Tuesday, April 30, 2024

బిగుస్తున్న ఉక్కు పిడికిలి

ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రాంతీయ పార్టీలకూ, ప్రతిపక్షాలకూ ఎదిరించే శక్తి లేదు కాబట్టి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవ్వరూ ఆపలేరనే విశ్వాసంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అనుకోవాలి. కానీ వాతావరణం అందుకు అనుకూలంగా లేదు. అది అంత తేలిక కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ ఉద్యమం మహోగ్రరూపం దాల్చే సూచనలే కనిపిస్తున్నాయి.

కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి, ముఖ్య నాయకుడు కేటీఆర్ ఉక్కు ఉద్యమంలో నేనుసైతం పాల్గొంటానంటూ ఊతమిచ్చారు. పక్క రాష్ట్రానికి కష్టం వస్తే, ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. ఇవాళ ఉక్కు పరిశ్రమ అమ్ముతున్నారు. రేపు తెలంగాణలోని సింగరేణి, బి హెచ్ ఈ ఎల్ పై కూడా పడతారని బిజెపి ప్రభుత్వంపై ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కావచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రంలోని పలు ముఖ్యమైన పరిశ్రమలను కూడా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందనే భయం, అనుమానం, ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉక్కు అంశంలో ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడడానికి ఆయన సిద్ధమయ్యారు. రేపోమాపో విశాఖపట్నం సందర్శించి, ఉద్యమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : ఉక్కు సంకల్పమే శరణ్యం

నేను సైతం అన్న చిరంజీవి

అగ్రనటుడు చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా, ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. చిరంజీవి విశాఖపట్నం వచ్చి, ఉద్యమంలో పాల్గొన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. పోరాటానికి సినిమావారి మద్దతు కూడా కావాలని  పలువురు కోరుతున్నారు. ఇదే సమయంలో చిరంజీవి చేసిన ట్విట్టర్ వ్యాఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో ఉత్తరం రాశారు. అఖిల పక్షాన్ని, కార్మిక నాయకులను కూడా వెంటపెట్టుకొని  కలుస్తానని ఆయన అందులో పేర్కొన్నారు. ఇది ఎంతో అభినందించాల్సిన సందర్భం. స్వాగతించాల్సిన విషయం.

Also Read : సమష్టి పోరాటమే విశాఖ ఉక్కుకు శ్రీరామరక్ష

నిశ్శబ్దాన్ని ఆశ్రయించిన బీజేపీ నేతలు

ప్రారంభంలో హడావిడి చేసిన రాష్ట్ర బిజెపి నేతలు, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. మొన్న జరిగిన ఏపీ బంద్ లోనూ పాల్గొనలేదు. జనసేన పాక్షికంగా పాల్గొన్నది. దీనివల్ల, ఉద్యమానికి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కానీ, రాష్ట్రంలో బిజెపి, జనసేన తీవ్రంగా నష్టపోతాయి. కేటీఆర్ తెలంగాణలో చేసిన వ్యాఖ్యల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఎంతోకొంత నష్టం జరుగుతుంది. షర్మిల తెలంగాణలో రాజకీయ సందడి చేస్తున్న వేళల్లో, ఆంధ్రప్రదేశ్ లో కె టిఆర్ కు  ప్రజలు క్షీరాభిషేకం చేస్తుండడం విశేషం. అంటే,విశాఖ ఉక్కు అంశాన్ని ప్రజలు అంతగా సొంతం చేసుకుంటున్నారని భావించాలి. దిల్లీలో ఉధృతంగా ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలు ఉక్కు ఉద్యమానికి మద్దతును ప్రకటించాయి. 

అగ్గిలో ఆజ్యం పోసిన ఆర్థిక మంత్రి

ఇటీవల లోక్ సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తెలుగువారిని ఆగ్రహోదగ్ధులను చేశాయి. ఇక స్టీల్ ప్లాంట్ పోయినట్లే… అనే భావనలోకి తెలుగువారందరూ వచ్చేశారు. దీనితో ఉద్యమం మహోగ్రరూపాన్ని తీసుకుంది. వివిధ రంగాల నుంచి, సంఘాల నుంచి మద్దతు వెల్లువై వస్తోంది. ఆర్ధిక శాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ప్రైవేటీకరణ కాకపోతే, మూసి వేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ కొన్ని లక్షల మంది ఆధారపడ్డారు. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు తోడు ఎంతోమంది నిర్వాసితులు కూడా ఉన్నారు.

Also Read : విశాఖ ఉక్కుతో మీకేం సంబంధం?

ఎటు చూస్తే అటు అన్యాయం

స్టీల్ ప్లాంట్ స్థాపన సమయంలో భూములు ఇచ్చి, వసతి కోల్పోయినవారికి చేయాల్సిన న్యాయం ఇంతవరకూ జరుగలేదు. ఆ రోజు చేసుకున్న ఒప్పందాలను పెడచెవిన పెట్టారు. వీళ్ళందరూ తమ భవిష్యత్తు ఏంటని? బావురుమంటున్నారు.గనులు కేటాయిస్తే,సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది, ఆ విషయం కేంద్రానికి తెలియంది కాదు. కానీ, చిన్న సహకారంతో పోయే దాన్ని, పెద్ద సమస్యగా కేంద్రం సృష్టిస్తోందని పారిశ్రామిక రంగ నిపుణులు  విమర్శిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు లాభాలు కొత్త కాదు. నష్టాలు వస్తున్నాయనేది ఒక వంక మాత్రమే అన్నది కార్మిక సంఘాల వాదన. సంస్థకు చెందిన భూములే లక్ష కోట్లు చేస్తాయి. ఇది కాకుండా కర్మాగారం విలువ వేల కోట్లు ఉంటుంది. ఇదంతా కలుపుకొని కేవలం 32వేల కోట్లకే ప్రైవేట్ సంస్థలకు అప్పనం గా అప్పచెబితే ఊరుకొనే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తెలుగువారంటే చులకన భావంతోనే ఢిల్లీ పెద్దలు ఈ సాహసానికి దిగారని తెలుగు ప్రజ ఉడికిపోతోంది. ఇటువంటి చర్యలను తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చేపట్టే ధైర్యం కేంద్రానికి ఉందా? అని, పలు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బిజెపి – జనసేన ద్వయం తప్ప, అన్ని రాజకీయ పార్టీలు పోరాటబాట పట్టాయి. వివిధ ట్రేడ్ యూనియన్స్ ఆన్నీ కలిపి ” విశాఖపట్నం స్టీల్ పరిరక్షణ పోరాట వేదిక”ను స్థాపించాయి.

Also Read : తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన

ఉద్యమం ఉధృతికి సన్నాహాలు

నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి వివిధ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 20వ తేదీన వివిధ ట్రేడ్ యూనియిన్ల జాతీయస్థాయి నాయకులు విశాఖపట్నంలో తమ గళాన్ని వినిపించబోతున్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలకు సంబంధించిన ముఖ్య నేతలు ఈనెల 28వ తేదీ నాడు విశాఖపట్నం వచ్చి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట వేదికకు సంఘీభావం తెలుపనున్నారు. త్వరలో ఢిల్లీలోనూ ఉక్కు ఉద్యమం చేపట్టనున్నారు. రాజకీయ పార్టీలూ,  ట్రేడ్ యూనియన్లూ, వివిధ ప్రజా సంఘాలూ, విద్యార్థి సంఘాలూ, మేధావుల వేదికలూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల్లోనూ చైతన్యం నింపడానికి సిద్ధమవుతున్నాయి.

తెలుగు జాతి వాడి, వేడి

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లుగా,ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమై, ఉద్యమాన్ని మహోద్యమంగా తీర్చిదిద్ది, తెలుగువాడి పౌరుషాన్ని, సాహసాన్ని,ఐకమత్యాన్ని, సమర్ధతను చాటి చెప్పకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగలదని పలువురు పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం కేవలం స్టీల్ ప్లాంట్ తో ఆగదని, అలుసుగా ఉంటే ఆంధ్రులు ముందు ముందు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుందనే భావన తెలుగు ప్రజల్లో బయలుదేరిందని భావించాలి. తెలుగువారి వేదనను, వేడిని కేంద్ర ప్రభుత్వం ఎంత వరకూ అర్ధం చేసుకుంటుందన్నది సమీప భవిష్యత్తులోనే తేలిపోతుంది.

Also Read : సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles