Tuesday, April 23, 2024

96 కోట్ల రామనామాలు చేసిన నాదయోగి త్యాగయ్య

  • మాడభూషి శ్రీధర్

మహానుభావుడు త్యాగరాజు గొప్పవాడని కొత్తగా చెప్పేదేమీ లేదు. కాని అంతకుమించిన గొప్పది మరొకటి ఉంది. ‘రామేతి మధురం వాచం’ అని పెద్దలు చెప్పినందుకు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించిన వాడు త్యాగరాజు. ఎంత ఆశ్చర్యం? నాదోపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించిన వాడు త్యాగయ్య. ఆయన శ్రీరామభక్తి అజరామరమైనది. 

రామకృష్ణానంద పరబ్రహ్మం గారు రామ షడక్షరీ మంత్రాన్ని18 ఏళ్లవయసులోనే త్యాగరాజు ఆశీర్వదించారు.

త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత దినోత్సవం. నాదయోగి అయిన త్యాగరాజు 1767వ సంవత్సరం మే 4వ తేదీన జన్మించారు. ఖచ్చితంగా ఎప్పుడు పుట్టారో చెప్పడానికి ప్రామాణిక వివరాలు లేవు. జనవరి 6, 1847 నాడు ఈ గాన బ్రహ్మ పరమబ్రహ్మైక్య మైనారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు 5 జనవరి, ఫిబ్రవరి నెలలలో తిరువయ్యూరులో సమాధి చెందిన త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.

తమిళనాడు రాష్ట్రంతంజావూరు జిల్లాకు తిరువారూర్ గ్రామంలో కాకర్ల త్యాగబ్రహ్మం పేరుతో జన్మించాడు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతులలో మూడవ కుమారుడు. ములకనాడు తెలుగు బ్రాహ్మణులనీ, భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులనీ, ఆపస్తంభ సూత్రులనీ వారు. త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లా, కంభం మండలం కాకర్ల గ్రామం నుంచి తంజావూరు వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆస్థానంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు.

రామబ్రహ్మం దంపతులకు నారదుడు స్వప్నంలో కనిపించి ఒక కుమారుడు జన్మిస్తాడన్నారనీ, ఆయనకు త్యాగరాజు నామకరణం ఆదేశించారట. కనుక నారద ముని త్యాగరాజస్వామి మంత్రోపదేశంతో ‘స్వరార్ణవం’.. ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్ధ ‘శాస్త్ర గ్రంథాలు,’ప్రహ్లాద భక్తి విజయం’,’నౌకా చరితం’ అనే నాట్యరూపకాలను కూడా రచించారు.

త్యాగయ్య తెలుగు తమిళ భాషలకే కాకుండా దేశానికి, ఈ ప్రపంచానికి నాదానికి యోగి.  పాటకు రాజు, రాగానికి రారాజు, త్యాగరాజు. త్యాగయ్యను

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః

వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం

బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః

యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే

అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝాపేట వేంకటరమణయ్య భాగవతార్ ఈ శ్లోకాన్ని ప్రస్తుతించారు. ఒక అద్భుతంగా ఈ అర్థాన్ని వివరించారు. ‘‘వేదములను విప్పి చెప్పడంలో ఆయన వ్యాసుడు. మధురమైన వాక్యములు రచనలో వాల్మీకి కవి. వైరాగ్యములో శుకుని వంటి వాడు. భక్తిలో ప్రహ్లాదుని వంటి వాడు. సాహిత్యములో బ్రహ్మ వంటి వాడు. సంగీతములో నారదుని వంటి వాడు.రామ నామమనే అమృతానికి త్రాగడంలో పరమశివుని వాడు’’ అనిరచయితలు అక్కిరాజు ప్రసాద్, రవిరాజు ఆదిరాజు కలిసి వ్యాసంలో వివరించారు.

తల్లి పాలు తాగుతున్న పసిబాలుడు సంగీతం వినబడితే పాలు త్రాగడం ఆపి తల తిప్పి సంగీతం వినేవారట. ‘ఒకసారి రామబ్రహం తన కుటుంబంతో కాశీ ప్రయణం అవుతుండగా ఆ త్యాగరాజస్వామి (శివుడు) మళ్లీ స్వప్నంలో కనబడి తిరువైయారు వెళ్లమని, అదే అతనికి కాశీతో సమానమని చెబుతాడు. . రామబ్రహ్మం ఈ విషయం రాజావారికి తెలుపగా అయన తిరువైయారులో రామబ్రహ్మానికి ఒక ఇల్లుతో పాటు ఆరెకరాల పొలం ఇస్తారని వివరించారు. త్యాగరాజస్వామి కీర్తనల్ని ‘త్యాగరాజు ఆత్మ విచారం’ పేరిట గొప్ప వచనంగా భమిడిపాటి కామేశ్వరరావుగారు ప్రచురించారు. కాటూరి వెంకటేశ్వరరావుగారు సాహిత్య అకాడెమీ కోసం ‘తెలుగు కావ్యమాల’ ను కూడా ఒక సంకలనం చేశారు. ఎన్.విజయ శివ అనే మరో రచయిత‌త్యాగరాజ కీర్తనలకి స్ఫూర్తి రామాయణంలోనిసుందరకాండంలో ఉందని వివరించారు.  ఆనాటి సుప్రసిద్ధ త్యాగరాయ కృతి, పంచరత్న కీర్తనల్లో ఒకటైన ‘ఎందరో మహానుభావులు’ కి స్ఫూర్తి సుందరకాండలో (26:50) సీతాదేవి పలికిన ఈ శ్లోకంలో ఉందంటాడాయన:

ప్రియాన్న సంభవేద్దుఃఖమప్రియాదధికమ్ భయమ్

తాభ్యామ్ హి యే వియుజ్యంతే నమస్తేషామ్ మహాత్మానామ్

(ప్రియమైనది దొరకలేదనే దుఃఖంగాని, అప్రియం నుండి గొప్ప భయం కాని ఉండని ఆ మహాత్ములెవరో, ప్రియాప్రియాలు రెండింటికీ దూరంగా ఉండేవారెవరో ఆ మహాత్ములకు నమస్కారం, అని అర్థం). గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగరాజ స్వామి.  కర్ణాటక సంగీత మరోక ఇద్దరు శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వారు. ఇద్దరూ సమకాలికుడీయన. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువాయరు కు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు.

ఈ నాదయోగి కాకర్ల త్యాగరాజస్వామి, పుష్య బహుళ పంచమి1847 సంవత్సరన సిద్ధి పొందిన రోజు. తిరువాయూరులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తూ ఉండగా విదేహముక్తి పొందిన యోగి ఆయన. త్యాగరాజుస్వామి చరిత్ర రూపంలో ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ గార్లు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు ఇస్తే, కృష్ణస్వామి భాగవతార్ రెండవ భాగం విశేషాలు రచించారు. వీరు తాళపత్రాలలో, నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మదురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరచారట. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వారి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ. సాంబమూర్తి గారు కృష్ణస్వామి గారిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తి గారనిఅక్కిరాజు ప్రసాద్ తెలిపారు. రవిప్రసాద్ ఆదిరాజు కూడా ఆయనకు సహాయం చేసారు.

ఈ సందర్భంలో చెప్పవలసిన మరొక విషయం ఏమంటే సామవేదం షణ్ముఖ శర్మ త్యాగ రాజవైభవం అని ఏడు భాగాలలో ప్రవచనం తప్పకుండా విని తీరవలసినవి. ఇది ఏ పుస్తకంలోనూ దొరకవు, అవి ప్రవచన ప్రధానమని అర్థం చేయాలి. TyagarajaVaibhavam (త్యాగరాజ వైభవం) By SamavedamShanmukha Sharmahttps://tunes.desibantu.com/tyagaraja-vaibhavam/.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles