Tuesday, September 10, 2024

సమర్థుని జీవయాత్ర!

  • తెలుగుదనం ఉట్టిపడే వ్యక్తిత్వం
  • తెలుగు పలుకు కోసం తపన
  • వివాదాల పరిష్కారవేదికగా హైదరాబాద్ 

‘ప్రజాన్యాయమూర్తి’, తెలుగుకీర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి విరమణ పొందారు. ప్రజా జీవితాల్లో కలిమిడిగా తిరగడానికి,తనకు ఎంతో ఇష్టమైన అక్షర సేద్యానికి,అమ్మభాషకు మరింత అంకితమవ్వడానికి మంచికాలం ముందుకొచ్చింది. ఎప్పుడో 56 ఏళ్ళ క్రితం తెలుగువాడైన కోకా సుబ్బారావు ఆ అత్యున్నత పీఠంలో ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు,ఇన్నేళ్లకు మరో తెలుగుబిడ్డ ఆ గడ్డ ఎక్కాడు. నేడు దిగిపోతున్నా తెలుగువాడిగా చరిత్ర పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. న్యాయరంగంలో తెలుగువాడికి దక్కిన ఘన గౌరవమది. తెలుగు భూమిపుత్రునికి దక్కిన విశిష్ట విఖ్యాతి ఇది. మట్టివాసన, గాలి, నీరు, వేడి, వెలుతురు, మనుషుల తీరుతెన్నులు, పల్లెదనం పుష్కలంగా తెలిసిన తెలుగు మట్టిమనిషి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.

Also read: మరో మహా కర్షక పంచాయతీ!

మాతృభాష, మాతృభూమి పట్ల ఆరాధనాభావం

పల్లె నుంచి దిల్లీ దాకా అంత గొప్ప ప్రయాణం చేయడం సాధారణమైన విషయం కానే కాదు. ఎక్కడో తెలుగు పల్లెలో పుట్టిపెరిగిన మధ్యతరగతి మనిషి దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానానికి అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తిగా పదవిని అలంకరించడం సామాన్యమైన అంశం కాదు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన నాడు తెలుగువారందరూ ఎంతో గర్వపడ్డారు. వారు ఏ ఊరు వచ్చినా వారిని అభినందించడానికి ప్రజలు బారులు తీరారు. వారిలో నిస్వార్ధపరులైన సామాన్యులున్నారు. ధీమాన్యులున్నారు. ఎందరు పెద్దలు తన జీవితంలో తారసపడినా ఆయన కళ్ళు సామాన్యుడిపైనే ఉంటాయి. ప్రపంచంలోని ఎన్నెన్ని మహానగరాలు తిరిగినా ఆయన మనసు తెలుగు పల్లెల చుట్టూనే ఉంటుంది. ఎన్ని శాస్త్రాలు, భాషలు విన్నా ఆయన చెవులు తెలుగు కోసమే వెంపర్లాడుతూ ఉంటాయి. తెలుగు పాట, పద్యమే కాదు, తెలుగు మాట కోసం కూడా ఆయన చెవి కోసుకుంటారు. దిల్లీలో తన ఇంటి ‘నామ ఫలకం’ ( నేమ్ ప్లేట్)  ఎంతో పట్టుదలగా తెలుగులోనే పెట్టుకున్న తెలుగు ప్రేమికుడు. మాతృభూమిపై, మాతృభాషపై ఆయన పెంచుకున్న ప్రేమ అందరికీ ఆదర్శం. “ఏ దేశమేగినాఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము” అని రాయప్రోలు సుబ్బారావు అన్న మాటలను అక్షరాలా పాటించిన ఆచరణశీలి జస్టిస్ రమణ. పాత్రికేయుడిగా (లీగల్ రిపోర్టర్ ) వృత్తి జీవితాన్ని ప్రారంభించి, న్యాయవిద్యలో ఉన్నత పట్టాను అందుకొని, సొంత గడ్డ కృష్ణమ్మ ఒడిలో అక్షరాలు దిద్దుకొని, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ప్రవేశించి, అనుభవ భాగ్యాన్ని పొంది, న్యాయవాది నుంచి న్యాయమూర్తి, న్యాయమూర్తి నుంచి సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి దాకా ఎదిగిన తీరు ప్రశంసాపాత్రం. ఈ ఎదుగుదలను చూసి గోరంత గర్వాన్ని కూడా దరిచేరకుండా చూసుకోవడంలోనే జస్టిస్ రమణ వినయ విలక్షణత దాగివుంది. తాజాగా వీడ్కోలు సభలో ఆయన మాట్లాడిన మాటలు మరోమారు ఆ వైనానికి బలంగా అద్దంపట్టాయి. అంతటి సర్వోన్నతమైన స్థానం దక్కినందుకు కృతజ్ఞతగా మంచిపనులు చేసి, మంచిపేరు తెచ్చుకొని పదికాలాల పాటు మనుషుల మదిలో మిగిలిపోవాలానే తపన ఆయన మాటలు, చేష్టల్లో స్పష్టంగా కనిపించింది. వృత్తి జీవిత ప్రస్థానంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని, అందుబాటులోకి వచ్చిన ప్రతి సందర్భాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. తన విద్యాభ్యాసం ఎక్కువ కాలం తెలుగులోనే సాగినా తదనంతర సాధనలో ( ప్రాక్టీస్ ) ఇంగ్లిష్ ను కూడా ఒడిసిపట్టుకున్నారు. ఆ ప్రయాణంలో తెలుగు మాధ్యమంలో చదివానే  అనే ఆత్మన్యూనత ఆయనకు ఎన్నడూ కలుగకపోవడం విశేషం. న్యాయస్థానాలలో, న్యాయ రంగాలలో స్థానిక భాషకు పెద్దపీట వేయాలనే దీక్షకు ఆయన కంకణం కట్టుకున్నారు. అన్నట్లుగానే ఆచరణలోకి తెచ్చారు. ఇంత వరకూ ఏ ప్రధాన న్యాయమూర్తి చేపట్టని గొప్పకార్యమిది. దీని ద్వారా కేవలం తెలుగుకే కాక, దేశంలోని అన్ని స్థానికభాషలకు పట్టంకట్టారు. బక్కమనిషికి భరోసా కల్పించారు.

Also read: ‘ఆంధ్రకేసరి’ అవతరించి నూటాయాభై ఏళ్ళు

పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల నియామకం

న్యాయ స్థానాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెండింగ్ కేసులు. వాటిని సాధించాలంటే సరిపడా సిబ్బంది కావాలి,న్యాయమూర్తులు కావాలి. ఇంతవరకూ ఏ ప్రధాన న్యాయమూర్తి చేయనంత స్థాయిలో అతిపెద్ద సంఖ్యలో న్యాయమూర్తులను  దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లోనూ, సుప్రీంకోర్టులోనూ నియమించిన ఘనత కూడా జస్టిస్ రమణకు దక్కింది. మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తుల నియామకంపైనే  ప్రధానంగా ఆయన దృష్టి సారించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేసి సుప్రీంకోర్టును ప్రజలకు దగ్గర చేసే వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలన్నది ఆయన ఆకాంక్ష. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల హామీల అంశాలు తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటుచేయడం మంచి నిర్ణయం. జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన కాలంలో ఎన్నో మైలురాళ్లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం  సాహసోపేతమైన నిర్ణయం.

Also read: తెలుగు పిడుగు గిడుగు

రాజద్రోహం కేసుల నిలుపుదల గొప్ప నిర్ణయం

ప్రజాప్రతినిధులపై ఉండే కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పుఇచ్చింది. ఇటువంటి కేసులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులే స్వయంగా పర్యవేక్షించాలని చెప్పడం కూడా ముఖ్యమైన విషయం. రాజద్రోహానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 124ఏ ను నిలుపుదల చేయడం కీలకమైన తీర్పు. పర్యావరణ కేసుల్లో వాటి పరిరక్షణకే ప్రథమ తాంబూలం ఇచ్చారు. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందంగా ఉపయోగించుకోవాలని ఆయన చేసిన సూచనలు కరోనా లాక్ డౌన్ కాలంలో కార్యరూపం దాల్చి సత్ఫలితాలనిచ్చాయి. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ప్రారంభింపజేసిన ఘనత కూడా జస్టిస్ రమణకే దక్కుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలనేది ఆయన ఆశయం. కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అమలుచేస్తుందో చూడాలి. ప్రజలకు సత్వరమే న్యాయం అందాలన్న ఆయన సత్ సంకల్పానికి వ్యవస్థలు సహకరించాలి. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా మధ్యవర్తిత్వానికి పెద్దపీట వేయాలన్న జస్టిస్ రమణ ఆలోచన ఉత్తమమైనదిగా మేధావుల మన్ననలు పొందుతోంది. బ్రిటీష్ కాలం నాటి బూజుపట్టిన చట్టాలను ఎత్తివేయాలి.  సంస్కరించాలని ఆయన వినిపించే వాదనను విజ్ఞులు మెచ్చుకుంటున్నారు. రాష్ట్రపతితో ప్రమాణస్వీకారం చేయించే అరుదైన అవకాశం కూడా  దక్కించుకున్న తొలి తెలుగు న్యాయమూర్తి కూడా ఈయనే. నేడు పదవీ విరమణ చేసినా, ఒకటి రెండేళ్లు దిల్లీలోనే  ఉంటానని అంటున్నారు. జస్టిస్ వెంకటరమణ ప్రస్థానం ‘సమర్ధుని జీవయాత్ర’గా అభివర్ణించవచ్చు.

Also read: చిరంజీవి పీ వీ ఆర్ కె ప్రసాద్!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles