Saturday, April 20, 2024

5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష

త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, కేరళ,పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయింది. అన్నింట్లో, పశ్చిమ బెంగాల్ లో కాస్త ముందుగానే కసరత్తులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరంలో బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మొదలైన చోట్ల జరిగిన ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు రాబట్టుకుంది.

బీహార్ గెలుపు బీజేపీకి ఊతం

మహారాష్ట్రలో ఎదురుదెబ్బతిన్నా, బీహార్ లో సాధించిన గెలుపు బిజెపికి మంచి ఊతాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉప ఎన్నికలు, స్థానికఎన్నికల్లోనూ గణనీయమైన ఫలితాలు రాబట్టుకుంది. ఈ  విజయాల పరంపరతో బిజెపి మంచి ఊపులో ఉంది. అస్సాం, వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రి స్థానాలను కైవసం చేసుకుంటామని, తమిళనాడులో కింగ్ మేకర్ గా చక్రం తిప్పుతామనే విశ్వాసాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేరళలో గతంలో ఎటువంటి ఉనికిలో లేని బిజెపికి, గడచిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త పెరగడం ఊరటనిచ్చే అంశం.

మూడు దక్షిణాది రాష్ట్రాలే

ఎన్నికలు జరుగబోయే అయిదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. దక్షిణాదిలో విజృంభించి అధికారం కైవసం చేసుకోవాలనే ఆరాటంలో ఉన్న బిజెపి ఆట మొదలెట్టింది. ఈ  ఐదు రాష్ట్రాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిద్దాం. అస్సాంలో బిజెపి-అస్సాం గణపరిషత్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో ఎల్ డి ఎఫ్, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నాయి. తమిళనాడులో అన్నా డిఎంకె, పుదుచ్చేరిలో డిఎంకె ముఖ్యమంత్రులు ఉన్నారు. బిజెపి మంచి ఊపులో ఉన్నప్పటికీ రేపటి ఫలితాలు మిశ్రమంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ లో బిజెపి అధికారం చేపట్టాలనే గట్టి సంకల్పం, విశ్వాసంతో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్ళీ తనదే అధికారం అంటున్నారు.

మమత గెలుపు అంత తేలిక కాదు

కానీ, ఈసారి మమత గెలుపు అంత ఆషామాషీ కాదు. ఇప్పటికే ప్రభావశీలమైన, కీలక నేతలు చాలామంది బిజెపిలోకి వెళ్లిపోయారు. తమకు నమ్మినబంటు వంటి వారు, గత ఎన్నికల్లో గెలుపునకు మూలాధారమై నిలిచినవారిని మమత కోల్పోయారు. మమతకు ఆయువుపట్టు వంటి నేతలను తమ వైపు తిప్పుకోవడమే బిజెపి సాధించిన మొట్టమొదటి గెలుపు. అదే ఆమెకు తొలి ఓటమి కూడా. ఇప్పటికి రెండు పర్యాయాలుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. ఇది నష్టాన్ని తెచ్చే రెండవ అంశం.

మూడు కూటముల ముకాబిలా

దీనికి తోడు ఇక్కడ మూడు కూటములు తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ + వామ పక్షాలు, బిజెపి. కాంగ్రెస్ బంధం నుంచి విడిపోయి తృణమూల్ ఒంటరి అయ్యింది. వామపక్షాలు, కాంగ్రెస్ ఒకవైపు ఉండడం వల్ల ఓట్లు చీలిపోతాయి. ఈ చీలిక తృణమూల్ కు నష్టాన్ని, బిజెపికి లాభాన్ని కలిగించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. దశాబ్దాలపాటు వామపక్షాల నీడలో ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ వశమైవుంది. ఈ పార్టీ కింద పదేళ్ల పాలనలో విసిగెత్తిన బెంగాలీబాబులు ఈసారి బిజెపికి పట్టంకట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

పశ్చిమ బెంగాల్ బీజేపీకే మొగ్గు

ఏది ఏమైనా, పశ్చిమ బెంగాల్ లో ఈసారి బిజెపి వైపే మొగ్గు ఎక్కువ కనిపిస్తోంది. మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే అద్భుతమే. బిజెపికి అధికారం కాస్త అటుఇటూ అయినా, సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే శకునాలే కనిపిస్తున్నాయి.కేరళలో ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యు డి ఎఫ్ మధ్యనే అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఒక ఎన్నికల్లో ఒకరిని గెలిపిస్తే, మరోసారి ఇంకొక కూటమికి పట్టం కట్టడం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉంది.ఎన్ డి ఏ /బిజెపి కూడా రేసులో ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంత శక్తి ప్రస్తుతానికి బిజెపికి లేదు. ఓట్లశాతం పెరిగే అవకాశం మాత్రమే ఉంది. బిజెపి కొన్ని సీట్లు గెలుచుకోగలిగితే, దాన్ని గొప్ప పరిణామంగా భావించవచ్చు.

ఎల్ డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే పోటీ

ప్రధాన పోటీదారులైన ఎల్ డి ఎఫ్, యు డి ఎఫ్ తీరుతెన్నులను విశ్లేషించుకుందాం. ప్రస్తుతం, ఎల్ డి ఎఫ్ (లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ) అధికారంలో ఉంది. సీపీఎం నేత పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఇది వామపక్ష పార్టీలతో కూడిన కూటమి. సిపిఎం, సిపిఐ, ఇండియన్ నేషనల్ లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం) పార్టీలు కలిసి ఒక జట్టుగా 2016లో అధికారంలోకి వచ్చాయి. మళ్ళీ అధికార పీఠం దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

పరిశీలించవలసిన కొత్త కోణాలు

ఈసారి రాబోయే ఫలితాలను విశ్లేషంచుకొనే సందర్భంలో, కొత్త కోణాలను స్పృశించాల్సిన పరిస్థితులు కేరళలో నెలకొని ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎల్ డి ఎఫ్ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. దీన్ని ప్రజల నాడిగా భావిస్తే, కొన్ని నెలల్లోనే వచ్చే ఎన్నికల్లోనూ ఎల్ డి ఎఫ్ నే విజయం వరించాలి. గత 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఎల్ డి ఎఫ్ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. ఈ సోపానంపైనే ప్రయాణం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇవన్నీ ఎల్ డి ఎఫ్ గెలుపును చూపించే అంశాలు. ఇదే ఫార్ములా మళ్ళీ కొనసాగితే, మళ్ళీ ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వస్తుంది. పినరయ్ విజయన్ ఐదేళ్ల పాలనను విశ్లేషిస్తే, చెప్పుకోదగ్గ గొప్ప విజయాలు లేవు.

స్కాముల సర్కార్

అదే విధంగా, స్కాముల ప్రభుత్వంగా చెడ్డపేరు మూటగట్టుకుంది. గోల్డ్ స్కామ్, సోలార్ స్కామ్, ఉద్యోగ నియామకాల స్కామ్ మొదలైనవి ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం చుట్టూ చుట్టుకున్నాయి. కేరళలోని వామపక్ష పార్టీల చరిత్రలో స్కామ్ ల ప్రభుత్వంగా ముద్ర వేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 20సీట్లకు గాను 19సీట్లు పోగొట్టుకుంది. ఈ దుష్ప్రభావాలు, దుష్ఫలితాలు రేపటి ఎన్నికల్లో ఎల్ డి ఎఫ్ కు అడ్డుగోడలుగా నిలిచే అవకాశం ఉంది. కేరళ సంప్రదాయం ప్రకారం ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి రెండో తఫా ఓటర్లు మద్దతు ఇవ్వరు. ఈ అంశాల దృష్ట్యా ఎల్ డి ఎఫ్ గెలుపు ప్రశ్నార్ధకంగా ఉంది.

యూడీఎఫ్ విశ్వాసం

కాంగ్రెస్ ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యు డి ఎఫ్) ఈసారి అధికారం దక్కించుకోగలననే విశ్వాసంలో ఉంది. దానికి ప్రధానమైన కారణం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 20సీట్లకు గాను 19సీట్లు గెలుచుకోవడం.ప్రస్తుత అధికార ఎల్ డి ఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత. కేరళ సంప్రదాయం ప్రకారం, గత ఎన్నికల్లో ఎల్ డి ఎఫ్ కు అవకాశం ఇచ్చారు కాబట్టి, ఈసారి తమకే అవకాశం వస్తుందనే నమ్మకం మూడవది. 2016లో వచ్చిన ఫలితాలను గమనిస్తే 140సీట్లలో కేవలం 47సీట్లనే గెలుచుకుంది. ఈ ఫ్రంట్ తరపున రమేష్ చెన్నితాల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. యూడీఎఫ్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంత వరకూ తెలియరాలేదు. ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీని వేసింది.

ఊమెన్ చాందీకి పర్యవేక్షణ బాధ్యత

మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి నాయకత్వ బాధ్యతలను అప్పచెప్పింది. చాందీ కొంతకాలం నుంచి పార్టీ వ్యవహారాల్లో అంత చురుకుగా లేరు. ఐనప్పటికీ, ఆయనకున్న గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతలు అప్పచెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇతని పేరును సూచించకపోవడం గమనార్హం. పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అభ్యర్థిని ప్రకటించికపోవడం సరియైన చర్య కాదనే విమర్శలు పార్టీలో నడుస్తున్నాయి. బహుశా, ఎన్నికలకు ముందు ప్రకటిస్తారేమో తేలాల్సి వుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఎం. రామచంద్రన్, ప్రతిపక్ష నేత రమేష్,  ఊమెన్ చాందీ మధ్య వర్గ కలహాలు ఉన్నాయి. ఇది ఫ్రంట్ కు నష్టం తెచ్చే అంశం. రాబోయే కేరళ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ఫలితాల అంచనా కొంత గందరగోళంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల మేరకు అంచనా వేస్తే, మళ్ళీ ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు.

చిత్రవిచిత్రంగా తమిళనాడు రాజకీయం

తమిళనాట గందరగోళం

తమిళనాడులో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ప్రధాన యుద్ధం అన్నా డిఎంకె- డిఎంకె మధ్యనే ఉన్నప్పటికీ, బిజెపి పాత్ర ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. శశికళను నాయకురాలిగా అన్నా డి ఎంకె గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీరు సెల్వం శశికళను తీవ్రంగా విభేదిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన గంటల వ్యవధిలోనే తమిళనాడు ప్రభుత్వం శశికళకు సంబంధించిన ఆస్తులన్నింటినీ జప్తు చేసుకొని, కక్ష సాధింపు చర్యలను చేపట్టింది.ఆమె ఆర్ధికమూలాలపై దెబ్బతీయాలన్నది అన్నా డిఎం కె అధినేతల మొట్టమొదటి ఎత్తు. దాన్ని అమలు చేశారు. ఈమెపై ఇప్పటికే నిషేధం ఉన్న నేపథ్యంలో, రేపటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగమ్ పార్టీయే శశికళకు ప్రస్తుతం ఉన్న రాజకీయ వేదిక. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో, శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. డిఎంకె, కాంగ్రెస్ సంకీర్ణం అధికారానికి దూరమై చాలా కాలమైంది.

స్టాలిన్ ఒక్కడే స్టార్

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న నాయకుల్లో కాస్త ఆకర్షణ ఉన్నవాడు స్టాలిన్ మాత్రమే. ఈ కారణాలతో తమిళ ప్రజలు డిఎంకెకు పట్టం కట్టి, స్టాలిన్ ను ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టే అవకాశాలు ఉన్నాయనేదాన్ని కొట్టి పారేయలేం. పుదుచ్చేరిలో ప్రస్తుతం డిఎంకె అధికారంలో ఉంది. మళ్ళీ ఈ పార్టీకే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అస్సాంలో బిజెపి, అస్సాం గణ పరిషత్ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యమేలుతోంది.కాంగ్రెస్ పరిస్థితి గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంది.ఈసారి కూడా బిజెపి ప్రభుత్వానికే ప్రజలు పట్టంకట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంమీద, త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గతంలో కంటే కొత్తగా ఉండే వాతావరణం కనిపిస్తోంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles