Thursday, May 2, 2024

పెరుగుట విరుగుటకొరకే

ఈ సామెత ఎవరికైనా వర్తిస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేవారికి ప్రమాదం లేదు కానీ పెరిగినకొద్దీ అహంభావాన్ని, అభిజాత్యాన్ని పెంచుకునేవారికి విరుగుడు తప్పదు. వారు ఎంతగా అధికారం ఆవహించుకొని అహంకారంగా వ్యవహరిస్తారో అదే మోతాదులో దెబ్బతగులుతుంది. దేశాధినేతలు ఎదిగినవారూ, ఒదిగినవారూ ఉన్నారు పెరుగుతూనే అధికారం తలకెక్కించుకొని ఎవరి మాటా వినకుండా తమకు తోచినట్టు వ్యవహరించి, తప్పులు చేసి ప్రజల చేతిలో గుణపాఠం చెప్పించుకున్నవారూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలలో అమ్మా, బాబూ అని బతిమిలాడి, లేనిపోని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంనాస్తి అంటూ విర్రవీగేవారికి ప్రజలే అదను చూసి బుద్ధిచెబుతారు.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నియంతల వల్ల ప్రజలకు ఎంత ప్రమాదమో మూడు దేశాల స్థితిగతులనూ, ఆ దేశాలను ఏలిన, ఏలుతున్న నాయకుల మానసిక స్థితినీ, చర్యలనూ అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మూడు దేశాలు: ఇండియా, అమెరికా, బ్రెజిల్. ముగ్గురు నాయకులు: నరేంద్రమోదీ, డొనాల్డ్ ట్రంప్, బోల్సోనారో. ఈ ముగ్గురూ ప్రజాస్వామికంగా ఎన్నికైన నియంతలు. కరోనా మహమ్మారి విషయంలో వ్యవహరించిన తీరు వారి అహంభావానికీ, మానసిక ప్రవృత్తికీ అద్దం పడుతుంది.

Also read: తెలుగువారి ఆత్మగౌరవ పతాక

కరోనాను గుర్తించడానికి నిరాకరించిన ట్రంప్

అమెరికాలో ట్రంప్ జమానాలో కరోనాను గుర్తించేందుకు నిరాకరించారు. కరోనాను సృష్టించిందంటూ ఒకవైపు చైనాను నిందిస్తూనే మరో వైపు కరోనా పెద్దగా ప్రమాదకారి కాదనీ, పడిశం వంటిదేననీ, మాస్కులు ధరించవలసిన అగత్యం లేదనీ ట్రంప్ పదేపదే చెప్పారు. అసలు కరోనా అనేది బ్రెజిల్ లో లేనేలేదనీ, ఉన్నా పెద్దగా లెక్కపెట్టవలసిన అవసరం లేదనీ బొల్సోనారో ప్రకటించారు. మొదటి కరోనా తరంగాన్ని గుర్తించి తక్షణం చర్యలు తీసుకున్న భారత ప్రధాని మోదీ రెండో తరంగం సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. మొదటి కరోనా తరంగం తగ్గుముఖం పట్టినట్టు కనిపించడంతో కరోనాపైన ఘనవిజయం సాధించామని ప్రకటించేశారు. అంతర్జాతీయ సమావేశంలో సైతం కరోనాను ఎట్లా ఓడించాలో ప్రపంచ దేశాలకు ఇండియా దారి చూపించిందనీ, ప్రపంచ దేశాలకు ఓషధకేంద్రం ఇండియానేననీ (ఫార్మా ఆఫ్ ది వరల్డ్) మోదీ చాటారు. ఇది తొందరపాటు చర్య అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. రెండో కరోనా తరంగాన్ని ఆలస్యంగా గుర్తించి కూడా ఎన్నికల రంధిలో పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారసభలలో మాస్కు లేకుండా స్వయంగా పాల్గొన్నారు. మతసంబంధమైన కార్యక్రమాలను అనుమతించారు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

ఈ ముగ్గురు నాయకుల మధ్య సామ్యం ఏమిటి? ముగ్గురూ ప్రజాదరణ కలిగిన నాయకులే. ముగ్గురూ అహంకారస్వభావులే. ముగ్గురూ సమాజాన్ని మతం ప్రాతికపైన, వర్ణ ప్రాతిపదికపైన చీల్చినవారే, ముగ్గురూ అధికారాన్ని తమ చేతులలో కేంద్రీకృతం చేసుకున్నవారే, ముగ్గురూ తాము తందానా అంటే తానతందనానా అనే వెన్నెముక లేని వారిని చట్టూ చేర్చుకొని భజన చేయించుకునేవారే, ముగ్గురూ ప్రవీణుల సలహాలను లెక్కచేయనివారే, అశాస్త్రీయ దృక్పథం కలిగినవారే. అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడతాననీ, అసమర్థ పాలనను అంతం చేస్తాననీ, విధానపరమైన పక్షవాతం (పాలసీ పెరాలిసిస్ )తో కునారిల్లుతున్న మన్మోహన్ సింగ్ పాలనకు చరమగీతం పాడుతాననీ, సమర్థమైన పాలన అందిస్తాననీ హామీలు గుప్పించి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని, హిందూ సమాజానికి చెందిన మధ్యతరగతి ప్రజలనూ, ముఖ్యంగా యువకులనూ విశేషంగా ఆకర్షించారు మోదీ. ఎన్నికలలో విజయం సాధించారు. క్రమంగా అధికారాన్ని తన చేతులలో కేంద్రీకృతం చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ను సైతం పూర్వపక్షం చేస్తున్నారు. రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను చిన్నచూపు చూస్తున్నారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఘర్షణాత్మకవైఖరి.

Also read: ధన్యజీవి చేకూరి కాశయ్య

వాగ్దానాలు వేరు, ఆచరణ వేరు

నేరాలను అంతం చేస్తాననీ, రాజకీయంగా అందరికీ మేలు చేస్తాననీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బొల్సోనారో కరోనా మాట ఎత్తినవారిని ఎద్దేవా చేశారు. ఆరోగ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. ఆరోగ్యశాఖ అధికారులపైన మాటల ఈటెల వర్షం కురిపించారు. రాష్ట్రాల గవర్నర్లనూ, నగరాల మేయర్లనూ కరోనా ఊసు ఎత్తినందుకు అవమానించారు. అది కేవలం జలుబేనంటూ తేలికగా తీసిపారేశారు. ఆ కాలంలోనే అంతే తేలికగా కరోనాను తీసిపారేస్తూ పారాసిటమాల్ వేసుకుంటే కరోనా మటుమాయం అవుతుందని రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులూ వ్యాఖ్యానించారు. తర్వాత జాగ్రత్తపడ్డారు.

Also read: ఏమున్నది గర్వకారణం?

ట్రంప్ రాష్ట్రాల గవర్నర్ల మాట పెడచెవిన పెట్టారు.  కరోనాను లెక్కచేయనక్కరలేదని చెప్పారు. మాస్కుల ధరించవలసిన అవసరం లేదని చెప్పడంతో పాటు స్వయంగా తాను మాస్కు లేకుండా యథేచ్ఛగా తిరిగారు.

Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?

వీరు ముగ్గురూ జాతీయవాదాన్ని ప్రబోధించి అధికారంలోకి వచ్చారు. ప్రజలకు మేలు చేయడానికి అవతారం ఎత్తిన మానవాతీతులమనే అభిప్రాయం కలిగించారు. తమ మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలన విషయంలో ప్రవీణుల సలహాలను స్వీకరించడం, సహచరుల సూచనలను పాటించడం వంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కారు. ప్రతి చిన్న విషయానికీ ఘనవిజయం సాధించినట్టు స్వోత్కర్షకు పాల్పడ్డారు. పెద్దపెద్ద పేర్లు పెట్టి మామూలు విజయాలను సైతం మహాసంగ్రామం చేసి సాధించిన పెద్ద విజయాలుగా చాటుకోవడం, చుట్టూ ఉన్న భజనపరులతో భజన చేయించుకోవడం, టీవీ చానళ్ళలో చెప్పించుకోవడం, సోషల్ మీడియాలో రాయించుకోవడం, పత్రికలలో ప్రచురించుకోవడంతో అధికారం బాగా తలకెక్కినట్టు వ్యవహరించారు. తమకు తిరుగులేదనీ, తాము ఎవ్వరినీ సంప్రదించనక్కరలేదనీ, తాము సర్వజ్ఞులమనే భావనతో ఉన్నారు. తమను ప్రశ్నించినవారు దేశద్రోహులనీ, శత్రువులతో చేతులు కలిపిన దుర్మార్గులనీ చిత్రించారు. తమపైన విమర్శ చేయడానికి ఎవ్వరూ, ఏ మీడియా సంస్థా, ఏ రాజకీయ పార్టీ సాహసించలేని భయానక పరిస్థితి నెలకొల్పారు.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

ప్రశ్నించినవారు దేశద్రోహులే

ముగ్గురూ మతతత్వాన్ని బాగా వినియోగించుకున్నారు. ఇతర మతస్తులను ప్రమాదకారులుగా, శత్రుదేశాలతో కుమ్మక్కు అయిన దేశద్రోహులుగా ప్రకటించారు. ఇండియాలో ముస్లింలపైన, అమెరికాలో వలసజీవులపైనా, నల్లవారిపైనా, బ్రెజిల్ లో కమ్యూనిస్టులపైనా ధ్వజమెత్తారు. తనపైన విమర్శలు చేసినవారిని బొల్సోనారో కమ్యూనిస్టులనీ, సెక్యులరిస్టులనీ, ‘బాండిడోల’నీ ముద్రవేసి నిందించేవారు. 2019లో గణనీమైన విజయం సాధించిన తర్వాత మోదీ తన హిందూత్వ ప్రాజెక్టు అమలుకు నడుం బిగించారు. కశ్మీర్ లో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, సైనికుల పహరాను ముమ్మరం చేసి, రాష్ట్రప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్రపాలిత సంస్థలుగా ప్రకటించారు. అది ఒక్కటే ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రం. అదే సమయంలో పౌరసత్వ చట్టం తెచ్చి ఈ దేశంలో 20 కోట్లకు పైగా ఉన్న ముస్లింలు రెండో స్థాయి పౌరులనే అభిప్రాయం బలంగా కలిగించారు. సమాజాన్ని హిందూ సమాజంగా, హిదూయేతర సమాజంగా చీల్చారు. ముస్లింలను ప్రమాదకారులుగా చిత్రించేందుకు ఇండియాలో కరోనాను సైతం వినియోగించుకున్నారు. కరోనా జిహాద్ అంటూ ప్రచారం చేశారు. అదే కరోనా తీవ్రంగా ఉన్న రోజులలో వేలాదిమంది కుంభమేళా పేరుతో పవిత్రస్నానాలు చేయడంలో తప్పులేదనీ, దాని వల్ల కరోనా వ్యాప్తి చెందలేదనీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అడ్డంగా వాదించారు. సోమవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యంగ్యాస్త్ర ప్రయోగించారు. తెలుగు చానళ్ళపైన (టీవీ5, ఏబీఎన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేశద్రోహం కేసు పెట్టడాన్ని తప్పుపడుతూ ‘‘నిన్ని ఉత్తరప్రదేశ్ లో ఒక శవాన్ని నదిలోకి నెట్టివేస్తున్న దృశ్యాన్ని ఒక చానల్ (ఎన్ డీటీవీ) చూపించింది. ఆ చాన ల్ పైన దేశద్రోహం కేసు పెట్టారా, పెడతారా?’’ అంటూ వ్యాఖ్యానించారు. తమకు ఇబ్బంది కలిగించే అంశాలను ప్రచురించే పత్రిలకపైనా, ప్రసారం చేసే చానళ్ళపైనా దేశద్రోహం కేసులు పెట్టడం తగదని చెప్పకనే చెప్పారు న్యాయమూర్తి. దేశంలో ఉన్న వాతావరణానికి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్య అద్దం పడుతోంది.

Also read: మీడియా అందుబాటులోకి ఎస్ సి ప్రత్యేక యాప్

స్వంతంత్ర ప్రజాస్వామ్య సంస్థలు తమకు ఊడిగం చేయాలని ముగ్గురు నాయకులూ తలపోశారు. తప్పుడు లెక్కలు చూపించడం, మీడియాను లోబరుచుకోవడం, దబాయించడం ఈ ముగ్గురికీ అలవాటు. అందుకే కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలలో కూడా సంయమనం లోపించింది. కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య పరస్పర సహకారం లేదు. టీకా మందును రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం అనడం అన్యాయం. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్నదంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అనడం తగనిపని. ఇటువంటి విపత్కర పరిస్థితిలో దేశప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయించవలసిన ప్రభుత్వం టీకాలకు ఆర్డరు పెట్టకుండా, నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని అనడం బాధ్యతారాహిత్యం. మానవత్వం ఉన్న పాలకులు చేయవలసిన పని కాదు.

Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

బొల్సోనారోపైన బహిరంగ విచారణ

ఇంత జరుగుతున్నప్పటికీ మూడు దేశాలలోనూ సమాజం నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రతిస్పందనలు ఉన్నాయి. ఏయే రాష్ట్రాలలో కరోనా ఉధృతంగా ఉన్నదో ఆ రాష్ట్రాలలో ట్రంప్ కు పరాజయం ఎదురైంది. చివరికి రెండో టరమ్ గెలవలేకపోయిన నిక్సన్, ఫోర్డ, కార్టర్, పెద్ద బుష్ ల జాబితాలో ట్రంప్ చేరిపోయాడు. బైడెన్ వచ్చిన తర్వాత అత్యధిక అమెరికన్లకు టీకాలు వేయించారు. ఇప్పుడు మాస్కులు లేకుండా అమెరికన్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. బ్రెజిల్ లో బొల్సోనారోకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలయింది. బొల్సోనారో కరోనా విషయంలో వ్యవహరించిన తీరుపైన బహిరంగ విచారణ జరిపించాలని బ్రజిల్ సెనేట్ నిర్ణయించింది. ఇండియాలో పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురైన పరాజయం మోదీ పట్ల ప్రజలలో ప్రబలుతున్న వైముఖ్యానికి నిదర్శనం. రాష్ట్రాల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు ఆమోదం లేదనడానికీ, బెంగాలీ అస్మిత (ఆత్మగౌరవం) మమతా బెనర్జీకి ఘనవిజయం తెచ్చిపెట్టిందనీ ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదురైన అపస్వరాలను సరిచేయడానికి సమాజం ప్రయత్నిస్తుంది. ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రజలు జీర్ణించుకుంటే వారే నియంతల పని పట్టడానికి రంగంలోకి దిగుతారు. 1977లో ఆత్యయిక పరిస్థితి తర్వాత ఇందిరాగాంధీకి దేశ ప్రజలు ఎటువంటి గుణపాఠం చెప్పారో రేపు 2024లోనో, అంతకంటే ముందు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు మోదీకి గుణపాఠం చెబుతారు. ఈ లోగా తప్పులు గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే, వైఖరి మార్చుకున్నారని ప్రజలు విశ్వసిస్తే వారు క్షమించగలరు. ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకున్న దేశాలలో అపభ్రంశాలు ఎక్కువ కాలం రాజ్యం చేయలేవు. ప్రజలు అప్రమత్తులై ప్రభుత్వాలను మార్చివేస్తారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత తమదేనని ప్రజలకు తెలుసు.  ప్రజాస్వామ్యం అంటే ప్రజలకోసం, ప్రజలచేత, ప్రజల యొక్క అంటూ అబ్రహాం లింకన్ చెప్పిన నిర్వచనాన్ని ప్రజలు ఎన్నటికీ మరచిపోరు.

Also read: నెహ్రూ భారత్ ను కనుగొంటే పీవీ పునరావిష్కరించారు : శశిథరూర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles