Saturday, April 20, 2024

అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖమానవులు. నాకు తారసపడే విద్యాధికులైన భారతీయుల గురించి నేను అట్లాగే తలపోస్తాను. షేర్ మార్కెట్ పరిణామాలను సరైన దృక్పథంతో ప్రశాంతంగా విశ్లేషించే ఆర్థిక సలహాదారు మహిళల గురించి అన్యాయంగా మాట్లాడతాడు. కనిపించని తెల్లవారి ఆధిక్యం గురించి ఆలోచించే సాఫ్ట్ వేర్ నిపుణుడు కులం అన్నది లేనేలేదని వాదిస్తాడు. మామూలు పాథలాజికల్  లాబరేటరీ (రక్తపరీక్షలూ, మలమూత్ర పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు)నుంచి వచ్చిన నివేదికలను విశ్వసించని వైద్యుడు ముస్లింల జనాభా త్వరలోనే హిందువుల జనాభాను మించిపోతుందని నమ్ముతాడు. సాంకేతికపరమైన ప్రతిభ, సామాజిక బుద్ధిహీనత కలగలిసి ఉండటం వర్తమాన భారతానికి నిదర్శనాలు.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

న్యాయంగా మాట్లాడాలంటే ఇది ఇండియాకు మాత్రమే కాదు. వర్తమాన కాలానికి నిదర్శనం. ఇది వినడానికి బాగుటుంది కానీ ఇది పూర్తి నిజం కాదు. దేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న ఉన్నత విద్యాసంస్థల మధ్య తేడాను గమనించాను. ఉదాహరణకు అమెరికా సమాజంలో విస్తృతమైన అజ్ఞానం, అంధవిశ్వాసాలూ, మూర్ఖత్వం,  వర్ణవివక్షా కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. కానీ ప్రఖ్యాతిగాంచిన వారి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రవేశించినప్పుడు అటువంటి బలహీనతలు మచ్చుకైనా కనిపించవు. కనీసం అక్కడ బహిరంగంగా జరిగే చర్చలలో ఇవి తారసపడవు. ద్వేషభావన, తెల్లవారి ఆధిక్యభావన, ఇస్లాం పట్ల వ్యతిరేకత వంటి దుర్లక్షణాలతో సంపర్కం చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

తెలివైన మూర్ఖులు, సైద్ధాంతిక అజ్ఞాతులు

మన దేశంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తాయి. సమాజంలో కులం, మతం పేరు మీద చాలా విస్తృతంగా ద్వేషభావన ఉంది. కానీ అమెరికాలోని మధ్యపశ్చిమ రాష్ట్రాలలోని వీధులలో కనిపించే విద్వేషం కంటే ఎక్కువేమీ కాదు. ఇండియాలో ఐఐటీలూ, వైద్యవిద్యాలయాలు, మేనేజ్ మెంట్ కళాశాలలూ, ఇంజనీరింగ్ కళాశాలలూ ఈ ద్వేషభావన నుంచి దూరంగా లేవు. కరుడుకట్టిన ద్వేషం, సాంస్కృతికపరమైన స్వార్థం, సామాజిక అజ్ఞానం, మేధోపరమైన ఆధిక్యభావం మూర్తీభవించిన భయంకరమైన మిశ్రమానికి ఈ ఉన్నత విద్యాసంస్థలే కేంద్రాలు. అందుకే వీళ్ళను ప్రతిభావంతులైన మూర్ఖులు అనేది.

సామాజిక శాస్త్రాలూ, మానవశాస్త్రాలూ బోధించే ఉన్నత విద్యాసంస్థలు మరో రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అక్కడి విద్యార్థులకు సమాజం గురించి తెలియకపోలేదు. వారి పక్షపాతాన్ని బయటపెట్టుకోరు. రాజకీయంగా ఎటువంటి భాష మాట్లాడాలో వారు బాగా నేర్చుకున్నారు. కానీ వారు సమర్థిస్తున్న వాదాన్ని వారు సవ్యంగా అర్థం చేసుకోరు. నాలుగు దశాబ్దాల కిందట జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థిగా నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు చాలా అభ్యుదయ భావాలు కలిగినవని చెప్పుకునే సంస్థలలో సైతం ఇదే తీరు గమనించాను. పెద్ద సంఖ్యలో వామపక్షవాదానికి మారడం మతమార్పిడి కంటే భిన్నమైనదేమీ కాదు. కనీసం మారిన వ్యక్తి మేథో పరమైన ప్రతిభపైన అది ఎటువంటి ప్రభావం వేస్తుందో గమనిస్తే ఇది అర్థం అవుతుంది. అదే మూకమనస్తత్వం, విమోచనకోసం అదే ఆరాటం, అదే తీరులో పంచేంద్రియాలు పని చేయకుండా పోవడం.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

ప్రజాకోణం నుంచి హేతుబద్ధమైన వైఖరి కావాలి

 మన విద్యాసంస్థలో ప్రజలకోణం నుంచి హేతుబద్ధంగా వాదించే, వ్యవహరించే సంస్కృతి మృగ్యమైపోయింది. ప్రజాజీవితంలో సైతం అంతే. అది తరగతి గది కావచ్చు. రాజకీయ సంస్థ కావచ్చు. ప్రశ్నించకుండా చెప్పింది వినే సంస్కృతి పెరిగింది. మనతో సమానమైన సామాజిక నేపథ్యం కలవారితో, మనలాగే ఆలోచించేవారితో సుఖంగా కలిసి ఉండటాన్ని అభిలషిస్తాం. మన అభిప్రాయాలను సవాలు చేసే వారిని కలుసుకున్నప్పుడు వారితో నిందాపూర్వకంగా మాట్లాడతాం లేదా తీర్పు చెప్పడానికి మనం ఎవరం అనే ధోరణిలో అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాం. అందుకే మన టీవీ చర్చల్లో వేడిమి, ధ్వని, ఆగ్రహం ఉంటాయి కానీ హేతుబద్ధత కనిపించదు. మన కాలంలో నిరంకుశత్వానికి ఈ ధోరణి ప్రోత్సాహం ఇస్తుంది.

మన సామూహిక జీవితంలో హేతుబద్ధంగా ఆలోచించడం చాలా అవసరం. ఏది తప్పో, ఏది ఒప్పో బహిరంగంగా చర్చించుకునే వాతావరణం ఉండాలి. ఇది పారదర్శకంగా జరగాలి. కష్టమైన ప్రశ్నలు అడగాలి. ప్రతి వాదన స్వయంగా సమర్థనీయం కావాలి. అంటే దాని కాళ్ళ మీద అది నిలబడాలి.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

ఇక్కడో ఉదాహరణ

ఎక్కడప్రారంభించాలని ఎవరైనా అడిగితే నా దగ్గర జవాబుంది. రాజీవ్ భార్గవ తాజా రచన, ‘‘బిట్వీన్ హోప్ అండ్ డిస్పేర్: 100 ఎథికల్ రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపొరరీ ఇండియా (ఆశకీ, నిరాశకీ మధ్య: వర్తమాన భారతంపైన వంద నైతికపరమైన ఆలోచనలు) అనే పేరుతో వచ్చిన గ్రంథం. ఇది మీరు ఆశాభావంతో ఉన్నాడనుకునే యువభారతీయుడికి బహుమతిగా ఇవ్వదగిన పుస్తకం. ఇటువంటి పుస్తకం ఆయన రాయాలని దశాబ్దాలుగా కోరుకుంటూ ఉన్నాను. రాజీవ్ భార్గవ రాజకీయశాస్త్రజ్ఞుడు. తరతరాల విద్యార్థులకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనూ, దిల్లీ విశ్వవిద్యాలయంలోనూ బోధించారు. అటువంటి విద్యార్థులలో నేనూ ఒకడిని. ఎట్లా ఒక నిర్ణయానికీ, ఒక తీర్పుకీ రావాలో, మనం ఏకీభవించని వాదనను కూడా ఎట్లా నిస్పక్షపాతంగా చూడాలో, మనసు ఎట్లా మూసివేయకుండా తెరిచిపెట్టుకోవాలో, మన వాదాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎట్లా సమర్పించాలో మాకు చెప్పారాయన. మన ప్రత్యర్థులపైన వాదనలో కొన్ని అంశాలలో తెలివిగా పైచేయి సాధించే కళ గురించి కాదు. సత్యాన్వేషణలో నిజంగా నిజాయతీగా నిమగ్నం కావడం ఎట్లాగో నేర్పించారు.  నేను ఎప్పుడైనా టీవీ చర్చలో బాగా మాట్లాడని నన్ను ఎవరైనా అభినందిస్తే న్యాయంగా ఆలోచించడం ఎలాగో నేర్పిన నా తండ్రి గురించి ఆలోచిస్తాను. అప్పుడే రాజీవ్ భార్గవ గురించి కూడా ఆలోచిస్తాను. ఆయన అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన పుస్తకాలు రాశారు. వాటన్నిటికంటే దీని కోసం నేను ఎక్కువగా ఎదురు చూశాను.ఎందుకంటే ఆయన తరగతి గదిలో కూర్చోలేకపోయినవారికి కూడా హేతుబద్ధంగా ఆలోచించడం  ఎట్లాగో ఈ పుస్తకం నేర్పుతుంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ కు చాలా అవసరమైన అధ్యాపకుడు ఆయన.

‘ద హిందూ’ లో ప్రొఫెసర్ భార్గవ ప్రచురించిన చిన్న వ్యాసాలను  ఈ పుస్తకంలో ప్రచురించారు. మన దేశంలో మనం ఎదుర్కొంటున్న అనేక నైతికపరమైన ప్రశ్నలకు ఈ వ్యాసాలు సమాధానాలు చెబుతాయి. మనకు రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్యానికి ఎందుకు విలువ ఇవ్వాలి? జాతీయస్ఫూర్తిని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి? అల్పసంఖ్యాకవర్గాలకు హక్కులు ఉండాలనడం మంచి ఆలోచనేనా? లౌకికవాదం అంటే ఏమిటి? క్షమించడం, విస్మరించడం అంటే అర్థం ఏమిటి? సత్యానంతర యుగంలో వాస్తవాలకు విలువ ఏపాటిది?

Also read: భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

ఈ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఏమిటో ముందే చెప్పి మీ పఠనానుభవాన్ని పాడుచేయదలచుకోలేదు. ఇవి ఏ ఇజంలోనూ, భావజాలంలోనూ ఇమడవని చెబితే సరిపోతుంది. ఏమైనా భావజాలం ఈ పుస్తకంలో ఆసాంతం కనిపిస్తే అది భారత రాజ్యాంగం గురించీ, భారత్ అనే ఆలోచన అంటే ఏమిటనే ప్రశ్నకు సమాధానం గురించి మాత్రమే. రాజ్యాంగ నిర్మాతలు ఆ హడావుడిలో, సంక్షోభ సందర్భంలో రాజ్యాంగం గురించి చెప్పినదాని కంటే లోతైన రక్షణవాదనను రాజీవ్ భార్గవ అందించారని మాత్రం చెప్పే సాహసం చేయగలను.

తాత్వికతకు ప్రచారం

రాజకీయశాస్త్ర విద్యార్థులు ఈ ప్రశ్నలపైన జరిగిన చర్చలను గుర్తించగలరు. వాటిలో కొన్నింటిని విద్యావేత్త అవతారంలో రాజీవ్ భార్గవ స్వయంగా అందజేశారు. విశ్లేషణశాస్త్రంలో శిక్షణ పొందిన మేథను వారు ఇట్టే గుర్తించగలరు. తత్వశాస్త్రంలో ఆయన అభిజ్ఞకు చార్లెస్ టేయిలర్, అలాడెయిర్ మాకింటయిర్ ల ప్రస్తావనలు అద్దం పడతాయి. విద్యావేత్తలు ఉపయోగించే పదబంధాలు వాడకుండా, బరువైన గ్రంథాలను మీరు చదివి ఉంటారని ఊహించకుండా, రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకోవాలంటూ మిమ్మల్ని ఒత్తిడి చేయకుండా మనం ఈ రోజు ఎదుర్కొంటున్న పెద్దప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. మీరు ఎంతో కాలంగా అడగాలని అనుకుంటున్న మౌలికమైన ప్రశ్నలను అడగవలసిందిగా రచయిత మిమ్మల్ని ఆహ్వానిస్తారు. సరళమైన, శక్తిమంతమైన వ్యత్యాసాలను మీ ముందు ఉంచి ప్రపంచాన్ని మరో వెలుగులో చూసేందుకు దోహదం చేస్తారు. ఈ సరళమైన,లోతైన నైతిక హేతుబద్ధీకరణ తత్త్వశాస్త్రం ఎందుకు చదవాలో, దాని ప్రాధాన్యం ఏమిటో వివరించి చెబుతుంది. అమర్త్య సేన్, జాన్ రాల్స్ రాసిన విషయంపైన ఆసక్తి లేకపోయినా, వారి సిద్ధాంతాలతో ఏకీభావం లేకపోయినా హేతుబద్ధంగా, స్పష్టంగా ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో తెలుసుకోవడం కోసం వారి రచనలు చదవమని నేను యువతీయువకులకు తరచుగా చెబుతూ ఉంటాను. రాజీవ్ భార్గవ  పుస్తకం కూడా ఈ కోవకు చెందినదే.

Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

ఈ పుస్తకంలో ఇచ్చిన సమాధానాలతో అత్యద్భుతమైన తెలివితేటలు కలిగిన మీ మేనల్లుడు అంగీకరించవచ్చు. అదే జరిగితే ఈ చీకటి వేళ మన గణతంత్రవ్యవస్థను పరిరక్షించేందుకు మరో సైనికుడు దొరికినట్టే. ఈ పుస్తకంలో ఉన్న జవాబులతో అతడు ఏకీభవించకపోయినట్లయితే, ఒక ఆలోచనాపరుడైనా, విమర్శనాత్ముడైన, మూర్ఖుడు కాని ఒక పౌరుడిని తయారు చేసిందని భావించవచ్చు.

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

2 COMMENTS

  1. Thanks for introducing a great book for careful reading. Sri Yogendra Yadav did a good job, while doing it well emphasised on relevance of constitutional values in contemporary politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles