Saturday, September 30, 2023

భారతీయ ‘జనతా’ గ్యారేజ్

  • బీజేపీలో పుట్టిపెరగనివారికి ప్రాధాన్యం
  • రెండు తెలుగు రాష్ట్రాలలో విస్మయం గొలిపే మార్పులు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, భారతీయ జనతా పార్టీ మరమ్మత్తులకు సిద్ధమైంది. అందులో భాగంగా  తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ అధినేతలను మార్చేసింది. వారితో పాటు కొందరికి కొత్త పదవులను కట్టబెట్టింది. మొత్తంగా ఈ మార్పులను  గమనిస్తే, వాజ్ పెయి-అద్వానీ కాలపు సంప్రదాయాలకు తిలోదకాలిచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ పరిణామం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి సరికొత్త సంప్రదాయం వేళ్లూనుకుంటోంది. ఈ పథకరచనలో ప్రధానంగా నరేంద్రమోదీ -అమిత్ షా ద్వయం ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నది దాచలేని సత్యం. మారుతున్న రాజకీయ సంస్కృతిలో, సిద్ధాంతాలు, విలువలంటూ పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేమన్నది ఈ తరపు ఆచారంగా అభివర్ణించాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే నెహ్రూ- గాంధీ తర్వాత మారిన విధానాలను ప్రపంచం ఇంతకాలం చూస్తూనే వచ్చింది. అధికారపు అందలాలు ఎక్కడమే ప్రధాన, ముఖ్య, ఏకైక లక్ష్యంగా నిర్మాణమైన రాజకీయ సంప్రదాయానికి ‘కాంగ్రెస్ స్కూల్’ అనే పేరు కూడా వచ్చింది. 2014 నుంచి బిజెపి కూడా ఇంచుమించు అదే సిలబస్ ను పాటిస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. దశాబ్దాల పాటు బిజెపితో ఎంతో అనుబంధం కలిగివున్న వ్యక్తులను పక్కన బెట్టి, మిగిలిన పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాముఖ్యత ఇచ్చి,పదవులు పంచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

Also read: మహారాష్ట్రలో మరోసారి ఫిరాయింపుల రాజకీయం

వామపక్ష భావాలు కలిగిన ఈటెలకు పదవా?

ఈ జాబితా పెద్దదే. తాజా నియామకాలను గమనించినా, ఈ విషయం విస్పష్టంగా అర్ధమవుతుంది. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు, తెలుగు రాష్ట్రాలు చాలు! ఇందులో కిషన్ రెడ్డి మినహాయింపు. వామపక్ష భావజాలం నేపథ్యం నుంచి వచ్చి, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, కెసిఆర్ కు తోడునీడగా నిలిచి, టీ ఆర్ ఎస్ లో మంత్రిగా పనిచేసి, అంతర్గత విభేదాలతో బయటకు వచ్చి, బిజెపిలో చేరి, ఎమ్మెల్యేగా ఎంపికైన ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో కాపురం చేసి, కోట్లాది రూపాయిల కాంట్రాక్టుల కోసం, వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసమే బిజెపిలోకి దూకేశారని విమర్శలు ఎదుర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తాజాగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక చేశారు. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ లోనే జీవించి,ఆ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి మొదలు అనేక పెద్ద పదవులను అనుభవించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, ‘సమైక్యాంధ్ర’ పేరుతో సరికొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా పార్టీని ధూళిలో కలిపి, 2014 నుంచి చాలా ఏళ్ళు రాజకీయాలకు దూరంగా అజ్ఞాతవాసం గడిపి, మళ్ళీ కాంగ్రెస్ లో చేరి, బయటకు వచ్చి,ఇటీవలే బిజెపి తీర్ధం పుచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గం సభ్యుడిగా పదవిని అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా ఎంపికైన పురందేశ్వరి 2014లో కాంగ్రెస్ నుంచి బయటకు రాబోయే ముందు ఆ పార్టీలో రెండు పర్యాయాలు ఎంపీగా, కేంద్రమంత్రిగా పదవులు అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీసిందనే నెపంతో ఆమె కాంగ్రెస్ ను వీడి, బయటకు వచ్చి బిజెపిలో చేరారు.

Also read: శాంతి మంత్రం -రక్షణ తంత్రం

పురందేశ్వరి, కిరణ్ బీజేపీలో చేరడమే విడ్డూరం

సిద్ధాంత రీత్యా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బిజెపి మొదటి నుంచీ జైకొడుతోంది. అటువంటి సైద్ధాంతిక నేపథ్యం కలిగిన పార్టీలోకి అటు కిరణ్ కుమార్ రెడ్డి – ఇటు పురందేశ్వరి వెళ్ళడమే విడ్డూరం. నేడు ఈ ఇద్దరినీ కీలకమైన పదవులు వరించాయి. పదవులు వచ్చినంత తేలికగా పార్టీలో, ఓటర్లపై ప్రభావం చూపించడం కుదిరేపని కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, పురందేశ్వరికి – చంద్రబాబుకు మొదటి నుంచి పెద్ద సఖ్యత లేదు. బంధువులు కాబట్టి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కలవడం తప్ప, రాకపోకలు, అనుబంధాలు పెద్దగా లేవన్నది అందరికీ తెలిసిన విషయం. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు – చంద్రబాబుకు మధ్య సాగిన వివాదాలు జగద్విదితం. బిజెపితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వీర ప్రయత్నాలు చేస్తున్నారని వింటూనే వున్నాం. అందరి పొత్తులు పొంది, 2024 ఎన్నికల్లో గెలిచి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నది చంద్రబాబు ఏకైక లక్ష్యం. బాబును ముఖ్యమంత్రిగా చూడడానికి పురందేశ్వరి ఏ మేరకు కృషి చేస్తారన్నది పెద్ద ప్రశ్న. అసలు బిజెపి -టిడిపి పొత్తులు ఉంటాయా అన్నది మరో ప్రశ్న. పౌరసత్వం విషయంలో ఇబ్బంది రాకుండా ఉంటే  పురందేశ్వరి కుమారుడు మొన్న 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాల్సింది. అది కుదరకపోవడంతో ఆమె భర్త వెంకటేశ్వరరావు నిల్చొని ఓడిపోయారు. గెలిచి వుంటే నిజంగా చిత్రం వేరే విధంగా ఉండేది.

Also read: గీతాప్రెస్ కు గాంధీ పురస్కారం

సోము వీర్రాజు వందశాతం బీజేపీ నేత

నిన్నటి వరకూ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు మొదటి నుంచి బిజెపి భావజాలం కలిగిన వ్యక్తి. పార్టీలు మారకుండా అదే పార్టీలో కొనసాగిన మనిషి. వైసిపికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారనే ఫిర్యాదులు, అనుమానాల నేపథ్యంలో పదవి నుంచి దించేశారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. నిజానిజాలు ఎట్లా ఉన్నా, పురందేశ్వరితో పోల్చుకుంటే ఆయన 100 శాతం బిజెపి నేత. గతంలో అధ్యక్షుడిగా నియమించబడిన కన్నా లక్ష్మీనారాయణ కూడా జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ లోనే ఉండి, మంత్రి పదవులను పొందిన వ్యక్తి. అధ్యక్షుడుగా కన్నా పనిచేసిన కాలంలో బిజెపికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. 2019ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోక పోగా, పార్టీ ఓటింగ్ శాతం ఘోరంగా పడిపోయింది. కాంగ్రెస్,బిజెపిలో ఉన్నప్పుడు టీడీపి అధినేత చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ కొన్నాళ్ల క్రితమే తెలుగుదేశంలో, బాబు పంచన చేరారు. ఇటువంటి వాతావరణం అలుముకున్న కాలంలో,ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రేపటి ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలను రాబట్టుకుంటుందో వేచిచూడాలి. పురందేశ్వరి రాజకీయ జీవితాన్ని సమీక్షిస్తే 10 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. 9 ఏళ్ళ నుంచి బిజెపిలో ఉన్నారు. రెండు పార్టీల్లోనూ దాదాపు సమానమైన కాల భాగస్వామ్యంగా చెప్పాలి. సత్య లేదా మాధవ్ కు అధ్యక్షపదవిని ఇచ్చి వుంటే ఇంకాస్త బాగుండేదనే మాటలు వినపడుతున్నాయి.

Also read: ఎన్నికల బాగోతంలో ‘ఉత్తర’రామాయణం

అధికార పార్టీలకే ప్రయోజనకరం

సత్య అధ్యక్షుడి స్థానంలో ఉంటే చంద్రబాబుకు ఎంతోకొంత మేలు జరిగేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి ఖంగు తిన్నదన్నది కాదనలేని నిజం. ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్ పేరు బాగా వినపడుతోంది.చేరికలు,వలసలు పెరిగిపోతున్నాయి.రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర ప్రభావాన్ని తేలికగా తీసుకొనరాదు. ఈ నెల 8 వతేదీన ప్రధాని మోదీ వరంగల్ పర్యటన వుంది. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసే దిశగా బిజెపి వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగమే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా ప్రాముఖ్యత ఉంటుందని చాటి చెప్పడానికి ఈ పదవుల పందారమని అనుకోవాలి. తెలంగాణలో పార్టీని వీడకుండా ఉండడం కోసం మరికొందరికి వేరు వేరు పదవులు కేటాయించే పనిలోనూ బిజెపి పడిపోయింది.త్వరలో, హైదరాబాద్ వేదికగా, దక్షిణాది రాష్ట్రాల నేతలతో బిజెపి సమావేశం నిర్వహించనుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల వాతావరణం గమనిస్తే బిజెపి చేసిన మార్పులు-చేర్పుల వల్ల రెండు రాష్ట్రాల అధికార పార్టీలకే ఎక్కువ మేలు జరుగుతుందని ఎక్కువమంది అభిప్రాయం. అన్నింటికీ కాలమొకటుందిగా.

Also read: ‘పలుభాషల పలుకుతోడు – పాటల సైజోడు’ ఎస్పీ బాలసుబ్రమణ్యం….

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles