Saturday, April 27, 2024

వైష్ణవమతంతో 33 దేవతలెవరు?

2‌0 తిరుప్పావై కావ్యంలో ప్రతీకాత్మకత

గోదాదేవి చాలా ప్రతీకాత్మకంగా తన భక్తి కావ్యాన్ని రచించారు. ఇది మార్గశీర్ష స్నాన వ్రతం. ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ నీస్వామిని మాకిచ్చి స్నాన మాడించు అంటున్నారు. నీవు అనుభవించిన స్వామిని మాకిమ్మని అడగడం ఏమిటి? ఈ సకల లోకాలకు ఏకైక పురుషుడు పరమాత్ముడే. అందరూ ఆబ్రహ్మానందాన్ని అనుభవించవలసిన స్త్రీమూర్తులే అవుతారు. మా అందరికి జీవన ముక్తి . మీవారితో మాకు స్నానం ఆడించు అంటే పూర్తిగా భగవధ్యానంలో మునిగిపోయే స్నానం అడుగుతున్నారు గోపికలు. ముందు పరిపూర్ణురాలైన తల్లి నీళాదేవి తన జ్ఞానభక్తి వైరాగ్యాలద్వారా స్వామిని అనుభవించి, పురుషాకారం వహించి, తన సంతానమైన జీవులందరికీ పరమాత్మైకానందాన్ని అనుభవింపచేయాలని అర్థం.

Also read: ఆబోతుల పొగరణచి నాజ్ఞజితిని గెలిచిన శ్రీకృష్ణుడు

స్నానానికి అవసరమైనవి రెండు వస్తువులు. ఒకటి- అద్దం, ముఖం చూసుకోవడానికి. రెండు- విసనకర్ర, స్నానం తరువాత పుట్టే చిరుచెమటనుతొలగించడానికి. గోపికలు మూడు వస్తువులు అడుగుతారు. అద్దం, వింజామర తరువాత మూడో వస్తువు నిజానికి వస్తువు కాదు పరమాత్మే. పరమాత్మనే కోరుతున్నారు. అద్దంలో మనస్వరూపం చూసుకుంటాం. అది స్వస్వరూప జ్ఞానం. అది ఓం కారం. అది చూసుకోగానే కొంత అహంకారం వస్తుంది. అదే చెమట. ఉక్కొమం (విసనకర్ర) తట్టొళియం (అద్దం). గోపికలు అడుగుతున్నది, నేను కాదని, నాది లేదని తెలుసుకునే జ్ఞానాన్ని కలిగించాలని, స్వేదమనే అహంకారాన్ని వెంటనే తొలగించుకోవడానికి వింజామర ఇవ్వాలని వారి అభ్యర్థన. నమః అనే పదం అహంకారాన్ని వదిలించేదని అర్థం. అందుకే ప్రతి స్తోత్రం లో నామాలు ఓం తో మొదలై నమః తో ముగుస్తాయి. ప్రతి సారీ నాది కాదు నాదికాదు అంటూ అనుకుంటూ ఉండాలి. అప్పుడే అహంకారపు చెమట వదిలిపోతుంది. ఓం పక్కన నమః చేరుతుంది. మధ్యలో చేరాల్సిందిక నారాయణ నామమే. నమః నుంచి నారాయణ దాకా వస్తే అదే అష్ఠాక్షరి. జ్ఞాన భక్తుల ద్వారానే భగవంతుడు లభిస్తాడని ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తున్నారు. నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం కలుగుతుంది, అదే భక్తికి వైరాగ్యానికి దారితీస్తుంది. అప్పుడే బ్రహ్మానందానుభవ స్నానం లభిస్తుందని చాటిచెప్పే పాశురం ఇది.

Also read: తిరుమంత్రమై శ్రీకృష్ణుని కాచే యశోద

అసంఖ్యాకములైన జీవాత్మలకు జ్ఞాన సంకోచము కలగకముందే వారి సంసారబంధాలను నివర్తనంచేసే వాడా, ఎవరూ అడగకపోయినా సకల ఉపనిషత్సారమైన గీతామృతమును బోధించిన కరుణామయుడివి, ఆశ్రితులకు అందిన వాడు, భాగవత విరోధులను నిరోధించి భక్తుల భయనివృత్తి చేసిన వాడివి, ఆచార్యుల విషయానికి వస్తే కుదృష్టి మతాలను నశింపచేసి, ఆశ్రితులకు మాశుచః అని అభయమిచ్చిన వాడు. భగవత్ వియోగము సహించలేనిదీ, జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగిన మహాలక్ష్మీ మేల్కొనుము. అహంకార మమకారాలను తొలగించి స్వస్వరూపజ్ఞానమును ప్రసాదించి నీకు వశుడైన సర్వేశ్వరునితో మమ్ము కలిపి మీ ఉభయులను సేవించే భాగ్యం ప్రసాదించవమ్మా. భగవంతుని లోబరుచుకునే వాడు ఆచార్యుడనీ, విసనకర్ర అంటే అష్టాక్షరీ అనీ, అద్దం అంటే ద్వయమని ఆచార్యపరమైన అన్వయం.

మన దేవతలెంతమంది?

మనం ముక్కోటి దేవతలు అన్నా 33 కోట్లు అన్నా అతిశయోక్తి అనిపిస్తూనే ఉంటుంది. గోదాదేవి 33 అన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారన్నారా? పరమాత్ముని మనసునుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు, ముఖము నుంచి ఇంద్రాగ్నులు, శ్వాసనుంచి వాయువు జన్మించారని చంద్రమా మనసో జాతః..అనే వేద వాక్యం వివరిస్తుంది. వేద దేవతల లెక్క 33 మంది. వీరిలో 11 మంది భూమిమీది వారు. 11 మంది అంతరిక్షపు వారు, 11 మంది ద్యులోకపు వారు. ఇదొక లెక్క. మరొక పద్ధతిలో 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులు, 8మంది వసువులు, 1 ద్యావ, 1 పృథ్వి = మొత్తం ముఫ్పది ముగ్గురు దేవతలు. వీరంతా స్వామి సృష్టించిన వారే.  ఆయన ఆజ్ఞానువర్తులే. దాశరథి రంగాచార్యుల వివరణ ప్రకారం వేద దేవతలు వేరు, ఇతిహాస పురాణాల్లో కనిపించే దేవతలువేరు.  తపస్సుచేసి బ్రహ్మరుద్రులనుంచి అలవి కాని వరాలు సంపాదించి శత్రువులైన రాక్షసులనుంచి దేవతలను రక్షించడానికి నారాయణుడు అరి భయంకరుడు అవుతాడు. ఆయనకు సొంతంగా శత్రువులు లేరు. కాని తనను ఆశ్రయించిన దేవతలు, భక్తులకు కలిగే శత్రువులనే తన శత్రువులుగా భావించి అరిషడ్వర్గాల మీద అరిభయంకరుడవుతాడు.  గోపికలు ఈ పాశురంలో స్వామిని ఏమీ అడగడం లేదు. అమ్మను అడుగుతున్నారు. విసన కర్ర అంటే జనన మరణాలతో అలసినపుడు విసురుకోవడానికి. అద్దం ఆత్మదర్శనానికి ఉపకరణం. స్వామితో కూడి స్నానం చేయడానికి సాయం చేయమంటున్నారు. స్నానం ద్వారా స్వామి సాన్నిధ్యం సాయుజ్యం కోరుకుంటున్నారు. దాశరథి ఈ పాశురంలో అంతరార్థాన్ని చిన్న పదాలతో అద్భుతంగా వివరించారు. సర్వ ఖల్విదం బ్రహ్మ అంటే అంతా ఒక్కటే. రెండు లేవు. ఈశావాస్యమిదం సర్వం అంటే ఇది సాంతం ఈశ్వరుడే. విశిష్టాద్వైతంలో ప్రకృతి వేరు పురుషుడు వేరు. పరమాత్మ వేరు. పిరాట్టి వేరు, తల్లి వేరు, తండ్రి వేరు, ఆత్మవేరు పరమాత్మ వేరు.  అయితే రెండు రెండు ఉన్నా అవి అనన్యములే. అంటే వాక్కు అర్థం వేరుగా చెప్పుకున్నా వాటిని విడదీయగలమా? రెండు కలిసి ఒక్కటి అని చెప్పేదే విశిష్టాద్వైతం. పురుషుడు స్త్రీ విడివిడి అన్నట్టు నీళాదేవిని శ్రీకృష్ణుని ప్రకృతి పురుషులుగా విడిగా ప్రస్తావిస్తున్న గోపికలు ఇద్దరూ ఒకటే అని కూడా భావిస్తున్నారు. పురుషుడు అమితపరాక్రమవంతుడు, జగదేక వీరుడు. 33 కోట్ల మంది దేవతల కష్టాలు కూడా అడగకుండా తీర్చగల వీరుడు. ఇక తల్లి జగదేక సుందరి. అంతటి స్వామిని ఆకట్టుకున్న సౌందర్యరాశి. ఆ దేవతలను ఆ ప్రకృతిని ఆ జగత్తును ఆ సౌందర్యాన్ని అన్నీ సృష్టించింది ఆ స్వామి వారే.  శ్రీదేవితో కూడిన నారాయణుడిని అర్థిస్తున్నారు. తల్లి ద్వారా తండ్రిని కోరుకుంటున్నారు.

Also read: నందరాజు సుపాలన చెప్పే పాశురం

అజ్ఞానమే మరణం అనే జ్ఞానభక్తి పాశురం

అమరులు లేదా దేవతలు అంటే మరణం లేని వారు. మరణం అంటే బ్రహ్మ జ్ఞానం లేకపోవడం. అవిద్యారూపమగు శత్రువు ఆక్రమించకముందే విజృంభించి అవిద్యా భయమును రూపుమాపడం ఆర్జవము, పరాక్రమము. దేవతలు అంటే జ్ఞానులు, వారికి భయం ఏమిటి. భగవంతుడిని నిరంతర ధ్యానంలో ఏదైనా విఘాతం కలుగుతుందేమోనన్నదే జ్ఞానుల భయం. భగవద్విషయ స్మృతిని కలిగించేవాడు భగవంతుడే. అదే స్వామితో స్నాన సంశ్లేషం, నిరంతర సాన్నిహిత్య భావన. అదే అడుగుతున్నారు ఈ పాశురంలో. ఇది జ్ఞానభక్తి.

నిన్నటి (19వ) పాశురంలో నీళాదేవితో నిష్టూరాలడతారు. ఏం ఒక్కక్షణమైనా స్వామిని విడువకపోవడం న్యాయమా ఇది నీకు తగునా అని అలుగుతారు. ఆలస్యమైందని ఓపలేక మాట్లాడుతున్నారు లే అని నీళాదేవి సర్దిచెప్పుకుని తగిన సమయం చూసి స్వామికి చెప్పి వీరిని ఆదుకుందాం అని ఆలోచిస్తూ మౌనంగా ఉందట. ఇదేమిటి అమ్మ మౌనంగా ఉంది. సరే అయ్యను అడుగుదాం. నీవైనా మమ్ముఆదుకోకపోతే దేవతలందరినీ కాపాడతావనే నీ కీర్తికి భంగం ఏర్పడుతుంది అని క్రిష్ణయ్యను ప్రార్థిస్తున్నారు. అయినా స్వామి బదులు పలకడం లేదు. నీళాదేవిని నిష్టూరాలాడినందుకు స్వామికి కోపం వచ్చిందేమో అని మళ్లీ అమ్మ గుణాలను అందాలను ప్రశంసిస్తున్నారు గోపికలు, గోదమ్మ. నీ అందంతో స్వామిని ఆకర్షించి మమ్ముకావమని చెప్పడానికి సందర్భంకోసం చూస్తున్నావు కదూ అని ఆమెతో అంటున్నారు.

Also read: విభీషణుడి చిత్తశుద్ధి, ద్రౌపది భావశుద్ధి

నీళాదేవి అంతటి జ్ఞాన సౌందర్య పరిపూర్ణసుందరి. పెదాల ఎరుపు సంతానంపట్ల ప్రేమకు నిదర్శనం. ఎదపై రెండు బంగారు కలశ స్తనాలు జ్ఞానము, భక్తి కి ప్రతీకలు. అది వైరాగ్యానికి దారి తీయాలి. ఉందోలేదో తెలియనంత సన్నని నడుము వైరాగ్యానికి ప్రతీక. ఈ బహిరంతర సౌందర్యాలకోసమే నీళాదేవిని కట్టుకున్నాడు కృష్ణుడు. స్వామిని వశం చేసుకుని పిల్లలను రక్షింపచేయడమే సంపూర్ణత్వం. నీవే లక్ష్మీదేవివి. లేవమ్మా అంటున్నారు.

Also read: భాగవత సహవాసం వల్లనే గురుకృప

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles