Saturday, July 13, 2024

మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్! 

         ‘ల్ ఇండియా సర్వీసెస్’లో పనిచేసే- ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్., ఐఆర్.ఎస్., సర్వీస్ అధికారుల మధ్య వారి పనికి సంబంధించిన ‘నెట్ వర్కింగ్’ ఎలా ఉంటున్నది అనేది బయట ప్రపంచానికి తెలిసే అవకాశం బాగా తక్కువ. ప్రధానంగా మన దేశం ఇతర దేశాలతో చేసుకునే అంతర్జాతీయ ఒప్పందాలు అమలు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలు గురించి కూడా మన పౌరసమాజానికి ఉండే అవగాహన బాగా తక్కువ. వాళ్ళు తమ విధుల్ని రాజకీయ నాయకులు మాదిరిగా ‘ఫోకస్డ్’గా చేయాలని అనుకోరు. అయినా ఏదైనా ఒక ‘పబ్లిక్ ఇష్యు’ ఉందంటే, దాని గురించి మన సమాచార మాధ్యమాలు ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో- ‘ఎగ్జిక్యూటివ్’ను దాని పనితీరును అస్సలు పట్టించుకోరు.

Also read: నవతరం రాజకీయాల్లోకి – వై.ఎస్. షర్మిల

         ఎందుకు ఈ మాట అనడం అంటే, ప్రపంచీకరణ తర్వాత, పలుదేశాలతో మనం- ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు’ చేసుకోవడం మొదలయ్యాక, ఇతర దేశాలతో జరిగే వాణిజ్య లావాదేవీలపై ‘రాజ్యం’ పక్షంగా నిరంతర నిఘా ఉంచాల్సింది, సంబంధిత చట్టాలను కఠినంగా అమలుజరిగేట్టుగా చూడాల్సింది బ్యూరోక్రసీ అనబడే- ‘ఎగ్జిక్యూటివ్’ వ్యవస్థ మాత్రమే. ఎవరూ పెద్దగా పట్టించుకోరు గానీ, అందుకోసం పైన చెప్పిన మూడు ‘సర్వీస్’ల అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తారు. అలాగే ‘టెక్నాలజీ’ పాత్ర కూడా ఇందులో ఎంతో కీలకంగా మారింది. అవసరం అయినప్పుడు వారు, ‘ఇండియన్ ఫారెన్ సర్వీస్’ అధికారుల సహకారం తీసుకుంటారు.

         అయినా ఇదెలా ఉంటుందో తెలుగువారికి గుర్తుచేయడం తేలిక. రాష్ట్ర విభజన చట్టాన్ని, ఇంకా వీడిపోని రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను ఏకకాలంలో 2014నాటికి అమలు చేయవలసి వచ్చింది. అయితే, రాష్ట్రపతి పాలనలో- ‘ప్రభుత్వం’ లేకపోయినా కేంద్ర-రాష్ట్ర అధికార వ్యవస్థల మధ్య సమన్వయంతో దాన్ని పూర్తిచేసి, రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకులకు ‘ప్రభుత్వాలను’ అప్పగించింది- ‘ఎగ్జిక్యూటివ్’ వ్యవస్థ.

Also read: తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు

         అయితే, ‘బ్యూరోక్రసీ’ పనితీరు ఇలా ఉంటే, ఒక చట్రానికి లోబడకుండా రాజకీయ నాయకులు ఎటువంటి విషయం గురించి అయినా స్వేచ్ఛగా మాట్లాడతారు కనుక, వారు చెబుతున్న ప్రతిదీ ‘శాసనం’ అని సమాజము, ప్రజలు కూడా అనుకోనక్కరలేదు. భారత ప్రభుత్వం 2017 జులై 1 నుంచి ‘గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్’ (జీఎస్టీ) విధానం అమలుచేసింది. తొలుత కొంత ఇబ్బందిపడినా ఇప్పుడు అన్నిస్థాయిల్లో అది అమలవుతున్నది, ఇప్పుడు అదొకటి మనం కడుతున్నాము అనే విషయం కూడా మనం మర్చిపోయాం.

         ఇక- ‘జీఎస్టీ’ పన్నుల వసూళ్ళలో పురోగతి లేదా గణనీయమైన వృద్ధి వంటి వివరాలు పెద్దగా ఆకర్షణీయమైన వార్తలు కాదు కనుక, వాటిని మనం పెద్దగా పట్టించుకోము. అటువంటి పత్రికా ప్రకటనలు ఇచ్చిన వారి ముఖాలు కూడా మనకు గుర్తు ఉండవు. అదే- ‘విదేశాల్లో తల దాచుకుంటున్న ఆర్ధిక నేరస్థులను పట్టుకొచ్చి చట్టానికి అప్పగిస్తాం’ అనే రాజకీయ నాయకుల గంభీరమైన ప్రకటనల్ని మనం అంత త్వరగా మర్చిపోము. చివరికి అది అవుతుందా లేదా అనేది వేరే విషయం.  

         ఇప్పుడు మూడవసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎన్.డి.ఏ వ్యూహాలు రచించడం తెలిసిందే. ఎన్నికలకు ఏడాది ముందు, బయట దేశాల్లో దాక్కొన్న ఆర్ధిక నేరస్థులను పట్టుకుని రావడం మాట ఎలా ఉన్నప్పటికీ, దేశంలో ‘జీఎస్టీ’ వసూలు వంటి విషయంలో తమ పాలనలో ఎంత పటిష్టంగా పనిచేస్తున్నదో చూడండి, అంటూ ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్- ‘స్కిల్’ కేస్ నరేంద్ర మోడీకి అందివచ్చిన అవకాశంగా ఉపయోగపడవచ్చు.

Also read:  ‘ఫుడ్ ప్రాసెసింగ్’ తో తొలి ‘హైబ్రిడ్’ రాష్ట్రంగా ఏ. పి.  

         పెద్ద మొత్తంలో ‘జీఎస్టీ’ వసూలు చేయవలసిన లావాదేవీ ఏదైనా అనుమానాస్పదం అనిపించినప్పుడు, అందుకు సంబంధించిన- ‘ఇన్వాయిస్ నెంబర్’ ప్రాతిపదికగా ఆ ‘గూడ్స్’ కదలికల్ని ‘ట్రాక్’ చేయడం ఇప్పుడు అత్యంత సులభం అయిపోయింది. కేంద్రంలో సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్రంలో అదే సర్వీస్ కు చెందిన వారు ఇప్పుడు పూర్తిస్థాయి సమన్వయంతో వీటిని ‘ట్రాక్’ చేస్తున్నారు. అది కనుక ‘ఫేక్ ట్రాన్సాక్షన్’ కనుక అయితే, ఇట్టే దాన్ని పట్టేస్తున్నారు. పెనాల్టీలు భారీగా వసూలు చేస్తున్నారు.  

          అలాగే ఆదాయ పన్నుశాఖ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ 2023 ఆగస్టు 4న జారీ చేసిన ‘షో-కాజ్’ నోటీస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా ఎక్కడో పెరట్లో వెతుకుతుంటే దానిదారి వెనుక నుంచి ముందుకు ఇంటి గదులన్నీ దాటుకుంటూ ముందుకొచ్చి ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి ఆగింది. నవంబర్ 2019లో పూణేలోని పార్ధసాని అసోసియేట్స్ కార్యాలయంలో జరిగిన ఐ.టి సోదాల్లో దొరికిన ‘లింక్’ను అధికారులు పట్టుకుంటే, అది అమరావతి రాజధాని కోసం వెలగపూడిలో కట్టిన తాత్కాలిక సచివాలయ సముదాయం వద్దకు విషయాన్ని చేర్చింది. అది-2023 ఆగస్టు 4 నాటికి బయటకు వచ్చింది.     

         దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పరపతి ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు కనుక, మోడీ ప్రభుత్వం హయాంలో ఆర్ధిక నేరాల కట్టడి కోసం పనిచేస్తున్న వ్యవస్థల ‘నెట్ వర్క్’ దేశమంతా ఎంత పటిష్టంగా పనిచేస్తున్నది చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడానికి, ఇప్పుడు ఈ రెండు కేసులు వారికి- ఎదురొచ్చిన ఏరువాక చందంగా మారాయి. ఇక ఇవి- నరేంద్ర మోడీ ప్రచార అంబుల పొదిలోకి చేరిన కొత్త అస్త్రాలు అవుతాయా? అంటే, ఈ ఏడాది చివరకు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కనుక, అది స్పష్టం కావడానికి కూడా అట్టే సమయం పట్టక పోవచ్చు.

Also read: ఉద్రిక్తతల్లో ‘ఆమె’ లక్ష్యం కావడం అనాగరికం!    

  

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles