Thursday, December 8, 2022

కేసీఆర్ అపాయంట్ మెంట్ కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేఖ

హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ)సారథ్య కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో అనేక అవకతవకలు జరిగాయనీ, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తేవడంలో అధికారులు విఫలమయ్యారనీ, తమకు కనుక సమయం ఇస్తే ముఖ్యమంత్రికి స్వయంగా విషయం స్పష్టంగా నివేదిస్తామని సారథ్య కమిటీ సభ్యులు తమ లేఖలో తెలియజేశారు. ముఖ్యమంత్రి అపాయంట్ మెంటు కోరారు. సారథ్య కమిటీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇది:

శ్రీయుత కె చంద్రశేఖర్ రావు గారికి,

గౌ౹౹ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం,

హైదరాబాద్.

ఆర్యా,

విషయం :- రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 – స్థానిక క్యాడర్లకు ఉద్యోగుల కెటాయింపు – జిఓ 317 లోని లోపాలను సవరించి నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ, సమస్యలపై చర్చించేటందుకు ఉపాధ్యాయ సంఘాల పోరాటకమిటీ(యుయస్పీసీ) ప్రతినిధులకు సమయం ఇవ్వాలని అభ్యర్థన.

సూచిక :-

1. జిఓ నెం. 124 జిఎడి తేదీ 30.08.2018.

2. జిఓ నెం. 128 జిఎడి తేదీ …06.2021.

3. జిఓలు 141 నుండి 258 జిఎడి. 4.08.2021నుండి 29.08.2021.

4. GO Ms No. 317 జిఎడి తేదీ 6.12.2021.

5. ప్రభుత్వ మెమో నెం. 1655 జిఎడి తేదీ 23.12.2021.

……….

పై విషయానుసారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో స్థానికుల ప్రయోజనాలను కాపాడటం కోసం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు.

 రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు 2018 ప్రకారం రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ సూచిక 1,2 లలోని జిఓలు విడుదల చేశారు. సూచిక 3 ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలను శాఖల వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టులుగా (లోకల్ క్యాడర్లుగా) వర్గీకరించారు.

నూతన లోకల్ క్యాడర్లకలో ఉద్యోగులను సర్దుబాటు చేయటానికి సూచిక 4 లోని జిఓ 317 జిఎడి తేదీ 6.12.2021 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగుల అభ్యంతరాలను, అభ్యర్థనలను పట్టించుకోకుండా కెటాయింపులు జరిపినందున పలువురు ఉద్యోగులు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారు. సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయలేదు. స్పెషల్ క్యాటగిరీ అభ్యర్ధనలను సక్రమంగా పరిశీలించలేదు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జిల్లాల అలొకేషన్ లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయి. భార్యా భర్తలను ఒకే లోకల్ క్యాడర్ కు బదిలీ చేయవలసి ఉండగా కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ కారణంగా నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం అప్పీల్ చేసుకున్నారు. నెలరోజులు గడుస్తున్నా సదరు అప్పీల్స్ పరిష్కారం చేయటం లేదు. అందువలన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి నెలకొన్నది. సమస్యలను తమ దృష్టికి తేవటానికి వారు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు.

ఈ సమస్యలన్నింటినీ సక్రమంగా మీదృష్టికి తేవటంలో ఉన్నతాధికారులు, కొన్ని సంఘాల నాయకులు విఫలమయ్యారని భావిస్తున్నాము. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) స్టీరింగ్ కమిటీ   సభ్యులకు అపాయింట్మెంట్ ఇచ్చిన యెడల అన్ని సమస్యలను సమగ్రంగా తమకు వివరించగలము. తద్వారా తమరు సానుకూలంగా పరిష్కరించగలరనే విశ్వాసం ఉన్నది. కనుక వీలైనంత త్వరగా యుయస్పీసీ ప్రతినిధులతో చర్చలకు సమయం ఇవ్వాలని కోరుతున్నాము.

కృతజ్ఞతలతో….

భవదీయులు

స్టీరింగ్ కమిటీ

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ)

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles