Wednesday, September 18, 2024

ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పనితీరుపై విమర్శలు, ప్రశంసలు

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ గురువారంనాడు పదవీ విరమణ చేశారు.  16 మాసాల ప్రధాన న్యాయమూర్తి పదవీ నిర్వహణపైన కొన్ని విమర్శనాత్మకమైన కథనాలు వచ్చాయి. మరికొన్ని తప్పకుండా వస్తాయి. ఎందుకంటే జస్టిస్ రమణ నిర్వహించిన పదవి అటువంటిది. దేశంలోని న్యాయవాదులంతా, ప్రజలందరూ ఎన్నో అంచనాలతో, అనుమానాలతో, ఆశలతో, ఆశయాలతో ఆ పదవిలో ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా గమనిస్తారు. ప్రజాస్వామ్య సౌధానికి గల నాలుగు స్తంభాలలో న్యాయవ్యవస్థ ఒకటి. దానికి అత్యున్నత ప్రతినిథి భారత ప్రధాన న్యాయమూర్తి. ఈ పదవిలో జస్టిస్ రమణ తనకంటే ముందు పదవిలో ఉండిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులకంటే చాలా నయం అనిపించుకున్నారు. న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నించానంటూ తన వీడ్కోలు సమావేశంలో అన్నారు. రాబోయే చరిత్ర తన పనితీరుపైన తీర్పు ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

ప్రజల హృదయాలలో స్థానంకోసం తపించా

జస్టిస్ రమణ  ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగాన్నీ, ప్రజల హక్కులనూ పరిరక్షించారని సీనియర్ న్యాయవాదులు జస్టిస్ రమణపైన ప్రశంసల  జల్లు కురిపించారు. ఇప్పుడున్న మన  న్యాయవ్యవస్థ, విధానాలు నిబంధనలు వలసపాలనలో పుట్టినవనీ, వాటిని వర్తాన పరిస్థితులకూ, సామాజిక వాస్తవాలకూ తగినట్టు భారతీయీకరించాలనీ జస్టిస్ రమణ చెప్పారు. ‘‘న్యాయమూర్తిగా నా ప్రవర్తన, పనితీరు ద్వారా ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉండాలని కోరుకున్నాను తప్ప….తీర్పులు, ఉత్తర్వుల రూపంలో న్యాయపుస్తకాల్లో కాదు’’ అంటూ తాను పని చేసిన తీరుపైన ఆయనే వ్యాఖ్యానించారు. ‘‘జీవితంలో నాకు దక్కినవన్నీ ఎన్నో సంఘర్షణలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న తర్వాతే దక్కాయి. ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్ళన్నింటినీ ధైర్యంగా స్వీకరించాను. అవే నన్ను రాటుదేల్చాయి’’ అని కూడా అన్నారు.

సీనియర్ల ప్రశంసలు

జస్టిస్ రమణ పదవీ విరమణతో ఒక మేధావిని కోల్పోతున్నామని అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచారనీ, రాజకీయాలలో ఆసక్తి ఉన్నట్టు చెప్పారనీ, రాజకీయాలలో చేరి ఉంటే ప్రధాని అయ్యేవారనీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు వికాస్ సింగ్ అన్నారు. ఉన్నత ప్రమాణాలు నిలబెట్టారని మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబ్బల్ ప్రశంసించారు. నికార్సుగా పని చేశారంటూ సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే అన్నారు. జస్టిస్ రమణ గురించి వీడ్కోలు సభలో ప్రసంగిస్తున్న సమయంలో దవే భావోద్వేగానికి గురైనారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో మహిళల సంఖ్య పెంచడానికి కృషి చేశారని కితాబు ఇస్తూ మహిళాస్వామ్యానికి పునాది వేశారని సీనియర్ మహిళా న్యాయవాది విభా దత్త మఖీజా వ్యాఖ్యానించారు. కేసుల లిస్టింగ్ పారదర్శకంగా ఉండేలా చూస్తాననీ, ఏడాది పొడవునా ఓ రాజ్యాంగ ధర్మాసనం నడిచేలా చేస్తాననీ, జస్టిస్ రమణ సూచనలు పాటిస్తాననీ శనివారంనాడు 49వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు తీసుకున్న జస్టిస్ యుయు లలిత్ అన్నారు.

ఇంతటి ఉన్నతమైన పదవీ బాధ్యతల నుంచి విరమించుకున్న జస్టిస్ రమణ పనితీరుపైన రకరకాల వ్యాఖ్యాలు వచ్చాయి. ఎవరు కూడా పూర్తిగా ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపించలేదు. ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారని నిందించలేదు. కాకపోతే చాలాకాలం పెండింగ్ లో ఉన్న కేసులను పట్టించుకోలేదనీ, తాను టేకప్ చేస్తానంటూ వాగ్దానం చేసిన కేసులను కూడా విచారించలేకపోయారని మాత్రం చాలామంది విమర్శించారు. జస్టిస్ రమణ పట్ల గౌరవం ఉన్నవారు సైతం తెలుసుకోవలసిన విమర్శలను ఇక్కడ ప్రస్తావిస్తాను. దీని వల్ల అత్యున్నత న్యాయస్థానం నుంచి సాధారణ ప్రజలూ, పిటిషనర్లూ, న్యాయవాదులూ ఏమి ఆశిస్తున్నారనే విషయం తెలుస్తుంది.

‘చీఫ్ అండ్ జస్టిస్’ అనే శీర్షికతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ముంబయ్ ఎడిషన్ చక్కటి సంపాదకీయం ప్రచురించింది. ఎక్స్ ప్రెస్ ఎడిట్ పేజీలో సీనియర్ న్యాయవాదులు వ్యాసాలు రాశారు. అన్నీ సమతుల్యంగానే ఉన్నాయి. విమర్శనాత్మకంగా ఉన్న వ్యాసాలను కింద ప్రస్తావిస్తున్నాను.

ప్రధానమైన కేసులపైన చర్యలు లేవు

ఆర్టికిల్ 14 అనే పత్రికలో సౌరవ్ దాస్ అనే పరిశోధనాత్మక జర్నలిస్టు ‘ఎన్నో ప్రసంగాలు, కానీ జాతీయ ప్రాధాన్యం కలిగిన కేసులపైన చర్య లేదు, చీఫ్ జస్టిస్ రమణ వారసత్వం (లాట్ప్ ఆఫ్ స్పీచెస్, బట్ నో యాక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్: ది లెగసీ ఆఫ్ చీఫ్ జస్టిస్ రమణ) అనే శీర్షికతో ఆగస్టు 24న ఒక వ్యాసం ప్రచురించారు. 16మాసాల ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలంలో జస్టిస్ రమణ 29 ఉపన్యాసాలు ఇచ్చారు. చట్టపాలననూ, రాజ్యాంగాన్నీ పరిరక్షించుకోవడంకోసం ఏమి చేయాలో ఉద్బోధించారు. కానీ జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఆరు కేసులు ఆయన హయాంలో ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. విస్తృత పీఠం ఎదుటికి వెళ్ళవలసిన 53 ముఖ్యమైన కేసులు జస్టిస్ రమణ ముందు పని చేసిన ప్రధాన న్యాయమూర్తులు ఎక్కడ ఉంచారో అక్కడే ఉన్నాయి.

‘‘చట్టసభల, ప్రభుత్వాల చర్యలను న్యాయవ్యవస్థ సమీక్షించడం (జుడీషియల్ రివ్యూ) అన్నది రాజ్యాంగ వ్యవస్థలో భాగం. భాతర రాజ్యాంగానికి అది గుండెకాయ వంటిది అని చెప్పదలచుకున్నాను. న్యాయవ్యవస్థ సమీక్ష కనుక లేకపోతే రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లి ఉండేదన్నది నా వినమ్రమైన అభిప్రాయం.’’ ఇది చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ 23 జులై 2022న తన ప్రసంగంలో భాగంగా చేసిన ఉద్ఘాటన.

కానీ జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ గా ఉన్న కాలంలో  53 ముఖ్యమైన కేసుల విషయంలో న్యాయసమీక్ష చేయనేలేదు. రాజ్యాంగ దృక్పథంలో అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన ధర్మాసనాలు ఈ కేసుల పరిశీలనకు ఏర్పాటు చేయవలసింది. ఇవే కాకుండా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం కలిగిన మరికొన్ని ధర్మాసనం అక్కరలేని కేసులు కూడా ఉన్నాయి. వాటి జోలికి కూడా చీఫ్ జస్టిస్ రమణ వెళ్ళలేదు.

ఇవి కాకుండా పెండింగ్ లో ఉన్న ఇతర కేసులలో ఆరు అత్యంత ప్రధానమైనవి.

  1. జమ్మూ-కశ్మీర్ లో 370 వ అధికరణ రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లు. ఈ కేసులు 1,115 రోజులుగా అపరిష్కృతంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని రెండుగా విభజించి రెండు కేంద్రపాలిక ప్రాంతాలుగా చేయడం రాజ్యాంగవిరుద్ధమని పిటిషనర్ల వాదన. జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ అంగీకారం లేకుండా 370 వ అధికరణను రద్దు చేయడం కూడా రాజ్యాంగవిరుద్ధమని పిటిషనర్లు అంటున్నారు. అసెంబ్లీ ఆమోదానికి బదులు కేంద్రం నియమించిన గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసు పేరు మనోహర్ లాల్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసును మొదట 16 ఆగస్టు 2019న విన్నారు. చివరిసారిగా చీఫ్ జస్టిస్ రమణ, జస్టిస్ఎస్ కె కౌల్, జస్టిస్సుభాష్ రెడ్డి, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం 2 మార్చి 2020న ఆలకించింది.

‘‘చట్టపాలన, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పెను సవాలు న్యాయవ్యవస్థ వేగంగా, మితమైన ఖర్చులకు లోబడి నిర్ణయాలు చేయకపోవడం.’’ ఇది శ్రీనగర్ లో జస్టిస్ రమణ 14 మే 2022న చేసిన ప్రసంగంలోని భాగం. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ రాష్ట్రపతి 5,6 ఆగస్టు 2019న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 23 పిటిషన్లు దాఖలైనాయి. రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ పిటిషన్లను విచారించలేదు.  

  • ఎలక్టొరల్ బాండ్ల గోప్యతనూ, రాజకీయ పార్టీలకు అజ్ఞాతంగా నిధులు సేకరించి పెట్టే విధానాన్ని ప్రశ్నించిన వ్యాజ్యాలు. ఇవి 1,816 రోజులుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.  అసోసియేషన్ ఆఫ్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఈ కేసు ప్రసిద్ధి చెందింది. చివరిసారిగా ఈ కేసును ఆలకించింది మాజీ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ వి రామాసుబ్రమణియన్ లతో కూడిన బెంచ్. మొదట 5 ఏప్రిల్ 2019న ఆలకించింది. చివరగా 29 మార్చి 2020న, 30 మాసాల కిందట విన్నారు. ఈ  కేసును వినవలసిందిగా జస్టిస్ రమణకు కేసుకు  సంబంధించిన న్యాయవాది విజ్ఞప్తి చేసింది 25 ఏప్రిల్ 2022న. ‘టేకప్ చేద్దాం’ అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. కానీ టేకప్ చేయలేదు.  

‘‘చట్టపాలన గురించి తెలుసుకోవడం ద్వారా, నిత్యజీవితంలో  అనుసరించడం ద్వారా, న్యాయవ్యవస్థను అడగడం ద్వారా  పౌరులు చట్టపాలనకు దోహదం చేయగలరు.’’ 30 జూన్ 2021న పీడీ దేశ్ ముఖ్ స్మారకోపన్యాసంలో భాగంగా చీఫ్ జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య. ఎలక్టొరల్ బాండ్ స్కీమ్ ను పిటిషనర్లు సవాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2 జనవరి 2018న ప్రారంభించిన ఈ స్కీము మూలకంగా రాజకీయపార్టీలకు అజ్ఞాతంగా నిధులు లభిస్తాయనీ, దీనిని ఫైనాన్స్ బిల్లు అంటూ తప్పుడుగా అభివర్ణించి పార్లమెంటులో ఆమోదింపజేశారనీ అసోసియేషన్ ఆఫ్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ వాదించింది. ఎన్నికల కమిషన్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక, న్యాయ, ధర్మశాస్త్ర మంత్రిత్వశాఖలు దీనిని వ్యతిరేకించాయి. ఈ చట్టాన్ని దురుపయోగం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చివేసే ప్రక్రియను ప్రోత్సహిస్తుందని చెప్పాయి.  ఈ స్కీమ్ పై స్టే మంజూరు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్నిపిటిషనర్లు అభ్యర్థించారు. స్టే మంజూరు చేయడానికి మొదట రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ గా ఉండగా ఏప్రిల్ 2019లోనూ, రెండో సారి బాబ్డే చీఫ్ జస్టిస్ గా ఉండగా మార్చి 2021లోనూ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫలితంగా ఈ స్కీము కొనసాగుతోంది. ఏ పార్టీకి ఎవరు ఎంతమొత్తం చెల్లిస్తున్నారో ఒక్క కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని తప్పుదారి పట్టిస్తోంది,’’ అంటూ ప్రముఖ  న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 5 ఏప్రిల్ 2022న చీఫ్ జస్టిస్ రమణతో అన్నారు. కోల్ కతాకు చెందిన ఒక కంపెనీ తనపైన ఎక్సైజ్ శాఖ దాడుల నుంచి తప్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రూ.40కోట్లు పార్టీ ఫండ్ కింద చెల్లించిందనే దాఖలా కూడా చూపించారు. కోవిడ్ కారణంగా ఈ కేసు ముందుకు సాగలేదని చెప్పి త్వరలోనే ‘టేకప్ చేద్దాం’ అని జస్టిస్ రమణ అన్నారు. టేకప్ చేయలేకపోయారు.

  • ప్రభుత్వ విద్యాసంస్థలలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్నిప్రశ్నించే పిటిషన్లు. ఇవి 159 రోజులుగా అపరిష్కృతంగా ఉన్నాయి.
  • కులాలతో నిమిత్తం లేకుండా ఆర్థిక స్తోమత నిర్ణాయకాంశంగా కేంద్రప్రభుత్వ అమలు చేస్తున్నరిజర్వేషన్ విధానాన్ని ప్రశ్నించిన పిటిషన్లు. ఇవి 1,323 రోజులుగా అపరిష్కృతంగా ఉన్నాయి.
  • అసమ్మతి అణచివేసే సాధనం అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా), 1967 చట్టాన్ని ప్రశ్నించే పిటిషన్లు. ఇవి 1105 రోజులుగా దుమ్ముకొట్టుకుంటూ ఉన్నాయి. సజల్ అవస్థి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. చివరిసారిగా ఈ కేసును కోర్టు ఆలకించింది 9 సెప్టెబర్ 2019న మాజీ చీఫ్ జస్టిస్ గొగోయ్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్. అదే చివరిసారిగా విన్నది. 35 మాసాలుగా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. ‘‘మన పూర్వీకులు పోరాడి మనకు ప్రసాదించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకోవడానికి నిరంతరం నిర్వరామంగా ప్రపంచ పౌరులందరూ కృష్టి చేయవలసి ఉన్నది.’’ 26 జూన్ 2022న ఫిడల్ఫియా (అమెరికా)లో చీఫ్ జస్టిస్ రమణ చేసిన ప్రసంగంలో భాగం. ప్రముఖ రచయిత వరవరరావు ముంబయ్ లో జైలులోనూ, జైలు బయటా ఉండటానికి కారణం ఈ ఉపా చట్టమే. ఈ చట్టాన్ని 2019లో సవరిస్తూ చిన్న నేరాలకు సైతం వ్యక్తులపైన ఉగ్రవాదులని ముద్రవేసి నెలల తరబడి విచారణ లేకుండా జైళ్ళలో మగ్గపెట్టడం సమంజసమో కాదో పరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును సజల్ అవస్థితో పాటు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే హక్కుల సంఘం కూడా విజ్ఞప్తి చేసింది. 2019లో మోదీ ప్రభుత్వం చేసిన సవరణలు 19(1) వ అధికరణను ఉల్లంఘించటమేనని పిటిషనర్ల వాదన. చీఫ్ జస్టిస్ గా ఉండగా గొగోయ్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. విచారణ లేదు. చీఫ్ జస్టిస్ రమణకు చాలామంది జర్నలిస్టులూ, పౌరసమాజం సభ్యులూ ఈ అన్యాయమైన చట్టాన్ని కొట్టివేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉపా కింద ఎవరిపైన అయినా ఆరోపణ చేయవచ్చును కానీ అరెస్టు చేయరాదంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తొక్కిపట్టింది. ఉపా కింద ఉగ్రవాది నిర్వచనం అస్పష్టంగా  ఉన్నదని దిల్లీ హైకోర్టు 15 జూన్ 2021న వ్యాఖ్యానించింది. మూడు రోజుల తర్వాత 18 జూన్ 2021న సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దిల్లీ హైకోర్టు ఆదేశాన్ని ఉదాహరణ (ప్రిసిడెంట్)గా పరిగణించరాదంటూ ఆదేశించింది.  
  • సిటిజన్ షిప్ ఎమండ్  మెంట్ యాక్ట్ , 2019. ఇది ఇరుగుపొరుగున ఉన్న మూడు దేశాలనుంచి ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వాన్ని సత్వరం ప్రసాదించే చట్టం. ఈ చట్టాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లు 987 రోజులుగా మరుగున పడి  కొట్టుకుంటున్నాయి.

చీఫ్ జస్టిస్ ను ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అంటారు. అంటే ఏ కేసును ఎవరికి అప్పగించాలో, ఏ కేసు పరిష్కారానికి ధర్మాసనం ఏర్పాటు చేయాలో నిర్ణయించే విశేషాధికారాలు ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగం దఖలు పరిచింది. ఏ కేసైనా విచారణకు రాకపోతే దానికి బాధ్యత ప్రధాన న్యాయమూర్తిదే.

జస్టిస్ రమణ హయాంలో ఒకే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అది 2021 సెప్టెంబరలో తాను పదవీ బాధ్యతల స్వీకరించిన తర్వాత కొన్ని నెలల తర్వాత. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కూ, అడానీ పవర్ (ముంద్రా)లిమిటెడ్ కూ మధ్య కాంట్రాక్టుకు సంబంధించిన బాధ్యతల విషయంలో వివాదం పరిష్కారానికి సంబంధించింది. 2022 ఫిబ్రవరిలో న్యాయస్థానం వెలుపల చర్చల ద్వారా వివాదాన్ని కక్షిదారులు పరిష్కరించుకున్నారు.

పరిపాలనాధికారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికీ, దిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదాల పరిశీలనకు అయిదుగురు న్యాయమూర్తులతో ఒక బెంచిని ఏర్పాటు చేసినట్టు పదవీ విరమణకు నాలుగు రోజులకు ముందు ఆగస్టు 22న చీఫ్ జస్టిస్ చెప్పారు. ఆ బెంచ్ విచారణ ప్రారంభం కావలసి ఉంది.

ఇందిరాజైసింగ్ వ్యాసం

‘‘రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకొనే చీఫ్ జస్టిస్ పదవిని విరమిస్తున్నారు’’ అనే శీర్షికతో ఇందిరా జైసింగ్ అనే సీనియర్ న్యాయవాది ‘ద లీఫ్ లెట్’ అనే పత్రికలో వ్యాసం రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ బాబ్డేకు జస్టిస్ రమణపైన, ఆయన కుమార్తెలపైన ఫిర్యాదు చేస్తూ రాసిన ఉదంతాన్ని ప్రస్తావించి అటువంటి వివాదాస్పదమైన పరిస్థితులలో చీఫ్ జస్టిస్ గా నియుక్తుడైన జస్టిస్ రమణ చాలా జాగ్రత్తగా, తెలివిగా తన నావను నడుపుకొచ్చారని ఇందిర అన్నారు. జస్టిస్ రమణ కుమార్తెలకు అనుకూలంగా నాటి లిటిగేషన్ నిరుడు సెప్టెంబర్ లో ముగిసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే తన అభిప్రాయాలను వెల్లడించకుండా ముఖ్యమంత్రి రాసిన లేఖను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించి తన తర్వాత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణను నియమించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు అటు ముఖ్యమంత్రికీ, ఇటు ప్రధాన న్యాయమూర్తికీ కావలసినవారు కావడంతో ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇద్దరు తెలుగు న్యాయమూర్తులు చాలాకాలం చక్రం తిప్పారు. వారు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రమణ. వారిద్దరివీ రెండు శిబిరాలు అయినప్పటికీ ఇద్దరికీ ఉమ్మడి  రాజకీయ స్నేహితుడు చంద్రబాబునాయుడు అంటూ ఇందిరాజైసింగ్ విశ్లేషించారు. తాను వైఎస్ఆర్ సీపీ నాయకురాలు ఆర్కే రోజా కేసు వాదిస్తున్న సమయంలో తనకు ఈ విషయం స్పష్టంగా అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. డిసెంబర్ 2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి స్పీకర్ శివప్రసాద రావు రోజాను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారనీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని దూషిస్తున్నారనీ రోజాపైన వచ్చిన ఆరోపణలు. ‘‘అప్పుడు జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేవారు. ఆ రోజుల్లో మహిళల హక్కులపైన సెమినార్ సందర్భంగా ఆయనతో తాను మాట్లాడాననీ, తాను విద్యార్థిదశలో రాజకీయాలలో పాల్గొనేవాడిననీ, ఎమర్జెన్సీ రోజులలో తనను మావోయిస్టుగా ముద్రవేస్తారని భావించి అజ్ఞాత జీవితం గడిపాననీ జస్టిస్  చెప్పారు. ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. జస్టిస్ బాబ్డే లాయరుగా ఉండగా హక్కుల కార్యకర్తల కేసులను పట్టుదలతో వాదించేవారనీ, న్యాయమూర్తులకు అటువంటి నేపథ్యం ఉండటం మంచిదే’’ననీ వ్యాఖ్యానించారు.

ఆ ముగ్గురూ అపకీర్తి మూటకట్టుకున్నారు

‘‘చీఫ్ జస్టిస్ రమణ కంటే ముందు ఆ పదవి నిర్వహించిన ముగ్గురూ (జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే) అపకీర్తి మూటకట్టుకొని పదవి నుంచి దిగిపోయారు. నేషనల్ జుడీషియల్ అప్పాయంట్ మెంట్స్ కమిషన్ ను నెలకొల్పాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవాలు చేయలేదో ఇప్పుడు అర్థమైంది. సుప్రీంకోర్టు కలీజియం సిఫార్సు చేసిన పేర్లలో తమకు ఇష్టమైనవారినే నియమించే అవకాశం ఉన్నప్పుడు, తమకు ఇష్టంలేనివారి పేర్లను పక్కన పెట్టే వీలున్నప్పుడు కోర్టులతో పేచీ ఎందుకని ప్రభుత్వం భావించి ఉంటుంది. తనకు సమ్మతం కాని సౌరభ్ కిర్పాల్ అనే న్యాయవాదిని న్యాయమూర్తిగా కలీజియం సిఫార్సు చేసినప్పటికీ నియమించలేదు. జస్టిస్ ఏఏ ఖురీషీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కలీజియం సిఫార్సు చేసినప్పటికీ నియమించలేదు. కంటితుడుపు చర్యగా జస్టిస్ ఖురేషీని రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కొద్ది మాసాలపాటు పదవిలో ఉండే విధంగా నియమించారు. కారణం ఏమిటి? 2002లో గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు గోధ్రా దుర్ఘటన అనంతరం గుజరాత్ లో జరిగిన అల్లర్లలో ఆయన స్వతంత్ర వైఖరి అవలంబించారు. కనుక మోదీ, షాలకు ఆయనంటే పడదు. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించలేదు. సీనియారిటీ ప్రాతిపదికగా న్యాయమూర్తుల నియామకం జరగాలనే సూత్రానికి జస్టిస్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే తిలోదకాలు ఇచ్చారు.

చీఫ్ జస్టిస్ రమణ నాయకత్వంలోని కలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని సిఫార్సు చేశారు. వారిలో నలుగురు ప్రధాన న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ బివి నాగరత్న తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఆమె పదవీకాలం నెలరోజులపాటే ఉంటుంది. జస్టిస్ జేపీ పార్దీవాలా రెండేళ్ళు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహాల పదవీకాలం చెరి ఆరు మాసాలు ఉంటుంది’’ అని ఇందిరాజైసింగ్ తెలియజేశారు.

రాజద్రోహం కేసులు నిలిపివేయడం సాహసోపేతమైన నిర్ణయం

పదవీ విరమణ చేస్తున్న ఏ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలాన్ని అయినా అంచనా వేయడానికి ఆయన ఎటువంటి తీర్పులు ఇచ్చారో అని చూస్తారు. భారత రాజ్యాంగాన్ని అన్వయించే తీర్పులు జస్టిస్ రమణ పెద్దగా ఇవ్వలేదు. కానీ కొన్ని తాత్కాలిక ఆదేశాలు ఇవ్వడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారని ఇందిరాజైసింగ్ రాశారు. రాజద్రోహానికి సంబంధించిన కేసులన్నిటినీ సస్పెండు చేయాలన్న తాత్కాలక ఆదేశం నిజంగా గొప్పది. ప్రత్యేకమైనది. భారత శిక్షాస్మృతిలో రాజద్రోహానికి సంబంధించిన అంశాన్ని తిరగదోడే విషయం చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిందని కూడా ఇందిరాజైసింగ్ వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles