Tuesday, April 23, 2024

ధన్యజీవి చేకూరి కాశయ్య

  • డబ్బు సంపాదన యావ లేని రాజకీయ నాయకుడు
  • పార్టీలు మారినా విలువలకు తిలోదకాలు ఇవ్వని నిజాయితీపరుడు.
  • ఖమ్మం జిల్లా పెద్దాయనగా అందరి మన్ననలూ అందుకున్న అసాధారణ వ్యక్తి

చేకూరి కాశయ్య నిజాయతీపరుడైన, విలువలు పాటించిన రాజకీయ నాయకుడు. డబ్బుసంపాదన కోసం రాజకీయం చేసినవాడు కాదు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించిన నేత. విద్యార్థులన్నా, యువజనులన్నా, ఉపాధ్యాయులన్నా అమితమైన ప్రేమ. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, తన స్నేహితులతో ఉన్న అనుబంధాలను విస్మరించకుండా, రూపాయి సంపాదించకుండా, రూపాయ ఖర్చు చేయకుండా దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయయానం చేసిన ఉన్నతమైన వ్యక్తి. ధన ప్రభావం రాజకీయాలలో పెరిగిన తర్వాత వాటికి ఒక నమస్కారం పెట్టి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సహవాసం చేస్తూ శేష జీవితాన్ని సంతృప్తికరంగా గడిపిన నిరాడంబరుడు. ఆయన యువరాజకీయ నాయకులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ఆయన మృతి ఖమ్మంజిల్లా సమాజానికి తీరని లోటు.

చేకూరి కాశయ్య (86) సోమవారం అర్ధరాత్రి ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమితి అధ్యక్షుడుగా పరిషత్తు అధ్యక్షుడుగా, శాసనసభ్యుడిగా ఆయన ప్రజాసేవ చేశారు. ఎనిమిదేళ్ళ సమితి అధ్యక్ష పదవి, పదకొండు సంవత్సరాలు శాసనసభ్యత్వం, అయిదేళ్ళు జిల్లా పరిషత్తు అధ్యక్షపదవి నిర్వహించిన రాజకీయ నాయకుడు ఆయన.  సౌమ్యుడూ, వివాదాలకు అతీతుడూ, అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఉన్న నాయకుడూ అయిన కాశయ్య కొత్తగూడెం కార్యక్షేత్రంగా రాజకీయాలలోకి దిగారు.

సమితి అధ్యక్షుడిగా తొలి అడుగు

ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా ఉన్న రోజులలో ఉద్యోగం విరమించి రాజకీయాలలో దిగారు. ఖమ్మం లోక్ సభ స్థానానికి తెలంగాణ ప్రజాసమితి తరఫున 1971 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1972లో కొత్తగూడెం నుంచి శాసనసభకు ఎన్నికైనారు.  1978లో జనతా పార్టీ తరఫున కొత్తగూడెం శాసనసభ్యుడిగా వనమా వెంకటేశ్వరరావుపైన గెలిచారు.

రైతుల పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల అవగాహన, విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న నాయకుడు కనుకనే ఈ రంగాల గురించి ఎక్కువగా పట్టించుకొని పని చేసేవారు. కొంతకాలంగా ఖమ్మంలో ఆశ్రమ జీవితం గడుపుతున్నారు. అభ్యుదయవాదిగా, నిజాయతీపరుడుగా పేరు తెచ్చుకున్న కాశయ్య రాజకీయాల నుంచి విరమించుకొని గురుదక్షిణ ఫౌండేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తక్కెళ్ళపాడులో జననం

 కాశయ్య ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం తక్కెళ్ళపల్లి గ్రామంలో నర్సయ్య, భాగ్యమ్మ దంపతులకు 1936లో జన్మించారు. వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. 1946లో కాశయ్య మధిరలో సెకండ్ ఫామ్ చదువుతున్న రోజుల్లో అక్కడికి గాంధీగారు వచ్చారు. వారం రోజులు మద్రాసులో దక్షిణభారత హిందీ ప్రచారసభ కార్యక్రమాలు చూసుకొని ఆ తర్వాత వార్థా వెడుతూ మహాత్ముడు మధిరలో ఆగారు. మధిరలో గాంధీ సభ పెట్టుకోవడానికి నిజాం ప్రభుత్వం అనుమతించింది.  హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామానందతీర్థ, ఆయనకు కుడిభుజంగా నిలిచిన సర్దార్ జమలాపురం కేశవరావు కూడా మధిర వచ్చారు. అప్పటికే కాశయ్య విద్యార్థి  నాయకుడు.  నాడు గాంధీగారిని చూడడం, వినడం తన అదృష్టమని, తన జీవిత దృక్పథం మారిపోయిందనీ, ఆ రోజే తాను రాజకీయాలలో ప్రవేశించి దేశ సేవ చేయాలని నిర్ణయించుకున్నాననీ కాశయ్య అనేక సందర్భాలలో చెప్పారు. గాంధీజీ ప్రభావం కాశయ్యపైన విశేషంగా ఉంది. అప్పటి నుంచి చివరి శ్వాస పీల్చేవరకూ ఆయన గాంధీ సిద్ధాంతాలనే అనుసరించారు. తన చుట్టూ రాజకీయాలు ఎంత కలుషితమైనప్పటికీ ఆయన మట్టి అంటించుకోలేదు. ఇంటర్మీడియట్, బీఏ చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా చేకూరి కాశయ్య హైదరాబాద్ రాష్ట్రం అంతటా పర్యటించారు.

ఖమ్మం జిల్లా ఏర్పాటులో బొమ్మకంటి సత్యనారాయణరావు పాత్ర

1952 ఎన్నికలలో జలగం వెంగళరావుగారు వేంసూరు నియోజకవర్గం నుంచి 330 ఓట్లతో ఓడిపోయారు. మాడపాటి రామచంద్రరావుకూ, బొమ్మకంటి సత్యనారాయణరావుకూ పడేదికాదు. ఎన్నికలలో బొమ్మకంటి సత్యనారాయణరావు ఓడిపోయినా కూడా ఖమ్మం జిల్లా ఏర్పాటుకు మూలపురుషుడు ఆయనే. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో తనకు సాన్నిహిత్యం ఉండడం వల్ల ఈ పని చేయగలిగారు. వరంగల్లు జిల్లా నుంచి చీలి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి సహకారంతో శీలం సిద్ధారెడ్డి రాజకీయాలలో ఎదిగి, జలగం వెంగళరావుకు ప్రత్యర్థిగా నిలిచారు. వెంగళరావు కంటే ముందే రాష్ట్ర మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించారు.  బూర్గుల రామకృష్ణారావుతోనూ, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులతోనూ కలిసి పని చేసే అవకాశం తనకు వచ్చిందని కాశయ్య చెబుతూ ఉండేవారు. తాను హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుకునే సమయంలో తన తండ్రి తనకు నెలకు రూ.30లు పంపేవారనీ, అందుకోసం ఆరు బస్తాల జొన్నలు అమ్మవలసి వచ్చేదని చెప్పేవారు. కొంత కాలం తర్వాత స్నేహితులతో కలసి ఉండేవాడిననీ, వడ్డేపల్లి నరసింహారావుగారితో కలసి వారి ఇంట్లో ఉండేవాడిననీ చెప్పేవారు. అప్పటి నుంచి తనకూ స్నేహితులతో కలసి ప్రయాణం చేయడం అలవాటయిందని అన్నారు. 1955లో బీఏ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు వరంగల్లులో విద్యార్థి మహాసభలు జరిగితే విద్యార్థి నాయకుడి హోదాలో ఆ సభలలో కాశయ్య పాల్గొన్నారు. అప్పుడు ముఖ్యఅతిథిగా పీవీ నరసింహారావుగారు వచ్చారు. అప్పటి నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డితోనూ, పీవీతోనూ సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. 19 సెప్టెంబర్ 1959న లలితను కాశయ్య ప్రేమించి దండల మార్పిడి పెళ్ళి చేసుకున్నారు.

బీఏ పూర్తయిన తర్వాత సాయంకళాశాలలో బీఎల్ చదువుతూ 1958,59లో టీచర్ గా కాశయ్య పని చేశారు.అనంతరం సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సెలక్టు అయ్యారు. కొత్తగూడెంలో ఉద్యోగంలో 1960లో  చేరారు. శ్రీమతి లలిత టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండటం ఆయనకు కలసి వచ్చిన అంశం. తన ఉద్యోగానికి 1964లో రాజీనామా చేసి పూర్తి కాలం రాజకీయాలలోకి దిగగలిగారు. కాశయ్య దంపతులకు ఇద్దరు కుమారులూ, ఇద్దరు కుమార్తెలూ. కాశయ్య భార్య ఇదివరకే చనిపోయారు.

భూసంస్కరణలు అమలు చేసిన బూర్గుల  

నాటి రాజకీయాల గురించి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి పూర్వం హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గులరామకృష్ణారావు గొప్ప సేవలందించారని కొనియాడేవారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం కారణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే బూర్గుల భూసంస్కరణలు అమలు పరిచారని చెప్పారు. పదవీ ప్రమాణం చేసిన పదిహేను రోజులకే ప్రతి ఇంటికీ అధికారులను పంపించి భూవివరాలు సేకరించారు. ప్రతిపేదవారికీ ప్రభుత్వ భూముల నుంచి అయిదు ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. ఖాస్రా పహాణీ యాక్ట్ తీసుకొని వచ్చారు. 1953లోనే కౌలుదారీ చట్టం తీసుకొని వచ్చి దేశంలోకెల్లా భూసంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని నిలిపారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఉన్నకేరళలో కంటే ముందుగా హైదరాబాద్ రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయడానికి అంగీకరించిన బూర్గుల రామకృష్ణారావును మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి చేస్తామని పార్టీ అధిష్ఠానం వాగ్దానం చేసింది. కానీ నిలబెట్టుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బూర్గులను రాజ్యసభ సభ్యుడిగా పంపడానికి కూడా అధిష్ణానం సిద్ధంగా లేదు. చివరికి ఆయనను కేరళ గవర్నర్ గా నియమించారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు.

జలగం అనుచరుడిగానే రాజకీయ అరంగేట్రం

జలగం వెంగళరావు అనుచరుడిగానే కాశయ్య రాజకీయ జీవితం ప్రారంభమైంది. వెంగళరావు మద్దతుతోనే సమితి అధ్యక్షుడుగా రెండు విడతలా ఎన్నికైనారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చేసరికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితిలో చేరారు. 1970 లో నేను తల్లాడలో టీచర్ గా పని చేస్తున్న రోజుల్లో టీపీఎస్ నాయకుడిగా చేకూరి కాశయ్యగారు ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం విన్నాను. అప్పుడే ఆయనను కలుసుకోవడం. ఆ తర్వాత 1971లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుంచి తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (కాంగ్రెస్)కు వ్యతిరేకంగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి లోక్ సభకు ఎన్నికై అత్యున్నత చట్టసభలో ప్రసంగించాలనే కోరిక తీరకుండానే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 1971లో ఖమ్మం లోక్ సభ సీటు గెలుచుకున్న లక్ష్మీకాంతమ్మ 1977, 1980లో కూడా విజయం సాధించారు. ఆమెకు కాశయ్య దగ్గరైనారు. లక్ష్మీకాంతమ్మ కాశయ్య ప్రభృతులను పీవీ నరసింహారావు దగ్గరికి తీసుకువెళ్ళారు. మొత్తం 14 స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్న టీపీఎస్ కాంగ్రెస్ లో విలీనమైంది. 1972లో పీవీగారు  కాశయ్యకి కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. గెలుపొందారు.

జలగంతో విభేదాలు

టీపీఎస్ లో చేరినప్పటి నుంచి జలగం వెంగళరావుతో కాశయ్య సంబంధాలు చెడిపోయాయి. టీపీఎస్ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత జిల్లాలో శీలం సిద్ధారెడ్డి వర్గంలోనూ, సామినేని ఉపేంద్ర వర్గంతోనూ సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్రస్థాయిలో పీవీ నరసింహారావుకి దగ్గరైనారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1975లో విధించిన ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసి ఇందిరాగాంధీ  1977లో జరిపించిన లోక్ సభ ఎన్నికలలో ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో చిత్తుగా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లోనూ, కర్ణాటకలోనూ ఘనవిజయం సాధించింది.  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 42స్థానాలలో ఒక్క నంద్యాలలో కాంగ్రెస్ (ఓ) అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి గెలుపొందారు. తక్కిన 41 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. వెంగళరావు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వెంగళరావుకీ, కర్ణాటకలో దేవరాజ్ అర్స్ కీ మంచి పేరు వచ్చింది. మొరార్జీ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం పతనమైన తర్వాత, చరణ్ సింగ్ సర్కార్ కుదేలైన మీదట మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో సంస్థాగత కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉండగా చీలిన పార్టీకి ఇందిరాగాంధీ నాయకత్వం వహించారు. ఆ పార్టీని కాంగ్రెస్ (ఐ) అన్నారు. వెంగళవారు బ్రహ్మానందరెడ్డినే బలపరిచి ఆయన నాయకత్వంలోని పార్టీలోనే ఉన్నారు. ‘అమ్మా లేదు, బొమ్మా లేదు’ అంటూ తాను చెప్పినట్టు వినాలని ప్రజలకు వెంగళరావు హితబోధ చేశారు. ప్రజలు వినలేదు.  వెంగళరావుకు  వ్యతిరేకంగా జనతా ప్రభుత్వానికి లేఖ రాసినవారిలో కాశయ్య ప్రముఖులు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళవారు అధికార దుర్వినియోగానికీ, నిధుల దుర్వినియోగానికీ పాల్పడ్డారని ఆరోపించారు. విచారణకు విమద్ లాల్ కమిషన్ ను నెలకొల్పారు. జలగం వెంగళరావు సలహా మేరకు కాశయ్యనీ, జైపాల్ రెడ్డినీ, ఉమారెడ్డినీ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. 1978 ఎన్నికలలో కాశయ్య జనతా టిక్కెట్టు మీద కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 175 స్థానాలు సాధించిన కాంగ్రెస్ (ఐ) డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రభుత్వేం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ (రెడ్డి) టిక్కెట్టుపైన గెలిచిన 30 మంది  ఎంఎల్ఏలు (వైఎస్ రాజశేఖరరెడ్డి సహా) కాంగ్రెస్ లో చేరిపోయారు.

ప్రతీకారేచ్ఛ

తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి కారకుడైన జలగం వెంగళరావుపైన ప్రతీకారం తీర్చుకునేందుకు కాశయ్య ఎన్ టీఆర్ పిలుపు మేరకు 1985లో టీడీపీలో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి యువనాయకులతో కలసి పని చేశారు. ఎన్ టీ ఆర్ హయాంలో తెచ్చిన సంస్కరణల ఫలితంగా జిల్లాపరిషత్తులకు నేరుగా ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలలో వెంగళరావు హవా బలంగా ఉండేది. పైగా జలగం దిల్లీలో రాజీవ్ గాంధీ మంత్రిమండలిలో పరిశ్రమల మంత్రి. జిల్లాలో ఆయన మాటకి తిరుగులేదు. అటువంటి వాతావరణంలో టీడీపీ అభ్యర్థిగా కాశయ్యగారిని నిలబెట్టాలని ఎన్ టీఆర్ నిర్ణయించారు. ఉపాధ్యాయవర్గం, వివిధ రంగాలలో ఉన్న స్నేహితులూ, టీడీపీ నాయకులు చేసిన సమష్టి కృషి మూలంగా జలగం వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాద్ పైన కాశయ్య 50 వేల ఓట్ల మెజారిటీతో జిల్లాపరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నికైనారు.

టీడీపీలో ఉండగానే కాశయ్యకు ఒక ధర్మసంకటం వచ్చింది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షద్ మెహతా ఉదంతం తెరపైకి వచ్చింది. ప్రధానికి కోటి రూపాయలు లంచం ఇచ్చినట్టు స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఆరోపించారు. పీవీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నేషనల్ ఫ్రంట్ అధినాయకుడుగా ఉన్న టీడీపీ అధినేత ఎన్ టి రామారావు కూడా ప్రతిపక్షంతో గొంతుకలిపారు.

పీవీకి మద్దతు, టీడీపీ నుంచి నిష్క్రమణ

ఇది అన్యాయం అనిపించింది కాశయ్యగారికి. తీవ్ర మనస్తాపం కలిగింది. మానసిక సంఘర్షణకు గురైనారు. టీడీపీలో ఉండడమా, మానడమా అని తర్కించుకున్నారు. సత్యనిష్ఠ లేకుండా రాజకీయాలు దండగని అనుకున్నారు. భావోద్వేగానికి లోనైనారు. ధైర్యం చేసి పీవీకి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు పీవీ వ్యక్తిత్వం క్షుణ్ణంగా తెలుసు. పీవీ డబ్బుతో రాజకీయం చేయడని తెలుసు. అటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండే నిరాడంబర జీవి అనికూడా తెలుసు. అటువంటి మహానుభావుడిని లంచగొండిగా అభివర్ణిస్తూ హర్షద్ మెహతా ఆరోపణలకు గౌరవం ఆపాదిస్తూ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు  డిమాండ్ చేయడం దారుణం అనిపించింది కాశయ్యగారికి. ఎవ్వరినీ సంప్రదించకుండా, పీవీకి సైతం చెప్పకుండా, కొత్తగూడెం నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పీవీని రాజీనామా అడగడం దుర్మార్గం అంటూ ప్రకటించారు. సహజంగానే ఇది ఎన్ టీఆర్ కి ఆగ్రహం కలిగించింది. తక్షణం పార్టీ నుంచి బహిష్కరించారు. కారణాలు ఏమైతేనేమి రెండు ప్రధాన పార్టీల – కాంగ్రెస్, టీడీపీ – నుంచి బహిష్కరణకు గురైన ఏకైక నాయకుడు కాశయ్య.

తీరని కోరిక లోక్ సభ సభ్యత్వం

తనకు లోక్ సభకు వెళ్ళి అందులో తన వాణి వినిపించే అదృష్టం లేదని తీర్మానించుకున్న కాశయ్య క్రమంగా రాజకీయాల నుంచి దూరమైనారు. 2000 సంవత్సరంలో రాజకీయాల నుంచి విరమించుకొని ఖమ్మంలో గురుదక్షిణ ఫౌడేషన్ కు శేషజీవితం అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడే విద్యార్థులతో కలసి జీవిస్తున్నారు. హైదరాబాద్ లో కాన్సర్ కి చికిత్స తీసుకుంటూ ఉండగా గుండె నొప్పి వచ్చి మంగళవారం ఉదయం కన్నుమూశారు.  చాలా పార్టీలు మారిన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఏ పార్టీలోనూ పదవికోసం చేరలేదు. రెండు ప్రధాన పార్టీల నుంచి బహిష్కరణకు గురి కావడంతో కొత్త పార్టీలో చేరక తప్పలేదు. ఎన్ని పార్టీలు మారినా అవకాశవాదిగా ముద్ర వేయించుకోకపోవడం కాశయ్యగారి వ్యక్తిత్వ విశేషం.

నాకు కాశయ్యగారు మంచి మిత్రుడు. నేను టీచర్ గా తల్లాడలో పని చేస్తున్న రోజుల్లో ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినప్పుడు నన్ను కలుసుకున్నారు. యువకులను ప్రేమించి, ప్రోత్సహించే మనస్తత్వం ఆయనది. జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఉత్తమ జర్నలిస్టుగా నన్ను పిలిచి నేను వద్దని వారిస్తున్నావినకుండా సన్మానించారు. నేను దిల్లీలో ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన ప్రధాని పీవీ నరసింహారావుగారిని కలుసుకోవడానికి వచ్చేవారు. వచ్చిన ప్రతిసారీ ఐఎన్ ఎస్ బిల్డింగ్ లో మా కార్యాలయానికి వచ్చి రాజకీయ పరిస్థితులనూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను సాకల్యంగా గంటలసేపు చర్చించేవారు. ఆ తర్వాత చాలా సందర్భాలలో కలుసుకున్నాం. ఇటీవల ఖమ్మం పోయినప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాను. హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. ఈ లోగా కరోనా కట్టడిలో గడపదాటకుండా గృహనిర్బంధంలో ఉండే పరిస్థితులు దాపురించాయి. నేను ఇంటర్వ్యూ చేయకుండానే, ఆయన పార్లమెంటు సభ్యుడు కాకుండానే కాశయ్య కాలగర్భంలో కలసిపోయారు.

హేతువాది

కాశయ్య హేతువాది. విద్యార్థి దశలోనే గోపరాజు రామచంద్రరావు (గోరా) అభిమాని. ఆ తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడే వారం రోజులు ఉండి గోరాగారి ఉపన్యాసాలు విన్నారు. గొరాగారి కుమారులు లవణంగారు ఆయనకు బాగా దగ్గర. సమరంగారితో, విద్యగారితో సాన్నిహిత్యం ఉంది. సూర్యాపేటలో ఖానాజీగారు నెలకొల్పిన నాస్తిక కేంద్రానికి వెళ్ళేవారు. గురుదక్షిన ఫౌండేషన్ లో ప్రకృతి చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు.  

భార్య ఉద్యోగం ఉందన్న ధైర్యంతోనే రాజకీయాలలోకి దిగాననీ, రాజకీయాలలో డబ్బు సంపాదించాలనే దుగ్ధ ఎన్నడూ లేదనీ, డబ్బు లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా బెంగలేదనీ,  బోలెడంతమంది స్నేహితులూ, హితైషులూ ఉన్నారనీ, ప్రజల ఆదరణ కొనసాగుతున్నదనీ, అంతకంటే తాను కోరుకున్నది ఏమీ లేదనీ, సంతృప్తిగా ఉన్నాననీ కొన్ని మాసాల కిందట తుమ్మల నాగేశ్వరరావుగారి ఇంటిదగ్గర కలిసినప్పుడు అన్నారు. కాశయ్యగారు కర్మజీవి. ధన్యజీవి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles