Saturday, September 30, 2023

త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!

వోలేటి దివాకర్

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో  ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడును పరామర్శించిన అనంతరం ఒకవై పు బాలకృష్ణ, మరోవైపు నారా లోకేష్ చేతులు కట్టుకుని నిలబడి ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం జనసైనికులను, ముఖ్యంగా పవన్ సామాజిక వర్గీయులను, ఎంతో ఆనందింపజేసింది. రాజకీయ కక్షతోనైనా అవినీతి కేసులో చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లిన వేళ రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రావాలని, పవన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని వారు కోరుకుంటున్నారు. తెలుగుదేశం, జన సేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇది సాధ్యమా అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇక సీట్ల సర్దుబాటు మిగిలింది. ఈ కూటమి అధికారంలోకి రావాలంటే ఇరు పార్టీల కార్యకర్తలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఇరుపార్టీల్లోని ఆశావహులు సిద్ధంగా ఉన్నారా అన్నదే అసలు ప్రశ్న. అలాగే సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలన్నది తమ అభిమతమని గతంలోనే పవన్ స్పష్టం చేశారు. ఏ మేరకు ఆయన గౌరవప్రదమైన సీట్లు సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Also read: చంద్రబాబు అరెస్టు తరువాత….!

ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన 40-50 సీట్లను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గత ఎన్నికల ఫలితాలను సాకుగా చూపించి జనసేనకు 20-25 సీట్లకు మించి కేటాయించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిఎస్పీ, వామపక్షాలతో కలిసి 25 సీట్లలో పోటీ చేశారు. పవన్ భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి రెండుచోట్లా ఓటమి పాలయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో  గెలుపు బోణీ కొట్టింది. అక్కడ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత ఆయన పార్టీ ఫిరాయించి అధికార పార్టీకి అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Also read: మన బెజవాడ బంగారం…. కాదు ప్లాటినం

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించినట్లు జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకే అత్యవసరం. ఈ పరిస్థితుల్లో జనసేనతో పొత్తు కుదిరితే కోస్తాలో టిడిపి నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జన సేన ప్రభావం చూపించే అవకాశం ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, కొత్త పేట, రాజానగరం, తదితర సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Also read: అందుకేనా గద్దర్ లో ఆ మార్పు?!

గోరంట్ల సీటు గోవిందా?

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం, రూరల్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు సిటీలో పోటీ చేసే అవకాశం ఎలాగూ లేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ సీటును కూడా జనసేన కీలకనేత, పార్టీ అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ కు త్యాగం చేయాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంలో చురుగ్గా తిరుగుతున్న జన సేన పార్టీ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ టిడిపికి సీటు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకదశలో ఆయన కూడా రాజమహేంద్రవరం సీటు కోసం పట్టుపట్టవచ్చు. మాజీ టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అలక కారణంగా రాజానగరం నియోజకవర్గంలో టిడిపికి సరైన అభ్యర్థి లేరు. ఇటీవలే దివంగత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావు కుమారుడు వెంకటరమణ చౌదరిని రాజానగరం టిడిపి ఇన్చార్జిగా నియమించారు.

Also read: టీటీడీ మహాభారతంలో తప్పులు?!

రాజానగరం కోసం టీడీపీ పట్టుపడితే  విచ్చలవిడిగా సొమ్ములు ఖర్చు చేస్తూ రాజానగరం జనసేన అభ్యర్థిగా విస్తృత ప్రచారం పొందుతున్న బత్తుల బలరామకృష్ణకు నిరాశ తప్పకపోవచ్చు. రాజమహేంద్రవరం సిటీ సీటును ఆశిస్తున్న ఆదిరెడ్డి వాసును పార్లమెంటుకు పోటీ చేయించి, గోరంట్లను సిటీకి మారుస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వాసు మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తానని స్పష్టంగా చెబుతున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఈ మధ్య ఎస్ లోకేష్ పేరు వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బొడ్డు వెంకటరమణను పక్కన పెట్టి , గోరంట్ల ను రాజానగరం పంపే  అవకాశాలూ లేకపోలేదు. త్యాగాలు చేయాల్సి వస్తే గోరంట్ల, బొడ్డు, అదిరెడ్డి, జనసేన పార్టీలో అత్తి సత్యనారాయణ, బత్తులలో ఎవరో ఒకరు సీట్లు కోల్పోవాల్సి రావచ్చు. ఎన్నికల నాటికి ఈ పరిణామాల్లో ఏదైనా జరగవచ్చు. అయితే అభ్యర్థిత్వాలను కోల్పోయే టిడిపి, జనసేన నాయకులు త్యాగాలు చేస్తారో…అధిష్టానంపై ఆగ్రహంతో వెన్నుపోట్లు పొడుస్తారో కూడా చెప్పలేము.

Also read: ఈసారి రామోజీ ఫిలిం సిటీపై ఉండవల్లి గురి!

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles