Tuesday, November 12, 2024

ఎంతకీ అర్థం కాని జీవితం!

My Confession

                           ————————

                                               By Leo Tolstoy

నా సంజాయిషీ

                           ———————

                                               లియో టాల్స్టాయ్

  తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                              చాప్టర్ – 7

                               ———–

సైన్సులో నా ప్రశ్నలకు వివరణ దొరకక, నేను జీవితంలో వెతకడం మొదలుపెట్టాను (నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఏమైనా దొరకవచ్చు అనే ఆశతో). నా చుట్టూరా ఉన్న మనుషులు — నాలాంటి వాళ్లు — ఎట్లా బ్రతుకుతున్నారు? నా జీవిత ప్రశ్న పట్ల (ఏదైతే నన్ను నిరాశతో కృంగతీసిందో) వారి వైఖరి ఏమిటి? అని పరిశీలించడం మొదలెట్టాను.

విద్యా స్థాయి, నడవడికలలో నా స్థితిలో ఉన్న వారిలో — నేను క్రింద చెప్పింది

కనుగొన్నాను :

   నా స్థితిలో ఉన్న వారిలో — మేమున్న ఘోరమైన స్థితి నుండి బయటపడే మార్గాలు నాలుగు ఉంటాయని కనుగొన్నాను.

మొట్టమొదటిది అజ్ఞానం.

———————

జీవితం అరిష్టమూ  మరియు అసంబద్ధమూ అని తెలుసుకోలేకపోవడం. ఈ రకమైన మనుషులు (స్త్రీలు, పిల్లలు మరియు నిస్తేజంగా ఉన్నవారు) — స్కోపెన్ హాయేర్, సోల్మన్ మరియు బుద్ధునికి వచ్చిన జీవిత ప్రశ్నను- సరిగా అర్థం చేసుకోలేకపోయారు. వారు తమ కోసం డ్రాగన్ వేచి ఉంటుందని, వారు వేలాడే కొమ్మను ఎలుకలు కొరికి వేస్తాయని — చూడలేరు. తేనె చుక్కలు రుచి చూస్తూ ఉంటారు. కానీ వారు కొంతసేపే ఆ తేనె చుక్కలను ఆస్వాదించగలరు; ఏదో ఒకటి వారి దృష్టిని డ్రాగన్, ఎలుకల వైపు మరలిస్తుంది. వారు తేనెని ఆస్వాదించడం ఆగిపోతుంది. వారి నుండి నేనేమీ నేర్చుకోలేను (మనకు కొంత తెలిసిన దాని గురించి — ఇంకా ఎక్కువ తెలుసుకోకుండా ఆపేయలేం).

యస్నయా పాలియానాలో చెట్లు (ఫొటో కర్టెసీ జయప్రభ)

రెండవ మార్గం — ఎపిక్యూరియానిజం.

————————–

జీవితం యొక్క నిరర్థకతను గుర్తిస్తూనే — దాని నుండి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించడం.

(డ్రాగన్, ఎలుకలను పట్టించుకోకుండా — తేనె దొరికినంత అందబుచ్చుకోవడం). సోల్మన్ ఈ బయటపడే మార్గాన్ని ఇలా వ్యక్తపరుస్తాడు.” నేను ఆనందంగా ఉండడాన్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే — మనిషికి ఆకాశం కింద తినటం, త్రాగటం మరియు ఉల్లాసంగా ఉండడం కన్నా మంచి విషయం ఏముంటుంది! ఇది మనిషి శ్రమ చేసే రోజుల్లో కూడా అతన్ని అంటిపెట్టుకొని ఉండాలి.

Also read: శాక్యముని అడిగిన మౌలిక ప్రశ్నలు

“అందుచేత, నీ రొట్టె ఆనందంగా తిను. నీ మద్యం ఉల్లాస హృదయంతో ఆస్వాదించు. నువ్వు గర్వపడే రోజుల్లో, ప్రేమించిన నీ భార్యతో ఆనందంగా గడుపు. ఇదే జీవితంలో నీ పాత్ర! ఆకసం క్రిందఎండలో నువ్వు పడిన శ్రమ. నీ చేతులు ఏమి చేయదలుచుకున్నాయో అది నీ పూర్తి శక్తితో చెయ్యి! ఎందుకంటే నువ్వు వెళ్లే సమాధిలో — నీకు పని, పనిముట్లు, విజ్ఞానం ఇంకా జ్ఞానం — ఇవేవీ ఉండవు.”

మన లాంటి వాళ్ళ సమూహంలో అత్యధిక జనం ఈ రకంగా జీవితాన్ని వారికి వారు సుసాధ్యం చేసుకుంటారు. వాళ్ల పరిస్థితులు వారికి శ్రమ కన్నా సంక్షేమాన్ని  ఎక్కువ సమకూరుస్తాయి. వారి నైతిక మందబుద్ధి — వారి స్థితికి ఉన్న అనుకూలత కేవలం యాదృచ్ఛికం అనే విషయాన్ని మరిపింప చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ సాల్మన్ లాగా వెయ్యి మంది భార్యలు, రాజభవనాలు కలిగి ఉండరు. వెయ్యి మంది భార్యలున్న వారు ఒకరుంటే, ఒక భార్య కూడా లేనివారు వెయ్యి మంది ఉంటారు. ప్రతి ఒక్క రాజభవనాన్ని వెయ్యి మంది చెమటోడ్చి నిర్మించాలి. ఏ యాదృచ్ఛికం అయితే నన్ను ఈరోజు సాల్మన్ చేసిందో, రేపు అదే నన్ను సాల్మన్ బానిస కింద చేయవచ్చు. ఈ ప్రజల భావనల మందబుద్ధి, వారిని అన్ని విషయాలు మరిచేటట్లు చేస్తుంది — రోగం, ముసలితనం, మరణం యొక్క అనివార్యత రేపో మాపో ఆనందాలన్నీ నాశనం చేస్తుంది — ఇవే బుద్ధునికి శాంతి లేకుండా చేసినవి.

 అందుచేత — మన రోజుల్లో ఉన్న, మనలాగా బ్రతుకుతున్న అత్యధిక ప్రజల మనోభావాల గురించి ఆలోచించు. వీరిలో కొంతమంది వారి ఆలోచనా దారిద్రం, ఊహా శక్తి రాహిత్యం — ఈ రెంటిని వారి తాత్వికత కింద చలామణి చేస్తారు. అసలు ప్రశ్నలనే వదిలేసి. తేనెనాస్వాదించే వారి కన్నా, వారు మెరుగని నేననుకోను. వారిని నేననుకరించలేను; వారి మందబుద్ధి నాకు లేదు కాబట్టి నేను కృత్రిమంగా దాన్ని నాలో తయారు చేసుకోలేను. ఎలుకలు, డ్రాగన్ నుండి నా కళ్ళు మరల్చుకోలేను. ఒకసారి చూసిన తర్వాత చైతన్యవంతుడైన ఏ మనిషి ఆ పని చేయలేడు.

Also read: ‘నేనేమిటి?,’ ‘ఈ విశ్వం ఏమిటి?’

ఇక మూడో బయటపడే మార్గం

——————————————

ఇది బలానికి,శక్తికి సంబంధించింది. జీవితం ఒక అనర్థమూ, అసంబద్ధమూ అని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ధ్వంసం చేసుకోవడం అనేది — అనూహ్యమైన శక్తి, స్థిరమైన మనస్తత్వం ఉన్న మనుషులు కొందరు మాత్రమే ఆ పని చేయగలరు. వారి మీద ప్రయోగించబడిన జీవితమనే ఈ మూర్ఖపు అపహాస్యం వారితో ఆడుకుంటూందని అర్థం చేసుకుని,  బ్రతకడం కంటే జీవితం చాలించడం మేలని, ఉనికిలో లేకుండా ఉండడమే అత్యుత్తమమైనదని — వారు తదనగుణంగా వెంటనే జీవితాన్ని అంతం  చేసుకుంటానికి పూనుకుంటారు. అలా అంతం చేసుకునే సాధనాలు కోకొల్లలు : త్రాడుతో ఉరి, నీటిలో మునగటం, కత్తితో గుండెల్లో పొడుచుకోవడం, రైలు కింద పడటం — ఇలాంటివి. మన స్థాయిలో ఉన్న చాలామందిలో ఈ విధంగా ప్రవర్తించే మనుషుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఎక్కువగా వాళ్ళు జీవితంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడే ఈ విధంగా చేస్తున్నారు. ఆ సమయంలో వారి మానసిక స్థితి పూర్తిగా వికసించి ఉంటుంది ( మనసుని పాడు చేసే అలవాట్లు నేర్చుకొని ఉండరు).

యస్నయా పాలియానాలో టాల్ స్టాయ్ సమాధి (ఫొటో కర్టెసీ జయప్రభ)

అదే నేను అత్యంత విలువైన జీవితం నుండి బయటపడే మార్గంగా చూశాను. దాన్నే స్వీకరించాలనుకున్నాను.

 ఇక జీవితం నుండి విముక్తి పొందే నాలుగో మార్గం — బలహీనత.

—————

అదేమిటంటే — పరిస్థితిలో నిజాన్ని చూస్తాం. దాన్నించి ఏమీ రాదని తెలిసి కూడా ఆ జీవితాన్ని పట్టుకునే వేలాడుతూ ఉంటాం. ఈ రకం జనాలకు జీవించడం కన్నా మరణమే మేలని తెలుసు. కానీ వారికి (ఈ మోసాన్ని అంతం చేసి, ఆత్మహత్య చేసుకునే) సహేతుకంగా ప్రవర్తించే మానసిక బలం ఉండదు. వారు దేనికోసమో వేచి చూస్తూ ఉంటారు. ఈ బలహీనతే బయటపడే మార్గం. ఉత్తమ మార్గం ఏదో నాకు తెలిసీ, అది నా ఆధీనంలో ఉంటే,ఆ ఉత్తమ మార్గాన్ని నేనెందుకు స్వీకరించడం లేదు? నేనా రకానికి చెందుతాను.

నాలాంటి ప్రజలు ఆ నాలుగు మార్గాల్లో కనపడుతున్న విపరీతమైన వైరుధ్యాల నుంచి తప్పించుకుంటారు. దాని మీద నా దృష్టి ఎంత పెట్టినా గాని, ఆ నాలుగు మార్గాలు తప్ప వేరే ఏమీ కనపడలేదు. ఒక  మార్గం ఏమిటంటే — జీవితం వివేకం లేనిది, వ్యర్థమైనది ,అనర్ధమైనది — అని అర్థం చేసుకోకపోవడం. జీవించకపోవడమే మంచిది. నేనిది తెలుసుకోకుండా ఉండలేకపోయాను. ఒకసారి తెలుసుకున్నాక, దాన్ని నా దృష్టి నుంచి తప్పించలేకపోయాను. రెండో మార్గం ఏమిటంటే — భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవితాన్ని గడిపేయడం. నేనది చేయలేకపోయాను. వృద్ధాప్యము, రోగము, మరణము ఉంటాయని తెలిసిన నేను శాక్యమునిలా వాటికోసం వెతుకుతూ వెళ్లలేదు. నా ఊహ చాలా స్పష్టం. విధి వశాత్తు అనుకోకుండా లభించిన క్షణిక ఆనందాలతో నేను సంతోషించలేకపోయాను. ఇక మూడవ మార్గం — జీవితం అనర్ధమూ, మూర్ఖమూ అని అర్థం చేసుకొని, ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతమొందించుకోవడం. నేనది అర్థం చేసుకున్నాను గాని, ఎందుకో నన్ను నేను చంపుకోలేకపోయాను. నాలుగో మార్గం — సాల్మన్, స్కోపెన్ హాయర్ లాగా బ్రతకడం : జీవితం మన మీద ప్రయోగింపబడిన మూర్ఖపు అపహస్యం అని తెలిసీ, జీవితం కొనసాగించడం .(స్నానం చేయడం, బట్టలు ధరించడం, భోజనం, మాట్లాడడం ఇంకా పుస్తకాలు రాయడం కూడా) ఇది నాకు వికర్షకం, వేదనాభరితమైనప్పటికీ నేను ఆ స్థితి లోనే కొనసాగాను.

Also read: ఆత్మహత్యవైపు ఆలోచనలు

స్పృహ లేకుండా చేసిన నా పనికిరాని ఆలోచనల వలన నేను ఆత్మహత్య చేసుకోలేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జీవితం నిరర్థకమని నన్ను ఒప్పించిన మేధావుల, మరియు నా యొక్క ఆలోచనా పరంపర  — ఎంత నిస్సంశయంగా, నిస్సందేహంగా ఉన్నప్పటికీ, నాలో ఏదో ఓ మూల —  నా అంతిమ సారాంశంలో ఉన్న న్యాయం గురించి —  ఒక సందేహం మిగిలిపోయింది.

ఇది ఈ రకంగా ఉంది: నేను (అంటే నా సహేతుకత) జీవితం అర్థం లేనిది అని ఒప్పుకున్నాను. హేతువు కంటే గొప్పది ఏదీ లేదనుకుంటే (ఏమీ లేదు కూడా! ఉందని ఏదీ నిరూపించలేదు) సహేతుకతయే నాకు ఈ జీవితాన్ని సృష్టించింది. హేతువు ఉనికిలో లేకపోతే నాకు జీవితం ఉండేది కాదు. హేతువే సృష్టికర్త అయినప్పుడు — అదే జీవితాన్ని ఎలా కాదంటుంది? (లేదా) ఇంకో రకంగా చెప్పాలంటే: జీవితం లేకపోతే నా హేతువు ఉనికిలో ఉండదు. అందుకని హేతువు అనేది జీవితం యొక్క పుత్రుడు. జీవితం సర్వస్వం. హేతువు దాని ఫలం. అయినా హేతువు జీవితాన్ని తిరస్కరిస్తుంది. ఇక్కడేదో పొరపాటు ఉందని నా భావన. ‘జీవితం అనేది ఒక మూర్ఖపు అనర్ధం. ఇది ఖచ్చితం.’ అని నాకు నేను అనుకున్నాను. అయినా నేను జీవించాను. ఇంకా జీవిస్తున్నాను. మానవకోటి అంతా బ్రతికింది. ఇంకా బ్రతుకుతుంది. అది ఎట్లా? బ్రతకడం సాధ్యం కానప్పుడు ఈ మానవ కోటి ఎందుకు బ్రతుకుతోంది? జీవితంలోని  మూర్ఖతను, చెడును అర్థం చేసుకోవడం నాకు, స్కోపెన్ హాయర్ కు మాత్రమే సాధ్యమైందా? మేమిద్దరమే జ్ఞానులమా?

యస్నయా పాలియానాలో టాల్ స్టాయ్ నివాసం

 ‘జీవితం వ్యర్థం’ అనే కారణం అర్థం చేసుకోవడం ఎవరికీ (అతి సామాన్యులతో సహా) కష్టం కాదు: అయినా గాని వారు జీవించారు. ఇంకా జీవిస్తున్నారు. వారందరూ జీవితానికి కారణం ఏమిటి అని ఆలోచించకుండా — అలా బ్రతికేస్తున్నారు! ఇది ఎలా?

మునుల యొక్క జ్ఞానంచే నిర్ధారించబడ్డ నా విజ్ఞానం  నాకిలా తెలిపింది — భూమ్మీద ఉన్న ప్రతిదీ (ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్) తెలివిగా అమర్చబడింది. నా స్థితి ఒక్కటే తెలివి తక్కువగా ఉంది. ఆ మూర్ఖపు జనాలకు (అపారమైన జన సందోహాలు) ప్రపంచంలో ఆర్గానిక్, ఇనార్గానిక్ పదార్థాలు ఎలా అమర్చబడినాయి దాని గురించి తెలీదు: కానీ వాళ్లు బ్రతుకుతున్నారు. వాళ్ల జీవితాలు చాలా క్రమ పద్ధతిలో అమర్చబడినాయని వారికి అనిపిస్తుంది!…

  నాకు తట్టింది: “నాకు తెలియనిది ఏదైనా ఉందేమో? ఏమైనా ఉంటే ఏమిటి? అజ్ఞానం అదే పద్ధతిలో ప్రవర్తిస్తుంది. నేను చెబుతున్నది ఎప్పుడూ అజ్ఞానం చెబుతుంది. దానికి ఏదైనా తెలియనప్పుడు ఆ విషయం మూర్ఖత్వం అనుకుంటుంది. నిజానికి ఈ అనంత మానవకోటి జీవితానికి అర్థం తెలిసిన దానిలాగా బ్రతికినట్లు, ఇంకా బ్రతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అర్థం చేసుకోకుండా అది బ్రతకలేదు; కానీ నేననేది ఏమిటంటే ఈ జీవితం అంతా ఒక తెలివి లేనితనం. అందుచేత నేను బ్రతకలేను.

“ఆత్మహత్యతో మన జీవితాన్ని తిరస్కరించడం ఏదీ ఆపలేదు. సరే అయితే. నిన్ను నువ్వు చంపుకో! చర్చించకు. జీవితం నీకు అసంతృప్తిగా ఉంటే నిన్ను నువ్వు చంపుకో! నువ్వు బ్రతుకు– నీకు జీవితం అర్థం కాకపోతే  — అంతం చేసుకో. అంతేకానీ నాకు జీవితం అర్థం కాలేదని చెబుతూ, రాస్తూ మూర్ఖునిలాగా అటూ ఇటూ తిరగకు. ప్రజలందరూ తృప్తిగా ఉన్నారు. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. నువ్వు వారి సహచర్యంలోకి వచ్చావు. అప్పటికి నీకు జీవితం నిస్తేజమూ, వికర్షకమూ  అయితే —- వెళ్ళిపో!”

నిజానికి ఆత్మహత్య యొక్క అవసరాన్ని గుర్తించి కూడా (ఆత్మహత్య) చేసుకోవడానికి ఇంకా నిశ్చయించుకోలేని మనం బాగా దుర్బలులం, స్థిరత్వం లేని వాళ్ళం. సూటిగా చెప్పాలంటే — అతి మూర్ఖులైన మనుషులు (ఒక దుష్ప్రవర్తన గల స్త్రీ బొమ్మ గురించి రచ్చ చేసే మూర్ఖుడిలాగా) వారి మూర్ఖత్వంతో చేసే ఆర్భాటం లాగా కాక మరేమిటి? ఎందుకంటే — మన జ్ఞానం ఎంత నిస్సందేహమైనదైనా, జీవితం యొక్క అర్థం గురించి మనకు సరైన విజ్ఞానం ఇవ్వలేదు. జీవితం గడిపిన కోట్లాదిమంది మానవులు జీవిత పరమార్ధం గురించి సందేహం వెలిబుచ్చటం లేదు.

పూర్వకాలం నుంచీ, జీవితం మొదలైనప్పటి నుంచీ,  జీవితం వ్యర్థం అనే వాదనను తెలుసుకొని కూడా జనం జీవించారు. ఆ ఆలోచన ఎంత అవివేకమైనదో నేను తెలుసుకున్నాను. అయినా జీవితానికి కొంత అర్థం ఆపాదిస్తూ బ్రతికేశారు.

 జీవితం మొదలైన కాలం నుంచీ జీవితం యొక్క అర్థం వారు అనుకున్నట్లుగా ఉండేది. వారట్లా గడిపారు. అదే జీవితం నేనూ కొనసాగించాను. నాలో ఉన్నది, ఇంకా నా చుట్టూ ఉన్నది (భౌతికమైన, అదిభౌతికమైన) అంతా వారి జీవన జ్ఞానఫలం. ఆ ఆలోచనా పరికరాలు (వేటితోనైతే నేను జీవితాన్ని పరిగణించడం, తిరస్కరించడం చేస్తానో) — నేను కనుగొన్నవి కాదు. పూర్వీకులు చేసినవే. నేను పుట్టడం, పెరగటం, నేర్చుకోవడం అన్నీ వారి వల్లనే. వారికి నా కృతజ్ఞతలు. ఇనుము బయటకు తీశారు. అడవులెట్లా  నరకాలో నేర్పారు. ఆవులు, గుర్రాలు పెంచారు. జొన్న విత్తనాలు వేయడం నేర్పారు. కలిసి ఉండడం నేర్పారు. మన జీవితాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టారు. ఆలోచించడం, మాట్లాడడం నేర్పారు. వారిచే ఉత్పత్తి చేయబడి, ఆహార పానీయాలు ఇవ్వబడి, వారితో ఎన్నో విషయాలు నేర్పబడి,   వారి ఆలోచనలు, మాటలు కొనసాగిస్తున్న నేను, ఇప్పుడు వారు అర్థం లేని వారు అని వాదిస్తున్నాను! “ఎక్కడో, ఏదో తప్పనిపిస్తోంది ” నాకు నేనే అనుకున్నాను. ” ఎక్కడో ఘోరమైన తప్పిదం చేశాను.” ఆ తప్పు ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది.

Also read: జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో!

——–  ————   ————–

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles