Saturday, October 5, 2024

దర్యాప్తు చేయకుండా జగన్ లేఖను ఖండిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుందా?

  • న్యాయవ్యవస్థతో చంద్రబాబునాయుడు వ్యూహాత్మక సంబంధాలు
  • న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణ అర్థరహితం
  • ఫిర్యాదు చేయడం కోర్టు ధిక్కారం కాదు, పరువునష్టం కాదు
  • రాష్ట్రపతికీ, చీఫ్ జస్ఠిస్ కూ ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు
  • ఆరోపణల పరిశీలను ఒక కమిటీని నియమించాలి
ప్రొ.ఎం.శ్రీధర్ ఆచార్యులు

న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోరుతూ సాహసోపేతమైన లేఖ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కొందరు ప్రముఖులు పొగుడుతున్నారు.  ఈ లేఖ బెడిసికొడుతుందనీ, లేఖ రాయడం తెలివితక్కువ పని అనీ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి కనుక న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే లేఖ రాశారంటూ ఇంకా కొందరు మాజీ న్యాయమూర్తులూ, న్యాయవాదులూ, న్యాయప్రవీణులూ నిందిస్తున్నారు.

ముఖ్యమంత్రి తన లేఖలో ఏమి కోరారో పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్లను వేరే కోర్టుకు బదిలీ చేయమని ఆయన అడగలేదు. ఆయన ముగింపు వాక్యం ఇలా ఉంది:

‘‘ఈ లేఖలో తెలియజేసిన విషయాలను పరిశీలించి న్యాయవ్యవస్థ తటస్థ వైఖరిని అవలంబించేందుకు ఏ చర్యలు అవసరమని మీరు భావిస్తారో అటువంటి చర్యలు తీసుకోవలసిందిగా సగౌరవంగా కోరుతున్నాను. పైన ప్రస్తావించిన విషయాలను లేదా లేఖతో  జతపరచిన అంశాలను నిర్ధారించుకోవడానికి  అవసరమైన సమాచారం అవసరమైతే నేను మీ గౌరవనీయమైన సంస్థకు సమర్పిస్తాను.’’

ముఖ్యమంత్రి ఏమి కోరారు?

ఎవరిపైన అయినా విచారణ జరపాలనో, జరిమానా విధించాలనో కోరకుండా ముఖ్యమంత్రి జాగ్రత్త పడ్డారు. న్యాయమూర్తులు తటస్థంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి అభిలషిస్తే అందుకు అవసరమైన పత్రాలను సమర్పిస్తానని చెప్పారు. తాను రాసిన అంశాలను సముచితంగా పరిశీలించాలనీ, తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అడగడం కోర్టు ధిక్కరణగా, పరువునష్టం కలిగించే చర్యగా చిత్రించడం సమంజసం కాదు. ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలపైన విచారణ జరిపించాలా లేదా అనే విషయం ఈ దేశంలో అత్యున్నత న్యాయమూర్తి నిర్ణయించాలనేది అత్యంత సమజంసమైన, న్యాయమైన కోరిక.  ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తగిన వేదికపైన నిరూపిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరగడమే కాకుండా జస్టిస్ రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది.

డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తూ, పదవీ పూర్తిగా న్యాయవ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి ఫిర్యాదు అత్యున్నత న్యాయస్థానంలో సహా అన్ని స్థాయిలలోని న్యాయవ్యవస్థలలో పనిచేస్తున్న న్యాయాధికారులకు ఆగ్రహం కలిగిస్తుంది. జగన్ ఫిర్యాదుతో కూడిన లేఖ రాయడం, భారత ప్రధాన న్యాయమూర్తి స్పందన కోసం వేచి చూడకుండా ఆ లేఖను మీడియా సమావేశంలో విడుదల చేయడం వల్ల జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య సంబంధాలు జటిలమై పూర్తిగా చెడిపోయి ఉండవచ్చు. ఇదంతా న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో చేశారని ఎవరైనా అంటే అది మెదడు ఉన్న మనుషులు ఎవ్వరూ ఒప్పుకోరు. జగన్ ఇప్పుడు పూర్తిగా న్యాయవ్యవస్థ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉన్నారు. ఈ లేఖ రాయడంలో జగన్ సర్వస్వాన్నీ ఒడ్డారు.

ఇద్దరి సంగతీ తెలుసుకొని నిర్ణయించాలి

జగన్ పైన ఉన్న కేసులు, నడుస్తున్న విచారణలు, ఆయన తీసుకున్న మంచి, చెడు నిర్ణయాలు, వాటిపైన పరిష్కరించవలసి ఉన్న రిట్ పిటిషన్లు, మీడియాలో, న్యాయవ్యవస్థలో, రాజకీయ వర్గాలలో బ్రహ్మాండమైన మద్దతు కలిగిన చంద్రబాబునాయుడు వంటి వ్యూహత్మకమైన నాయకుడితో చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలూ, లేఖ రాయడంలో ఆయన ప్రదర్శించిన బలమైన, దూకుడుతో కూడిన వైఖరిని పరిశీలించిన తర్వాతనే ఆయన రాసిన లేఖపైన ఒక అభిప్రాయానికి రావాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించడంలో చంద్రబాబునాయుడి పార్టీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలనూ, రైతుల సమ్మతితో చేస్తున్నట్టు చెబుతూ భూమి సమీకరించడంలోని వివాదాస్పదమైన అంశాలనూ, రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కంటే చాలా ఎక్కువ భూమిని సమీకరించడం, మొదలైన అంశాలను కూడా జగన్ రాజకీయాలనూ, రాజధానిపైన ఆయన నిర్ణయాలనూ ఖండించే ముందు పరిశీలించాలి.

న్యాయవ్యవస్థతో వ్యూహాత్మకమైన సంబంధాలు ఏర్పరచుకునే వ్యక్తిగా చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకున్నారు. దిల్లీ వర్గాల సహకారంతో తనకు వ్యక్తిగతంగా సన్నిహితులైనవారిని న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థానాలలో ప్రవేశపెట్టడం ఆయనకు తెలిసిన విద్య. చాలాకాలం అవిభక్త లేదా విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు  ముఖ్యమంత్రిగా ఉండిన వ్యక్తి అభిప్రాయాలను ఆయన నాయకత్వంలోని పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉన్నత స్థానాలలో ప్రవేశించిన న్యాయాధికారులు సమర్థించడాన్ని గుర్తించాలి.  వారు (సదరు న్యాయాధికారులు) తమ పలుకుబడిని వినియోగించారా లేదా అన్న విషయాన్ని లేఖలో చేసిన ఆరోపణలను పరిశీలించకుండా నిర్ణయించడం సమంజసం కాదు, పద్ధతి కాదు.

అటువంటి పరిస్థితులను సమ్యక్ దృష్టితో పరిశీలించకుండా జగన్ చేసిన ఫిర్యాదును ఖండించడం కానీ దాన్ని సత్యమని విశ్వసించడం కానీ సరి కాదు. ఫిర్యాదుపైన విచారణ జరగాలి. న్యాయవ్యవస్థపైన ఫిర్యాదు చేయడం నేరం కాదు. రాష్ట్రపతికి కానీ భారత ప్రధాన న్యాయమూర్తికి కానీ ఏ పౌరుడైనా ఫిర్యాదు చేయవచ్చునని సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అటువంటి ఫిర్యాదును 1961లో అప్పటి మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి పంపిన దాఖలా కింద చూడండి.

ఖండనమండనలు

లేఖ రాయడం  పట్ల కేవలం సోషల్ మీడియాలోనే కాదు, సర్వత్రా ప్రజలు మద్దతు తెలపడమో, ఖండించడమో చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి లేఖ రాయడాన్ని న్యాయవాదుల బృందాలు ఖండించాయి. జస్టిస్ ఎన్.వి. రమణను సమర్థిస్తున్నాయి.  లేఖలోని అంశాలను వెల్లడిస్తూ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు మీడియా గోష్ఠిలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రిపైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్ – పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) దాఖలు చేసే బాధ్యతను ఒక న్యాయవాది తనంతట తానే తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. లేఖలోని అంశాలను రహస్యంగా ఉంచాలని ఆయన వాదన. లేఖాంశాలను వెల్లడించడం శిక్షార్హమైన నేరమని ఆయన అభిప్రాయం. అద్భుతం.

ప్రాక్టీసు చేస్తున న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పేరు మీద  పిల్  అడ్వకేట్ ఆన్ రికార్డ్ ముక్తీసింగ్ ద్వారా దాఖలయింది. న్యాయమూర్తులపైన ఆరోపణలు చేస్తూ అటువంటి మీడియా సమావేశాలు పెట్టకుండా ముఖ్యమంత్రిని నిరోధించాలని న్యాయస్థానాన్ని పిల్ దాఖలు చేసిన న్యాయవాది కోరారు. ముఖ్యమంత్రిపైన తగిన చర్య ఎందుకు తీసుకోరాదో చెప్పమంటూ ముఖ్యమంత్రికి ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేయాలని సునీల్ కుమార్ సింగ్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి లేఖ రాయడం దేశంలోని న్యాయవ్యవస్థ దర్పాన్ని దెబ్బతీయడమేనని ఈ ఇద్దరు న్యాయవాదుల విశ్వాసం. ఈ గౌరవనీయమైన న్యాయస్థానంలో పని చేస్తున్న గౌరవ న్యాయమూర్తిపైన నిరాధారమైన ఆరోపణలు ముఖ్యమంత్రి సలహాదారు తన మీడియా గోష్ఠిలో చేశారంటూ వారు నివేదించారు. రాజ్యాంగం నిర్దేశించిన పరిధులను జగన్ మోహన్ రెడ్డి ‘అతిక్రమించారని’ న్యాయవాది అభిప్రాయం.

అడ్వకేట్ ఆసక్తికరమైన వాదన

ఆయన వాదన ఆసక్తికరంగా ఉంది: ‘‘…భారత రాజ్యాంగంలోని 121, 211 అధికరణల కింద అవినీతి, పక్షపాతం అంటూ ఆరోపణలు చేయడం నిషిద్ధం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వారి విధి నిర్వహణలో భాగం వ్యవహరించిన తీరును పార్లమెంటులో కానీ రాష్ట్రాల శాసనసభలలో కానీ చర్చించరాదంటూ రాజ్యాంగం నిర్దేశించిందని న్యాయమూర్తి వాదించారు. చట్టసభలలో చర్చించే సంపూర్ణ స్వేచ్ఛ సభ్యులకు ఉన్నదనే మినహాయింపును మన అద్భుతమైన న్యాయవాది గుర్తించలేకపోయారు.

ఆ తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛపైనా, వాక్ స్వాతంత్ర్యంపైనా  పిల్ దాడి చేసింది. కోర్టు ధిక్కారానికీ, పరువునష్టానికీ సంబంధించి రాజ్యాంగం 19(1)(ఎ)అధికరణ కింద ఇచ్చిన వాక్ స్వాంతంత్ర్యంపైనా, భావ ప్రకటన స్వేచ్ఛపైనా సహేతుకమైన పరిమితులు ఉంటాయంటూ న్యాయవాది వాదించారు. మన న్యాయవాది సృష్టించిన న్యాయప్రమాణాల ప్రకారం ఆయన పిల్ వేయడం ముఖ్యమంత్రికి పరువునష్టం కలిగించడమేనని తెలుసుకోవలసింది.

రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానంటూ రాజ్యాంగంపైన ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థ పట్ల గౌరవం కలిగి ఉండాలన్నది ఒక వాదన. ఈ న్యాయవాది అభిప్రాయంలో  రాజ్యాంగాన్ని గౌరవించడం  అంటే న్యాయవ్యవస్థను గౌరవించడం. ఇదొక ఆశ్చర్యం కలిగించే ప్రతిపాదన. దేశం ఆర్థిక, సామాజిక సవాళ్ళను ఎదుర్కొంటున్నదనీ, బయటి నుంచి కూడా  చికాకులు ఉన్నాయని చెబుతూ న్యాయవాది తన తెలివితేటలు ప్రదర్శించారు. వ్యవస్థపట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడం అనుమతించరాని విషయమనీ, ఆ విధమైన బాధ్యతారహితమైన ఆరోపణలను ముఖ్యమంత్రి చేయకండా ఉండవలసిందనీ ఆయన వ్యాఖ్యానించారు. (https://www.livelaw.in/top-stories/breaking-confidence-of people-in-judiciary-at-stake-plea-in-sc-against-andhra-govts-press-conference-accusing-nv-ramana-and-hc-judges-164349?infinitescroll=1)

ఏ వ్యక్తి ఆరోపించినా దర్యాప్తు చేయాలి

ఏ వ్యక్తి చేసిన ఆరోపణలనైనా పరిశీలించాలనేది న్యాయపాలనలో ప్రాథమిక అంశం. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఇది మరింతగా వర్తిస్తుంది. ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించి అంతటితో వదిలివేయాలి. ఫిర్యాదులను స్వీకరించేందుకూ, వాటి పట్ల చర్యలు తీసుకునేందుకూ ఒక పద్ధతిని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ పద్ధతిని అనుసరించాలి. ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపైన స్పందించాలి. మరో ప్రాథమిక న్యాయపరమైన అంశం ఏమంటే తగిన స్థాయి కలిగిన అధికారికి ఫిర్యాదు ఇవ్వడం అనేది కోర్టు ధిక్కరణ కాదు, పరువునష్టమూ కాదు. ఫిర్యాదులోని అంశాలను వెల్లడించడం అంటే ఈ రెండు నేరాలు చేసినట్టేనని భావించాలేమో. కోర్టు ధిక్కరణ ఆరోపణపైన పిటిషన్ వేయాలంటే  అటార్నీ జనరల్ దగ్గరికి వెళ్ళాలనీ, పరువునష్టం దావా వేయాలంటే ఆ పని పరువు నష్టమైనదని భావించే న్యాయమూర్తిది కానీ తనది కాదనీ ఈ న్యాయవాది తెలుసుకోవాలి.

ఈ పిల్ ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పిల్ భారత దేశంలో న్యాయచికిత్సను విప్లవీకరించింది. హక్కులకు భంగం కలిగినప్పుడు రాజ్యాంగపరమైన రక్షణ వ్యవస్థను కల్పించింది. అటువంటి పిల్ ను నీరుగార్చడం గర్హనీయం.

అడ్వకేట్ల సంఘాల తీర్మానాలు చూశాం. ముఖ్యమంత్రి రాసిన లేఖను ఆ సంఘాలు ఖండించాయి. సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్ సీఏఓఆర్ఏ) కు ఏ న్యాయమూర్తినైనా, ఏ ముఖ్యమంత్రినైనా, ఏ వ్యక్తినైనా విమర్శించే హక్కు ఉంటుంది.

సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఖండన

ముఖ్యమంత్రి లేఖను ఖండిస్తూ ఈ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ లేఖను మీడియాకు అందజేయడం ఔచిత్యరహితమనీ, న్యాయస్థానాన్ని అపఖ్యాతిపాలు చేసేదనీ అభివర్ణించింది. ‘‘ త్వరలో ప్రధాన న్యాయమూర్తి కాబోయే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గురించి 06 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి భారత ప్రదాన న్యాయమూర్తికి రాసిన లేఖలోని అంశాలను బాధతో గమనించినట్టు ఎస్ సీ ఏఓఆర్ఏ ప్రకటన తెలియజేసింది.  ఆ లేఖను 10 అక్టోబర్ 2020న ఒక విలేఖరుల గోష్ఠిలో విడుదల చేయడాన్ని అనవసరమైన, ఔచిత్యంలేని పని అనీ, అది ఉన్నతమైన రాజ్యాంగపదవిలో ఉన్న వ్యక్తి గౌరవానికి తగినట్టుగా లేదనీ, లేఖ న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేస్తుందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరిస్తుందనీ ప్రకటన వ్యాఖ్యానించింది. అసోసియేషన్ కార్యవర్గం అక్టోబర్ 13న ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది (https://www.livelaw.in/to-stories/lacking-in-propriety -scaora-condemns-jagan-mohan-reddys-letter-regarding-justice-ramana-read-resolution-164457/) పరిశీలించవలసిన మరో తీర్మానం కూడా ఉంది. అది ఏమంటుందంటే: గౌరవనీయులైన జస్టిస్ ఎన్.వి. రమణమీద చేసిన ఆరోపణలను సూటిగా, నిర్ద్వంద్వంగా, సాధ్యమైనంత బలంగా ది దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డీహెచ్ సీబీఏ) ఖండిస్తున్నది.

 నాయుడు పరిపాలించిన 2014-19 కాలంలో తీసుకున్నచర్యలపైన తన ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర హైకోర్టు వ్యవహరాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా ప్రభావితం చేయడం ఆరంభించారని ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి తన లేఖలో ఆరోపించారు.

డీహెచ్ సీబీఏ ఇంకా ఈ విధంగా రాసింది: ‘‘….చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాసిన అసంబద్ధమైన లేఖలో గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నడతపైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపైన  అభియోగాలు మోపడాన్ని, ఆ లేఖను విడుదల చేయడాన్ని న్యాయపరిపాలనలో అనవసరమైన జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించేందుకూ, ఈ గౌరవనీయమైన సర్వోన్నత న్యాయస్థానాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకూ ఉద్దేశించిన చర్యగానే  ఆ లేఖ రాయడాన్నీ, దాన్ని విలేఖరులకు విడుదల చేయడాన్నీ పరిగణిస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న జస్టిస్ రమణ నీతినిజాయితీలకు కట్టుబడి ఉండే విలువలు కలిగిన గొప్ప న్యాయమూర్తులలో ఒకరని కూడా డీహెచ్ బీఏ అభివర్ణించింది. (https://timesofindia.indiatimes.com/city/delhi/delhi-hc-bar-panel-condemns-jagan-mohan-reddys-allegations-against-justice -ramana/articelshow/78674425.cms)

జస్టిస్ మురళీధర్ ను దిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్-హరియాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వాపసు తీసుకోవాలని సుప్రీంకోర్టు కొలీజయంను 19 ఫిబ్రవరి 2020న దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డీహెచ్ సీబీఏ) అభ్యర్థించిన సంగతి గుర్తు చేసుకోవాలి.

న్యాయవాదులు సంఘాల అతివాదం

ఆ బదిలీ చాలా అరుదైనది కనుక నిరసనగా 20 ఫిబ్రవరి 2020న పనిని బహిష్కరించవలసిందిగా సభ్యులకు సంఘం పిలుపునిచ్చింది. ‘‘మనం ఆరాధించే సంస్థ దర్పం ప్రమాదంలో పడింది,’’ అంటూ డీహెచ్ సీబీఏ అభివర్ణించింది. గౌరవనీయమైన సుప్రీంకోర్టు కొలీజియం మా బెంచ్ ని అలంకరించిన అత్యంత ప్రతిభావంతులలో ఒకరైన  గౌరవనీయులైన డాక్టర్ జస్టిస్ ఎస్. మురళీధరన్ ను బదిలీ చేయడంపట్ల తమ  సంఘం ఖేదాన్నీ, విస్మయాన్నీ, దగ్భ్రాంతినీ, ఆగ్రహాన్నీ వెలిబుచ్చుతున్నదని ప్రకటించింది. (http://theprint.in/talk/point/justice-muralidhar-transfer-lawyers-out-of-line-to-protest-against-judicial-appointments/3684432/)

అడ్వకేట్ల అసోసియేషన్ నిరసన తెలపవచ్చు. పనిని బహిష్కరించవచ్చు. దీని వల్ల భౌతికంగా పనికి అంతరాయం కలుగుతుంది. కొన్ని వందల కేసులు కోర్టులలో నిలిచిపోతాయి. కానీ ఒక ముఖ్యమంత్రి మాత్రం ఫిర్యాదు చేయరాదు. హైకోర్టు పని మొత్తాన్ని నిలిపివేయడం వందసార్లు కోర్టు దిక్కరణకు పాల్బడినట్టు ఎందుకు కాదో, ముఖ్యమంత్రి లేఖ రాయడం కోర్టు ధిక్కారం ఎందుకు అవుతుందో డీహెచ్ సీబీఏ నాయకులు వివరించాలి.

ఈ సంఘాలు తమంతట తామే న్యాయమూర్తులుగా భావించుకొని జగన్ ను దోషిగా నిర్ణయించారు. న్యాయమూర్తులకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు అక్షరసత్యాలని కానీ పూర్తి అసత్యాలని కానీ ఎవ్వరూ తొందరపడి నిర్ణయించకూడదు. ఫిర్యాదు నిరాధారమైనదని నిర్ణయానికి వచ్చే ముందు న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకోవలసింది. అన్ని పక్షాల వాదనలనూ వినకుండా ఫిర్యాదుపైన తీర్పు చెప్పడానికి వారికి గల అర్హత ఏమిటి? న్యాయస్థానం పరువుప్రతిష్ఠలు రక్షించడమే వారి అభిమతం అయితే వారే స్వయంగా  నిజనిర్ధారణ కమిటీని వేసుకొని పరిస్థితిని ఎందుకు అధ్యయనం చేయలేదు?

గతంలో కొన్ని కేసులలో న్యాయమూర్తులపైన చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపితమైనాయి. కానీ వారిపైన చర్య తీసుకోలేదు. అటువంటి పరిస్థితులలో ఈ సంఘాలు ఏమని సమాధానం చెబుతాయి?

గౌరవనీయమైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను మరింత పెంపొందించేందుకు ఫిర్యాదుకు స్పందన ఉండాలి. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కమిటీని నియమించి, దానికి నియమనిబంధనలు నిర్దేశించడం అవసరం. లోగడ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిపైన వచ్చిన లైంగిక అత్యాచారం తాలూకు అరోపణలపైన విచారణ తంతు జరిగినట్టు ఈ విషయంలో మాత్రం జరగ కూడదు.

(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యులు, న్యాయశాస్త్ర అధ్యాపకులు)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles