Saturday, April 27, 2024

దేవతల వలె మేమైనా రాజ్యాలడిగామా?

గోదాగోవింద గీతం 20: క్రిష్ణయ్యకు గోపికల ప్రశ్న

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
కప్పమ్ తవిర్ క్కుమ్ కలియే తుయిలెజాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్ క్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెజాయ్
శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెజాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్

మాడభూషి తెలుగుభావార్థ గీతిక

ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

దానవ వైరుల తరిమికొట్టెడు సత్య బల పరాక్రముండు

పోయిన రాజ్యాల కట్టబెట్టు, మేము ముక్కోటి కన్నతక్కువనా

 మృతిని జయింప సురలు తాగిన సుధ మాకుత్త ఉప్పునీరు

భగవదనుభవమే అమృతమ్ము,రాజ్యాలు గీజ్యాలు అడగబోము

మమ్ముబాధించువారుగాక నీకు వైరులెవరు వేరె వైకుంఠనాథ

మధురాధరి, కలశస్తని, తలోదరి, నీళ, నీవె మా లక్ష్మివమ్మ

అద్దము, వింజామర, కన్నయ్య స్నాన సాంగత్యమీయవమ్మ

అర్థం

“ముప్పత్తు మూవర్ అమరర్కు” ముప్పై మూడు వర్గాల దేవతలను “మున్ శెన్ఱు” ఆపదరావడానికి ముందే వెళ్ళి కాపాడే “కప్పం తవిర్కుం కలియే!” గొప్ప బలం కలవాడివే “తుయిల్ ఏరాయ్” లేవవయ్యా. “శెప్పం ఉడైయాయ్! ” సత్య పరాక్రమశాలీ, ఆడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఏమైంది నీ మాట. ” తిఱలుడైయాయ్” సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, “శేత్తార్కు వెప్పమ్కొడుక్కుం విమలా!” శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా, ఏదోషం అంటని వాడా. “తుయిల్ ఎరాయ్” నిద్ర లేవయ్యా. నిన్న అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. “శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్” సమమైన అంగ సౌష్టవ సౌందర్యం కల్గి, “నప్పినై” స్వామి సంబందంతో ‘నంగాయ్’ పరి పూర్ణమైన అందం కలదానా! “తిరువే!” సాక్షాత్తు నీవే లక్ష్మివి “తుయిలెరాయ్” మేల్కోవమ్మా. అమ్మ ఏంకావాలని అడిగింది. “ఉక్కముమ్” స్నానానికి తర్వాత పట్టిన స్వేదాన్ని వదిలించే విసనకర్ర కావాలి, “తట్టొళియుమ్”స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, ” తందు” ఈ రెండు ఇచ్చి “ఉన్మణాళనై” నీ స్వామిని ‘ఇప్పోదే’ ఇప్పుడే ‘ఎమ్మై’ మాతో కలిపి “నీరాట్టు” నీరాడించు.

భావార్థం:
మనకు 33 కోట్ల మంది దేవతలు. వారికి ఆపదలు వస్తాయని చూచాయగా తెలిసినా ముందు తానే వెళ్లి నారాయణుడు వారి కష్టాలను తొలగిస్తాడట. మిత్రులను ఆదుకుంటూ శత్రువులను భయభీతులను చేసే మహాబలుడు, పరాక్రమ విక్రముడు. మరి ఇదేమిటి ఈ రోజు పానుపు పైనుంచి లేవడమే లేదు. గోపికలు అప్పుడు మళ్లీ నీళాదేవిని ప్రార్థిస్తారు. ఎరుపైన పెదాలు, ఎత్తయిన వక్షస్థలం, సన్నని నడుముతో నీళాదేవి, విష్ణుపత్ని శ్రీదేవి వలె అతిలోక సుందరి. మీరిరువురూ లేవండి మా సిరినోముకు కావలసిన అద్దమూ, ఆలవట్టమూ, మీ శ్రీనాథుడిని ఇవ్వండి. శ్రీకృష్ణుడితో కలిసి స్నానాలు చేసేమహాభాగ్యం మాకు కల్పించడమ్మా అని నప్పిన్న పిరాట్టి నీళాదేవిని వేడుకుంటున్నారు.

Also read: తల్లిదండ్రులను విడదీయడమే రాక్షసత్వం, రావణత్వం

విశేషార్థం:
గోపికలకు నీళాదేవికి మధ్య వాగ్వాదం జరిగిన తరువాత శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. గోపికలు నిష్ఠూరాలు ఆడారు. నీళాదేవీ మాట్లాడడం లేదు. గొల్ల పడుచులు శ్రీ కృష్ణుడిని, ఆ తరువాత నీళాదేవిని మరోసారి అర్థిస్తున్నారు. నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం కలుగుతుంది, అదే భక్తికి వైరాగ్యానికి దారితీస్తుంది. అప్పుడే బ్రహ్మానందానుభవ స్నానం లభిస్తుందని చాటిచెప్పే పాశురం ఇది.

దేవతలు 33 కోట్ల మంది, గొల్లపిల్లలమైన మా సంఖ్య తక్కువ. 33 కోట్లకు తక్కువగా ఉంటే నీవు కాపాడవా? వారికి బలం ఎక్కువ, పురుషులని అహంకారం- మేం పురుషులం కాదు, అబలలం. బలంలేని వారిని కాపాడాలి కదా. గొల్ల పడుచులం, నీ చరణాలే నమ్ముకున్నాం. వారికి పదవులు కావాలి, రాజ్యాలు కాపాడుకోవాలి- మాకు ఆ అవసరమే లేదు. అటువంటి వేరే ప్రయోజనాలేవీ లేవు. ఇంకేదైనా ఆశించే వారినే ఆదుకుంటారా? మాకు నీవిచ్చేది ఏదీ లేదు. మేమేదీ అడగడం లేదు. కఠినులైన ఘోర రాక్షసులపైకి శ్రీకృష్ణుడిని పంపే దేవతల వలె మేము నిర్దయులం కాదులే. వారు ఉప్పు నీళ్ల వంటి అమృతం తాగిన వారు. మేం భగవదనుభవం అనే అసలైన అమృతం తాగదలుచుకున్నాం. చంపినా మరణం లేని దేవతలు బలయుతులు, వారినే ఆదుకుంటావా, నిన్ను ఒక్క క్షణం ఎడబాసినా వియోగదుఃఖంతో మరణించే మాకు, శక్తియుక్తులేవీ లేని అమాయకులమైన మాకు నీరక్షణ లేదా? పోనీ దేవతలనే రక్షించడం మీవ్రతం అని భావిస్తే మమ్మల్ని దేవతలమనే అనుకొని రక్షించవచ్చు కదా. మీ క్షేమమే మాక్కావలసింది. శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్ క్కువెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెజాయ్ నీకంటూ వేరు శత్రువులు లేరు. కాని నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే అని భావించి వారినుంచి రక్షిస్తావు. ద్రౌపది వంటి ఆశ్రితులకు అభయంకరమైనవి, దుర్యోధనాది శత్రువులకు భయంకరమైనవీ అయిన పంచాయుధాలు ధరించిన వాడివి మమ్మల్ని రక్షించవా అంటూ గోపికలు అడుగుతున్న పాశురం ఇది.

Also read: నీళాకృష్ణులకు గోదా సుప్రభాత శృంగారగీతం

ఎంత వేడినా మౌనం వీడకపోతే, గోపికలు మళ్లీ జగదేక సుందరి నీళాదేవినే ఆదుకొమ్మని కోరుకుంటున్నారు. శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరవే తుయిలెజాయ్ అందమైన స్తనములు, అధరములు, సన్నని నడుము గల మహాలక్ష్మీ లేవమ్మా, నీ అందమునకు మోహించి సప్తవృషభములను లొంగదీసుకునే నియమాన్ని పాటించి నిన్ను శ్రీకృష్ణుడు చేపట్టేట్టు చేసుకున్నావు.

నీవు పరిపూర్ణురాలివి ‘నజ్ఞాయ్’ లేవమ్మా అన్నారు. ‘నేను మేలుకునే ఉన్నాను. మీకేం సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏమివ్వాలి’ అని నీళాదేవి అడిగారు. అద్దమూ వింజామరతోపాటు శ్రీకృష్ణుడినే మాకు ఉపకరణంగా వెంటనే ఇవ్వండి. మమ్మల్ని మీ దయావృష్ఠిలో స్నానం చేయించు తల్లీ’ అని వేడుకుంటున్నారు.

Also read: లక్ష్మి కరుణిస్తేనే నారాయణుని అభయం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles