Friday, April 26, 2024

బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

కర్ణాకటలోని కోలార్ లో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఉపన్యాసం ఆ క్షణంలో ప్రతిఫలించిన భావావేశం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదల, దళితుల, ఆదివాసీల, ముస్లింల పార్టీగా వర్థిల్లింది. తిరిగి ఆ వైభవం సంపాదించడంకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

కోలార్ లో రాహుల్ గాంధీ ఉపన్యాసం సామాజిక న్యాయం రాజకీయాలను కొత్త మలుపు తిప్పిందా? కాంగ్రెస్ మండల్ బస్సును అందుకోలేకపోయింది. మండల్ -2 లో అది అసౌకర్యంగా ఇబ్బందిగా ప్రయాణం చేసిన పార్టీ. మండల్-3కి కాంగ్రెస్ చోదకశక్తి కాబోతున్నదా? అటువంటి మలుపునకు దేశం సిద్ధంగా ఉన్నదా? తన కథ ఈ మలుపు తిరగడానికి కాంగ్రెస్ తయారుగా ఉన్నదా?

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

సన్నని తీగ మీద చాలా బట్టలు ఆరవేస్తున్నానని మీరు అనుకోవచ్చు. అది ఒక ఎన్నికల ప్రసంగం మాత్రమే. మోదీ ఇంటిపేరు గలవారు దొంగలుగా కనిపిస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యతో తాను ఓబీసీలకు వ్యతిరేకినంటూ నిందపడటం రాహుల్ కి మనస్తాపం కలిగించింది. దాన్ని తప్పించుకొని బీజేపీని దాని ఓబీసీ ప్రేమ గురించి సూటిగా ప్రశ్నించారు. కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారులు (గవర్నమెంట్ సెక్రటరీలు) ఎస్ సి/ఎస్ టీ/ఓబీసీలకు చెందినవారు కేవలం ఏడుగురు మాత్రమే ఎందుకున్నారని అడిగారు. కులగణన నుంచి ఎందుకు పారిపోతున్నారని కూడా రాహుల్ బీజేపీని ప్రశ్నించారు (ఈ విషయంపైన నేను ఇప్పటికే రాశాను. కులగణన ఎందుకు అవసరమో కూడా వివరించాను. అందుకే ఇక్కడ మళ్ళీ రాయడంలేదు). 2011లో జరిగిన సర్వే వివరాలు (డేటా) ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపైన 50 శాతం పరిమితిని తొలగించాలని కూడా రాహుల్ కోరారు. ఇది తెలివైన, అరుదైన ప్రసంగమా?

మీరు పొరబడుతున్నారు.  ఆ మాటలు అన్నప్పుడు రాహుల్ గాంధీ దేహభాషను జాగ్రత్తగా గమనించండి. అది గొప్ప సంకల్పాన్ని సూచించింది. బీఎస్ పీ తో సహా మనదేశంలోని చాలా పార్టీల నాయకులకంటే రాహుల్ గాంధీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూ,కాన్సీరాంనూ మనసుకు పట్టించుకున్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చెప్పిన విషయాలన్నీ (50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్న మాట మినహా) ఫిబ్రవరిలో చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానంలో భాగమే. రాబోయే కాంగ్రెస్ విధానాలను ఈ తీర్మానం పట్టి ఇస్తుంది. రాహుల్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను ఉటంకిస్తూ మర్నాడే ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే రాసిన లేఖను గమనించండి.

Also read: ఆశావహంగా హిందీ బాల సాహిత్యం

పోయిన పరపతిని తిరిగి సంపాదించడం

కోలార్ ప్రసంగం క్షణికమైనది కాదు. కాంగ్రెస్ ఏదో పెద్ద అంశాన్ని నెత్తికెత్తుకోబోతున్నది. సామాజికన్యాయం విషయంలో తాను కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సంపాదించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. పేదలు, దళితులు, ఆదివాసీలు, మతపరమైన అల్పసంఖ్యాకులు కాంగ్రెస్ ను మొదటి నుంచీ ప్రేమించేవారు. ఇప్పటికీ ఇతర వర్గాల కంటే ఈ వర్గాలవారే కాంగ్రెస్ కు అధికంగా ఓటు వేస్తారు. ఈ క్షేత్రవాస్తవికతను కాంగ్రెస్ నాయకత్వం కానీ, దాని విధానాలు కానీ, కార్యక్రమాలు కానీ కొంతకాలంగా ప్రతిబింబించలేదు. దీన్ని సంవరించడానికే రాహుల్ ప్రయత్నిస్తున్నారు.

ఈ పని అంత తేలికైనది కాదు. గ్రీకు తత్త్వవేత్త హరాక్లిటస్ చెప్పినట్టు, ఒకే నదిలో మీరు రెండుసార్లు అడుగు పెట్టజాలరు. సామాజికన్యాయ రాజకీయాలు 1990లలో ఉన్నట్టు ఇప్పుడు లేవు. మూడు దశాబ్దాల కిందట కాంగ్రెస్ ఏమి చేయగలిగి ఉండేదో అది ఇప్పుడు చేయగల పరిస్థితులు లేవు. సామాజికన్యాయ రాజకీయాలకూ, విధానాలకూ తగిన విధంగా స్పందించేందుకు ఏమి చేయాలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆలోచించాలి.

Also read: అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

ఈ పునరాలోచనకు ప్రారంభం ఏమిటంటే సామాజికన్యాయ రాజకీయాలూ, విధానాలు ఎప్పుడో ముందుకు పోలేని అడ్డంకి (డెడ్ ఎండ్)ని ఎదుర్కొన్నాయి.  అందుకే బీజేపీ సైద్ధాంతికంగా, రాజకీయంగా ఆ విధానాలను కాజేయగలిగింది. నేను ఈ సంగతి దశాబ్దం కిందటే సామాజిక న్యాయం రాజకీయాలూ, విధానాల అధ్యయనంలో భాగంగా గమనించాను (ఆ రోజుల్లో నేను రాసిన గంభీరమైన అంశాలకంటే ఎన్నికలలో జయాపజయాల గురించి నా అంచనాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు). సామాజికన్యాయం అన్నది పల్చటి రేకు లాగా తయారైనదనీ, దేనికైనా దానిని చుట్టవచ్చునని రాశాను. కుల వ్యవస్థకు సహజమైన వివక్ష, దారిద్ర్యం, వెనకబాటుతనం వంటి అన్యాయాలను తొలగించడం కంటే సామాజికవర్గాలకు ఇతోధిక ప్రాతినిథ్యం కల్పించడం ప్రధానం. సామాజికన్యాయం అంటే ఆలోచనలోనే తీవ్రమైన పతనం కారణంగా ప్రాతినిధ్యం విషయంలో అవకతవకలు సంభవిస్తున్నాయి.

సామాజికన్యాయం రాజకీయాలు  డెడ్ ఎండ్ కు చేరుకున్నాయన్నవాస్తవం అందరికీ కనిపిస్తున్నది. మొదటిది, హిందీ రాష్ట్రాలలో సామాజికన్యాయాన్ని గుండెలలో నింపుకున్న బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి పార్టీలు ఎదుగూబొదుగూ లేకుండా పడి ఉన్నాయి. రెండవది, సామాజికన్యాయం గురించిన వాదన కూడా చీలికలూపేలికలుగా క్షీణించింది. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లింల గురించి విడివిడిగా మాట్లాడుతున్నారు. ఒకదానికి ఒకటి పోటీగా కాకపోయినా అన్నిటినీ కలిపి మాట్లాడటం లేదు. మూడవది, సామాజికన్యాయం కోసం వాదించేవారు అనవసరమైన అంశాలపైన ఆత్మరక్షణలో పడుతున్నారు.  ఉదాహరణకు కులగణన. నాలుగవది, ఈ కారణంగా వారు ముట్టడిలో ఉన్నామన్న భావనలో ఉంటూ తమ ముందున్న సవాళ్ళ గురించి మాట్లాడలేకపోతున్నారు.  ఉదాహరణకు సబ్-కోటా విషయంలో మౌనం పాటిస్తున్నారు. చివరికి అన్నీ కలిపి చూస్తే ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్) కోటా ద్వారా సామాజికన్యాయం చేయవచ్చుననే దబాయింపుతో అసలు సామాజికన్యాయవాదం మౌలిక  నిర్మాణాన్నే కూలగొడుతున్నారు.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

తిరగదోడటానికి బలమైన ప్రయత్నం

రాజకీయాలలో డెడ్ ఎండ్ లో ఎక్కువకాలం నిలబడి ఉండజాలము. ఎవరో ఒకరు వచ్చి మీరు పోకూడదు అనుకున్న ప్రాంతానికి మిమ్మల్ని తోసేస్తారు. లేదా మీ దగ్గర ఉండిన విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళిపోతారు. సామాజికన్యాయం విషయంలో బీజేపీ చేసింది సరిగ్గా ఇదే. బహుజనులలో చిన్న వర్గాలను ఏరికోరి దగ్గరికి తీసుకోవడం, శక్తిమంతమైన నాయకులను తమ పక్షాన చేర్చుకోవడం, కొంతమంది నాయకులకు ఉన్నత వేదికపైన అవకాశాలు కల్పించడం వంటి చర్యల ద్వారా చైతన్యవంతమైన వ్యూహాలను అమలు పరిచి బీజేపీ సామాజికన్యాయ రాజకీయాలను జయప్రదంగా పక్కదారి పట్టించింది.

ఈ రోజు కాంగ్రెస్ ఎదుట ఉన్న పెనుసవాలు ఇదే. దీన్ని తిరగతోడాలంటే సామాజికన్యాయం రాజకీయాలనూ, విధానాలనూ, వాటి సిద్ధాంతాలనూ, సూత్రాలనూ బహుజాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అటువంటి ఆలోచనను బలంగా ముందుకు తోసేందుకు పనికి వచ్చే నాలుగు పకడ్బందీ ప్రతిపాదనలు ఇవి:

మొట్టమొదటగా, సామాజికన్యాయం విషయంలో ఇంతవరకూ కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సంపాదించడంతోపాటు కొత్త ప్రాబల్యం సంతరించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఈ రోజున సామాజికన్యాయం అన్నది ప్రభుత్వరంగ ఉద్యోగాలకే పరిమితమైనది. ఇది నానాటికీ క్షీణిస్తున్నరంగం. ప్రభుత్వరంగంలో కూడా తిరిగి గెలుచుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. రాయపూర్ తీర్మానం ఉన్నత న్యాయస్థానాలలో ఎస్ సీ, ఎస్ టీ, ఓబీసీల ప్రాతినిధ్యం గురించి సరైన ప్రశ్నను లేవనెత్తింది. మీడియా, ఎన్ జీవోల వంటి ప్రభుత్వేతర రంగాలలో సామాజికన్యాయం అమలు గురించి ప్రయత్నించడం అవసరం. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు అందరికీ సమానావకాశాలు ఉండాలనే అంశంపైన చర్చను రాయపూర్ తీర్మానం ప్రారంభించింది.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

రెండవది, కొన్ని లక్షిత వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ బాహాటంగా, నిస్సంకోచంగా నిలబడాలి. లక్షిత వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే పరమావధి కావాలి. ఈ వాస్తవాన్ని అంగీకరిద్దాం. ఎదుర్కొందాం. డెబ్బయ్ సంవత్సరాల రిజర్వేషన్లు తనదైన స్వార్థప్రయోజనాలను సృష్టించాయి. ఈ విధానం ఫలితాలు అట్టడుగు వర్గాలకు చేరకుండా స్వార్థశక్తులు అడ్డుపడుతున్నాయి. వారు మండల్ రాజకీయాలను సొంతం చేసుకున్నారు. ఖాళీలు జనరల్ పూల్ కు బదిలీ కాకుండా చూసుకుంటూ రిజర్వేషన్ల అమలులో ఎస్ సీ, ఎస్ టీ, ఓబీసీలలో వర్గీకరణకోసం ప్రయత్నించాలి. అంటే సబ్-కోటా ఆలోచనను అంగీకరించినట్టు లెక్క. అదే విధంగా రిజర్వేషన్ల వల్ల ఒక సారి ఫలితం పొందినవారిని రిజర్వేషన్లు పొందేవారి జాబితాలో అట్టడుగున పెట్టాలి.

మూడవది, సాధికారికత విధానాలు కులప్రాతిపదికపైన  అమలు చేయడం అనంతంగా కొనసాగకుండా సామాజికన్యాయ సాధనకు కొత్త పద్ధతులను అన్వేషించాలి. కులం, వర్గం, లింగ వ్యత్యాసాలకు సంబంధించిన అంశాల కంటే అధికమైన అంతరాలు, ఒకదానిపైన ఒకటి పెనవేసుకున్నవివక్షలు మనసమాజంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక్క  కులం లేదా వర్గం లేదా జెండర్ ఆధారంగా వెనుకబాటుదనాన్ని నిర్ణయించడం సాధ్యం కాదు. రిజర్వేషన్ల కంటే అధికంగా సాధికారికత చర్యలు అమలు పరచడానికి అనువైన కొత్త పద్ధతులను కనుగొనవలసి ఉన్నది. లేమి సూచిక (డిప్రైవేషన్ ఇండెక్స్) వెయిటేజీ, ప్రైవేటురంగంలో ప్రోత్సాహకాలు లేదా ప్రతిబంధకాలు, వాస్తవాలను వెల్లడించే బలమైన వ్యవస్థ వంటి ఉపకరణాలతో న్యాయం చేయవచ్చు. దీనికి రాజకీయంగా గట్టి మద్దతు అసవరం.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

నాలుగవది, సామాజికన్యాయం విధానాలకు సంస్థాగతమైన ఆధునికీకరణ చేపట్టాలి. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలనీ, జాతీయ సామాజికన్యాయ మండలిని ఏర్పాటు చేయాలని రాయపూర్ తీర్మానం ఉద్ఘాటించింది. అంతకంటే ముఖ్యంగా, సామాజికన్యాయంపైన వార్షక నివేదికను తయారు చేసి దానిపైన పార్లమెంటులో చర్చించాలని రాయపూర్ తీర్మానం కోరింది. ఇంకా తెలివైన, చురుకైన పద్ధతులపైన దృష్టి కేంద్రీకరించాలి.  అట్లాగే, సమానావకాశాల కమిషన్ నెలకొల్పే విషయం కూడా ఆలోచించాలి. ఇటువంటి కమిషన్లు ప్రపంచంలోని పలు దేశాలలో ఉన్నాయి. ఇందుకోసం చట్టం చేయాలి. యూపీఏ పాలనలో ఒక కమిటీ ఇటువంటి కమిషన్ ను నియమించాలని సూచించింది (ఈ కమిటీలో నేను ఒక సభ్యుణ్ణి).

రాహుల్ గాంధీ తన కోలార్ ప్రసంగాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే అప్పుడు మండల్ బస్సు తప్పిపోవడమే ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలమని అనిపించవచ్చు. సామాజికన్యాయం కోరుతున్న ఇతర పార్టీలూ, సంస్థల నాయకులు భూస్వాములైన ఓబీసీలు. దానివల్ల భూములు లేని పేదల విషయంలో న్యాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి శక్తిమంతులైన భూయజమానులతో సంబంధం లేదు. దళితుల, ఆదివాసీల నాయకత్వాలను బీజేపీ సవాలు చేసి అస్థిరపరిచింది కనుక మౌలికమైన  మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలలో బలహీనత కూడా కొన్ని సందర్భాలలో బలంగా నిరూపితం కావచ్చు. చిన్నది కూడా అందంగా కినిపించవచ్చునని రాహుల్ అన అనుభవంలో తెలుసుకుంటారేమో.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles