Monday, October 7, 2024

ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?

ప్రశాంత్ కిశోర్ పరిచయం అక్కర లేని వ్యక్తి. ఎన్నికల నిర్వహణలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నాయకత్వంలోని ‘ఐప్యాక్’ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థ చాలామందికి ఉపాధి కల్పించింది. చాలా పార్టీలను ఎన్నికలలో గెలిపించింది. తాజాగా పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన ఘనవిజయంలో ప్రశాంత్ కిశోర్ పోషించిన పాత్ర గణనీయమైనది. ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకురాలు కనుక విజయం సాధించిన సంబరాలలో ప్రశాంత్ కిషోర్ పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ప్రస్తావించలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకం విడుదల చేసిన సందర్భంలో జరిగిన పార్టీ సమావేశంలో తన సరసన ప్రశాంత్ కిశోర్ ను కూర్చొబెట్టుకొని గౌరవించారు. పార్టీ నాయకులకు పరిచయం చేశారు. ఆయన తోడ్పాటు ఎన్నికల నిర్వహణలో ఉంటుందని బాజాబితాగా చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా తరచుగా ప్రశాంత్ కిశోర్ తో సంపర్కంలో ఉంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఇటీవల ప్రశాంత్ కిశోర్ కి పదవి ఇచ్చినప్పటికీ ఎన్నికల నిర్వహణలో తనదైన బాటనే అనుసరించారు. ప్రశాంత్ కిశోర్ పైన పూర్తిగా ఆధారపడలేదు.

Also read:రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే…

ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీనీ, అఖిలేష్ యాదవ్ నీ కలిపి ‘యూపీకే లడకే’ అంటూ ఉమ్మడిగా ప్రచారం చేయించడం ప్రశాంత్ కిశోర్ వ్యూహమే. కానీ బీజేపీ ప్రభంజనం ముందు ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం పని చేయలేదు. ప్రజలలో ఫలానా పార్టీని గెలిపించాలనే ఆకాంక్ష లేకపోతే ప్రశాంత్ కిశోర్ కానీ మరొకరు కానీ చేసేది ఏమీ ఉండదు. 2019లో ప్రశాంత్ కిశోర్ అండ లేకపోయినా బీజేపీ ఘనవిజయం సాధించింది. కాకపోతే, సర్వేలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేతకు సహాయం చేయగలరు. ప్రచారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడగలరు. ఉదాహరణకి ‘కావాలి జగన్, రావాలి జగన్…’ అనే పాటను ఆమోదించి అందలానికి ఎక్కించింది ఐప్యాక్ బృందమే. ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఇటువంటి చిట్కాలూ, వ్యూహాలూ, ప్రచారంలో అనుసరించవలసిన ఎత్తుగడలూ (నేను బ్రాహ్మణ బాలికను, ఫలానా గోత్రానికి చెందిన వ్యక్తిని అంటూ మమతా బెనర్జీ చేత బహిరంగసభలలో చెప్పించి బీజేపీ చేసే నష్టాన్ని అరికట్టడం ఒక రాజకీయ ఎత్తుగడ) అందించగలరు కానీ రాజకీయాల స్వరూపస్వభావాలనీ, రాజకీయ, నైతిక ప్రమాణాలనూ పెంపొందించలేరు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నదో చెప్పగలరేమో కానీ ఎవరు ఉత్తమ అభ్యర్థో చెప్పలేరు.

Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

నరేంద్రమోదీ నుంచి మమతా బెనర్జీ దాకా

ప్రశాంత్ కిశోర్ బృందం తొలుత 2014లో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ విజయానికి కృషి చేసింది. లక్ష్యం సాధించింది. మోదీతో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత బీహార్ లో 2015లో శాసనసభ ఎన్నికలలో నితీష్ కుమార్-లాలూప్రసాద్ కూటమి విజయానికి పని చేశారు. ఆ కూటమి ప్రశాంత్ కిశోర్ ఉన్నా లేకపోయిగా గెలుపొందేది. గెలిచింది. ఆ తర్వాత నితీష్ కుమార్ లాలూప్రసాద్ కుమారుడు తేజస్వియాదవ్ కు జెల్లగొట్టి ఆర్ జేడీతో తెగతెంపులు చేసుకొని జేడీయూని తీసుకొని వెళ్ళి బీజేపీతో ముడిపెట్టి అనైతిక రాజకీయం చేశారు. ఎన్నికలలో సహాయం చేసినందుకు ప్రశాంత్ కిశోర్ కి జనతాదళ్ (యు) ఉపాధ్యక్ష పదవి ఇచ్చి నితీశ్ కుమార్ తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. నితీశ్ మోదీకి బాగా చేరువ కావడం రుచించని ప్రశాంత్ కిశోర్ జేడీ(యు) నుంచి తప్పుకున్నారు.

Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే

పనితీరు ఏమిటి?

అసలు ప్రశాంత్ కిశోర్ బృందం పనితీరు ఏమిటి? ప్రశాంత కిశోర్ పార్టీ అధినేతతో నేరుగా సంబంధం పెట్టుకుంటారు. అధినేతతోనే ప్రధానంగా మాట్లాడుతారు. ఇతర నాయకులు ఆయన కటాక్షవీక్షణాలకోసం ఎదురు చూస్తూ ఉంటారు.  కొంతమంది ప్రతిభావంతులైన, ఐఐటీ చదివిన యువతీయువకులను సహాయకులుగా నియమించుకుంటారు. వారికి సోషల్ మీడియాలో  మంచి ప్రావీణ్యం ఉంటుంది. స్థానిక భాష తెలియదు. ఇంగ్లీషు, హిందీ మాత్రమే తెలుసు. కానీ భాష సమస్య కాదు. వారికి అంకెలూ, ధోరణులూ (ట్రెండ్సూ) ప్రధానం. అంకెలు తెచ్చిపెట్టడానికీ, ధోరణుల గురించి సమాచారం ఇవ్వడానికి పార్టీకి చెందిన కార్యకర్తలనూ, మీడియాలో పని చేసిన అనుభవం ఉన్నవారినీ, ఇతరులనూ నియమించుకుంటారు. అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రచార వ్యూహం రచించడం, ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయడం, ప్రచారంలో ప్రస్తావించవలసిన  ప్రధానాంశాలు ఏమిటో నిర్ణయించడంలో ప్రశాంత కిశోర్ నిర్ణాయక పాత్ర వహిస్తారు. జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికాంశాలలో అధిక భాగం ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు చేర్చినవే. తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నేతలలో చాలామంది పార్టీలో ప్రశాంత్ కిశోర్ ఆధిపత్యాన్ని సహించలేక పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

Also read: ఒపీనియన్ పోల్స్ బ్యాన్ చేయాలా?

ఉభయతారకం

ప్రశాంత్ కిశోర్ నమూనా ఉభయతారకంగా పని చేస్తుంది. ఒకే ఒక బలమైన నాయకుడి చుట్టూ అల్లుకున్నప్రాంతీయ పార్టీలలో జిల్లా స్థాయి నాయకులు అనేకమంది ఉంటారు. వారి మధ్య విభేదాలు ఉంటాయి. అభ్యర్థుల ఎంపిక జరిగే సమయంలో తాలా ఒక మాటా చెబుతారు. ఏకాభిప్రాయం కుదరడం కష్టం. అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి పార్టీ నుంచి వైదొలిగి వైరిపక్షంలో చేరతారు. వైరిపక్షం టిక్కెట్టు లభిస్తే పోటీకి దిగుతారు. లేదా తనకు టిక్కెట్టు రాకుండా అడ్డుపడినవారినీ, టిక్కెట్టు సంపాదించి పోటీలో నిలిచిన అభ్యర్థినీ ఓడించేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తారు. పనిలో పనిగా అధినాయకుడిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తారు. లేనిపోని ఆరోపణలు చేస్తారు. అందుకనే ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తినీ, ఆయన సంస్థనూ చూపించి అంతా ఆయన చేసిన సిఫార్సుల ప్రకారమే చేస్తున్నామని అధినాకుడు చెప్పుకోవచ్చు. కిశోర్  కానీ, అతనితో వచ్చిన సహచరులు కానీ స్థానికులు కారు. వారికి ఇష్టాయిష్టాలు ఉండవు. వారు శాస్త్రీయంగా పరిశోధన చేసి, లెక్కలు కట్టి ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో చెబుతారు. అట్లాగే పార్టీ వ్యవహరిస్తుంది. అందువల్ల టిక్కెట్టు రానివారికి పోటీ చేసే అవకాశం రాలేదన్న బాధ ఉన్నప్పటికీ పార్టీ అధినేత పట్ల వ్యతిరేకభావం పెద్దగా ఉండదు. గెలిచే అవకాశం ఎవరికి ఉంటే వారికి టిక్కెట్టు ఇస్తున్నారు. ఎవరికి అవకాశం ఉన్నదో ప్రశాంత్ కిశోర్ బృందం చెబుతుంది. పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే టిక్కెట్టు లభించనివారికి కూడా నామినేషన్ పోస్టులు ఇచ్చుకోవచ్చు. శాసనమండలికి గెలిపించుకోవచ్చు. ఈ వాదనకు ఆమోదం ఎక్కువగా లభిస్తుంది. పార్టీలోని అన్ని ముఠాలూ అంగీకరిస్తాయి. అధినాయకుడిపైన అసంతృప్తి స్థాయి తగ్గించడానికి ప్రశాంత్ కిశోర్ ఒక సాధనంగా పనికి వస్తారు.

Also read: నెహ్రూ భారత్ ను కనుగొంటే పీవీ పునరావిష్కరించారు : శశిథరూర్

గెలుపు గుర్రాల గుణగణాలతో నిమిత్తం లేదు

పార్టీలో అనేక రకాల శక్తులు పని చేస్తుంటాయి. అనేక ప్రయోజనాల మధ్య సంఘర్షణ జరుగుతుంది. పార్టీ నాయకుడు పార్టీలోని ఇతర నాయకులను కలిసి, వారితో చర్చించీ, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలి. సమన్వయం సాధించాలి. పార్టీ నాయకులను కలుసుకోవడం వల్ల పార్టీలో కింది స్థాయిలో ఏమి జరుగుతున్నదో అధినాయకుడికి తెలుస్తుంది. పార్టీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల ముందూ, తర్వాత కూడా పార్టీ నాయకులతో అధినేత మాట్లాడుతూ ఉండాలి. ప్రశాంత్ కిశోర్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత స్వీకరించిన తర్వాత అధినాయకుడికి ఇతర నాయకులతో మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రశాంత్ కిశోర్ తో మాట్లాడి, ఆయన సలహాలను అనుసరించి అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఎన్నికల ప్రచారంలో వనియోగించుకోవడానికి అభ్యర్థులకు బీ ఫారమ్ ఇచ్చినప్పుడే అధినాయకుడితో ఒక ఫోటీ దిగేందకు కొన్ని సెకన్ల అవకాశం మాత్రమే ఇస్తారు. దాని తర్వాత అభ్యర్థులతో కానీ గెలిచిన ఎంఎల్ఏలతో కానీ అధినాయకుడు కలుసుకోవడం ఉండదు. ఇది పార్టీ వ్యవస్థకు హానికరం. గెలుపే ప్రధానం కావడంతో భావజాలానికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. రకరకాల భావజాలాలు కలిగిన వ్యక్తులు, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్న వ్యక్తులూ, అందుకోసం అడ్డదారులు తొక్కే ప్రబుద్ధులూ అభ్యర్థులుగా తేలుతారు. డబ్బు ఉన్నవారికే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పించే అవకాశం ఉంటంది. వారిపేర్లే ప్రజల నోళ్ళలో నానుతాయి. ఐప్యాక్ బృందం వారిపేర్లనే రాసుకొని అధినాయకుడికి సమర్పిస్తుంది. నీతీ, నిజాయతీ, ధర్మనిరతి వంటి అంశాలకు ప్రాధాన్యం తక్కువ.

Also read: ఎటర్నల్ ఎండీ, రామకృష్ణ ప్రసాద్!

ఎన్నికల శాస్త్రంలో పండితులు

ప్రశాంత్ కిశోర్ బృందంలోని సభ్యులు కూడా పార్టీ అధినేతతోనూ, తక్కిన ముఖ్యులతో సన్నిహితంగా మెలుగుతారు (ప్రశాంత్ కిశోర్ తర్వాత స్థానంలో ఉన్న యువకుడి వివాహానికీ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తరాది వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు). వారికి మంచి పారితోషికం లభిస్తుంది. దర్జాగా ఉంటారు. ఆధునికంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మసలుతారు. ఎన్నికల రాజకీయ శాస్త్రంలో తలలు పండిన పండితులుగా కనిపిస్తారు. లాప్ టాప్ తో, స్మార్ట్ ఫోన్ తో ఎప్పుడూ నిర్వరామంగా పని చేస్తూ ఉంటారు. ఎన్నికలు పూర్తిగా కాగానే మరోచోటికి వెళ్ళిపోతారు. నరేంద్రమోదీ తలపెట్టిన జమిలి ఎన్నికలు నిజమైతే వీరికి ఐదేళ్ళకు ఒక్కసారే పని ఉంటుంది. తక్కిన సమయంలో వేరే ఏదైనా పనులు చూసుకోవాలి. లేకపోతే అయిదేళ్ళ పొడవునా ఎన్నికలే. మోదీ విజయం చూసి నితీశ్ కుమార్, ఆయన విజయం చూసి రాహుల్ గాంధీ, కెప్టెన్ అమరేంద్రసింగ్, పంజాబ్ లో గెలుపు చూసి కేజ్రీవాల్, ఆయనను చూసి జగన్ మోహన్ రెడ్డి, ఆయన సాధించిన ఘనవిజయం చూసి మమతా బెనర్జీ, స్టాలిన్ …ఈ విధంగా వారికి గడచిన ఏడేళ్ళ పొడవునా మంచి గిరాకీనే ఉంది. ఇక మీదట ఈ పని చేయబోనని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. కానీ ఆయన తయారు చేసిన ఐప్యాక్ రంగంలో ఉంటుంది.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్

భారత రాజకీయాలకు మేలు జరిగిందా?

ప్రశాంత్ కిశోర్ వల్ల భారత రాజకీయాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా? ఈ ప్రశ్నపైన ప్రఖ్యాత ఎన్నికల శాస్త్ర ప్రవీణుడూ, గ్రంథకర్త, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధినేత డాక్టర్ ఎన్. భాస్కరరావు ఇటీవల ప్రైమ్ పోస్ట్ లో లోతైన అవగాహనతో గొప్ప వ్యాసం రాశారు. ఇండియన్ ఎక్సెప్రెస్ లో రుచిగుప్తా అనే కాలమిస్టు కూడా వివరంగా రాశారు. ప్రశాంత్ కిశోర్ కి సైద్ధాంతిక నిబద్ధత ఏమైనా ఉన్నదా? ఆయన మొదట బీజేపీకీ, తర్వాత జేడీయూకీ, అనంతరం కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత కాంగ్రెస్ తో విభేదించి బయటకు వెళ్ళిన వైఎస్ఆర్ సీపీ కీ, తృణమూల్ కాంగ్రెస్ కీ పని చేశారు. కిరాయికి పని చేసినట్టే కానీ సైద్ధాంతిక నిబద్ధత అంతగా కనిపించదు. అయితే, 2014 తర్వాత మోదీ విధానాలూ, వైఖరీ నచ్చక ఆయనకు దూరమైన ప్రశాంత్ కిశోర్ అదే మోదీకి నితీష్ కుమార్ దగ్గర కావడాన్ని సహించక జేడీయూ నుంచి వైదొలిగారు. అంటే ఎంతో కొంత సైద్ధాంతిక నిబద్ధత లేకపోలేదు. కానీ ఐదేళ్ళ వ్యవధిలో అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్ కీ పని చేయడం విశేషం.

Also read: సమరశీలి బూర్గుల నరసింగరావు

ఎన్నికలలో గెలుపే ప్రధానమా?

ఈ రోజుల్లో ఎన్నికలు గెలవడం ఏ పార్టీకైనా అవసరమే. కానీ పార్టీ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం. సైద్ధాంతిక పునాదిపైన పార్టీ వ్యవస్థ నిలబడడం ప్రజాస్వామ్యంలో ప్రధానం. కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్ డీఎఫ్ గెలుపొందడానికి ప్రశాంత్ కిశోర్ వంటి ప్రవీణుడి సహకారం అక్కరలేకపోయింది. పార్టీలో సంస్థాగతంగా ఉన్న కార్యకర్తల బలం, సమాచార వినియమ వ్యవస్థ, ప్రజలతో సన్నిహిత సంబంధాలు పార్టీని గెలిపిస్తాయి. నిలబెడతాయి. ఎన్నికలలో పార్టీ నిలబెట్టే అభ్యర్థుల గుణగుణాల గురించీ, విద్యార్హతల గురించీ, నైతికత గురించీ ప్రశాంత్ కిశోర్ పట్టుపట్టి ఉంటే ఎన్నికల వ్యవస్థపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ఆయన ప్రభావం సకారాత్మకంగా ఉండేది. అన్ని రాజీకీయ పార్టీలలాగానే ప్రశాంత్ కిశోర్ సలహాలు పాటించిన పార్టీలు కూడా నేరచరిత్ర కలిగినవారినీ, న్యాయస్థానాలలో కేసులు ఎదుర్కొటున్నవారినీ, నయవంచకులనూ మినహాయించలేదు. వారికి కూడా కొన్నిటిక్కెట్లు కట్టబెట్టారు. వారు గెలుపొందారు. మంత్రులుగా కూడా వెలుగుతున్నారు. ఎన్నికలలో నిధుల వినియోగం తగ్గించేందుకు ప్రశాంత కిశోర్ బృందం ప్రయ్నతించిందా? ఆ దాఖలా లేదు. ఎన్నికల ఖర్చులో పార్టీ, అభ్యర్థులు పెట్టే ఖర్చు కాకుండా ప్రశాంత్ కిశోర్ కి చెల్లించే రుసుము అదనం. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్గానాలు అమలుకు సాధ్యమైనవో, కావో చూసుకొని సాధ్యమైనటువంటి వాగ్దానాలనే చేర్చడం వరకూ ప్రశాంత్ కిశోర్ చేతిలోఉంది. ఎన్నికలలో గెలిచి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాల అమలుపైన ఆయనకు కానీ ఆయన బృందానికి కానీ సంబంధం లేదు. కనుక భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రశాంత్ కిశోర్ ప్రభావం నామమాత్రమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాణాలు పెంచారనికానీ, ఎన్నికలలో అక్రమాలు తగ్గడానికి దోహదం ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠానికి ఏమైనా చేశారని కానీ చెప్పుకోవడానికి ఒక్క మేలు సైతం లేదు. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికీ, ఎన్నికలలో అక్రమాలను అరికట్టడానికీ పనికి రాని కార్యక్రమం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రయోజనం ఏముంటుంది?

Also read: అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles