Tuesday, April 30, 2024

కాంతి తగ్గుతున్న కాంగ్రెస్

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ గత ఏడేళ్ల నుంచీ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని, గాంధీల వారసత్వాన్ని నిలబెట్టాలని సోనియాగాంధీ కంటున్న కలలు నెరవేరడం లేదు. పైపెచ్చు, వైఫల్యాలు,ఎదురుదెబ్బలు పెరుగుతున్నాయి.2014లో నరేంద్రమోదీ జాతీయ రాజకీయాల ప్రవేశంతో, బిజెపికి జవసత్వాలు ఎన్నో రెట్లు పెరిగాయి. మోదీని ఢీకొట్టే నాయకుడు దివిటీ వేసి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు.

తగ్గిన కాంగ్రెస్, సోనియా ప్రాభవం:

ముఖ్యంగా,2009-2014 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకర్షణను కోల్పోయింది. ఈ ప్రభావంతో సోనియా ప్రాభవం కూడా తగ్గిపోయింది. 2004 నుంచి రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ, నాయకత్వంలో పరిపక్వత, పార్టీపై పట్టు, ప్రజల్లో ఆకర్షణ పెద్దగా సాధించలేదు. తల్లి చాటు బిడ్డగానే ముద్రవేయించుకున్నాడు. 2014,2019ఎన్నికల ప్రచారంలో రాహుల్ కీలక భూమిక పోషించినా, కాంగ్రెస్ పార్టీకి వైఫల్యాలే మిగిల్చాడు. మరో రెండు మూడు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం, పార్టీ భవిష్యత్తు అంచనా వేయలేని పరిస్థితిలోనే ఉంది.

పుదుచ్ఛేరిలో చేజారిన ప్రభుత్వం:

పుదుచ్చేరిలో అధికారాన్ని కోల్పోవడం తాజా ఉదాహరణ. ఈ సంక్షోభ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే వుండి కూడా పార్టీ పరువును కాపాడుకోలేకపోయాడు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రం కూడా చేజారిపోయింది. ఎన్నికల్లో ఆశావహమైన ఫలితాలు రాని ప్రతిసారీ రాహుల్ అస్త్ర సన్యాసం చేస్తూనే ఉంటారు. ఇటువంటి పరిణామాల వల్ల అధినాయకులపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ విశ్వాసం పోతుంది. గతంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు.

Also Read: పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం

గుజరాత్ ఎన్నికలకు దూరం:

దీన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత గుజరాత్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రధాన పాత్ర పోషించకుండా మిన్నకున్నారు. సోనియాగాంధీ పుత్రవాత్సల్యంతో రాహుల్ కు పదవి మీద పదవులు పెంచుతూ వచ్చారు. 2014 జనరల్ ఎలక్షన్స్ ప్రచారం రాహుల్ అధినాయకత్వంలోనే సాగింది. కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరపరాజయాన్ని చవిచూచింది. దీనితో రాహుల్ తన పదవికి రాజీనామాకు సిద్ధమయ్యారు. 2015 ఫిబ్రవరిలో సెలవులు అంటూ…కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

రామ్ లీలాలో తీవ్రమైన వ్యాఖ్యలు:

బయటకు వచ్చిన తర్వాత ఏప్రిల్ లో రామ్ లీలా మైదాన్ లో జరిగిన “కిసాన్ ఖేత్ మజ్ దూర్ ర్యాలీ”లో పాల్గొని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తాను మళ్ళీ చురుకుగా ఉన్నాననే సంకేతాలు పంపించాడు.”చౌకీ దార్ చోర్ హై ” అనే నినాదంతో, మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్ నడిపాడు. అంతా తానై నిలిచాడు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. బిజెపి తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ పరిణామాలతో రాహుల్ మళ్ళీ అస్త్రాలు పక్కన పెట్టేశారు. పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ సెలవులు అంటూ ఎటో వెళ్లిపోయారు.

మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు:

సెలవుల నుంచి వచ్చిన తర్వాత ట్వీట్స్ లో బిజెపి ప్రభుత్వంపై విమర్శనా బాణాలు సంధించడం మొదలు పెట్టారు. బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలోనూ పాల్గొన్నారు. రాహుల్ ప్రచారం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. వరుసగా అన్ని రాష్ట్రాల్లోనూ వైఫల్యాలే ఎదురయ్యాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ లో బిజెపి అధికారాన్ని దక్కించుకుంది, హవాను పెంచుకుంది. 2019లో నరేంద్రమోదీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గాంధీల కాంగ్రెస్ వారసత్వ ప్రాభవానికి కాలం చెల్లుతోందా? అనిపిస్తోంది.

Also Read: భారత్ బచావో కాదు… కాంగ్రెస్ బచావో అనాలి

రాహుల్ వైఫల్యం:

కుటుంబ వారసత్వ పటుత్వాన్ని నిలబెట్టడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారనే చెప్పాలి. సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుంది. పార్టీకి జాతీయ అధ్యక్షుడే లేరు. సంస్థాగత ఎన్నికలే ఇంతవరకూ జరుగలేదు. ఇదిగో అదిగో అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసోం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత సంస్థాగత ఎన్నికలు జరుపుతామంటున్నారు. అధ్యక్షుడుని అప్పుడు ఎన్నుకుంటామంటున్నారు. మళ్ళీ ఈ పదవిని స్వీకరించడానికి రాహుల్ అంగీకారం తెలిపినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

మళ్ళీ పదవీస్వీకారానికి అంగీకరిస్తారా?

రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాకపోతే రాహుల్ గాంధీ పదవిని స్వీకరించడానికి ఏ మేరకు ఒప్పుకుంటాడన్నది సందేహమే. ఫలితాలు బాగా వస్తే, మళ్ళీ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జమిలి ఎన్నికల దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే మాట్లాడుతున్నారు. 2022/2023లో వచ్చే అవకాశం ఉంది. లేనిపక్షంలో 2024 దాకా ఆగాలి. అప్పటికి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పదేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తప్పనిసరిగా ఉంటుందనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాబోయే ఫలితాలు కీలకం:

అది యుపిఎ కు కలిసివచ్చే అంశమే. దాన్ని రాహుల్ గాంధీ బృందం ఏ మేరకు అందిపుచ్చుకుంటారన్నది ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. రాహుల్ బాలుడు కాడు. ఇప్పటికే 51ఏళ్ళు వచ్చాయి. ఈ పాటికే పరిపక్వత సాధించి ఉండాలనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్,రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ పార్టీ సొంత మెజారిటీతో ప్రభుత్వాలను కొనసాగిస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ లో మిత్రవర్గాలతో కలిసి ప్రభుత్వాలను నడుపుతోంది. గతంలో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వాన్ని కోల్పోయింది. దిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటకట్టుకుంది.రాజస్థాన్ లో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు -సచిన్ పైలెట్ కు దూరం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఏ క్షణంలోనైనా మళ్ళీ బద్దలు కావచ్చు.

Also Read: తమిళనాట కాషాయం ఆట

కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు:

వీటికి తోడు జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి 23మంది సీనియర్లు ఆ మధ్య లేఖాస్ట్రం సంధించారు. సీనియర్ల వర్గం -రాహుల్ యువ వర్గం మధ్య కూడా అంతరాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకొని నడిపే వ్యక్తి కావాలి. రాహుల్ కు అంతటి శక్తి ఇంకా రాలేదు. ప్రియాంక గాంధీ ఆకర్షణ కూడా అంతంత మాత్రమే. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో గాంధీల వారసత్వం ప్రశ్నార్ధకంగానే ఉంది. కాంగ్రెస్ భవిష్యత్తు కూడా అంతే ఉంది. అన్ని వర్గాల మధ్య ఐక్యత పెరిగితే, కాంగ్రెస్ కూటమికి భవిష్యత్తు ఉంటుంది.

నెహ్రూ-గాంధీ కుటుంబంపట్ల ఆకర్షణ:

ఇన్ని వైఫల్యాలు,అడ్డంకులు, అపజయాలు ఉన్నా, ప్రజల్లో గాంధీ కుటుంబంపై ఉన్న ఆకర్షణ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఈ పార్టీలో కాస్త ఆకర్షణ ఇంకా వీరికే ఉంది. రాహుల్ గాంధీకి, ప్రియాంకా గాంధీకి ఇంకా చాలా భవిష్యత్తు ఉందనే చెప్పాలి. అధికార బిజెపి పార్టీపై ప్రజలకు మొహం మొత్తితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టం కడతారు. ఏది ఏమైనా, కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలి. గత వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఐకమత్యంగా సాగాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా రాహుల్ ఎదగాలి. లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి, పార్టీలో గాంధీల వారసత్వ ప్రాభవానికి నూకలు చెల్లినట్లే.

Also Read: 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles