Thursday, March 28, 2024

భారత క్రీడారత్నం ధ్యాన్ చంద్

  • మేటి హాకీ మాంత్రికుడికి భారతరత్న ఇవ్వని ప్రభుత్వం
  • ధ్యాన్ చంద్ పైన అంతి ప్రేమ ఉంటే అత్యున్నత పురస్కారం ఇవ్వాలి
  • అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంకు కపిల్ దేవ్ పేరు పెట్టాలి
  • సాటిలేని క్రీడాకారుల పేరు పెట్టడం మంచి సంప్రదాయమే

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడంలో రాజకీయం ఉందా? దేశభక్తి ఉందా? క్రీడాస్ఫూర్తి ఉన్నదా? మూడూ ఉన్నాయా? అటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ఇచ్చిన ప్రచార ప్రకటన నిండా మోదీ మూర్తిమత్వమే ఉన్నది కానీ ధ్యాన్ చంద్ ఫొటో పైన ఎక్కడో మూలలో చిన్నగా ఉన్నది. దీనిని ఏమంటారు? ప్రచార కండూతికోసం, గాంధీ-నెహ్రూ కుటుంబం పట్ల అయిష్టతను చాటుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా?

ధ్యాన్ చంద్ నిస్సందేహంగా గొప్ప క్రీడాకారుడు. భారత దేశం తరతరాలు గర్వించదగిన హాకీ మాంత్రికుడు. దేశానికి సైనికోద్యోగిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించటమే కాకుండా భారత్ హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకం గెలుచుకోవడంలో ప్రధాన కారణభూతుడైన హాకీ తాంత్రికుడు. రాజీవ్ గాంధీ మోతీలాల్ నెహ్రూ మునిమనుమడు, జవహర్ లాల్ నెహ్రూ మనుమడు, ఇందిరాగాంధీ కుమారుడు కావడం వల్లనే 1984లో ఇందిర హత్య అనంతరం ప్రధాని పదవిని చేపట్టారు. అందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన చనిపోయిన తీరు, శ్రీలంక తమిళ టైగర్ల చేతిలో హతమైన తీరు ఆయనను ప్రత్యేక నేతగా నిలబెడుతుంది. దేశసేవలో ప్రాణాలు త్యాగం చేసిన మహోన్నత త్యాగమూర్తిగా పరిగణిస్తుంది. అమరుడుగా కీర్తిస్తుంది. అలాగని అన్నిటికీ – విమానాశ్రయాలకీ, క్రీడా మైదానాలకీ, అస్పత్రులకూ, విశ్వవిద్యాలయాలకూ – రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని వాదించడం లేదు. ఒక సారి పెట్టిన పేరును మార్చడంలోనూ ఔచిత్యం లేదు. ఉగ్రవాదుల చేతిలో హతమైన మాజీ ప్రధాని పేరును మార్చి ధ్యాన్ చంద్ పేరు పెట్టడం కంటే ముందే ధ్యాన్ చంద్ పేరు పెట్టి ఉంటే ఎవ్వరూ ఆక్షేపించే పని ఉండేది కాదు. ధ్యాన్ చంద్ పేరుతో అంతకంటే ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని ప్రారంభించినా బాగానే ఉండేది.

Dhyan Chand’s famous dribbling

పేరులోనే ఉన్నది పెన్నిధి

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చి ధ్యాన్ చంద్ పేరు  పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధాని మోదీ ఒక పని చేయగలిగితే బాగుండేది. అహమ్మదాబాద్ లో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద క్రికెట్ స్టేడియంకు సర్దార్ పటేల్ పేరు మార్చి తన పేరు పెట్టుకున్న మోదీ తన పేరును  కూడా తొలగించి కపిల్ దేవ్ (మొదటిసారి భారత్ కు ప్రపంచ కప్ ను 1973లోనే గెలుచుకొని వచ్చిన క్రికెట్ దిగ్గజం)పేరు పెడితే అందరూ ఎంతగానో సంతోషించేవారు. రాజీవ్ పేరు మార్చడాన్ని తప్పుపట్టేవారు కూడా కాదు.  ఆ పని చేయకపోవడంతో, బతికుండగానే ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ  తమ పేర్లను పథకాలకూ, స్టేడియాలకూ పెట్టుకునే దురాచారాన్ని, తమ విగ్రహాలను తామే ఆవిష్కరించుకునే దుష్టసంప్రదాయాన్ని కొనసాగించిన మామూలు రాజకీయవాదిగా మోదీ మిగిలిపోతారు.

రాజీవ్ పేరు తొలగించడానికి అభ్యంతరం చెబుతూనే, ధ్యాన్ చంద్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. ధ్యాన్ చంద్ పట్ల మోదీకి నిజంగా అంత ప్రేమ ఉంటే, అంత భక్తి ఉంటే ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ అనేక సిఫార్సులు 2014 నుంచీ ప్రధాని కార్యాలయానికి అందుతూనే ఉన్నాయి. ఎవరెవరికో భారత రత్న ఇచ్చారు కానీ గత ఏడేళ్ళలో ధ్యాన్ చంద్ కు భారత రత్న ఎందుకివ్వలేదు? బహుశా ఈ సంవత్సరం ఇస్తారేమో. రాజీవ్ గాంధీ స్మృతిని చెరిపివేసే క్రమంలో ధ్యాన్ చంద్ స్మృతిని తిరిగి జ్ఞాపకం చేసుకోవడం, తిరిగి వెలిగించుకోవడం, జాజ్వల్యమానంగా అది ప్రకాశించేలా చూసుకోవడం ఒక రకంగా మంచిదే. మోదీ ఏ కారణంతో పేరు మార్చాలని నిర్ణయించుకున్నా క్రీడాపురస్కారాలకూ, క్రీడాస్టేడియాలకూ సుప్రసిద్ధ క్రీడాకారుల పేర్లు పెట్టడం మంచిదే. ఆహ్వానించదగిన పరిణామమే.

హాకీలో వరుసగా ఒలింపిక్స్ స్వర్ణాలు

హాకీని ఓంప్రథమంగా ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చిన 1928 ఒలింపిక్స్ మొదలు మూడు ఒలింపిక్స్ లోనూ భారత హాకీ జట్టుకు స్వర్ణ పతకం సాధించడంలో ధ్యాన్ చంద్ పాత్ర అపూర్వమైనదీ, అద్వితీయమైనదీ, అసామాన్యమైనదీ. ఆయనను తొలి హాకీ సూపర్ స్టార్ గా పరిగణిస్తారు. పత్రికలు ద్యాన్ చంద్ ను ‘హాకీ కా జాదూగర్‘ (హాకీ మాంత్రికుడు) అని అభివర్ణించేవి. 1928లో ఆమ్ స్టర్ డామ్ లో, 1932లో లాస్ ఏంజెలెస్ లో, 1936లో బెర్లిన్ లో జరిగిన మూడు ఒలింపిక్స్ లో స్వర్ణపతకాలను భారత్ గెలుచుకున్నది. ఆ రోజుల్లో భారత హాకీ జట్టు ధాటికి ప్రపంచంలోని ఏ జట్టు కూడా తట్టుకొని నిలబడేది కాదు. అనేక గోల్స్ ఆధిక్యంతో ఇతర జట్లపైన భారత జట్టు విజయఢంకా మోగించడం పరిపాటిగా ఉండేది. 1928 ఒలింపిక్స్ హాకీ ఫైనల్ లో నెదర్లాండ్స్ జట్టుపైన భారత జట్టు 3-0 స్కోర్ తో గెలిచింది. 1932 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో అమెరికా జట్టుపైన 24-1 స్కోరుతో విజయధుందుభి మోగించింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో జర్మనీ జట్టుపైన 8-1 స్కోరుతో గెలుపొందారు. ధ్యాన్ చంద్ మొత్తం 12 ఒలింపిక్స్ మ్యాచ్ లు ఆడాడు. 33 గోల్స్ సాధించాడు.

Dhyan Chand and Adolf Hitler

అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులలో, ఆటలో వ్యత్యాసం  

ఇది వరకు సహజమైన గడ్డి నేల మీద హాకీ ఆడేవారు. ఎగుడుదిగుడు భూమి ఉండేది. బంతికి నియంత్రించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆస్ట్రోటర్ఫ్ (కృత్రిమ మైదానం) మీద ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే క్రీడాకారులకు భౌతిక శక్తి, పిక్కబలం, వేగం అవసరం. అందుకే సహజంగా పుష్టిగా ఉండే యూరోపియన్లు ఈ ఆటలో రాణించడం మొదలుపెట్టారు.  ఇది వరకు అంతా బంతిని నడిపించే నేర్పు మీద ఆట ఆధారపడి ఉండేది. ధ్యాన్ చంద్ బంతిని దొర్లించడం (డ్రిబ్లింగ్)లో బహునేర్పరి. బంతి ఆయన హాకీ స్టక్ కి అతుక్కుపోయిందా అనిపించేది. కొందరు హాకీ స్టిక్ ను విరగకొట్టి అందులో అయిస్కాంతం ఏమైనా ఉన్నదేమోనని వెతికేవారంటూ కథనాలు ప్రచారంలో ఉండేవి. థ్యీన్ చంద్ ఆడింది స్వాతంత్ర్యానికి పూర్వపు రోజుల్లో. భారతీయులందరూ స్వదేశంలోనే బ్రిటిష్ వారి ఆధిక్యానికి తలొగ్గి రెండో తరగతి పౌరులలాగా అణగిమణగి పడి ఉండిన రోజులలో ధ్యాన్ చంద్ తో పాటు కె.ఆర్. సింగ్ (బాబు), రూప్ సింగ్ (ధ్యాన్ చంద్ తమ్ముడు), బల్బీర్ సింగ్ వంటి మరి కొందరు హాకీ ఆటగాళ్ళు యూరప్ దేశాలపైన అనాయాసంగా ఘనవిజయాలు సాధించడం భారతీయులందరి హృదయాలను హత్తుకున్న సన్నివేశం. మహదానందభరితమైన సందర్భం. భారత మాతకు జైకొట్టించే విజయాలకు ప్రధాన కారకుడైన ధ్యాన్ చంద్ అంటే భారతీయులలో భక్తి భావం ఉండేది. అతడిని మనస్ఫూర్తిగా ఆరాధించేవారు. కె.డి. జాదవ్ 1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో కుస్తీలో కాంస్య పతకం గెలుచుకోవడం మినహా అన్ని ఒలింపిక్స్ లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది హాకీ జట్టు మాత్రమే. మళ్ళీ టెన్నిస్ లో లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో పతకం గెలుచుకునే వరకూ ఇండియాకు వేరే పతకం లేదు. 1928 నుంచి 1964 వరకూ (ఒక్క 1960 మినహ) అన్ని ఒలింపిక్స్ లోనూ భారత హాకీ జట్టు మొత్తం ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించింది.  ఆ రోజుల్లో క్రికెట్ అంటే మోజు లేదు. హాకీనే జాతీయ క్రీడగా భావించేవారు. ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమంటే అణచివేసిన దేశంలోని పౌరులు గర్వంతో పొంగిపోయేవారు.

ఝాన్సీలో స్థిరపడిన ధ్యాన్ చంద్ కుటుంబం

ధ్యాన్ చంద్ క్రీడాకారుల కుటుంబంలో 29 ఆగస్టు 1905న రాజపూత్ వంశంలో జన్మించారు. తల్లి సాధనాసింగ్, తండ్రి సుబేదార్ సమేశ్వర దత్ సింగ్. తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పని చేశారు. సైన్యంలో హాకీ ఆడేవారు. మూల్ సింగ్ అని మరో సోదరుడు ధ్యాన్ చంద్  కు ఉండేవారు. తండ్రికి బదిలీలు అవుతూ ఉండేవి. కుటుంబం వివిధ నగరాలలో జీవించేది. ఆరో తరగతిలో ఉండగా ధ్యాన్ చంద్ చదువుకి అంతరాయం కలిగింది. చివరికి ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో స్థిరపడింది ధ్యాన్ చంద్ కుటుంబం. ధ్యాన్ చంద్ మెల్లగా చదువు కొనసాగించి గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు. సైన్యంలో చేరకమునుపు ధ్యాన్ చంద్ ఝాన్సీలో మిత్రులతో కలసి సరదాగా హాకీ ఆడేవారు కానీ హాకీ మీద అప్పట్లో  పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆయన రక్తంలో హాకీ ఉంది. తండ్రి, తోబుట్టువైన సోదరుడు, తనయుడు అందరూ హాకీలో అగ్రశ్రేణి క్రీడాకారులే. 28 ఆగస్టు 1922లో ధ్యాన్ చంద్ సైన్యంలో సిపాయిగా చేరాడు. అప్పటి నుంచి సైన్యం తరఫున హాకీ ఆడేవాడు.

న్యూజీలాండ్ సందర్శించిన భారత హాకీ జట్టులో ద్యాన్ చంద్ కు స్థానం దక్కింది. భారత జట్టు 18 మ్యాచ్ లు గెలిచింది, రెండు డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్ కొద్ది తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ తో నే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఒకటి గెలుచుకోగా, మరికటి ఓడిపోయింది. అప్పట్లొ ఒలింపిక్స్ లో హాకీ లేదు. చాలా ప్రయత్నాలు, పైరవీలు చేసిన తర్వాత హాకీ క్రీడను ఒలింపిక్స్ లో చేర్చడానికి కమిటీ నిర్ణయించింది. 1928లోనే తొలిసారిగా హాకీని ఒలింపిక్స్ క్రీడగా గుర్తించారు. ఒలింపిక్స్ లో ఆడటానికి భారత జట్టును ఎంపిక చేసే ప్రయత్నాలు 1925 నుంచీ మొదలైనాయి. అంతర్ రాష్ట్ర (ఇంటర్ ప్రావిన్స్) పోటీలు పెట్టారు. పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్,బెంగాల్, రాజపుటానా, సెంట్రల్ ప్రావిన్స్ జట్లు పోటీలలో పాల్గొన్నాయి. సైన్యం నుంచి అనుమతి తీసుకొని ధ్యాన్ చంద్ యునైటెడ్ ప్రావిన్స్ జట్టలో ఆడాడు. ఫైనల్ లో యునైటెడ్ ప్రావిన్స్ జట్టు రాజపుటానా జట్టుపైన 3-1 స్కోరుతో విజయం సాధించింది. ధ్యాన్ చంద్ సెంటర్ ఫార్వర్డ్ స్థానంలో ఆడేవారు. అందులో రెండు గోల్స్ ధ్యాన్ చంద్ చేశాడు. బ్రూమా ఎరిక్ పిన్నింజర్ ను ఒలింపిక్స్ లో ఆడే భారత జట్టుకు కెప్టెన్ గా నియమించినట్టు బొంబాయిలో ప్రకటించారు. ఒలింపిక్స్ కు బయలుదేరే ముందు భారత జట్టు బొంబాయిజట్టు తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. అందులో బొంబాయిజట్టు 3-2 స్కోరుతో గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచింది.

Dhyan Chand’s statue at Sripli hill in Jhansi

తొలి ఒలింపిక్స్  స్వర్ణం గెలిచిన సందర్భం

ఆ తర్వాత బ్రిటన్ లో 11 మ్యాచ్ లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ కు 10 మార్చి 1927న బయలుదేరి వెళ్ళింది. భారత్ చేతిలో బ్రిటన్ జట్టు చిత్తుగా ఓడిపోయిన ఫలితంగా బ్రటిన్ జట్టును ఒలింపిక్స్ పంపకూడదని బ్రిటిష్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 17 మే 1928న భారత హాకీ జట్టు  ఆమ్స్ స్టర్ డాం  ఒలింపిక్స్ లో ఆడింది. ఏ గ్రూప్ లో ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లండ్ తో కలసి ఇండియా ఉంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రియా పైన 6-0 గెల్స్ తేడాతో ఇండియా గెలిచింది. ఇందులో మూడు గోల్స్ ధ్యాన్ చంద్ చేసినవే.  మరుసటి దినం బెల్జియంపైన 9-0 స్కోరుతో విజయం సాధించింది. ఇందులో మాత్రం ధ్యాన్ చంద్ చేసింది ఒకే ఒక్క గోలు. ఆ తర్వాత డెన్మార్క్ పైన 5-0 స్కోరుతో ఇండియా గెలిస్తే అందులో ధ్యాన్ చంద్ చేసిన గోల్స్ మూడు. రెండు రోజుల తర్వాత బెల్జియంపైన ఆడి 6-0 స్కోరుతో గెలుపొందింది భారతజట్టు. ఫైనల్ నెదర్లాండ్ జట్టుతో జరిగింది. ధ్యాన్ చంద్ తో సహా ఫిరోజ్ ఖాన్, అలీ షౌకత్, ఖేర్ సింగ్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులందరూ జ్వరంతో మంచంపట్టారు. మైదానంలోకి దిగలేకపోయారు.  మిగిలినవారే మ్యాచ్ ఆడి 3-0 స్కోరుతో విజయం సాధించి భారత్ జట్టు గొప్పతనం చాటారు. మొత్తం అయిదు మ్యాచ్ లు ధ్యాన్ చంద్ ఆడి 14 గోల్స్ సాధించి అత్యున్నత స్కోరర్ గా నిలిచాడు. ‘ఇది హాకీ కాదు, మ్యాజిక్ ‘ అంటూ యూరోపియన్ పత్రికలు భారత క్రీడాకారులపైన ప్రశంసల వర్షం కురిపించాయి. యూరప్ వెళ్లే ముందు విమానాశ్రయానికి ముగ్గురు వ్యక్తులు వచ్చి భారతజట్టుకు బొంబాయిలో  వీడ్కోలు చెప్పారు. ఒలింపిక్స్ స్వర్ణం గెలుచుకొని తిరిగి వచ్చిన భారత జట్టుకు స్వాగతం చెప్పడానికి బొంబాయిలో వేలమంది అభిమానులు గుమికూడారు.  

అమెరికాపై 20-0 స్కోర్ తో విజయం

లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ కోసం భారతజట్టు సిలోన్ (శ్రీలంక) మీదుగా అమెరికా వెళ్ళింది. ఈ జట్టులో ఎనిమిది మంది సభ్యులు పంజాబ్ నుంచే ఎంపికైనారు. లాల్ షా భొఖారీ జట్టు నాయకుడు. ఆల్ సీలోనే టీమ్ తో ఆడిన మ్యాచ్ లో 20-0 స్కోరుతో భారత జట్టు గెలిచింది. శ్రీలంక నుంచి బయలుదేరి 6 జులై 1932న శాన్ ఫ్రాన్సిస్కో చేరారు భారత క్రీడాకారులు. 30 జులైనాడు ఒలింపిక్స్ ప్రారంభమైనాయి. మొదటి మ్యాచ్ లో ఇండియా జపాన్ తో తలపడింది. 11-1 గోల్స్ తేడాతో ఓడించింది. ధ్యాన్ చంద్, రూప్ సింగ్, గుర్ముఖ్ సింగ్ లు చెరి మూడు గోల్స్ చేశారు. ఫైనల్ మ్యాచ్ అమెరికాతో 11 ఏప్రిల్ 1932న జరిగింది. అమెరికాపైన 24-1 స్కోరులో భారత్ విజయపతాకం ఎగురవేసింది. అంత పెద్ద వ్యత్యాసంతో గెలుపొందడం ప్రపంచ రికార్డు. ఆ ఒలింపిక్స్ లో ఇండియా స్కోరుచేసిన 35 గోల్స్ లో 25 గోల్స్ ను ధ్యాన్ చంద్, అతడి తమ్ముడు రూప్ సింగ్ లే చేశారు. అందుకే వారిద్దరినీ ‘హాకీ కవలలు’ అని పిలిచేవారు. ‘తూర్పు నుంచి తుఫాను వచ్చినట్టే భారత హాకీ జట్టు కనిపించింది,’ అంటూ లాస్ ఏంజిలిస్ పత్రిక ఒకటి అభివర్ణించింది.

1936 ఒలింపిక్స్ హాకీ ఫైనల్ లో ఆతిథ్యమిస్తున్న జర్మనీని ఇండియా చిత్తుగా 8-1 గోల్స్ తేడాతో ఓడించింది. అందులో ధ్యాన్ చంద్ ఆటతీరు చూసి ముగ్ధుడైన జర్మనీ చాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ అతడికి జర్మన్ పౌరసత్వం ఇవ్వడానికీ, జర్మన్ సైన్యంలో కల్నల్ హోదా ఇవ్వడానికి సంసిద్ధుడై కబురు పెట్టాడు. కానీ ద్యాన్ చంద్ సమ్మతించలేదు. ధ్యాన్ చంద్ ‘‘గొల్’’ పేరుతో స్వీయచరిత్ర రాసుకొని ప్రచురించాడు. అందులో తనకు అత్యంత ఇష్టమైన మ్యాచ్ ఏదంటే ఝాన్సీ హీరోస్ కెప్టెన్ గా కలకత్తా కస్టమ్స్ జట్టుతో ఆడిన ఆట అంటాడు. కపూర్ రాసిన ‘రొమాన్స్ ఆఫ్ హాకీ’ మంచి పుస్తకం. ధ్యాన్ చంద్ గురించి, భారతహాజీ విజయ పరంపర గురించీ ఈ పుస్తకంలో చాలా సమాచారం ఉంది.

Scoring a goal againt Germany in 1936 Olympics

జాతీయ క్రీడాదినోత్సవం

ధ్యాన్ చంద్ జన్మదినం చాలా ముఖ్యమైనది. అదే రోజు ఆయన సైన్యంలో చేరాడు. అదేరోజు సైన్యం నుంచి 34 ఏళ్ల సర్వీసు తర్వాత 1956లో పదవీ విరమణ చేశాడు.  ఆ రోజును జాతీయ క్రీడాదినోత్సవంగా పరిగణిస్తున్నారు. ఆయన పేరు మీద ధ్యాన్ చంద్ టోర్నమెంటు నిర్వహించిన సందర్భంలో 1951లో జరిగిన ప్రారంభ సభకు ధ్యాన్ చంద్ హాజరైనాడు. దాని తర్వాత మౌట్ అబూ (రాజస్థాన్)లో హాకీ కోచ్ గా పని చేశారు. దిల్లీలో జాతీయ స్టేడియంకు ద్యాన్ చంద్ నేషనల్ స్టేడియం అని పేరు పెట్టుకున్నారు. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో ధ్యాన్ చంద్ చదువుకున్నాడు.  ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక హాస్టల్ కు ధ్యాన్ చంద్ పేరు పెట్టుకున్నారు.  పటియాలలోని జాతీయ క్రీడా సంస్థ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ స్పోర్ట్స్)లో చీఫ్ హాకీ కోచ్ గా చాలా సంవత్సరాలు పని చేశాడు. దిల్లీలోని ఎయిమ్స్ లో లివర్ కాన్సర్ కారణంగా 03 డిసెంబర్ 1979న కన్నుమూశాడు. ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ ద్యాన్ చంద్ కూడా హాకీ మేటి క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో కూడా భారత దేశం తరఫున ఆడాడు. 22 సెప్టెంబర్ 2012న బారతీయ జర్నలిస్టుల సమాఖ్య ప్రదానం చేసిన ‘ద జమ్ ఆఫ్ ఇండియా’ పురస్కారాన్ని దివంగత తండ్రి తరఫున కుమారుడు అశోక్ అందుకున్నాడు. భారత రత్న ఇవ్వాలని ధ్యాన్ చంద్ పేరును 2014లోనే నామినేట్ చేశారు. క్రీడామంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది కానీ ప్రధాని కార్యాలయంలో ఆగిపోయిందని సమాచారం. ఇది ప్రదానికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడైనా ధ్యాన్ చంద్ కి ‘భారతరత్న ప్రదానం చేస్తే రాజీవ్ గాంధీ పేరు మార్చాలనే నిర్ణయం సార్థకం అవుతుంది.

క్రీడాభిమానులకు ధ్యాన్ చంద్ ప్రాత:స్మరణీయుడు. అందులో అనుమానం లేదు. ఖేల్ రత్నకు అతని పేరు పెట్టడంపైన ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఇందుకోసం రాజీవ్ గాంధీ స్మృతికి అపచారం పనిగట్టుకొని చేయడం, ధ్యాన్ చంద్ కు ఇంతవరకూ భారత రత్న ఇవ్వకపోవడం అభ్యంతరకరం. 2013లో క్రికెట్ మేటి సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ప్రదానం చేశారు. అప్పుడైనా ధ్యాన్ చంద్ కు కూడా ఇవ్వవలసింది, ధ్యాన్ చంద్ కు పద్మవిభూషణ కూడా ఇవ్వలేదు. దాని తర్వాతది పద్మభూషణ్ ఇచ్చారు.

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles