• నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు
• రహదారుల దిగ్బంధం, స్తంభించిన జనజీవనం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన గత రాత్రి నుంచి కొనసాగుతోంది. కేంద్రం ప్రకటనతో ప్రజా, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. నిరసనకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కూర్మన్న పాలెంలో కార్మిక సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.
నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిపాలనా భవనాన్ని ముట్టడించేందుకు పిలుపుఇవ్వడంతో ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పూర్తి తనిఖీల తర్వాతే ఉద్యోగులను లోపలికి పంపిస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద నిరసనలు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ప్లాంట్‌లో ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు.
Also Read: విశాఖ ఉక్కుతో మీకేం సంబంధం?
భయంతో పరుగెత్తిన ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్:
స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైనాన్స్ డైరెక్టర్స్‌ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఫైనాన్స్ డైరెక్టర్ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు.సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకొని ఆయనకు రక్షణ వలయంగా మారి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉద్యమకారులు అయినా వాళ్లను విడిచిపెట్టలేదు. ఫైనాన్స్ డైరెక్టర్ వెనుక పరుగులు తీశారు. అక్కడ తప్పించుకోవడంతో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మరోసారి చుట్టుముట్టారు. దీంతో భయంతో వేణుగోపాలరావు పరిగెత్తారు.
స్తంభించిన జాతీయ రహదారి:
సోమవారం రాత్రి నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటన ప్రతులను నిరసనకారులు దగ్దం చేశారు. కార్మికుల ఆందోళనలకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకునే ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించిన కార్మికులు ఆందోళన చేపట్టారు.
వాహనాల దారి మళ్లింపు:
విశాఖలోని కార్మిక సంఘాల నిరసనలు హోరెత్తుతున్నాయి. రహదారుల దిగ్భంధంతో పలు కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. తుని వైపు వెళ్లాల్సిన వాహనాలను లంకెలపాలెం నుంచి మళ్లిస్తున్నారు. సబ్బవరం మీదుగా పంపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఏడీ జంక్షన్, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. ఎన్‌ఏడీ నుంచి కూర్మన్నపాలెం వరకు, అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Also Read: సమష్టి పోరాటమే విశాఖ ఉక్కుకు శ్రీరామరక్ష