Tuesday, September 10, 2024

మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

నరచాప ప్రవిముక్త దారుణ బృహన్నారాచ ధారల్ భయం

కర దైతేయ నికాయ కాయములపై కప్పెన్ దిశల్ నిండ బం

ధుర ధాత్రీధర తుంగశృంగ తట సందోహమ్ముపై కప్పు దు

ర్ధర ధారాధర ముక్తసంతత పయోధారావళిం పోలుచున్”

నన్నయ భట్టారకుడు

క్షీరసాగరమథనం

విష్ణువు ప్రసాదించిన శక్తితో  దేవదానవులు ఏకధాటిగా  సముద్రాన్ని మధింపగా, విషం పుట్టి నలుదిక్కులా అగ్నిజ్వాలలై వ్యాపించింది. ఆ విషాన్ని వేగంతో అందుకొని పరమేశ్వరుడు తన కంఠంలో పొందు పరచుకున్నాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

ఈ విస్ఫులింగాలతో బాటు, జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చ్వైశ్రవమనే శ్వేతాశ్వం, కౌస్తుభమణి, ఐరావణ గజరాజం, అమృతపూర్ణ శ్వేతకమండలం ధరించిన ధన్వంతరి అనే దేవవైద్యుడు, తదితర వస్తుసంచయంతో సహా ఉద్భవిల్లినారు.

కౌస్తుభమణిని విష్ణుమూర్తి గ్రహించినాడు.  ఉచ్చ్వైశ్రవమును, ఐరావతమును, ఇంద్రుడు స్వీకరించినాడు. అమృతాన్ని దానవులు గ్రహించడం చూసిన విష్ణువు, కృత్రిమ నారీరూపంలో రాక్షసుల మనస్సులకు మోహం కల్గించి, వారినుండి అమృతం తస్కరించి, దేవతలకిచ్చినాడు. వారా అమృతాన్ని సేవించే సమయంలో రాహువు దేవతల సహపంక్తిలో కూర్చొని అమృతం త్రాగబోగా, సూర్యచంద్రులది గుర్తించి విష్ణువుకు చెప్పినారు. అమృతం రాహువు గొంతులో ప్రవేశింపక మునుపే విష్ణువు తన చక్రం ప్రయోగింపగా, అది తగిలి స్వర్భానువు శిరస్సు తెగి శరీరం నేలపై పడింది. అమృతస్పర్శ పొందిన శిరస్సు మాత్రం నాశనం లేనిదై అట్లే వుండిపోయింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

అమృతం లభింపని రాక్షసులు మిక్కిలి క్రోధంతో తమ రాజైన బలిచక్రవర్తితో చర్చించి దేవతలతో యుద్ధం చేయాలని నిశ్చయించుకొన్నారు.

ఈ దేవదానవ యుద్ధం దీర్ఘంగా నడిచింది. ఈ సమరం  ఎడతెరిపి లేకుండా సాగిందని చెప్పడానికి దీర్ఘమైన మహాస్రగ్ధర వృత్తాన్ని ఆదికవి ఎన్నుకున్నాడు. ఆ పద్యమిది:

అమరేంద్రారాతు లిట్లాహవ ముఖమున నేయంగ తత్తీక్ష్ణ బాణౌ

ఘము ఘోరంబై సురానీకము పయి పెలుచం కప్పినం జుూచి, దైత్యో

త్తములం కోదండ చక్రోద్యత భుజులు మహాదారుణుల్ వీరలక్ష్మీ

రమణుల్ దుర్వార వాత్యారయమున నరనారాయణుల్ తాకి రల్కన్!”

ఈ పద్యతాత్పర్యం:

“దానవులు ప్రయోగించిన బాణసముదాయం భయంకరమై దేవతా సమూహాన్ని తాకగా, దేవతా సైన్యంలో శౌర్యలక్ష్మికి ప్రియులైన “నర నారాయణుల”నే వారు, నరుడు కోదండమనే ధనుస్సును, నారాయణుడు చక్రాన్నీ ప్రయోగిస్తూ, దుర్వార మారుత వేగంతో రాక్షసులను ముట్టడించినారు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

నరనారాయణుల పరాక్రమం

నేటి పద్యం దేవదానవ యుద్ధంలో నరుడు చూపించిన పరాక్రమాన్ని, అతని ధనుః కౌశల్యాన్నీ తెలుపుతుంది. దీని తరువాతి పద్యం నారాయణుని శౌర్యాన్ని, అతని చక్ర ప్రయోగ ప్రావీణ్యాన్నీ పేర్కొంటుంది.

ఘోరమైన దేవదానవ యుద్ధంలో దైత్యులు పరాజయాన్ని పొంది దిక్కుతోచక సముద్రంలో ప్రవేశిస్తారు. దేవతలు  దేవేంద్రుని వద్ద అమృతాన్ని భద్రంగా దాచిపెడతారు.

పద్యసౌందర్యం

నేటి పద్య తాత్పర్యమిది: “నరుని చాపం నుండి విడువబడిన దారుణ బృహన్నారాచ ధారలు దిగంతరాళములను కప్పినవి. సుందర పర్వత శిఖరాగ్రములపై అలుముకొంటున్న భీషణ పయోధరావళిని పోలుతూ, ఆ బాణధారలు కుంభవృష్టి వలె భయంకరులైన రాక్షసుల శరీరాలపై నిరంతరంగా వర్షించినవి”.

నన్నయ భట్టారకుని  మనోహర తత్సమపద శబ్దధార  నేటి పద్యాన్ని వేగంగా పరుగులు పెట్టిస్తూ,  శాత్రవులపై ఎడతెరపి లేకుండా నరుడు ప్రయోగించే  దారుణమైన బృహత్ బాణ ధారను స్ఫురింపజేస్తుంది.  అందమైన పర్వత శిఖరాగ్రములపై గల దట్టమైన మేఘాల నుండి ధారాపాతంగా కురిసే కుంభవృష్టితో నరుని బాణ పరంపరను పోలుస్తూ, నరనారాయణులు తమ రణకౌశల్యంతో దేవదానవుల నడుమ యుద్ధాన్ని ఏకపక్షంగా మార్చిన వైనాన్ని ఈ పద్యమూ, దీని తరువాతిదీ, వర్ణిస్తాయి.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

ఎంతటి వీరాగ్రేసరులైనా,  భయంకరంగా కురిసే నరుని యొక్క కుంభవృష్టి వంటి  బృహన్నారాచ ధారల ముందు నిస్సహాయులని, ఎట్టి ప్రతిఘటనా తలపెట్టలేని అల్పులనీ నేటి పద్యం తెలుపుతుంది.

“రేఫాన్ని” (ర వర్ణం) పాదప్రాసగా ఆదికవి ఎన్నుకున్నాడు.  ఈ  “రేఫం” “నరచాప ప్రవిముక్త బృహన్నారాచ ధారల్” అంటూ సాగే మొదటి పాదంలో ‘పునః పునః సాక్షాత్కరించడం పఠితలు గమనింపగలరు.

అట్లే: “భయంకర దైతేయ నికాయ కాయములపై కప్పెన్ దిశల్ నిండ” అంటూ కొనసాగే రెండవ పాదాన్ని ఆదికవి “క” వర్ణ శబ్ద మాధుర్యంతో  అనుప్రాసా శోభితం చేయడం సైతం గమనింపగలరు. అదేవిధంగా, “బంధుర ధాత్రీధర తుంగశృంగ సందోహంబుపై కప్పు” అనే మూడవ పాదంలో, “దుర్ధర ధారాధర ముక్తసంతత పయోధారావళిన్ పోలుచున్” అనే నాల్గవ పాదంలోనూ, “తథదధ” శబ్దాలు, “ర” శబ్దంతో కలిసి, మనోహరమైన సంయుక్త శబ్దఘోషతో పఠితల మనస్సులకు గిలిగింతలు పెట్టడమే గాక, పద్యం యావత్తూ కర్ణపేయమై,  హృదయాలను ఉఱ్ఱూతలూగిస్తుంది. ఈ పద్యం భావ ప్రధానమైనదే గాక నాద ప్రధానమైనది కూడా.

Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం

శృంగారనైషధం

ఇట్లా పలు శబ్దాలను సమర్థవంతంగా ఏకపంక్తిలో ప్రయోగించిన కవుల్లో శ్రీనాథుడొకడు. ఉదాహరణకు ఆయన శృంగార నైషధంలో:

కాలకంఠ కఠోర కంఠ హూంకారంబు

చెవుల సోకని నాటి చిత్తభవుడు”.

అనే ప్రయోగం వున్నది. ఈ సీసపద్య పాదంలో “క” కారము, “న” కారము (కన్ఠ), “ఠ” కారము కలిసి భీషణధ్వానం చేస్తాయి. ఈ పంక్తిలో “ఠ” కార శబ్దమే  ప్రధాన భూమిక వహించి శబ్ద భారాన్ని మోయడం విశేషం (stressed sound). దీనికి భిన్నంగా, నేటి ఆదికవి పద్యంలో అన్ని ప్రధాన శబ్దాలు సమాన ప్రాముఖ్యత కలిగి  ప్రసన్నమోహనంగా పద్యం ప్రవహిస్తుంది.

నేటి పద్యంలో “నరచాపప్రవిముక్త బృహన్నారాచ ధారల”చే దైతేయులు నిస్సహాయులు కావడం మనకు గోచరిస్తుంది.

మొట్టమొదటి సారి ప్రవరాఖ్యుణ్ణి చూసినప్పుడు వరూధిని “మీనకేతన ధనుర్జ్యా ముక్త నారాచ దుర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహ” కావడం అల్లసాని పెద్దన మనుచరిత్రలో చూస్తాము.

నన్నయ పద్యంలో నరుని బాణపరంపర వర్షధారయై కురిసి రాక్షసులు తబ్బిబ్బు చెందుతారు. పెద్దనార్యుని పద్యంలో, మీనకేతన మన్మధుని ధనుర్జ్యా ముక్త బాణవృష్టిలో తడిసిన వరూధిని మనస్సు, విరామంలేని కుండపోతవానలో తడిసి మూర్ఛిల్లిన అంబురుహం వలె, తల్లడిల్లిపోతుంది.

నరనారాయణుల పరాక్రమం చాటే నన్నయ రమణీయ పద్యం అనర్గళ ధారయై శోభిస్తుంది. సున్నితమైన  పెద్దన పద్యం తన ఝళంఝళా రవళితో పఠితలను సమ్మోహపరుస్తుంది. రెంటిలోనూ రూపకాలంకార మొక్కటే.

దేవదానవుల యుధ్ధగాథలోని పై పద్యం నరుని యొక్క ధనుః ప్రావీణ్యతను వర్ణిస్తుంది. దీని తర్వాత వచ్చే పద్యం నారాయణుని యొక్క “ఉన్నత దోర్దండ విముక్త చక్ర నిహతి” యొక్క ప్రభావాన్ని చాటి చెబుతుంది.

 ఇదీ ఆ పద్యం:

పత దుర్వీధర ధాతు నిర్ఝర జలాభంబై, మహాదేహ ని

ర్గత సాంద్రారుణ పూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి, నారాయణో

న్నత దోర్దండ విముక్త చక్ర నిహతిన్ నాకద్విషన్మస్తక

ప్రతతుల్ ఘోరరణంబునన్ బడియె భూభాగంబు కంపింపగన్”

దీని భావం: “ఆకాశం నుండి గైరికాది ధాతువులతో కలిసి పృధ్విపై వర్షించే ధారాస్రవంతీ  కాంతి కలిగి,  బృహత్ దానవ దేహాలనుండి  రక్తం ప్రవాహమై స్రవింపగా, నారాయణుని ఉన్నత భుజాగ్రాల నుండి విసరిన చక్రం తగిలి, లెక్కలేనంత మంది శాత్రవుల శిరస్సులు రణరంగంలో తెగి నేలపై పడి, భూతలం యావత్తూ భయంకరంగా కంపించిపోయింది.”

ఈ దేవదానవుల యుద్ధం కృతయుగం నాటిది. దీనిలో  వీరాగ్రగణ్యులై విజయలక్ష్మిని చేగొన్నవారు నర నారాయణులు. ద్వాపర యుగం నాటి కురుక్షేత్ర సంగ్రామంలోనూ ఈ  నర నారాయణులే కృష్ణార్జునులుగా అవతారమెత్తి కథ నడిపిస్తారు.

Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles