ఇతర ఓటర్లు బీజేపీ, జేడీ(ఎస్) నుంచి కాంగ్రెస్ కి మారుతున్నవారు ఉన్నారు. ఒక కాంగ్రెస్ ఓటరు మాత్రం జేడీ(ఎస్)కు ఈ సారి మారుతున్నారు.

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

ఈ సారి గాలి (హవా) కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ కు 2018లో బీజేపీ కంటే ఓట్ల శాతంలో రెండు పాయంట్ల ఆధిక్యం ఉంది. అయినప్పటికీ తక్కువ సీట్లు వచ్చాయి. నేను చూసిన విశ్వసనీయమైన పోల్ సర్వేల ప్రకారం ఈ తేడా ఈ సారి పెరగబోతోంది. జనవరిలో సర్వే చేసిన సిసిరో అనే సంస్థ ఈ తేడా నాలుగు శాతం దాకా పెరగవచ్చునని అంచనావేసింది. ఇటీవల సర్వే చేసిన సి-ఓటర్ ఈ తేడాను ఆరు శాతంగా అంచనావేసింది. ఎన్ టీడీవీ కోసం లోక్ నీతి-సీఎస్ డీఎస్ జరిపిన సర్వే ఫలితాలు సైతం దాదాపుగా ఇదే తేడాను సూచించింది. ‘ఈదిన.కామ్’ సర్వే కాంగ్రెస్ కు పది శాతం ఆధిక్యాన్నిసూచించింది.

ప్రభుత్వ వ్యతిరేకత

అధికారంలో ఉన్న బొమ్మయ్ ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదనే అభిప్రాయాన్నిబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ హవా వేగం ఎంతో తెలుస్తుంది. బొమ్మయ్ ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ సానుకూల ఓటర్లు మాకు కనిపించలేదు. కాకపోతే అందరూ అనేది ఏమిటంటే ‘‘మేము బొమ్మయ్ కి ఓటు వేయడం లేదు. మేము మోదీకి ఓటు వేస్తున్నాం’’ అని. ‘’40 పర్సెంట్ సర్కార్’’ అంటూ బొమ్మయ్ ప్రభుత్వం పైన వచ్చిన నిందను కాదని ఎవ్వరూ వాదించడం లేదు. ‘‘ఏ ప్రభుత్వం అవినితిమయంకాదు? కాంగ్రెస్ అవినీతి పార్టీ కాదా?’’అంటూ ఎదురు ప్రశ్నించినవారు ఉన్నారు. వివిధ వనరుల నుంచి సేకరించిన సర్వేడేటాలో ఈ ధోరణి కనిపించింది. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వానికి మరో ఐదేళ్ళగడువు ఇవ్వవచ్చా?’’ అని అడిగితే ఓటరు మనసులో ఏమున్నదో తెలిసిపోతుందని సర్వేల పరిశోదకుడిగా నా అనుభవం నేర్పిన పాఠం. లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రశ్నకు స్పందన 1:1 గా వచ్చింది. ఈ సారి సర్వేలన్నిటిలో ఈ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వగూడదు అనే వారి నిష్పత్తి 1.7:1 గా ఉంది. అంటే పది మంది ఈ ప్రభుత్వమే కొనసాగాలని అంటే 17 మంది ఈ ప్రభుత్వం కొనసాగకూడదు అని చెప్పారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ పచ్చగా కనిపించడానికి కారణం అక్కడి బీజేపీ ఎంఎల్ఏలు స్థానికంగా సమస్యలు పరిష్కరించి, ప్రజలను మెప్పించి  ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కంటే స్థానిక ఎంఎల్ఏల పట్ల వ్యతిరేకత తక్కువ ఉన్నదని ‘ఈదిన.కామ్’ సర్వే సూచించింది. చాలా దశాబ్దాలుగా కర్ణాటకలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకండా ఓటు వేయడం ఆనవాయితీగా మారింది. ఈ సారీ ఆనవాయితీ తప్పే సూచనలు కనిపించడంలేదు.

Also read: అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

వర్గ వ్యత్యాసం

కిందికి పోయినకొద్దీ కాంగ్రెస్ అనుకూల గాలి ఎక్కువగా కనిపిస్తుంది. పేద ఓటరు ఎవ్వరూ బీజేపీ పట్ల సానుకూలంగా మాట్లాడలేదు. కర్ణాటక ఓటర్లలో సంపన్న, పేద వర్గాల విభజన స్పష్టంగా కనిపిస్తోందని నేను ఇదివరకే రాశాను. సంపన్న ఓటర్లలో కాంగ్రెస్ పట్ల సానుకూలత తక్కువ. బీజేపీకి పేద ఓటర్లలో సానుభూతి లేదు. పేద, దిగువ మధ్యతరగతి ఓటర్లను కదిలిస్తే, నిత్యావసర వస్తువుల ధరలు అందకుండా పెరిగిపోయాయనీ, గ్యాస్ సిలిండర్ వెల ఆకాశాన్నంటుతోందనీ ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. గ్యాస్ ధర విషయంలోనే గగ్గోలు ఎక్కువ. ‘‘ఇదివరకు మేము కట్టెలతో వంటి చేసుకునేవాళ్ళం. అటువంటిది మాకు గ్యాస్ ఇచ్చి అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యికి వెళ్ళలేం. గ్యాస్ ధర భరించలేం’’ అని ఒక ఓటరు నిస్సహాయంగా అన్నాడు.

కాంగ్రెస్ హయంలో సబ్సిడీ బియ్యం కుటుంబానికి పదికిలోలు ఇచ్చేవారు. దాన్ని బీజేపీ ప్రభుత్వం అయిదు కిలోలకు తగ్గించిందంటూ చాలామంది ఫిర్యాదు చేశారు. తర్వాత పెట్రలో, డీజిల్ ధరలను ప్రస్తావించారు. ఎరువుల ధరలు పెరగడం గురించి రైతులు ఫిర్యాదు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధిని ఎద్దేవా చేశారు. ‘‘మాకు రెండు వేల రూపాయలు ఇస్తారు. కానీ అంతకంటే ఎక్కువే మా జేబులోనుంచి తీసుకుంటారు’’ అని నిరసన వెలిబుచ్చారు. సాధారణ ప్రజలకు సైతం జీఎస్ టీ గురించి తెలుసు. దానివల్లనే ధరలు పెరిగాయని నిందిస్తున్నారు.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

పేద ఓటర్లు బీజేపీకి ఓటు అసలు వేయడం లేదని కాదు. వారు వేస్తే స్థానిక ఎంఎల్ఏ పట్ల మొహమాటంతోనో, లేదా బీజీపీ నాయకుల పట్ల ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటేనో వేస్తారు. కర్ణాటక కోస్తా ప్రాంతంలో బీజేపీకి మంచి కార్యకర్తల యంత్రాంగం ఉన్నది. అక్కడ బీజేపీని తమ పార్టీగా భావించేవారు ఉన్నారు. మిగతా ప్రాంతాలలో బీజేపీకి ఓటు వేసే పేదవారు దాన్ని తమ పార్టీగా పరిగణించరు.

సిద్దరామయ్య పేదలకు ఇష్టుడు. అధికార దారిద్ర్య రేఖకు దిగువల ఉన్నవారే పేదలుగా లెక్కవేయకుండా దిగువ మధ్య తరగతి ప్రజలను కూడా పేదలుగా పరిగణించాలి. ఈ రకం ప్రజలు పల్లెటూళ్ళలో నాలుగింట మూడు వంతుల మంది ఉంటారు. పట్టణాలలో సగం మంది ఉంటారు. పేదలను దూరం చేసుకోవడం అంటే ఓటర్లలో అత్యధిక శాతం మందిని వదులుకోవడమేనని అర్థం.

మతపరమైన ఆవేశాలు తక్కువ

కాంగ్రెస్ సానుకూల గాడ్పును (హవాను) మతపరమైన అడ్డుగోడలు అడ్డుకోకపోవడం విశేషం. కర్ణాటకలో మామూలుగా ఎన్నికలకు సంబంధించిన కబుర్లలో హిందూ-ముస్లిం విభేదాలు కనిపించవు, వినిపించవు. ప్రత్యేకించి అడిగితే తప్ప మేము మాట్లాడినవారిలో ఎవ్వరూ తమంతతాము హిందూ-ముస్లిం గొడవల గురించి ప్రస్తావించలేదు. ‘హిజాబ్,’ ‘ఆజాన్,’ ‘లవ్ జిహాద్,’ ఇప్పుడు ‘బజరంగ్ దళ్’ వంటి అనవసరమైన, అనర్థకరమైన, మతపరమైన అంశాలపైన పతాక శీర్షికలు పత్రికలలో వచ్చే కర్ణాటకలో మతప్రస్తావన లేదనడం వింతగా కనిపించవచ్చు. కర్ణాటక నుంచి మతపరమైన సమీకరణాలు పూర్తిగా మాయమైనాయని అనుకోవడం పొరపాటు, తొందరపాటు. ఈ రాష్ట్రం గురించి తెలిసినవారు ఎవరైనా మతభావాలు ప్రజల మనస్సుల్లో బాగా ఇంకిపోయాయని అర్థం చేసుకొని ఉంటారు. ఒక విషయం మాత్రం కచ్చితం. ఈ  సారి ఓటర్లు మతప్రాతిపదికపైన ఆలోచించి వచ్చే ఎన్నికలలో ఓటేయడం లేదు.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

ఉత్తరప్రదేశ్  ఎన్నికలలో 2022లో నేను ప్రయాణిస్తూ చూసిందీ, విన్నదీ దీనికి పూర్తిగా భిన్నం. సమాజ్ వాదీపార్టీకి ఓటు చేసినవారితో సహా హిందూ ఓటర్లు అందరూ తమపరమైన శ్లేషలో సురక్ష (రక్షణ) గురించి మాట్లాడారు. ఇందుకు భిన్నంగా కర్ణాటకలో రాజ్యం ముస్లింలనూ, హిందువులనూ విడదీస్తున్నప్పటికీ, ఈ విధానం వల్ల నష్టబోతున్న ముస్లింలు సైతం ఎన్నికల విషయంలో మత ప్రస్తావన చేయడం లేదు. తమ జాతీయతాభావాన్ని ప్రకటించుకోవాలనీ, మతసామరస్యాన్ని చాటుకోవాలన్న భావన వారిలో కనిపించింది. హిందువుల ప్రాధాన్య క్రమంలో మతపరమైన అంశాలు అడుక్కుపోయాయి.ముస్లింలు మత ప్రస్తావన చేయకుండా దాన్ని గుర్తించకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. పోలింగ్ మరి వారం రోజులుందనగా ఇప్పుడు మతవిభేదాలు సృష్టించి లబ్ధిపొందాలన్న బీజేపీ ప్రయత్నం ఫలిస్తుందని అనుకోను.

కర్ణాటకలోని ఎన్నికల వాతావరణంలో ఒకరకమైన శూన్యం కానవస్తున్నది. ఎక్కడా హోర్డింగులు కనిపించవు. గోడలమీద రాతలు లేవు. ఫ్లెక్స్ లు లేవు. ప్రచార రధాలు కనిపించవు. ఎన్నికల ప్రచారం అజ్ఞాతంలో సాగుతున్నది. దీనివల్ల ఎన్నికల ఖర్చు ఇబ్బడిదిబ్బడిగా పెరిగిపోయింది. ఇంతవరకూ ఎన్నడూ లేనంతగా ఎన్నికల వ్యయం పెరిగిపోయింది. పది కోట్లు ఖర్చుపెట్టినా ఓడిపోవడం ఖాయం. ఇరవై నుంచి నలభై కోట్లు, అంతకంటే ఎక్కువగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఖర్చు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఈ  ఆటకు దూరంగా ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఖర్చు చేయగలదు. ఎవరు ఎవరిని ఎంతకు కొనేశారు, ఎవరు ఏ పార్టీకి ఫిరాయించారు, ఎవరి ఓట్లు ఎవరు చీల్చుకుంటారు అ   నే అంశాలపైనే వీధి మూలల్లో గుసగుసలు సాగుతున్నాయి. మన ప్రజాస్వామ్యంలో మామూలుగా జరిగే తంతు ఇదే కదా?

వీపరీతమైన ఎండల తర్వాత బెంగుళూరు సాయంకాలాలు చల్లటీ శీతవాయువులతో నిండిపోవడానికి ఈ నాలుగు అంశాలూ దోహదం చేయవచ్చు. అధికారానికి ధిక్కారంగా ప్రజాతీర్పు ఉంటుందని అన్ని సూచనలూ కనిపిస్తున్నాయి. నీటిలాగానే అసమ్మతి కూడా ఏదో ఒక విధంగా వాలు చూసుకొని, వీలు చేసుకొని ప్రవహిస్తుంది.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles