Friday, April 26, 2024

తెలుగువారి ఆత్మగౌరవ పతాక

నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) చారిత్రక పురుషుడు. కారణజన్ముడు. తెలుగు ప్రజల హృదయపీఠాలపై శాశ్వతంగా నెలకొని ఉన్న అసాధారణ వ్యక్తి. ఎన్ టి రామారావును తెలుగువారంతా ప్రేమిస్తారు. రాజకీయ విభేదాలు ఉండి ఉండవచ్చు. ఆయన నిర్ణయాల వల్ల కోట్లమందికి ఉపకారం జరిగితే కొన్ని వేలమందికి అపకారం జరిగి ఉండచ్చు. కానీ అసలు సిసలైన సంక్షేమ రాజ్యానికి పునాది వేసిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవ పతాకను జాతీయ వేదికపైన ఆవిష్కరించిన అసాధారణ నాయకుడు ఎన్టీఆర్.

Also read: ధన్యజీవి చేకూరి కాశయ్య

తొంభై తొమ్మిది సంవత్సరాల కిందట సరిగ్గా ఈ రోజు (మే 28) నందమూరి లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు నందమూరి అందగాడు జన్మించాడు. వ్యవసాయంలో నష్టం రావడం, పొలాలు అమ్ముకోవలసి రావడంతో కష్టాలతోనే నందమూరు వదిలి విజయవాడలో కాపురం పెట్టి హైస్కూలు చదువు చదివారు. విశ్వనాధ సత్యనారాయణ, చతుర్వేదుల శ్రీరామనరసింహం వంటి ప్రతిభావంతులైన అధ్యాపకులకు ప్రియశిష్యుడైనారు. ఇంటర్ పూర్తయిన తర్వాత గుంటూరు వెళ్ళి అక్కడ ఏసీ కాలేజీలో బీఏ చదువుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలిపెట్టి సినీరంగంలో ప్రవేశించారు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

ఎన్ టి రామారావు తెలుగు రాజకీయాలలో, భారత రాజకీయాలలో చరిత్ర సృష్టించిన తీరు అపూర్వం. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్రరంగంలో మూడువందల సినిమాలకు పైగా నటించి, ప్రపంచంలో ఏ నటుడూ నటించని పాత్రలలో జీవించి, కలియుగ రాముడుగా, కృష్ణుడుగా, భీముడుగా, దుర్యోధనుడుగా, రావణుడుగా, కర్ణుడిగా ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న అసాధారణ వ్యక్తి. అంతటితో ఆగిపోయినా, సినిమా రంగంతో సరిపెట్టుకున్నా ఆయన చరిత్ర సృష్టించిన నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా మిగిలిపోయేవారు. అంతటితో ఆగిపోతే ఆయన అక్కినేని నాగేశ్వరరావు అవుతారు కానీ నందమూరి తారక రామారావు కాదు.

Also read: ఏమున్నది గర్వకారణం?

రాజకీయ తుపాను సృష్టికర్త

అరుపదుల వయసు నిండగానే సినిమా రంగానికి స్వస్తి చెప్పి రాజకీయాలలో అరంగేట్రం చేశారు. తెలుగురాజకీయాలలో తుపాను సృష్టించారు. తెలుగుదనానికి పట్టం కట్టే విధంగా పార్టీని పెట్టి, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం స్ఫురించే జెండాను రూపొందించి, అసాధారణమైన రీతిలో చైతన్యరథంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసి, ఘనాతిఘనమైన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ఎన్నికలలో అపూర్వ విజయం సాధించారు. మూడున్నర దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిష్ఠవేసుకున్న కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెళ్ళగించారు. స్వచ్ఛమైన తెలుగు ఆహార్యం, వ్యవహారంతో ఆవేశపూరితంగా వేలమంది అభిమానుల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేశారు.

Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?

మనసులో ఉన్నది మాట్లాడడం, మనసుకు తోచింది చేయడం, సత్యనిష్ఠ పాటించడం, నిజాయితీగా జీవించడం అనే సూత్రాలను తు.చ. తప్పకుండా జీవించారు. కుటుంబం అంటే విపరీతమైన ఆరాటం. భార్య బసవతారకం పట్లా, సంతానం పట్లా ప్రేమానురాగాలు ఎక్కువ. సాధారణంగా ఏ తండ్రి కంటే కూడా ఎక్కువగా పిల్లల్ని ఆదరించారు. ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో సరైన అవగాహన లేక, నిర్దిష్టమైన సమాచారం లేక తప్పులు జరిగాయి. వాటిని దిద్దుకోవడానికి ఏ మాత్రం సంకోచించేవారు కాదు. జరిగిన పొరపాటును ఆయన దృష్టికి తీసుకొని వెడితే తప్పకుండా సరిదిద్దుకునేవారు. ‘నాకు ఈ వ్యవహారం తెలియదు బ్రదర్. ప్రభుత్వానికి కొత్తకదా’ అనేవారు. తాను నమ్మిన అధికారుల సలహాలు పాటించేవారు. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే తప్పులో కాలేసేవారు.

ఎదురు చెప్పిన అధికారులను గౌరవించిన సీఎం

ఉన్నతాధికారులుగా ఎన్ టి ఆర్ హయాంలో పని చేసి, ఆయన మాటకు ఎదురు చెప్పి, ఆయనకు రుచించని సలహాలు చెప్పి ఆయన చేత మంచి పనులు చేయించినవారు ఉన్నారు. అటువంటి అనుభవం నేటి ప్రధానమంత్రితో కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ పనిచేస్తున్న అధికారులకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా అభిప్రాయం తప్పయితే సంతోషం. కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చే పథకానికి రూపకల్పన చేసి అమలు చేసి, తర్వాత ముగ్గురు ప్రధానులకు సలహాదారుగా పని చేసిన కె. ఆర్. వేణుగోపాల్, అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసిన వై. వి. రెడ్డి, ప్రధాని పీవీకి సమాచార వ్యవహారాల సలహాదారుగా పని చేసిన పివిఆర్ కె ప్రసాద్ వంటి విలక్షణమైన అధికారులు ఎన్ టీఆర్ మాటకు ఎదురు చెప్పిన సందర్భాలు, ఆయన వారిని బుజ్జగించి, సముదాయించిన సందర్భాలూ నాకు తెలుసు.

చంద్రబాబునాయుడును పార్టీలో చేర్చుకున్నా, ఆయనను పూర్తిగా విశ్వసించినా, ముప్పయ్ మంది మంత్రులనూ ఒక్క కలంపోటుతో బర్తరఫ్ చేసినా, తిరుపతి బహిరంగ సభలో (కెప్టెన్ చంద్రకాంత్  శతదినోత్సవ సభ) లక్ష్మీపార్వతి అనే వ్యక్తిని వివాహం చేసుకుంటున్నట్టు నాటకీయంగా ప్రకటించినా, చంద్రబాబునాయుడు అధికారం హస్తగతం చేసుకునే క్రమంలో కూడా లక్ష్మీపార్వతిని దూరంపెట్టడానికి అంగీకరించకపోయినా ఎన్టీఆర్ తన మనసు చెప్పినట్టు నడుచుకున్నారు. తన ఎత్తుగడలు తాను వేశారు. తన సమయజ్ఞతను తాను ప్రదర్శించారు. కానీ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల తనకు కానీ, తన పార్టీకి కానీ, తన ప్రభుత్వానికి కానీ లాభమా, నష్టమా, ఎంత శాతం అని ఆలోచించలేదు.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

ప్రజాస్వామ్యవాది, ఉదారవాది

ప్రస్తుత ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జర్నలిస్టులకు పెద్దగా గౌరవం ఇచ్చిన సందర్భాలు కనిపించవు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) మీడియా సమావేశాలలో తనకు హుషారుగా ఉన్నప్పుడు, తాను అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతారు కానీ తనకు అననుకూలమైన ప్రశ్న అడిగిన జర్నలిస్టు నోరు నిర్దాక్షిణ్యంగా మూయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవీ ప్రమాణం చేసిన తర్వాత ఒకే ఒక సారి విలేఖరులతో మాట్లాడారు. అది కూడా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విషయంపైన మాట్లాడటానికి. ప్రధానిగా నరేంద్రమోదీ ఈ రోజుతో ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదు. ఎన్టీఆర్ అట్లా కాదు. పదవిలో ఉన్నప్పుడు చాలా హాయిగా విలేఖరులతో, ఇతర జర్నలిస్టులతో మాట్లాడేవారు. నేను కూడా అనేక సందర్భాలలో ఆయన నివాసంలో కలుసుకొని తనివితీరా మాట్లాడాను. నడింపల్లి సీతారామరాజుగారూ, నేను ఆయన అధికారంలో లేనప్పుడు కూడా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ తో నా కంటే ఎక్కువ చనువున్న జర్నలిస్టులు కూడా నాకు తెలుసు. చివరికి పదవీచ్యుతుడైన తర్వాత కూడా జర్నలిస్టుడైరీ కార్యక్రమం నిర్వాహకుడు సతీష్ ఏర్పాటు చేసిన సమావేశంలో చాలామంది జర్నలిస్టులు సూటిగా అడిగిన అనేక ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. సినిమా నటుడిగా ఉన్నకాలంలో సినిమా జర్నలిస్టులతో ఎట్లా ఉండేవారో నాకు తెలియదు కానీ రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసినట్టే విలేఖరులను క్రమం తప్పకుండా కలుసుకునేవారు. ఆవేశంగా, నిష్ఠురంగా, ఆత్మనిందాత్మకంగా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. ఆయన భావావేశాలు తెలుసు కనుక జర్నలిస్టులు అర్థం చేసుకునేవారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలంటే గౌరవం ఉన్నట్టు కనిపించేవారు. ప్రధానంగా మీడియా ప్రతినిధులతో వ్యవహరించే విషయంలో ఉదారంగా ఉండేవారు.

Kesava Rao, president of Hyderabad union of Journalists, welcomes Chief Minister NTR
to a meet the press programme in Hyderabad in 1990.

Also read: మీడియా అందుబాటులోకి ఎస్ సి ప్రత్యేక యాప్ 

ప్రతిపక్షాల సంధానకర్త

ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేతులలోకి తీసుకున్న కొద్ది మాసాలకే విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో థర్మల్ స్టేషన్ అతిథి గృహంలో ప్రతిపక్షాల నాయకుల సమావేశం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. నేను అప్పుడు విజయవాడలోనే ఉన్నాను. వాజపేయి, ఫారుఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, సూర్జిత్ సింగ్ బర్నాలా వంటి ప్రతిపక్ష హేమాహేమీలు ఆ సభకు హాజరైనారు. అది కూడా చరిత్రే. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం చరిత్ర. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తర్వాత పదేళ్ళకు ప్రతిపక్షాలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సమీకరించిన ఘనత ఎన్టీఆర్ దే.  రాజీవ్ గాంధీ 1989 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత విపి సింగ్, చంద్రశేఖర్ లు ప్రధానులు కావడానికే నాటి ప్రతిపక్షాల సమైక్యతే కారణం. పీవీ నరసింహారావు తర్వాత దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వంటి దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నాయకులు ప్రధానులు కావడానికి కూడా ఎన్టీఆర్ నాయకత్వంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కారణం. దేవెగౌడ అదికారంలోకి వచ్చేవరకూ ఎన్టీఆర్ లేకపోవచ్చు కానీ ఆయన వేసిన బీజమే వృక్షమై ప్రతిపక్షానికి అండగా నిలిచింది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబునాయుడు కొనసాగారు- అయన 1999లో బీజేపీతో చేతులు కలిపేవరకూ.

Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

ఎన్టీఆర్ కంటే ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, సంజీవరెడ్డి వంటి నాయకులు కేంద్రంలో ప్రముఖ స్థానాలలో ఉన్నప్పటికీ తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు లేదు. తెలుగువారిని కూడా మద్రాసీలుగానే పరిగణించే రోజులు అవి. అటువంటి సందర్భంలో రాజకీయ ప్రవేశం చేసి, తుపాను సృష్టించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం ద్వారా తెలుగువారికి జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చారు. నూటికి నూరుపాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే విధంగా పంచె, లాల్చీ, ఉత్తరీయం ధరించి దిల్లీలో తిరుగాడడం ద్వరా తెలుగు కట్టుబొట్టులకు కూడా ప్రచారం కల్పించారాయన. పీవి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూ, తెలుగువారికీ, వంగర వంటి చిన్న పల్లెకూ జాతీయ  స్థయిలో మరింత గుర్తింపు రావడం సహజమే. కానీ తెలుగువారికి జాతీయస్థాయిలో ఒక ప్రశంసనీయమైన పరిగణన సాధించిన ఘనత మాత్రం ఎన్టీఆర్ దే. ఇప్పుడు ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నత స్థానంలో ఉన్న తెలుగువారు.

Also read: ఈటలపై వేటు ఇప్పుడే ఎందుకు పడింది?

బీసీలకు అధికార ప్రదాత

కిలో రెండు రూపాలయకు బియ్యం, యాభై రూపాయల విద్యుచ్ఛక్తి శ్లాబ్ నిర్ణయం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వానికి భారమైనా అమలు చేశారు. మద్యపాన నిషేధం సైతం అటువంటిదే. పరిపాలనారంగంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు కూడా చరిత్రాత్మకమైనవే. మండలీకరణ వల్ల మూడంచెల పాలన వచ్చి పరిపాలన వికేంద్రీకృతమైంది. ఎంతో మంది వెనుకబడిన కులాలవారికి అధికారం దక్కింది. జిల్లాపరిషత్తు అధ్యక్ష పదవులకు నేరుగా ఎన్నికలు జరిపించడం కూడా అసాధారణమైన నిర్ణయం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీల రాజకీయ ప్రాబల్యం పెరిగింది. 1994 ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీల ఆధిక్యం తిరుగులేనిది. రాజకీయ కుటుంబాలవారికీ, డబ్బు ఉన్నవారికీ, పైరవీలు చేసినవారికీ పార్టీ టిక్కెట్లు ఇచ్చే కాంగ్రెస్ సంస్కృతికి చరమగీతం పాడింది ఎన్టీఆరే. అనామకులకూ, తమ మానాన తాము అధ్యాపకులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నవారికీ, లాయర్లుగా, డాక్టర్లుగా ప్రాక్టీసు చేసుకుంటున్నవారికీ పిలిచి పార్టీ టిక్కెట్లు ఇచ్చి ఎన్నికలలో గెలిపించి మంత్రిపదవులు ఇచ్చి రాజకీయ నాయకులుగా ఎదగడానికి దోహదం చేశారు. ఇదీ చరిత్రే. అడుగడుగునా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పదవి కూడా చరిత్రాత్మకంగా ఆయనను వీడిపోయింది. ఎవరినైతే మనస్పూర్తిగా విశ్వసించి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా నియమించారో, రెండు ముఖ్యమైన శాఖలు అప్పగించి మంత్రిగా గౌరవించారో, అంతకు ముందు పిల్లనిచ్చి అల్లుడిగా తెచ్చుకున్నారో అటువంటి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ చేతిలోని అధికారాన్ని లాక్కున్నారు. ఏ మహిళను అయితే తాను తన అవసరం కొద్దీ చేరదీసి పెళ్ళి చేసుకున్నారో ఆ మహిళ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణతోనే ఎన్టీఆర్ పదవికి ముప్పు తెచ్చారు. పదవి పోయినా, అదికారం లేకపోయినా పోరాటమార్గాన్ని వీడకపోవడం ఎన్టీఆర్ వ్యక్తిత్వ విశేషం.  ఎన్టీఆర్ పోరాటం మధ్యలోనే, విజయవాడలో మహాసభకు సన్నాహాలు చేస్తున్న దశలోనే శాశ్వతంగా కన్నుమూశారు. అటువంటి నటుడు, రాజకీయ నాయకుడు, సంస్కరణశీలి, సంక్షేమ భాగ్యవిధాత మళ్ళీ కనిపించరు. అందుకే, ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగుజాతి స్మరించుకోవలసిన చరిత్ర పురుషుడు.

Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే

(మే 28 ఎన్టీఆర్ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles