Sunday, September 15, 2024

మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

క్షోణీ చక్రభరంబు క్రక్కదల దిక్కుల్ మ్రోయగా నార్చి,

క్షీణోత్సాహ సమేతులై రయమునన్ గీర్వాణులుం, పూర్వ గీ

ర్వాణవ్రాతము నబ్ధి ద్రచ్చునెడ తద్వ్యాకృష్ఢ నాగానన

శ్రేణీప్రోత్థ విషాగ్ని ధూమవితతుల్ సేసెం పయోదావలిన్”

నన్నయ భట్టారకుడు

నన్నయభట్టారకుని భారతసంహిత- ప్రథమా శ్వాసంలోని భృగువంశ కీర్తనమనే ఘట్టం ముగిసింది. ద్వితీయాశ్వాసంలోని గరుడోపాఖ్యానంలోకి మనమిప్పుడు పాదం మోపుతున్నాము.

“తల్లి కద్రువ శాపంచేత సర్ప యాగంలో సంభవించిన నాగవంశ వినాశనాన్ని నీ తండ్రికి శిష్యుడైన ఆస్తీకుడే కదా జనమేజయునికి చెప్పి ఆపు చేయించింది?” అని రురునితో సహస్ర పాదుడంటాడు.

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

ఈ ఘట్టాన్ని పౌరాణికుడైన ఉగ్రశ్రవసువు శౌనకాది మహామునులకు వివరించి చెప్పగా విన్న మహామునులు ఉగ్రశ్రవసువును ఇట్లా ప్రశ్నిస్తున్నారు:

“తన సంతానాన్ని పరుల నుండి కాపాడవలసిన కన్నతల్లియే  ఎందుకోసం తన సంతు యొక్క వినాశనాన్ని కోరుకున్నది? ఆ కథ మాకు వివరించి చెప్పవా?”

సమాధానంగా మునిగణానికి ఉగ్రశ్రవసువు వర్ణించి చెబుతున్నదే  గరుడోపాఖ్యానం. దానిలో మొదటిది కద్రూవనితలు పుత్రులను పొందే ఘట్టం. తరువాతి భాగమే క్షీరసాగర మథనం.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

క్షీరసాగరమథనం

వీరులైన దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించి, అమృతం పొందాలనే పూనికతో, సురేంద్రుడు ముందు నడవగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి మేరు మహాపర్వతం మీదికి పోతారు.  వారందరికీ పెను సంశయ మొకటి కలుగుతుంది:

“యే క్రియన్ వారధి జొచ్చు వారము? ధ్రువంబుగ దానికి కవ్వమెద్ది? ఆధారము దానికెద్ది?”

“ఏ విధంగా మనం సముద్రంలోకి ప్రవేశింపగలం? ఈ సముద్రాన్ని మధించడానికి మనకే ఆధారమున్నది? దీన్ని చిలికే కవ్వం ఎక్కడున్నది?”

దేవదానవులీ సందిగ్ధావస్థలో వుండగా, ఆ బృహత్కార్యాన్ని ముందుండి నడిపించడానికి, బ్రహ్మ, విష్ణువు,పూనుకున్నారు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

భూమిపై పర్వతాలన్నీ కలిపితే ఎంత పొడవు ఏర్పడుతుందో, అంత పొడవూ గలిగినదొక మంధరపర్వతమే. అన్నింటిని కలిపితే ఎంత ఎత్తు ఏర్పడుతుందో అంత ఎత్తును కలిగినదీ ఒక మంధరగిరియే.  అంతేకాక అపారమైన స్థిరత్వం కలిగినది కూడా.  ఓషధీరస విశేషతతో అలరారేదీ, ఉత్తమమైనదీ ఐన మంధరపర్వతమే సముద్రమథనానికి కవ్వంగా వుండడానికి శ్రేష్ఠమైనదని బ్రహ్మ, విష్ణువు  నిర్ణయించి, ఆజ్ఞాపించగా, ఆదిశేషుడా పర్వతరాజాన్ని సమూలంగా పెళ్ళగించి, పైకెత్తినాడు.

మంధరగిరి పొడవు పదకొండు వేల యోజనాలు. దాని లోతు కూడా పదకొండు వేల యోజనాలే. ఇట్టి మంధరపర్వతాన్ని శేషుడు పెళ్ళగించి పైకెత్తగా, దేవాసురులందరూ కలిసి, ఆ కొండను సముద్రంలో పడవేసి, అది సముద్రంలో దిగబడిపోకుండా, క్రింద ఆధారంగా ఆదికూర్మాన్ని అమర్చి, కవ్వపు త్రాడుగా సర్పరాజైన వాసుకిని  ఏర్పాటు చేసుకున్నారు.

కవ్వపు త్రాడైన వాసుకి  శిరోభాగాన్ని పట్టుకొని రాక్షసులు, వాలాన్ని పట్టుకుని దేవతలు,  గొలుసుకట్టుగా చుట్టూ చేరి కవ్వపు త్రాడును అటూ ఇటూ  లాగే ప్రక్రియ ప్రారంభమైనది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

వాసుకి అనే కవ్వపు త్రాడును దేవదానవులు కలిసి లాగే  సుదీర్ఘ ప్రక్రియ యొక్క వర్ణనయే నేటి పద్యపు సారంశం:

“భూచక్రం ఆసాంతం క్రక్కదలి పోగా, అమితోత్సాహంతో, దిక్కులు పిక్కటిల్లే లాగున, దేవతలు, రాక్షసులు పెడబొబ్బలు పెడుతూ, కవ్వాన్ని అటూ ఇటూ లాగుతూ సముద్రాన్ని మధిస్తున్నారు. ఈ సుదీర్ఘ మధనంతో సర్పరాజు వాసుకి ముఖం నుండి అనంతంగా  విషాగ్ని వెలువడుతున్నది. ఆ విషాన్ని ధూమసంచయం అపార మేఘసముదాయం వలె దిక్కులన్నీ క్రమ్ముకొన్నది”.

భీషణ విషాగ్ని జ్వాలలు

భూమి భయంకరంగా కంపించడము, విపరీతమైన వైశాల్యం కలిగిన మంధర పర్వతాన్ని కవ్వం చేసుకొని, వీరాధివీరులైన దేవదానవులు భీకరంగా అరుస్తూ వాసుకి అనే కవ్వపు త్రాడును తమ శక్తినంతా వినియోగించి అటూ ఇటూ లాగడమూ, ఆ లాగుతున్నప్నడు భీషణ విషాగ్ని జ్వాలలు వెలువడడము, ఆ అగ్ని యొక్క ధూమరేఖలు మేఘ సంచయం వలె దిక్కులన్నీ నిండిపోవడము,  ఈ విభీషణ ప్రక్రియను వర్ణించడానికి వాగనుశాసనుడు  ఉద్వేగాన్ని సూచించే శార్దూల వృత్తాన్ని  ఎన్నుకున్నాడు.

ఇందులో భాగంగా ఒక కదిలే చిత్రాన్ని మన కట్టెదుట సాక్షాత్కరింప జేయడానికి గాను ఆదికవి వాడుకున్న శబ్దప్రక్రియ బహుసుందరం.

దేవదానవుల కేకలను స్ఫురింపజేయడానికి ఆయన “ణ” అక్షరంలోని అనునాసికా శబ్దాన్ని పాదప్రాసగా వాడుకున్నాడు. “ణ” అనే శబ్దానికి “క్ష” అనే శబ్దాన్ని కలుపుకున్నాడు. శార్దూలం యొక్క మొదటి రెండు పాదాల  ఎత్తుగడలో ఈ రెండు శబ్దాలు దీర్ఘాక్షరాలై దేవదానవుల ఉద్వేగాన్ని ప్రతిఫలించినవి. “క్షోణిచక్రం”, “అక్షీణోత్సాహం”,  “పూర్వగీర్వాణవ్రాతం”, “నాగానన శ్రేణీ ప్రోథ్థ విషాగ్ని” వంటి శబ్దాలు దేవ దానవులు పెట్టే పెడబొబ్బలను  స్పురింప జేస్తాయి. మగణంతో ప్రారంభమయ్యే ప్రతి శార్దూల పాదము మూడు దీర్ఘాక్షరాలు కలిగి వుంటుంది.  శారీరకశ్రమ తారాస్థాయి చేరిన ప్రతిసారీ ఇట్లా పెడబొబ్బలు పెట్టి ఉపశమనం గాంచడం, మళ్లీ లాగడానికి ఉపక్రమించడం, మళ్లీ పెడబొబ్బలు పెట్టడం సామూహిక దేహశ్రమలోని సహజమైన ప్రక్రియ.

పద్యంలోని “స,జ, స,త,త,గ” ణాలు దేవదానవులు కవ్వపు త్రాడును లాగే సుదీర్ఘమైన ప్రక్రియను తెలిపితే, మూడు దీర్ఘాక్షరాలు కలిగిన “మగణం”, భరింపలేని దేవదానవుల శ్రమ తారస్థాయిని చేరిన ప్రతిసారీ, వారందరి ఉదర కుహరాంతరాల్లో ఒక్కసారిగా  జనించి, ముక్తకంఠాల ద్వారా లయబద్ధంగా వెలువడే అరుపులను తెలుపుతుంది.

కవ్వపు త్రాడుగా గల వాసుకి  విపరీతమైన దేహశ్రమకు లోను కావడాన్నీ, దాని ముఖం నుండి అనంతంగా నల్లని విషానల ధూమం వెలువడడాన్నీ, వెలువడిన ధూమమేఘాలు దిగ్దిగంతాలు క్రమ్ముకోవడాన్ని, నన్నయభట్టారకుడొక భావగర్భిత సమాసం ద్వారా మన మనోనేత్రం ముందు దర్శింప జేస్తున్నాడు.  “తద్వ్యాకృష్ఢ నాగానన శ్రేణీప్రోత్థ విషాగ్ని ధూమవితతుల్” అనే ఈ సుదీర్ఘ సమాసం, అనంతంగా వ్యాపించే విషాగ్ని ధూమానికి సంకేతం.

Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం

మనోరంజకమైన ఈ పద్యం  శబ్ద ప్రధానమైనది

దేవీ ప్రసాదరాయ చౌదరి ఆధునిక భారతీయ చిత్ర, శిల్ప కళారంగాల్లో ఎనలేని ఖ్యాతిని గడించిన వాడు. మదరాసు ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసినవాడు. చెన్నై మెరినా బీచ్ ఇసుకతిన్నెల్లో ఆయనచే నిర్మింపబడిన నిలువెత్తు కాంస్య శిల్పం చూపరులకు కనువిందు చేస్తుంది.  ఈ శిల్పం పేరు “కార్మిక విజయం” (the triumph of labour). దేహంపై  కేవలం గోచీగుడ్డ మాత్రమే గల కార్మికులు కొందరు, కండలు తిరిగిన తమ చేతుల్లో గునపాలు పట్టుకొని, కలిసికట్టుగా ఒక పెద్ద కొండరాయిని, ఊపిరి బిగబట్టి, దుర్భరమైన దేహశ్రమతో పెకిలిస్తుంటారు. అట్లా  పెకిలిస్తున్నప్పుడు వారి పొట్టలు లోపలికి అతుక్కొని  వుంటాయి. వీపుకు అటూ ఇటూ రెండు ఎముకలు రెండు కొండల వలె పైకి పొడుచుకొని వచ్చి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.

జీవకళ ఉట్టిపడే దేవీ ప్రసాదరాయ్ కాంస్య శిల్పం ఐదారు మంది కూలీల దుస్సహ దైనందినశ్రమను ప్రకటిస్తుంది.

దీనితో పోలిస్తే అఖండ శక్తిశాలులైన వేలాదిమంది  దేవదానవులు, అమృతం సాధించడం అనే పేరాశతో, పరస్పర శత్రుత్వం మరచి, కలిసికట్టుగా, వాసుకి అనే మహాసర్పమే కవ్వపు త్రాడుగా, అనేక యోజనాల విస్తీర్ణం కలిగిన మంధరపర్వతమే  కవ్వంగా, దుర్భేద్యమైన ఒక మహా సముద్రాన్ని తమ సమస్త శక్తులనూ ధారపోసి చిలికే ఘట్టం ఊహకే అందనిది.

Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3

మహత్తరమైన ఈ ఘట్టం దక్షిణ భారతదేశపు ప్రధాన  దేవాలయాల కుడ్యాలన్నింటిపైనా  సూక్ష్మరూపం (miniaturized) దాల్చిన శిల్పాకృతితో సందర్శకులను తరతరాలుగా ఆకట్టుకొంటున్నది.

ఈ దేవాలయ శిల్పాలు ఘనీభవించిన క్షీరసాగరమధన పద్యాలు.  నన్నయ భట్టారకుని క్షీరసాగర మధన పద్యం ద్రవీభవించిన ఒక దేవాలయ శిల్పం. దేవాలయ శిల్పాలు చూపరులకు నయనానంద కరమైన నిశ్శబ్ద పద్యాలైతే, ఆదికవి పద్యం పఠితలకు కర్ణపేయమైన ఒక శబ్దశిల్పం.

Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles